నాటకం అటకెక్కింది

1
2

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి బొందల నాగేశ్వరరావు పంపిన హాస్య కథ “నాటకం అటకెక్కింది”. “ప్రకృతి, పరిస్థితులు నన్నూ, నా భవిష్యత్తును బాగా దెబ్బతీసాయి” అనుకున్న ఓ రచయిత కం డైరక్టరు గురించి చెప్తున్నారు రచయిత. [/box]

[dropcap]పె[/dropcap]రుగన్నంతో ఆవకాయ నంజుకున్నట్టు సంగీతం, సాహిత్యాలలో కొంతే తెలిసికొని అంతా తెలిసినట్టు అదో రకమైన భ్రమలో వుంటూ నాకు నేనే గర్వంగా తిరుగుతుంటానని అందరూ అనుకొంటుంటారంట. ఆ సంగతి నాతో ఎవరూ ఎప్పుడూ అనలేదు. అయితే మీరు హాస్యనటులు బ్రహ్మానందంలా కనబడుతూ నాకెంతో ముద్దొస్తారండీ అంటూ అనుకున్నప్పుడల్లా నన్ను వాటేసుకుంటుంది మా ఆవిడ బోండాం భ్రమరాంబ. అలాంటి సన్నివేశం ఎప్పుడు జరిగినా నాకు ఆనందమే ఆనందం. మొత్తానికి నా గూర్చి ఎవరేమనుకున్నా నేను బాగా సంగీతాన్ని వొంట పట్టించుకొని, అలలలలుగా తన్నుకువచ్చే కథలను రాసుకొని, నోటినుంచి ధారాపాతంగా జాలువారే కవిత్వాన్ని పాటలుగా మలచుకొని మెదడునిండా మోసుకొంటూ సినిమాల ఛాన్సు కోసం ఎదురు చూస్తూ తిరుగుతున్న పేద్ద రచయిత, సంగీత దర్శకుడనన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే దేవుడు కరుణించి నాకో ఛాన్సు యిప్పించగలిగితే పల్లెల్లో నాటకాలు వేసుకొంటున్న నేను అవి కాస్తా మానేసి అలాగే సినిమా రైటరునైపోతా. కొన్నాళ్ళకు డైరక్టరునై అలాగే రాజకీయ నాయకుడనై ఇటు స్టేటు, అటు సెంట్రల్ మినిస్టరు వరకూ ఎదుగుతా. అందుకే మా అమ్మా నాన్నలు నన్ను పొలం పనులకు వెళ్ళమన్నా, నా శ్రీమతి వాళ్ళకున్న ఎరువుల కొట్లో గుమాస్తా వుద్యోగం చేయమని బ్రతిమాలినా, నా స్నేహితులు కొందరు ఓ నలుగురు పిల్లలకు ట్యూషన్లు చెప్పకొని నాలుగురాళ్ళు సంపాయించుకొని బ్రతుకురా వెంకట్రావా అన్నా వాళ్ళ మాటలను ఖాతరు చేయకుండా నాకు ఇష్టమైన ఈ నాటకరంగాన్ని ఎన్నుకొని నేను రచించిన నాటకాలు కొందరికి నేర్పించి పల్లెల్లో ప్రదర్శనలనిస్తూ పేరును గడిస్తూ, సినీరంగం నన్ను ఆహ్వానించే శుభదినం కోసం యెదురు చూస్తున్నాను. ఎందుకంటే త్వరలో నేను ఈ నాటకరంగాన్ని విడిచిపెట్టి సినీ రంగ ప్రవేశంతో పేద్ద రచయితను కం దర్శకుడనై పోయినట్టు ఓరోజు తెల్ల వారు ఝామున కల కన్నాను. అందుకే నాటకాలే వూపిరిగా ప్రదర్శనలనిస్తూ అమ్మానాన్నల తిట్లే కాకుండ, అప్పుడప్పుడు నా భ్రమరాంబ తిట్ల పురాణాలను సైతం ఎంచక్కా భరిస్తూ.

అది నా అదృష్టమేమో శ్రీ రామ నవమికి సరిగ్గా నెల సమయం వుందనగా ఓ రోజు వూరి పెద్ద మనుష్యులు నన్ను రామస్వామి మేడ వద్దకు పిలిపించారు. నా కొరకే వేచి చూస్తున్నట్టు వాళ్ళమధ్య కాస్త చోటును చూపించి కూర్చోమన్నారు. నేనూ కూర్చొని ఏమీ అర్థంకాని పరిస్థితుల్లో అందరి ముఖాలను చూడసాగాను.

