[dropcap]మ[/dropcap]ట్టితల్లి అందరికి తల్లే
అనుమానమే లేదు…
మట్టినుండి వచ్చే ప్రతీ గింజ
తేడాలేకుండా కడుపు నింపుతంది
అనుమానమే లేదు……
మట్టిపొరల్లో దాగి ఉన్న నీరే
ఎవ్వరనకుండా ప్రాణం నిల్పుతంది
అనుమానమే లేదు…….
మట్టిరేణువులే మమత కురిపించి
చచ్చినా తేడాలేకుండా
తనలో కల్పుకుంటది
అనుమానమే లేదు……
ఆ తిండికి, ఆ నీటిబొట్టుకి
ఆధారమైన ఆ సూరీడు తేడా ఏం చూపడు
అనుమానమే లేదు……..
అనుమానమల్లా
మట్టితల్లి పట్ల భక్తి లేనోని మీదనే!?
మట్టితల్లికి దండం పెట్టనోని మీదనే!?
మట్టితల్లి ఋణము తీర్చుకోనోని మీదనే!?
అనుమానం వద్దంటరా……
అణువణువు అమ్మ(దేశం)కొరకు పనిజెయ్యి
అణ్వస్త్రం కొరకు ఆహుతి అయ్యిన అబ్దుల్ కలాంలా…
తనువణువు అమ్మ(దేశం) కొరకు అర్పించెయ్యి
స్వాతంత్ర్యం కొరకు సమిధ అయ్యిన అష్ఫకుల్లాఖాన్ లా..
ఆలోచించు……ఆవేశం వద్దు…. ఆక్రమణ గుణం వద్దు
ఆలోచించు……ఆక్రోశం వద్దు…. ఆందోళన చెందవద్దు
గట్టిగా ఒక్కసారి గుండె లోతుల్లోంచి
నాతో గొంతు కలుపు
“భారత్ మాతా కీ జయ్” అని.