నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు శ్రీశ్రీ -1

2
2

[box type=’note’ fontsize=’16’] మహాకవి శ్రీశ్రీ జీవితాన్ని, రచనల ద్వారా ఆయన సమాజంపై చూపిన ప్రభావాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు కోవెల సంతోష్‌కుమార్. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]ఇ[/dropcap]రవయ్యో శతాబ్దపు మధ్యభాగం… బ్రిటిష్ సామ్రాజ్యవాదపు చేతుల్లో రెండు వందల ఏళ్ల పాటు తుప్పు పట్టిపోయిన సంకెళ్లు…, స్వాతంత్య్రం పేరుతో మరో అరాచక వ్యవస్థ కబంధ హస్తాల్లోకి బదిలీ అవుతున్న కాలం.. కునారిల్లిన శ్రామికలోకం తన చేతికి ఉన్న సంకెళ్లు తెగిపోతాయని ఆశపడింది. కుంగిపోయిన బడుగు వర్గం తనను బందీ చేసిన నిగళాలు విడిపోతాయని విశ్వసించింది. అలసిపోయిన జీవితాలకు ఆశలు కల్పించిన స్వాతంత్య్రం, ఈ దేశాన్ని ఎవరికీ కాకుండా చేసింది. ఆసేతు హిమాచలంలో వేల ఏళ్లుగా అంతర్లీనంగా అనుబంధించిన అంతస్సూత్రాన్ని తెంచేసే ప్రయత్నం చేసింది. భాషాపరంగా, కులపరంగా, మతపరంగా, ప్రాంతాల వారిగా, కొద్దో గొప్పో మిగిలి ఉన్న సామరస్యాన్ని, సౌభాగ్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని సమాధి చేసింది. ప్రజాస్వామ్యం తెర మాటున రాజకీయం పేరుతో సరికొత్త ముసుగు తొడుక్కుని రాచరిక వ్యవస్థ సింహాసనమధిష్ఠించింది.. వెయ్యేళ్ల పాటు భారత దేశంలో నిరాఘాటంగా సాగుతూ వస్తున్న దోపిడీ రంగుల తేడా లేకుండా కొనసాగుతూనే పోయింది. పోరాటాలకు స్వస్తి పలికి ఫలితాలను ఆస్వాదిద్దామని భావించిన జీవితాలు ఉసూరుమంటూ మళ్లీ గొంతు విప్పాల్సిన పరిస్థితి.. మొఘలాయీలు.. తురుష్కులు, డచ్చి వారు.. ఫ్రెంచి వారు.. పోర్చుగీసులు.. ఇంగిలీసులు.. చివరకు సొంత వారు.. ఎవరికీ తేడా లేదు.. రాజరికం దుర్మార్గానికి.. రాజకీయం దాష్టీకానికీ దాసోహం అనాల్సిన పరిస్థితి. మళ్లీ అవే పోరాటాలు.. మళ్లీ అవే ఆందోళనలు.. మళ్లీ అవే ఉద్యమాలు.. మళ్లీ అవే నినాదాలు.. ప్రత్యర్థులు మారుతున్నారు.. యుద్ధం మాత్రం ఆగటం లేదు.. ఆ సమయంలో సైనికులకు ఒక ప్రేరణ అవసరమైంది.. వారికి సరికొత్త ఆయుధం తప్పనిసరి అయింది. యుద్ధంలో అలసిపోయిన జీవులకు సరికొత్త గీతాచార్యుడు అవతరించాడు.. ఎగిసిపడే ఉద్రేకానికి.. ఉత్ప్రేరకమయ్యాడు.. శ్రామిక సైన్యపు భావోద్వేగానికి బాసటగా నిలిచాడు.. మాటల్ని ఈటెలు చేశాడు.. కత్తులుగా మార్చి కుత్తుకలపైకి విసిరాడు.. మంటలు రేపాడు.. ఆరాచక వ్యవస్థపై పదును తేలిన పదాస్త్రాలను సంధించాడు. ఆయన ప్రతీమాటా బడుగుజీవికి ప్రణవ నాదంగా మారింది.. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం అలసిపోయిన వ్యథార్థ జీవితాల్లో జీవనాదాల్ని మోగించింది.