అంతలో వూరి ప్రెసిడెంటు నన్ను చూసి “ఏమోయ్ ఎంకట్రావ్! నిన్నేదో గోప్ప రైట్రని సక్కగా కథలు, కవితలు, నాటకాలను రాస్తావని, కొన్నికథలను రాసి సిల్మాలక్కూడా పంపించావని వూళ్ళో అందరూ అనుకొంటున్నారు. ఇప్పుడు కూడా పదిమంది కుర్రాళ్ళను పోగేసుకోని మనూల్లోనే ఓ నాటకాన్ని నేర్పుతున్నావట. ఆ నాటకమేదో ఈ శీరావనవమికి మనూల్లోనే ఏయించరాదూ?” అడిగాడు ఆర్డరేస్తున్నట్టు.

అందర్ని ఒక్కసారి చూసి “మరి బాగా ఖర్చవుద్దే!” అన్నాను గంభీరస్వరంతో.

“ఎంతవుద్దేం…?” అడిగాడు ప్రక్కనున్న సెక్రెటరి.

“చెప్పవయ్యా ఎంకట్రావ్! ఎమౌంట్ ఎంతైనా సరే అయ్యగారు ఇవ్వటానికి సిద్ధం. ఇది వూరికి సంబంధించిన ప్రోగ్రాం కదా…! చెప్పేయ్! చేసేద్దాం” అది ట్రసరర్ మాట.

“ఓకే…. నాటకంలో నటించటానికి హీరోయిన్ కావాలి. ఆమెను టౌన్నుండి తీసుకురావాలి. పల్లెటూరిలో ప్రదర్శనంటే ఆవిడ ఒప్పుకోవడం కష్టం. అలాని చెప్పి స్త్రీ పాత్ర లేని నాటకమాడితే జనాలు చూడరాయే. కనుక ఆమెను తీసుకురావాలంటే కిరాయి, కన్వేయన్సులని పదివేలు… మ్యూజిక్కు, కర్చులకు ఓ నాలుగు వేలని మొత్తం పద్నాలుగువేలిస్తే….”నసుగుతూ ఆన్నాను.

“ఎంతైనా ఇస్తాం. ప్రదర్శన బాగుండాలి. ఇదిగో! ప్రదర్శన రోజు వుదయాన్నే మా ఎడ్ల బండిని కట్టుకెళ్ళి ఈరోయిన్ని తీసుకొచ్చేయ్. ఆవిడకు బసా, భోజనం మన సెక్కట్రీ సూసుకుంటాడు” ప్రెసిడెంటు మాట.

“మరి రైట్రవూ, డైరట్రవూ నువ్వే కదా! నీకెంతివ్వాలో సెప్పు?” అన్నాడు జనం మధ్య నుంచి లేచి చుట్ట పొగ బాగా పీల్చి మనుష్యుల మీదికొదులుతూ ఓ తలపాగా మనిషి.

చాలా కాలం నుంచి సందర్భం కోసం ఎదురు చూస్తన్న నాకు దొరికిందిరా ఛాన్సు అనుకొని “అయ్యా! నగదు రూపంతో నాకేమీ వద్దు. బదులుగా ప్రెసిడెంటుగారి దయ కావాలి” అన్నాను.

“ప్రెసిడెంటుగారి దయా… ఏమిటది?”

“అయ్యగారి అల్లుడు హైదరాబాదులో సినిమాలకు డైరక్టరు కదా! ఆయన్ను మన నాటక ప్రదర్శన రోజు పిలిపించండి. వారు నాటకాన్ని చూసి తరియించిన తరువాత నన్ను పరిచయం చేయండి చాలు. అక్కడి నుండి తతిమ్మా పనులను నేను చూసుకొంటా. అయనగారి కాళ్ళు, వ్రేళ్ళు పట్టుకొని వారితో పాటు హైదరాబాదెళ్ళి వారి దయతో సినిమాలకు డైలాగులు రాస్తా” మెల్లగా విషయాన్ని బయటపెట్టాను. అప్పుడు మరెందుకో అందరూ ఘోల్లున నవ్వారు. నేను సీరియస్సుగానే వున్నాను.

