[మెగాస్టార్ ‘చిరంజీవి’కి భారత ప్రభుత్వం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు ప్రకటించిన సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన కవిత.]
[dropcap]జీ[/dropcap]వన పోరాటంలో
అలుపెరగక శ్రమించి
ఎత్తుపల్లాలెన్నింటినో అధిగమించి
స్వయంకృషితో
జీవన గమ్యాన్ని చేరి
కళామతల్లి ముద్దుబిడ్డగా
నటరాజు చరణ కమలముల చెంత
సేద దీరిన మానవతామూర్తివి నువ్వు!
ఎంత ఎత్తుకు ఎదిగినా
వామనమూర్తిగ్లా ఒదిగి ఉండే
నిర్మల వినమ్రమూర్తివి కూడా నువ్వే!!
అహంకారానికి ఆమడ దూరంలో వుండే
సామాన్య, సౌమ్య, సాధు స్వభావం
నీకు మాత్రమే సొంతమైన
ఓ వజ్ర సమాన ఆభరణం!
నీ చుట్టూ పరిభ్రమించే..
సినీ మాయా ప్రపంచంలోని బడుగు జీవులు
ఆకలి బాధలతో అలమటిస్తుంతే
కలతలతో, కష్టాలతో విలవిల లాడుతుంటే
నీ మనసు ద్రవించి
ఆపన్నహస్తమందించిన వేళ..
ఆ అభాగ్యులందరికీ
నువ్వు దేవతామూర్తి వయ్యారు!
ప్రేమ, సహనం..
నీ సహజ స్వభావాలు
నిన్ను నిందించే నీచ మానవులను సైతం
ప్రేమతో హృదయంలో నిలుపుకొని
అజాత శత్రువువైనావు!
అసూయాపరుల..
అవమానాలను.. అవహేళనలను
సుగంధ పరిమళాలు వెదజల్లే
మల్లెల మాలలుగా స్వీకరించి..
పర్వత శిఖరమంత ఓర్పు
నీకే సొంతమని రుజువు చేసి..
శిఖరాగ్ర సమానుడవై
తెలుగు ప్రజల హృదయ మందిరాలలో
దైవంలా కొలువై వుండిపోయావు!
పురస్కారాలు.. సన్మానాలు..
నీ మహోన్నత ‘వ్యక్తిత్వం’ ముందు
గీటురాళ్ళేనని సకల మానవాళికీ తెలుసు!
ఈవేళ..
నిన్ను వరించి వచ్చిన..
ఈ ‘అవార్డు కన్య’ అందం
ద్విగుణీకృతమై వెలుగులీనుతోంది!
ఆమెను స్వీకరించి.. ముచ్చట తీర్చి..
సినీ వినీలాకాశంలో
‘చిరంజీవి’గా వర్ధిల్లు!