భవభూతి శ్లోకాలు.. పరమేష్టి జూకాలు.. నా మహోద్రేకాలు.. నా వూహ రసరాజ్య డోల.. నా వూళ కేదార గౌళ.. గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు.. ఝరులు, నా సోదరులు.. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం, అనర్గళం.. అనితర సాధ్యం నా మార్గం..

అంటూ శ్రామిక లోకానికి నిశ్చయంగా చెప్పాడు.. ఆయన కనులు మూస్తే పద్యం వచ్చింది. పెదవి కదిపితే నాదమయింది. నినదిస్తే విప్లవమొచ్చింది. నిలదీస్తే తిరుగుబాటు బావుటా ఎగిరింది..

శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా, త్రికాలలో సాగిపోయిన మహాకవి.. ఆధునిక తెలుగు సాహిత్య రణక్షేత్రంలో ఒకే ఒక్క యుద్ధ వీరుడు…. అందరికీ శ్రీశ్రీగా పరిచితమైన శ్రీరంగం శ్రీనివాసరావు.

జన్మ విశేషం

‘‘నేను విశాఖ పట్నంలో, 1910లో జన్మించాను. నా పుట్టిన రోజుకు సంబంధించి స్పష్టమైన దాఖలాలు లేవు. 1910 ఏప్రిల్ నెలలో, మా నాన్నగారు చెబుతుండే దాన్ని బట్టి, ఆయనే నా స్కూలు ఫైనల్ చిఠ్ఠాలో 2-1-10 అని వేయించారు. 1925 మార్చి నాటికి నేను 15 ఏళ్ల వాణ్ణి కావడం కోసం’’ (అనంతం-13)

స్వాతంత్య్రం రావటానికి 37 సంవత్సరాలకు పూర్వమే విశాఖపట్నంలో ఓ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీరంగం శ్రీనివాసరావు జన్మించాడు. శ్రీశ్రీ తండ్రి పేరు పూడిపెద్ది వెంకట రమణయ్య. తల్లి పేరు అప్పల కొండ.. ఏడాదిన్నర వయసు శిశువుగా ఉండగానే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి శ్రీశ్రీ మాతృప్రేమకు నోచుకోకుండానే పెరిగాడు. అటు అక్కలు కానీ, అన్నలు కానీ, ఇటు తమ్ములు కానీ, చెల్లెళ్లు కానీ లేరు. శ్రీశ్రీ బాల్యమంతా ఒక విధంగా ఒంటరిగానే బతికాడు.

ఈ జన్మ తేదీ గురించి భేదాభిప్రాయాలు రెండు మూడు ఉన్నాయి. మహాకవిపై ప్రేమానురాగాలున్న పరిశోధకులు చాలా కష్టపడి తేల్చిన తేదీలు రెండు అవి ఒకటి 1910 ఏప్రిల్ 15, రెండు 1910 ఏప్రిల్ 30. విప్లవ రచయితల సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30. తేదీల విషయంలో మూడు అభిప్రాయాలున్నా 1910లో శ్రీశ్రీ జన్మించినాడన్నది నిర్వివాదం.

శ్రీరామ నవమి రోజుల్లో పుట్టాడని శ్రీశ్రీ అమ్మమ్మ అంటూ ఉండేది. చైత్ర శుద్ధ శష్టి నాడు సూర్యుడూ, శ్రీశ్రీ ఒకేసారి ఉదయించారని భాగవతుల నరసింగరావు (శ్రీశ్రీ పెద్దబావ, ఆరుద్ర తండ్రి) అంటుండేవారని శ్రీశ్రీయే ‘అనంతం’ పేర్కొన్నారు.

ఇదీ శ్రీశ్రీ జన్మ విశేషం..