“ఓస్… ఇంతేనా! నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే చేద్దాం. నాటకాన్ని బాగా రక్తి కట్టించు. ఇవిగో వెయ్యిన్ని నూటాపదార్లు. బయానాగా వుంచేసుకో” అంటూ అందరూ చూస్తుండగా డబ్బు నా చేతిలో పెట్టాడు. నేనూ నాటకానికి బాగా రిహర్సల్స్ వేసి రక్తి కట్టించాలనుకొని లేచి ఇంటికి నడిచాను, నాటకాలంటే అస్సలు గిట్టని అమ్మానాన్నల చేతిలో ఆ డబ్బునుంచి వాళ్ళను మేనేజ్ చేయాలన్న వుద్దేశ్యంతో.

***

ఆ రోజు నాటకానికి గ్రాండ్ రిహార్సల్స్. రాత్రి పది గంటల వరకూ జరిగిన రిహార్సల్‌కు దర్శకత్వం వహించిన కారణాన బాగా అలిసిపోయాను. అయినా హీరోయిన్ను జాగ్రత్తగా టౌనుకు పంపాల్సిన బాధ్యత నాది కనుక బస్టేషనుకు తీసుకెళ్ళి చివరి బసెక్కించి వెనుదిరిగాను.

బస్టాండు నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళిన నేను హాల్లో నుంచి అమ్మనాన్నల పడక గది వేపు చూసుకొంటూ దొంగలా వెళ్ళి”తలుపు తెరు భ్రమా” అని మెల్లగా పిలిచాను నా శ్రీమతిని. ఆమె చక్కటి బోండామని ముందే చెప్పానుగా మెల్లగా వచ్చి తలుపు తెరిచి ‘రండి’ అని ఎవ్వరికి వినబడకుండా నన్ను బలంగా చొక్కా పట్టుకు లాగి మంచం వేపు నెట్టి తలుపు గడియ పెట్టింది. నేనూ అక్కడే వున్న టీపాయిని తట్టుకొని పడబోయి తమాయించుకొని వెళ్ళి మంచంమ్మీద పడి లేచి కూర్చొన్నాను. ఈ లోపు ఆమె గుణ్ణేనుగులా మరీ మెల్లగా అడుగులో అడుగు వేసుకొంటూ కిచ్చన్లోకెళ్ళి నాకోసం తయారుగా తీసి వుంచిన భోజనం తెచ్చి టీపాయి మీద పెట్టింది నోరు కదపకుండా మెక్కమని. అంటే దానర్థం శబ్దం రాకుండా తినమని. నేనూ అలాగే తింటున్నాను.

“ఇవాళ ఫిమేల్ ఆర్టిస్టుతో రిహార్సల్స్ అన్నారు. బాగా జరిగాయా? ఎలా వుందావిడ? బాగా నటిస్తుందా? మీ వాళ్ళలో సొల్లు కార్చుకొంటూ ఎంతమంది పోజులు కొట్టారు? ఆ పోజుల్లో మీ పర్సంటేజెంత?” నన్ను క్రీకంట చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎదురు చూడని ఆ ప్రశ్నలకు షాక్ తిన్నాన్నేను. నోటిలో ముద్దను మింగి “బ్రహ్మాండంగా వుంది భ్రమా! అందంలో అనుష్కా, అభినయంలో సావిత్రి. మగాళ్ళ మనసుల్ని దోచుకొని ఇట్టే కట్టి పడేస్తుందంటే నమ్ము!”వున్న నిజాన్ని చెప్పాల్సి వచ్చింది నాకు.

“ఓహో! అంతటి అందగత్తెంటే వెంటనే తమరు మనసు పారేసుకొని వుంటారే!”వ్యంగ్యంగా అంది భ్రమరాంబ.

“ఆంటే… నేనూ నలుగురి మగాళ్ళలా మనసును పారేసుకుంది నిజమే… ఆమె దోచుకుంటేనా మరి!”

“ఓహో… అలాంటి ఆశ కూడా వుందా తమకూ? అవునులే… నేనో బోండాం కదా?అంటే… మీ వుద్దేశంలో మీరో పేద్ద అందగాళ్ళన్నట్టు ఫీలయ్యారా చెక్క మొహం నల్లనయ్యాగారూ!” దీర్ఘం తీసింది.

“అలాని కాదులేవే… ఎంతైనా డైరక్టర్ను కదా! నాకో ప్రత్యేకత వుంటుందని ట్రై చేశా. కుదరకపోయే సరికి లెవల్ మైంటేయిన్ చేస్తూ వూరుకున్నా!”

“మొత్తంలో ఈ చెక్క మొహాన్ని ప్రక్కన పెట్టిందన్న మాట. ఏదేమైనా సరే రేపు రిహర్సల్స్‌కు నేనూ వస్తాను! ఆ హీరోయిన్ను చూస్తాను!”అంటూ నా గడ్డాన్ని పట్టుకొని అటూ ఇటూ పది సార్లు వూపింది.

