Site icon Sanchika

రక్తి కట్టిన నటసామ్రాట్

[dropcap]తె[/dropcap]లుగులో ‘నటసమ్రాట్’ చిత్రం గూర్చి వ్రాయబడ్డ మొట్ట మొదటి రివ్యూ ఇదని నేను భావిస్తున్నాను.

నటసామ్రాట్ (మరాఠీ చలన చిత్రం) అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.

***

“ఆయన నటనలో జీవించాడు

జీవితంలో నటించాడు”

ఎందుకంటే ఆయనకి తెలిసింది నటన ఒక్కటే కాబట్టి. ఈ కారణంగా ఆయన జీవితంలో ఎన్నో చిక్కులు వచ్చాయి. కొవ్వొత్తి తాను కాలిపోతూ కూడా చుట్టూ ఉన్నవారికి వెలుగు పంచుతుంది

సరిగ్గా అదే విధంగా ఒక నటుడు తనని తాను నిరంతరం కాల్చుకుంటూ ఇతరులకి వినోదం పంచుతాడు.

ఇక్కడ తనని తాను కాల్చుకోవడం అనే మాట ఎందుకు వాడానంటే ఒక ఎమోషన్‌ని పండించడం అంత సామాన్యమైన విషయం కాదు. మనం నవ్వితూ ఉంటే నాలుగు కాలాలపాటు ఆరోగ్యంగా ఉంటామని వైద్యశాస్త్రం ఘోషిస్తోంది అని మీకు తెలుసు కద. అదే విధంగా చిత మరియు చింతకి అసలు తేడా లేదని కూడా అదే వైద్యశాస్త్రం చెపుతోంది. అది నటన కావచ్చు, నిజమైన అనుభూతి కావచ్చు, ఆయా మనోభావాల ప్రభావం ఖచ్చితంగా నటుడి శరీరంపై పడుతుంది. నటీనటులు అభినయించి చూపే భావాలన్నింటికి వారి శరీరం స్పందిస్తుంది. తదనుగుణంగా వారికి అరోగ్యం అనారోగ్యాలు కలుగుతాయి అనేది ఒక భయంకరమైన సత్యం.

ఈ నటన తాలూకూ ప్రభావం వారి మానసిక స్థితి పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలే కళాకారులు సున్నిత మనస్కులు. వారు నటించి చూపేటప్పుడు ఆయా పాత్రలు ఇంచుమించు వారిని ఆవహిస్తాయి భూతాలలాగా. దెయ్యం పట్టిన వాడికి, నటుడికి తేడా ఉండదు. కాకపోతే ఆ నటుడిలో దెయ్యం స్థానంలో ఆ పాత్ర ఆవహిస్తుంది.

అందుకే వారిని దయతో చూడాలి. కొందరు సంయమనంతో ఆయా పాత్రల ప్రభావం నుంచి త్వరగా బయటపడతారు. కానీ – తమని పూనిన ఆయా పాత్రలని కొందరు అంత సులభంగా వదిలించుకోలేరు. లేదా ఆయా పాత్రలు ఆయా నటులని వదలవు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తనని తాను కారణ జన్ముడిని అని, శ్రీకృష్ణుడిని అని, శ్రీరాముడిని అని – ఈ జన్మలోనే, అందరికి మంచి చేయాలని అందరిని ఉద్ధరించాలని భావించేవారు అని ఆయన సన్నిహితులు చెప్పేవారు. రాజకీయాలలోకి ప్రవేశించిన అనంతరం కూడా ఆయన ఇచ్చే ఉపన్యాసాలలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించేది.

ఆయన సంస్కారవంతుడు కాబట్టి అలా ప్రవర్తించారు. కాని ఇంకొందరు దుర్బలులు, తమని ఆవహించిన ఆయా పాత్రలు కలిగించే సంచనాలని తట్టుకోలేక మత్తు పదార్థాలకి అలవాటు పడతారు, పిచ్చి పట్టిన వారిలాగా ప్రవర్తిస్తారు. దానధర్మాలు చేస్తారు, ఒక్క మాటలో చెప్పాలంటే వారు వారిలాగా ప్రవర్తించరు.

ఇది ప్రతి కళాకారుడికి అనుభవైక వేద్యమే.

బాగా ఇన్వాల్వ్ అయిపోయి క్లాసులో పాఠం చెప్పి వచ్చాక కొందరు టీచర్లు, క్లాసు అయిపోయాక కూడా కొంత సేపు మామూలు మనుషులు కాలేరు.

ఇవన్నీ ఎందుకు చెపుతున్నాను అంటే, ఈ చిత్రంలో నానాపటేకర్ పాత్ర ద్వారా నాటక రచయిత చూపదలచుకున్నది ఈ విషయమే.