పుట్టడానికి ముందే శ్రీశ్రీ జీవించాడు. తాను కాలు మోపే ఈ భూమిపై.. ఏవి ఎక్కడ ఎలా తన జీవితంతో ముడిపడిపోతాయో.. విడివడిపోతాయో దర్శించాడు. పుట్టిన తరువాత ఆ ముడిపడ్డ వాటిని చివరంటా ముడిబిగించే ఉంచుకున్నాడు.. విడిపోయిన వాటి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. తల్లి గర్భంలో ఉండే, తాను పుట్టబోయే విశాఖ పట్నాన్ని తనివి తీరా తరచి చూశాడు. అణువణువూ స్పర్శించాడు.

‘‘1909లో నేనింకా పుట్టలేదు.. పుట్టడానికి ప్రయత్నిస్తున్నాను.. అది నా జనని గర్భంలో ఉమ్మనీరులో పరిభ్రమిస్తున్నాను.

అకస్మాత్తుగా విశాఖపట్నం కనిపించింది.. గట్టిగా కౌగిలించుకున్నాను.

‘ఇదేమిటి, పట్టపగలు.. నడివీధిలో.. !

అయితే పద… అలా సముద్రంలోకి పోదాం అన్నాను..

ఇద్దరం సముద్రంలో ఈదుతున్నాం..

తీర్థపురాళ్ల దగ్గర మునిగి.. లాసన్స్ బే దగ్గర తేలాం..

ఉత్తర దిక్కుకు వద్దు.. దక్షిణంగా.. యారాడ కొండ దిగువ డాల్ఫిన్స్ ముక్కు వద్దకు చేరుకున్నాం. ఏమిటో కాలికి గుచ్చుకుంటోంది..

సోల్జర్ పేట..

ఆ దగ్గర లోనే కాకాయమ్మ గారిల్లుంది. ఆ ఇంట్లోనే నేను పుట్టబోతున్నాను. ….

విశాఖ పట్నం ఒక నిద్ర.. అందులో స్వప్నాలే నా జీవిత ఘటనలు..

విశాఖ పట్నాన్ని కౌగిలించుకోవటం అంటే విశాఖ విశ్వాసాన్ని నా అక్కున చేర్చుకోవడమే అని నా భావన.’’

శ్రీశ్రీ జన్మించిన 1910 తెలుగు వారి చరిత్రలో మరుపురాని అధ్యాయాలను లిఖించింది. బరంపురంలో సామూహిక వర్ణాంతర భోజనాలు ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దిలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఏడు సంవత్సరాల పాటు రక్తపాతం జరిగేలా చేసింది. ఆ ఏడు మాత్రం అద్భుతంగా జరిగింది.

అదే సంవత్సరం హైలీ తోకచుక్క ఆకాశంలో వెలుగులు విరజిమ్మింది. ప్రళయం వచ్చేస్తుందేమోనని అప్పుడే ప్రజలు భయపడిపోయారు. కానీ ఈ తోక చుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాకంగా గురజాడ అభివర్ణించాడు.

సమకాలీన భాషా రూపంలో.. సరికొత్త ఛందస్సు ముత్యాల సరాలనే పేరుతో గురజాడ మొట్టమొదటి సారిగా కవితా ప్రపంచానికి అందించాడు.

ఆ ఏడు .. మనను ఇంకా తెల్లవాళ్లు పాలిస్తూనే ఉన్న కాలం.. బ్రిటిష్ ప్రభువు ఏడో ఎడ్వర్ట్ మరణించాడు. అతని స్థానంలో అయిదవ జార్జి పట్టాభిషక్తుడయ్యాడు.. పాత రాజు పోయాడు. కొత్త రాజు వచ్చాడు.

అంతటి కీలకమైన సంవత్సరంలో శ్రీశ్రీ భూమ్మీద పుట్టాడు. ఆంధ్రుల సాహిత్య చరిత్ర గతినే మార్చేశాడు.