నేను నోటిలో పెట్టుకున్న ముద్దను గుటుక్కున మ్రింగి “అది కుదరదమ్మా!నువ్వు స్ట్రెయిట్‌గా నాటకాన్ని చూడాల్సిందే. రేపు ఆవిడకు రెస్టు. ఎల్లుండి నాటకం” అంటూ చెయ్యి కడిగేసుకున్నాను. అట్టాగే దుప్పటి లాక్కొని కళ్ళు మూసుకున్నాను. భ్రమరాంబ ఎంగిలి గిన్నెల్ను సర్ది పడుకున్న పది నిముషాల్లో గురకపెట్టసాగింది.

నేను స్ట్రెయిట్‌గా ఓ పావు గంటలో డ్రీమ్‌లోకి వెళ్ళి పోయాను.ఆ డ్రీమ్లో….

ఎలాగైనా సరే నాటకం ప్రదర్శనకు ప్రెసిడెంటుగారు ఆయనగారి అల్లుడు డైరక్టరు కం ప్రొడ్యూసరు పురుషోత్తంగారిని ముఖ్య అతిథిగా పిలిపిస్తారు. నేను టక్కున ఆయన మెడలో ఓ దండను వేసి కాళ్ళమీద పడతాను. అప్పుడు ఆయన నాలోని రచయితను గుర్తించినా గుర్తించక పోయినా పాపభీతితో నన్ను అటు హైదరాబాదో లేక చెన్నైకో తీసుకువెళ్ళి నా చేత ఓ సినిమాకు డైలాగులు రాయించి సినిమా తీస్తాడు. అది సెన్సారై రిలీజ్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఈ జనాలకు నాలోని ప్రతిభేమిటో! ఆ ప్రతిభతో ప్రమోషనొచ్చినట్టు రచయిత నుంచి నేనూ డైరక్టరునైపోతా. లక్షలనుంచి కోట్లు గడిస్తా. మా పల్లెటూరిని వదలి సిటీకెళ్ళి పోతా! ఇక చూస్కో నా సామిరంగా… సినిమాలను తీయుడే తీయుడు. తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వపు గుర్తింపులు, నంది అవార్డులు, పద్మశ్రీలు. ఇంకా ఎన్నెన్నో గౌరవాలు. అంతటితో ఆగదు నా ప్రస్థానం. ఏదేని ఓ రాజకీయ పార్టీలో చేరుతా. ఎం.ఎల్.ఏ నైపోతా! మినిస్టరునౌతా! కొంతకాలానికి సి.ఎం సీటు పట్టుకుంటా! ఏమో అదృష్టం ఎవడబ్బ సొమ్ము? ఆ డైరక్టరు కం ప్రొడ్యూసరు ద్వారా లక్కు నన్ను వరిస్తుందేమో అనుకొంటూ డ్రీమ్ నుంచి రిలీవై నిద్రలోకి జారుకున్నా!

***

నాటక ప్రదర్శన కొరకు రామస్వామి మేడ వద్ద దానికి కావలసిన రంగస్థలాన్ని బొంగు కర్రలతో ఏర్పాటు చేసి, టౌనుంచి కావలసిన తెరలను తెప్పించి అదిరి పోయేలా తయారు చేయించాడు ప్రెసిడెంటు.

ఆ రోజు రాత్రి పది గంటలకు నాటక ప్రదర్శన. మా వూరే కాకుండా చుట్టు ప్రక్కలున్న పది వూర్లలో కూడా ప్లెక్సీలు పెట్టించి, పోస్టర్లు అంటించిన కారణాన జనాలు వేల సంఖ్యలో వస్తారని అందరు అనుకొంటున్నారు. ఇక వూళ్ళో జనాలు కూడా ప్రదర్శించబోతున్న నా నాటకాన్ని గూర్చి, నాటక రచయిత, దర్శకుడనైన నన్ను గూర్చి దాదాపు వారం రోజుల నుంచి తెగ మాట్లాడి పొగిడేసుకొంటున్నారు. కాని వూరి జనాలకు నచ్చనిది ఒక్కటే… అదేమిటంటే నాటకానికి ‘భవిష్యత్తులేని బంగారయ్య’ పేరు బాగోలేదని, అది నా భవిష్యత్తుకు భంగం కలిగించే విధంగా వుందని అనుకొంటున్నారట కొందరు. అందుకు నేనేం చేయను కథను బట్టి పేరు పెట్టాను.