మొదట క్లుప్తంగా కథ చెప్పుకుందాం:

ఈ చిత్రంలో గణపత్ బేల్వాలికర్ (నానాపటేకర్) ఒక గొప్ప నాటకరంగ నటుడు. ఆయన వయసు దాదాపు అరవై దాటి ఉంటుంది. ఆయనకి చక్కటి కుటుంబం ఉంటుంది. భార్యా, కొడుకు, కూతురు. ఆనందమయమైన జీవితం ఆయనది. ఆయన స్థాయిని గూర్చి మీకు అర్థం అయ్యేలా ఒక పోలిక చెబుతాను తెలుగు సినిమా ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి ఎలా గౌరవపురస్కారాలు, మర్యాద మన్ననలు పొందేవాడో అలా ఆయన మరాఠి నాటక రంగంలో ఒక ధృవతార లాగా వెలిగిపోతూ ఉంటాడు. పెద్ద బంగళా, ఆస్తిపాస్తులు, దేనికి కొదవలేని జీవితం ఆయన స్వంతం. ఒక దశలో ఆయన క్రిక్కిరిసిన సభలో ఆయనకి జరిగిన సన్మానానంతరం అదే వేదిక మీద నుంచి తన పదవీ విరమణ ప్రకటిస్తాడు. ప్రజలంతా బాధాతప్త హృదయంతో ఆయనకి వీడ్కోలు చెబుతారు. ఆయన ఇంటికి వచ్చాక కూడా అదే ఊపుతో ఇంకో నిర్ణయం ప్రకటిస్తాడు. తన యావదాస్థిని కొడుకు, కూతుర్లకి వ్రాసిచ్చేస్తాడు. భార్యకి ఒక నెక్లెస్ కొనిపెడతాడు. ఇక ఆయనకి తన స్వంతం అని చెప్పుకోవటానికి ఏమీ లేవు, కట్టుబట్టలు తప్ప. అది ఆయన ప్రవర్తనలో మనకు నాటకీయంగా కనిపించే మొదటి అంశం.

తను నటించిన షేక్స్పియర్ నాటకాల తాలూకు పాత్రలైన జూలియస్ సీజర్, తదితర చక్రవర్తుల పాత్రల తాలూకు అహంభావం, అతిశయం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అది అహంకారం అని అనలేము. అది ఆయన అమాయకత్వం.

వాస్తవానికి ఆయన గొప్ప నటుడే కానీ, పసి పిల్లాడిలాంటి సున్నిత మనస్తత్వం. నిజం చెప్పాలంటే ఆయనకి నటన తప్ప మరొకటి తెలియదు. కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, దేనికి ఎలా స్పందించాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న కనీస అవగాహన ఉండదు ఆయనకి. దానితో ఆయన ప్రవర్తన కొడుకు, కోడలికి, కూతురు, అల్లుడికి వింతగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో ఎవ్వరూ చెడ్డవారు లేరు. మంచి కొడుకు, మంచి కోడలు, మంచి కూతురు, మంచి అల్లుడు. ఇలా అందరూ మంచి వారే.

ఈయనకి అత్యంత ఆప్తుడైన ఒక స్నేహితుడు (విక్రం గోఖలే) ఉంటాడు. ఆయన కూడా నటుడే. ఆయన ఈయన ఒకర్నొకరు ఒరే అంటే ఒరే అనుకునేంత ఆప్తులు. ఆయనకి పిల్లలు ఉండరు. కథా క్రమంలో ఈ స్నేహితుడి, భార్య, ఈ స్నేహితుడు కూడా మరణిస్తారు. అసలే సున్నిత మనస్కుడైన నానాపటేకర్‌ని వీరిద్దరి మరణాలు కృంగదీస్తాయి.

కుటుంబంలో జరిగే అత్యంత సామాన్యమైన చిన్నచిన్న విషయాలకి ఆయన అహం దెబ్బ తింటుంది. తన పిల్లల ప్రవర్తనలో ఆయనకి ధిక్కార ధోరణి కనిపిస్తుంది. అటు కొడుకు కోడలి వద్ద, ఇటు కూతురు అల్లుడు వద్ద కూడా ఇమడలేకపోతాడు.

ఎవరికీ చెప్పకుండా ఒక అర్ధరాత్రి కూతురి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆయనని ఎదిరించే మనస్తత్వం లేని ఆ మహా ఇల్లాలు ఆయనతో కూడా వెళ్లి దిక్కురోడ్డు పక్క దిక్కులేని చావు చస్తుంది.