జీవిత విశేషాలు

శ్రీశ్రీ తండ్రి పూడిపెద్ది వెంకటరమణయ్య అని ముందే చెప్పుకున్నాం. ఆయన్ను శ్రీరంగం సూర్యనారాయణ పెంచుకున్నారు. అలా శ్రీనివాసరావు ఇంటిపేరు శ్రీరంగం అయింది. తండ్రి గొప్ప గణిత శాస్త్రాధ్యాపకుడు. ఆయన కుటుంబం అంతా విద్యావంతుల కుటుంబం. శ్రీశ్రీ బాల్యమంతా పరమ దారిద్య్రంలో మగ్గిపోయిందని, అంతా చెప్పుకుంటారు. కానీ, చిన్నతనమంతా రాజభోగాలతో సాగిందని ఆయనే తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు. సూర్యనారాయణ గారింట్లో ఎప్పుడో లంకెబిందెలు దొరికాయని, దాని వల్ల తన చిన్నతనంలో ఒంటినిండా బంగారం ఉండేదట.

శ్రీశ్రీ చిన్నతనంలోనే ఆత్మీయులందరినీ పోగొట్టుకున్నాడు. ఏణ్ణర్థం వయసులోనే తల్లి పోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు మామ్మ, తాతగారు వెళ్లిపోయారు. ఆ రోజుల్లో శిశువుకు చనుబాలివ్వటం తల్లులు బాధ్యతగా స్వీకరించేవారు. అందుకే అయిదో ఏడు వచ్చేవరకూ శ్రీశ్రీకి ఎందరో అమ్మలు తమ చనుబాలిచ్చి ఎదిగేలా చేశారు. మిగతా విషయాలన్నీ తండ్రే అన్నీ అయి ఆయన్ను చూసుకున్నాడు. తాను రెండో వివాహం చేసుకున్నా.. ఆ మారుతల్లి కూడా అపారమైన ప్రేమానురాగాతో శ్రీశ్రీని పొత్తిళ్లలో పెట్టుకుని పెంచింది. ఆమె పేరు సుభద్రమ్మ. అయిదో ఏట తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీశ్రీకి ఉపనయనం జరిగింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో అక్షరాభ్యాసమూ జరిగింది. విశాఖలోనే ఒక వీధి బడిలో శ్రీశ్రీ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ వీధిబడి మాష్టారు గోదావరయ్య శ్రీశ్రీకి తొలిగురువు.

చిన్ననాటి నుంచీ శ్రీశ్రీది వామపక్ష వాదమే. ఎడమ చెయ్యి వాటమే. అక్షరాలు ఎడమ చేతితో రాస్తుండే వాడు. ఆయన తండ్రి ఎలాగో కష్టపడి శ్రీశ్రీ చేత ఎడమ చేత్తో రాయటం మాన్పించాడు. మనకు ఇప్పుడు కలగా మిగిలిపోయిన బాల్యావస్థనంతా ఎంతో ఆనందంతో శ్రీనివాసరావు అనుభవించాడు. రంగుల చాక్‌పీసులతో ఇళ్లంతా పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ బొమ్మలు గీసేవాడు. దీంతో తండ్రి ఓ నల్లబల్ల.. కొనిపెట్టాడు. ఎన్ని బొమ్మలు గీసుకున్నా.. అందులోనే… వాటర్ కలర్స్ కావాలంటే కొనిచ్చాడు.. చిత్రవిచిత్రమైన బొమ్మలు శ్రీశ్రీ ఎన్ని గీశాడో… ఆ చిన్నతనంలో.. శ్రీరామ నవమి వస్తే ముఖానికి రంగులు వేసుకుని.. వెదురు ముక్కకు నులక తాడు బిగించి ధనుర్బాణాలు తయారు చేసుకుని తానే శ్రీరాముల వారిలాగా తయారై పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. బాల శ్రీశ్రీ మంచి పాటగాడు కూడా… ఇప్పుడు మనకు ఆ బాల్యం రమ్మన్నా రాదు.. మన పిల్లలకు అలాంటి బాల్యాన్ని ఇవ్వమన్నా ఇవ్వలేం. కాంక్రీట్ జంగల్లో కంప్యూటర్ల నడుమ ఇల్లు కూడా దాటని ఎలక్ట్రానిక్ ఆటల్లో మునిగి తేలే అర్థం లేని బాల్యానికి శ్రీశ్రీ తరం ఆనందంగా గడిపిన పసి కేరింతలకీ ఎంత తేడా? కేరమ్స్, చదరంగం, ఫుట్‌బాల్ వంటి ఆటల్లో శ్రీశ్రీ జిల్లా స్థాయిలో బహుమతులు చాలానే సాధించాడు. తరువాతి కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు పూట గడవటం కోసం వాటిని అమ్ముకోవలసి వచ్చింది.