మరుసటి రోజు వుదయాన లేచి బ్రష్ చేసుకొంటూ దట్టంగా మేఘాలతో అలుముకొని వున్న ఆకాశం వేపు చూశాను. మరో గంటలో వర్షం పడేలా వుంది. ఒకవేళ వర్షం వస్తే సాయంత్రం నాటకం జరుగదేమో!అలా అయితే నా భవిష్యత్తు కార్యక్రమానికి భంగం కలిగినట్టేగా…. మైగాడ్! అని అనుకొన్నాను.

అంతలో కల్లేపు చల్లటానికి బయటికొచ్చిన భ్రమరాంబ “ఏంటండీ!… వర్షమోస్తుందేమోనని భయపడుతున్నారా! అవి పాసింగ్ క్లౌడ్సు అండీ… వర్షం రాదులే” అంది నాకు ధైర్యాన్నిస్తూ.

“అలా అయితే నీ నోట్లో మూడు చంచాలు చెక్కర పోస్తానే భ్రమా! రా…. త్వరగా రా. టిఫిన్ పెట్టు. ప్రెసిడెంటుగారి బండి కట్టుకు వెళ్ళి టౌనులో వున్న హీరోయిన్ను తీసుకు రావాలి” ముఖం కడుక్కొని ఇంట్లోకి నడిచాను.

గంట రాత్రి ఏడు. అలా మబ్బులతో ఉదయం నుంచి మౌనంగా చిన్నచిన్న జల్లులతో నడయాడుతూ దాక్కున్న వర్షం ఒక్కసారిగా వురుములు మెరుపులతో ప్రారంభమైంది. అయినా అట్టాగే హీరోయిన్ ఇంటికి వెళ్ళాను. పాపం… అప్పటికే నాటకం కోసం అన్ని సూట్కేసులో సర్దుకొని మంచంలో కూర్చొని గడ్డం క్రింద మూడు దిండ్లను పెట్టుకు ఆయాసపడుతూ, దగ్గుతూ కనబడింది హీరోయిన్. నేను షాక్కు గురైయ్యాను.

“మేము రడీగా వున్నామండి డైరక్టరు గారూ! కాని కుండపోతగా కురుస్తున్న ఈ వర్షంలో ఎలా రావాలి?” ఆయాస పడుతూనే అంది హీరోయిన్. ఆమె పరిస్థితిని చూస్తే నాకూ బాధ కలిగింది. అయినా ఆ నాటకంతో నా భవిష్యత్తు ముడిపడి వుందన్నది గుర్తుకు రాగా గుండె రాయి చేసుకున్నాను.

“భయపడకుండా బండ్లో కూర్చొండి. మీరు తడవకుండా అర్ధగంటలో స్టేజీ వద్దకు తీసుకువెళతాను” అని తొందర చేశాను. పాపం హీరోయిన్ వెంటనే రెండు బిళ్ళలు మింగి నీళ్ళు తాగి మారు మాట్లాడకుండా ఆయాసపడుతునే వాళ్ళమ్మతో పాటు బండెక్కి కూర్చొంది. అంత వర్షంలోనూ తప్పదన్నట్టు బండి కదిలింది. మెల్లగా నడుస్తూ వూరి బయట పడింది. ఆ సమయంలో అల్లంత దూరంనుంచి బైకులో ఓ కుర్రాడు స్పీడుగా వచ్చి మా ముందాగి “ఇదిగో బండ్లో ఎవరూ… అటువేపు మీరు వెళ్ళలేరండి. చెరువుకు గండి పడి నీళ్ళు ఇటే వస్తున్నాయి. ప్రభుత్వపు సిబ్బంది దాన్ని మూసే యత్నం చేస్తున్నారు. దయచేసి వెనక్కు వెళ్ళండి” అన్నాడు.