ఈయన తన మిగిలిన జీవితం ఫుట్‌పాత్ పై, ఇంచుమించి బిచ్చగాళ్ళ పక్కన గడుపుతూ ఉంటాడు. తాను ఎక్కడైతే నట సామ్రాట్ అన్న బిరుదు పొంది, ఎన్నో వందల పాత్రలకి జీవం పోశాడో, ఎక్కడైతే ఒక వెలుగు వెలిగి చక్రవర్తి లాగా వేదిక మీద గౌరవమర్యాదలు పొందాడో ఆ ఆడిటోరియం కాలి పోయిందని తెలిసి దుఃఖితుడై అక్కడికి వెళ్లి ఆ కాలిపోయిన ఆడిటోరియంలో స్మశానం లాంటి వేదికపై మహరాజులా కూర్చుని పాత డైలాగులన్నీ నాటకీయంగా చెపుతూ, ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ, గతం తలచుకుని దుఃఖించి, దుఃఖించి చివరకి ప్రాణాలు కోల్పోతాడు. ఈ చివరి క్షణాలలో ఆయన కుటుంబ సభ్యులంతా వస్తారు. ఆయన వారి వెంబడి రానని చెప్పి వారి అహ్వానాన్ని తిరస్కరిస్తాడు.

నా విశ్లేషణ:

ఎన్నో రివ్యూలు చదివాను ఈ సినిమా గూర్చి. వికిపిడియాతో సహా ఎందుకో అందరూ ఈ చిత్రం కథని అర్థం చేసుకోవటంలో విఫలం అయ్యారు అని అనిపిస్తుంది. రివ్యూలన్నింటి సారాంశం ఏమిటంటే ఆయనని కొడుకు, కోడలు, కూతురు అల్లుడు నిరాదరణ చేసి, ఆయన ఆస్తిని అనుభవిస్తూ కృతఘ్నులుగా ఉండటం వల్ల ఆయనకి అలాంటి పరిస్థితి దాపురించింది అని. అది ఎంత మాత్రం వాస్తవం కాదు.

అసలు చాలా మంది రివ్యూవర్స్ ఈ సినిమాని అర్థం చేసుకోలేదని చెప్పాలి. వాళ్ళు ఎంత సేపున్నా పిల్లల చేత నిరాదరణ చేయబడ్డ వృద్ద కళాకారుడి వ్యథ అన్న విధంగా అర్థం చేసుకుని ‘బడిపంతులు, బహుదూరపు బాటసారి’ తదితర చిత్రాలగాటన కట్టి రివ్యూలు వ్రాశారు. ఆ రివ్యూల ప్రభావంతో నేను చాలాసేపు ఈ సినిమాని ఆ కోణంలో చూసి కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాలి.

అసలు పిల్లలు ఇంత మంచివారు కద, వీళ్ళను చెడ్డవారు అని ఎందుకు అనుకున్నారు అందరూ అని అయోమయంలో పడ్డాను. వాస్తవానికి ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలచుకుంది వేరే అని నేను అర్థం చేసుకోవటానికి సమయం పట్టింది.

ఈ చిత్రంలో ఎవ్వరూ కృతఘ్నులు లేరు. ఎవ్వరూ చెడ్డవాళ్ళు లేరు. అందరూ మంచివారే. చివరికి ఆయన డబ్బు దొంగిలించిన దొంగతో సహా. ఆ దొంగ నానా పటేకర్‌కి డబ్బు తిరిగి తెచ్చి ఇచ్చేస్తాడు, ఆయన భార్య చితి వద్ద. పదవి విరమణ చేశాక ఆయన భార్యకి కానుకగా తెచ్చిచ్చిన నెక్లేస్ అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ ఇప్పుడు ఈయన వద్ద చిల్లిగవ్వలేకున్నా ఆ డబ్బుని రాజసంగా వాడివద్దనే ఉంచేస్తాడు. ఆయనలో తాను అదివరకు నటించిన పాత్రలు ఉంటాయి తప్ప ఆయన అంటూ ఎవ్వరూ ఉండరు. అది రచయిత చెప్పదలచుకున్నది ఈ సినిమా ద్వారా. ఆయా “పాత్రలు భూతాల్లా వచ్చి నన్ను ఆవహించాయి” అని ఆయనే అంటూ ఉంటాడు. దెయ్యం పట్టిన వాడు తానెలా ప్రవర్తిస్తాడో తనకే తెలియనట్టు ఈయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదు.

మనం మన జీవితాలలో ఏర్పడే చిన్న చిన్న విషాదలకి, కోపతాపాలకి విచలితులమై పోయి ఒక్కోసారి ఆరోగ్యం పాడు చేసుకుంటాం, తలనొప్పి తెచ్చుకుంటాం. మూడ్ ఆఫ్ అయిందని ముడుచుకు కూర్చుంటాం.

నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఈ నటీ నటులు ఇన్ని రకాల భావాలని ప్రదర్శిస్తారు కద, ఈ, విషాదాలని, ఆనందాలని, కోపాన్ని, రౌద్ర రసాన్ని, ఆశ్చర్యాన్ని, ఇలా నవరసాలు ఒలికిస్తారు కద, ఆయా భవాల తాలూకు ప్రభావం వారి మీద ఉండదా, వారి ఆరోగ్యాలని దెబ్బతీయదా అని ఆశ్చర్యపోతు ఉంటాను.

అదిగో సరిగ్గా ఈ విషయాన్నే చెప్పదలచుకున్నాడు ఈ కథకుడు. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ఈ నాటకంలోని ఆత్మని దెబ్బతినకుండా కథలోని మూల విషయాన్ని సరిగా చెప్పాడు. నానా పటేకర్ ఎక్కడా తగ్గలేదు. ఆయన తన నట జీవితంలో ఈ పాత్ర ద్వారా శిఖరసమానమైన నటనని చూపాడు అని చెప్పవచ్చు.

“ఆయన నటనలో జీవించాడు

జీవితంలో నటించాడు”

ఎందుకంటే ఆయనకి తెలిసింది నటన ఒక్కటే కాబట్టి. ఈ కారణంగా ఆయన జీవితంలో ఎన్నో చిక్కులు వచ్చాయి.

నట జీవితంలో ఆయన తలమునకలుగా ఉన్నన్ని రోజులు ఆయన భార్య కుటుంబాన్ని నడిపింది. ఈయన ఎప్పుడైతే పదవీ విరమణ చేసి పగ్గాలు పుచ్చుకున్నాడో అప్పటి నుంచి ఆయనకి ఆయన తోటి ఇంట్లో వారందరికీ కష్టాలు, అవమానాలే.

“మీరు నాటకరంగంనుంచి విరమణ తీసుకున్నారు కానీ, ఇంటికే నాటకరంగాన్ని తీస్కుని వచ్చారు” అంటుంది ఒక దశలో ఆయన శ్రీమతి.

సంభాషణలు:

ఈ సినిమాలో ప్రాణం సంభాషణలు.

“మహా కావ్యాలు అనదగ్గ నాటకాలని సృష్టించి నాటకరచయితలు చిరంజీవులు అయ్యారు. వారు సృష్టించిన పాత్రలు కూడా చిరంజీవులు అయ్యాయి. మధ్యలో ఆ పాత్రలని దెయ్యాలని ఎక్కించుకున్నట్టు ఒంట్లోకి ఆవాహన చేసుకున్న నటీనటులు శలభాలలాగా కాలి బూడిద అయిపోతున్నారు. ఏది ఏమైతేనేం మేమంతా ఈ రచయితలంతా పాకీపని చేసేవారిలాగా ఒక మహోన్నతమైన కార్యం నిర్వహిస్తున్నారు. మా నటన ద్వారా మేము కూడా ఆయాపాత్రలకి జీవం తెప్పించి ప్రేక్షకులకి కన్నీళ్ళు తెప్పించి మీలోని మలినాలని ప్రక్షాణన చేస్తున్నాం కద”

ఇలాంటి సంభాషణలు ఎన్నో ఈ చిత్రంలో.

కర్ణ నిర్యాణ ఘట్టం రక్తి కట్టిస్తారు ఈయన – ఈయన స్నేహితుడు ఇద్దరూ కలిసి. ఎక్కడ అనుకున్నారు? వేదిక మీద కాదు. ప్రాణ స్నేహితుడు, చావుకి దగ్గరగా ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉండి కూడా సహకరించని పెదాలతో కర్ణ తాలూకు పాత్ర సంభాషణలు చెపుతాడు. నానాపటేకర్ ఆగుతాడా, వెంటనే అందుకుని శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తాడు. ఇదంతా ఆసుపత్రి బెడ్ వద్దే. విక్రం ఘోకలే, నానా పటేకర్ పోటీ పడి నటించారు ఈ సందర్భంలో.

***

మరాటీలో విజయవంతంగా నడుస్తూ మేధావుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించటం ఒక సాహసం.

మన తెలుగు వారు ఈ చిత్రం గూర్చి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తొంది అంటే, ప్రయోగాలకి సాహసాలకి పేరుపొందిన కృష్ణవంశీ దీనిని తెలుగులో పునర్నిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ నిర్మాతగా ఉంటూ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. స్నేహితుడి పాత్ర బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ భార్య పాత్ర రమ్యకృష్ణ పోషిస్తున్నారని ప్రాథమిక సమాచారం లభించింది.

త్వరలో తెలుగులో వస్తున్నఈ చిత్రం పేరు రంగమార్తాండ.

స్వస్తి.

Exit mobile version