శ్రీశ్రీకి నాలుగు నిండి అయిదో ఏడు ప్రవేశించిన సంవత్సరం అంటే 1914 తొలి ప్రపంచ మహా సంగ్రామం ప్రారంభమైంది. నవయుగ కవితా వైతాళికుడు గురజాడ అప్పారావు అదే సంవత్సరం అస్తమించాడు. బాలకవి చదువు కూడా అదే సంవత్సరం ప్రారంభమైంది. శివరామయ్యగారి స్కూల్లో అయిదేళ్ల పాటు శ్రీశ్రీ చదువుకున్నాడు. ఆ స్కూళ్లో ఉన్నప్పుడే.. తొలి పద్యాన్ని రాశాడు. ఒక పొట్టి పాదం.. తరువాత ఒక పొడుగు పాదం.. ఇలా ఓ కందపద్యం రాశాడు. ఇతని కవితాసక్తిని గమనించి తండ్రి సులక్షణ సారం అనే ఛందో గ్రంథాన్ని అందించాడు. అంతే కాదు, కొడుక్కి ఛందో విశేషాలను కూడా బోధించాడు. కేతవరపు వెంకటరామయ్య దగ్గరకు సంస్కృతం నేర్చుకోమని పంపించాడు కానీ, శబ్దమంజరి చదువుకునే దగ్గర్లోనే అది ఆగిపోయింది. మనుచరిత్రని చదివాడు. శ్రీనాథుణ్ణి, రామకృష్ణకవినీ ఆకళింపు చేసుకున్నాడు. పదేళ్లు నిండకుండానే శ్రీశ్రీ కవితా వృక్షం విత్తు నుంచి మొక్కగా ఎదగటం ప్రారంభించింది. ఓ వైపు పద్య రచనలు చేస్తూనే వేంకట పార్వతీశ కవులను ఆదర్శం చేసుకుని అపరాధ పరిశోధక నవలలు రాయటం ఎనిమిదేళ్ల వయసులోనే ప్రారంభించాడు. విచిత్రమేమంటే.. అప్పట్లో ఏదో పత్రికలో ‘కాలూరాయీ’ అనే డిటెక్టివ్ నవల వస్తోందన్న ఓ ప్రకటన చూసిన శ్రీశ్రీ.. గదిలో కూర్చుని అదే పనిగా మరో డిటెక్టివ్ నవలను అదే పేరుతో రాసి.. ప్రకటన చేసిన నవల రావటానికి ముందే తన నవలను రిలీజ్ చేసాడు. 1920లో వీరసింహ విజయసింహులనే నవలను రాశానని శ్రీశ్రీ చెప్పుకున్నాడు. కానీ, దాని లిఖిత ప్రతి మాత్రం ఆయనకే దొరకలేదు. తాను జగన్మిత్ర సమాజపు నాటకాలలో బాలపాత్రలు వేసేవాటు. ఓ నాటకంలో అతను కట్టిన పాత్ర పేరు అశరీర వాణి. ఆ నాటకం పేరు శ్రీకృష్ణ లీలలు. రసపుత్ర విజయమనే నాటకంలో అజిత సింహుడనే పాత్రను కూడా శ్రీశ్రీ వేశాడు.