‘మై గాడ్.. అంటే ఇక నా నాటకం సంగతి అంతేనా…!?’ నాకు గుండె పగిలి పోయినట్లనిపించింది. దిక్కు తోచలేదు. బండి లోపల కూర్చొని వున్న హీరోయిన్ ఎడతెరపిలేకుండా దగ్గుతోంది. ఆమెకు తోడన్నట్టు వాళ్ళమ్మ చలికి వొణికి పోతోంది. పిచ్చిపట్టినట్టయ్యింది నాకు. రెండు నిముషాలు దీర్ఝంగా ఆలోచించాను. తప్పదన్నట్టు ఓ నిర్ణయానికొచ్చాను. హీరోయిన్ నాపై ఆమెకున్న గౌరవంతో నాటకం చేస్తానని వస్తోందే తప్ప ఆమిప్పుడు వున్న పరిస్థితుల్లో స్టేజీ మీద నిలబడి డైలాగులు చెప్పలేదు. అందుకే… అందుకే వెంటనే నాటకం ఆపేయ్యాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ప్రెసిడెంటు జనాల కోసం నాటకాన్ని తప్పకుండా ప్రదర్శించాలంటే హీరోయినుగా నేనే వేద్దామనుకొన్నాను. వెంటనే బైకు కుర్రాడ్ని చూసి బ్రతిమాలినట్టు “అబ్బాయ్! ఆ వూళ్ళో జరగబోయే నాటకానికి నేను రచయిత, డైరక్టర్ను. ఈమె అందులో హీరోయిన్. ఎటూ ఇక ఈ వర్షానికి నాటకముండదు కనుక వీళ్ళను వెనక్కు పంపేస్తున్నాను. దయచేసి నన్ను ఎలాగైనా తీసుకెళ్ళి స్టేజీ వద్ద విడిచిపెట్టి పుణ్యం కట్టుకో!” అడిగాను. అతను ఆలోచించకుండా బైకెక్కమన్నాడు. బండిని టౌనుకు తిప్పమని బండాడితో చెప్పి బైకులో కూర్చొన్నాను నేను.

పావు గంటలో వూళ్ళోకి చేరుకున్నాను. వూరు సద్దుమణిగినట్టుంది. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది.అంటే నాలో నాటకం జరుగుతుందన్న నమ్మకం బలపడగా త్వరత్వరగా స్టేజీ వద్దకెళ్ళాను. అక్కడ ప్రేక్షకులంటూ ఎవ్వరూ లేరు. నా ఆర్టిస్టులు మాత్రం పరిగెత్తినట్టు నావద్దకొచ్చారు. నన్ను తీసుకువెళ్ళి స్టేజీ ప్రక్కన నిలబెట్టి వున్న ఓ నల్లటి బోర్డును చూపారు. అందులో చాక్‌పీసుతో ‘వర్షం కారణంగా ఈ రోజు జరుగనున్న నాటకం రద్దు చేయబడినది’ ఇట్లు- వూరి ప్రెసిడెంటు అని రాసి వుంది. అందుచేత తండోపతండాలుగా తరలి వచ్చిన ప్రేక్షకులు వుస్సూరంటూ వెళ్ళిపోయారని చెప్పారు. బాధనిపించింది నాకు. ప్రకృతి, పరిస్థితులు నన్నూ, నా భవిష్యత్తును బాగా దెబ్బతీసాయనుకున్నాను.

అంతలో గొడుగు పట్టుకొని ప్రెసిడెంటు ప్రత్యక్యమైయ్యాడు.”ఎంకట్రావ్! ఏమీ అనుకోమాకు. గంట ముందు వరకూ కుండపోతగా కురిసిన వర్షానికి భయపడి నాటకం రద్దు చేశాను. మళ్ళీ ఏదేని పండక్కు ఏద్దువులే! వస్తా!” సాధారణంగా ఆ మాటని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు మారు మాటకు చోటివ్వకుండా. నేను చేసేది లేక నా ట్రూపు మనుష్యులను తీసుకొని కాస్త దూరంలో వున్న ‘టీ’ కొట్టు వద్దకు నడిచాను.

మరుసటి రోజు…

ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకొని దేవుడికి దణ్ణం పెట్టుకొని హాల్లోకొచ్చి “నన్ను ఆశీర్వదించండి నాన్నా” అన్నాను అమ్మానాన్నల కాళ్ళకు నమస్కరిస్తూ.

“ఏమైందిరా నీ నాటకం గోల”అన్నాడు నాన్న.

“దాన్నిఅటకెక్కించేశాను నాన్నా! ఇవాల్టినుంచి మామయ్యగారి కొట్లో ఎకౌంట్సు రాయటానికి వెళుతున్నాను”

“అవును మామయ్యగారూ! ఇక ఒక్కరోజు కూడా వృథా చేయకుండా మా వారు వుద్యోగానికి వెళతారు” అంది భ్రమరాంబ గేటువరకూ నన్ను సాగనంపి.

ఆశ్చర్యానికి గురై హాల్లో నుంచి బయటికొచ్చారు అమ్మానాన్నలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here