1920లో ఒకసారి గాంధీజీని అరెస్టు చేశారని విద్యార్థులంతా నిరసన తెలిపారు. అందులో పాల్గొన్నందుకు శ్రీశ్రీని తండ్రి బెత్తంతో కొట్టాడు. ఎందుకో తెలియదు.. సాయంత్రానికి మాత్రం క్షమించేశాడు. ఆ రోజుల్లో ఒంటెద్దు లాగే పెట్టె బండ్లు.. సైకిళ్లు తప్ప మరో వాహనం సంపన్నుల దగ్గర ఒకటో అరో కనిపించేది. శ్రీశ్రీది ఈ రెండు వాహనాల్లోనే ప్రయాణం.. మోటారు కార్లు అప్పుడొక వింత.. ఇప్పుడేమో రోత.

1925లో పాఠశాల విద్య పూర్తయింది. అంతకు ముందు సంవత్సరమే మారుతల్లి సుభద్రమ్మ మరణించింది. అప్పటికి శ్రీశ్రీ వయస్సు పదిహేనేళ్లు.. అదే ఏడు అతని వివాహమూ జరిగింది. తన పెళ్లి సందర్భంగా శ్రీనివాసరావు పరిణయ రహస్యమనే నవలికను రాశాడు. చాలా కాలం పాటు ఆ గ్రంథం దొరకలేదు. కొన్నేళ్ల క్రితమే ఇది దొరికిందని సుప్రసిద్ధ పరిశోధకులు, బూదరాజు రాధాకృష్ణ చెప్పారు. అది బాల్య వివాహపు రోజులు.. శ్రీశ్రీ వివాహం కూడా విచిత్ర వివాదాలతో జరిగింది. ఓ అమ్మాయిని చూపించి ఈ పిల్లను పెళ్లాడతావా అని తండ్రి అడిగితే సరేనన్నాడు శ్రీశ్రీ. అమ్మమ్మకు మాత్రం అమ్మాయి ఇష్టం లేదు. దీంతో శ్రీశ్రీని అక్కడి నుంచి తప్పించేసి బారువా అనే గ్రామానికి పంపించేసింది. దీంతో మర్నాడు జరగాల్సిన శ్రీశ్రీ పెళ్లి వాయిదా.. విశాఖపట్నం స్తంభించిపోయింది. తండ్రి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. పెళ్లి కూతురు శ్రీశ్రీని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనంటూ భీష్మించింది. చిన్నాన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ సోమనాథం.. నగరాన్నంతటినీ ఏకం చేసేశాడు. మొత్తానికి బారువా గ్రామంలో తలదాచుకున్న శ్రీశ్రీని పట్టుకొచ్చి భీమునిపట్నం తరలించి ఏకరాత్ర వివాహాన్ని చేశారు. పెళ్లి కూతురు పేరు మూలా వెంకట రమణమ్మ. శ్రీశ్రీ భార్య అయిన తరువాత శ్రీరంగం వెంకట రమణమ్మ. దాదాపు 50 సంవత్సరాల సంసార జీవితం వీరిద్దరిది.

1959లో ఉపద్రష్ట సరోజను శ్రీశ్రీ రెండో వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరులో శ్రీశ్రీ దంపతులకు కూతురు జన్మించింది. ఆమె పేరు మంజుల. ఆ తరువాత మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి జన్మనిచ్చారు.

అనారోగ్యం

దురదృష్టవశాత్తూ శ్రీశ్రీని ఒకసారి భగందర అనే వ్యాధి పట్టుకుంది. ఇదొక దీర్ఘ వ్యాధిగా మారిపోయింది. మహాకవిని దాదాపు నలభై సంవత్సరాల పాటు పీడించిన జబ్బు ఇది. శ్రీశ్రీ ఆరోగ్యవంతుడైన బాలుడేమీ కాదు.. ఆయనకు తరచూ చిన్నబిడ్డ చేష్టలు వస్తుండేవి. ఏడాది పిల్లవాడిగా ఉన్నప్పుడే, అప్పుడు అమల్లో ఉన్న నాటువైద్య పద్ధతి ప్రకారం చుట్టనిప్పుతో వాతలు పెట్టి స్మృతిలోకి తీసుకురావలసి వచ్చేది. విశాఖపట్నంలోనే ఉండే శివప్రసాదరావనే వ్యక్తి ఈ వైద్యం చేసేవాడు. అంతే కాదు.. దృష్టి దోషమూ ఉండేది. సినిమాలు స్క్రీన్‌కు చాలా దగ్గర నుంచి చూడటానికి అలవాటు పడటంతో కంటిచూపు కాస్త మందగించింది. 18ఏళ్ల వయసు వచ్చేసరికి కళ్లద్దాలు పెట్టుకోవలసి వచ్చింది. 1930లో శ్రీశ్రీ టైఫాయిడ్‌తో తీవ్రంగా బాధపడ్డాడు. దాదాపు 63 రోజుల పాటు అతణ్ణి ఈ మాయరోగం బాధించింది. డాక్టర్ మల్లిక్(చాట్రాతి మల్లికార్జునరావు) ఈ జబ్బు నుంచి విముక్తి కలిగించాడు.

చదువు-కవిత

డిగ్రీ చదవటానికి ముందు నుంచే ఆయన కవిత్వం పూర్తిగా చిక్కదనాన్ని పట్టుకుంది.. ఇంటర్‌మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు జాతీయవాది పురిపండా అప్పల స్వామి(1904-1982) తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వీరి స్నేహం ఆ మరణాంతం కొనసాగింది. శ్రీశ్రీకి అన్ని విధాలా మార్గదర్శిగా ఉన్నవాడు పురిపండా.. శ్రీశ్రీ తొలి కవితలు ప్రచురించిందీ పురిపండాయే. తన పత్రిక స్వశక్తిలో శ్రీశ్రీ రాసిన ‘విశ్వరూప సందర్శనము’ అనే పద్యరచనను ‘దివ్యలోచనములు’గా పేరు మార్చి పురిపండా అప్పలస్వామి ప్రచురించాడు. ఆయన స్థాపించిన కవితా సమితిలో శ్రీశ్రీ 1926లో సభ్యుడయ్యాడు కూడా. వడ్డాది సీతారామాంజనేయులు ఇందులో సభ్యుడు మాత్రమే కాదు.. శ్రీశ్రీ స్నేహితులలోనూ అగ్రగణ్యుడే..

‘ప్రభవి’ంచిన నవకవి

1926-28లో శ్రీశ్రీ ఇంటర్‌మీడియట్ విద్యాభ్యాసం పూర్తయింది. ఈ మధ్య కాలంలోనే తొలి కవితాసంకలనం ప్రభవ అచ్చయింది. ఇది కూడా మూడు భాగాలుగా ప్రచురణ జరిగింది. ఇది సంప్రదాయ ఛందస్సుల్లో వెలువడిన రచన. ఆంధ్ర పరిషత్పపత్రిక దాన్ని అనుకూలంగా విమర్శించింది. భారతిలో కొంపల్లె జనార్ధనరావు వ్యతిరేకంగా విమర్శించాడు.

ఎఱుగవే నన్ను లోక భీకర మహోగ్ర

ఫణి విషస్ఫీత మృత్యురూపిణిగ నీవు?

నీ హృదంతర వదన సంస్థిత కరాళ

శిఖి శిఖాచ్ఛటనని గ్రహించెదవో లేవో?

భీప్రద క్రరచోగ్ర దంష్ట్రాప్రభూత

విస్ఫుర త్తేజమున దాండవించుచు నన్ను

మృత్యుదేవతగా మదినెఱుగలేవో!  (ప్రభవ)

అదే కాలంలో శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ(1895-1976), దేవులపల్లి కృష్ణశాస్త్రి,(1897-1980), కవికొండల వెంకటరావు(1892-1969)ల ప్రభావంలో పడ్డాడు. ఆ సమయంలో తెలుగు సాహిత్య క్షేత్రాన్ని భావకవిత్వోద్యమం అప్రతిహతంగా ఏలుతోంది. ఆ కాలంలోనే ప్రభవ కావ్యం అచ్చవటం.. దాని వెంటే కవిగా అస్తిత్వాన్ని శ్రీశ్రీకి కట్టబెట్టి ఆయన్ను నిలబెట్టింది. ప్రఖ్యాత కవి టెన్నిసన్ కవితల్ని అదే సంవత్సరం ఆయన అనువదించాడు కూడా.

***

శ్రీశ్రీకి తొలి స్నేహితుడు స్వయంగా తండ్రే. మలి స్నేహితుడు తన దత్తు తండ్రి సోదరుడైన సుందరనారాయణ రెండో కుమారుడు నారాయణబాబు. ప్రఖ్యాత రచయిత. నారాయణ బాబు శ్రీశ్రీకి అన్నయ్య అయినా, ఇద్దరూ పేరు పెట్టుకునే పిలుచుకునే వారు. నారాయణబాబు రాసిన రుధిర జ్యోతి ఖండకావ్యం 1972లో అచ్చయింది.

ఇంటర్ మీడియట్ పూర్తయ్యేంత వరకు శ్రీశ్రీ విశాఖపట్నం వదిలి వెళ్లలేదు. డిగ్రీ చదువులకు మాత్రం మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి క్రైస్తవ కళాశాలలో బిఏ పూర్తి చేశాడు. అక్కడే కొంపల్లె జనార్ధన రావు(1907-1937)తో స్నేహం మొదలైంది. కొంపల్లె మరణించేంత వరకూ ఈ స్నేహం కొనసాగింది. శ్రీశ్రీ తొలి కవితా సంకలనం ప్రభవను తీవ్రంగా విమర్శిస్తూ భారతిలో సమీక్షించింది ఈ కొంపల్లె జనార్ధనే. ఇతనే ఆ తరువాత శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడయ్యాడు. మహాకవి మహాకావ్యాన్ని అంకితంగా అందుకున్నాడు.

‘‘తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం.. సెలవంటూ లోకాన్ని వదిలి

తలపోసినవేవీ కొనసాగకపోగా..పరివేదన బరువు బరువు కాగా

అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ ..చిరునవ్వూ, చేయూతా ఇవ్వక

మురికితనం, కరుకుతనం నీ..సుకుమారపు హృదయానికి గాయం చేస్తే

అటుపోతే, ఇటు పోతే అంతా.. అనాదరణతో, అలక్ష్యంతోచూసి

ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని..వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా నేస్తం

తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం

……..

ఈ నిరాశామయలోకంలో ..కదన శంఖం పూరిస్తున్నాను

ఇక్కడ నిలబడి నిన్ను..ఇవాళ ఆవాహనం చేస్తున్నాను

అందుకో ఈ చాచిన హస్తం..ఆవేశించు నాలో..

ఇలా చూడు నీకోసం..ఇదే నా మహా ప్రస్థానం..

కొంపెల్ల జనార్ధన రావు కోసం శ్రీశ్రీ మహా ప్రస్థానంలో రాసిన అంకిత పద్యమిది. ప్రాణ స్నేహితుడు మూడు పదుల వయసైనా దాటకుండానే మరణించటం శ్రీశ్రీని కలచి వేసింది. కొంపల్లె జనార్ధనరావు, శ్రీశ్రీ కలిసి మదరాసు అంతా కలయ తిరిగే వారు. సాహితీ క్షేత్రంలో ఇద్దరూ అప్పటికే వికసించిన పూవులు.. ఇద్దరూ సమవయస్కులు కావటం.. భావజాలం కూడా ఇంచుమించుగా ఒకటిగానే కలవటంతో రెండు శరీరాలు.. ఒక ఆత్మగా ఏకమైపోయారు. అందుకే క్షయ వ్యాధి కొంపల్లెను ఎత్తుకుపోయినప్పుడు శ్రీశ్రీ అంతగా ఆవేదన చెందాడు.. కుంగిపోయాడు. శ్రీశ్రీ మదరాసులో ఉన్నప్పుడు ఆయన సాహితీ వ్యాసంగం అద్భుతంగా సాగింది. సాహితీ దిగ్గజాలతో సహవాసం ఏర్పడింది. గన్నవరపు సుబ్బరామయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి మహానుభావులతో స్నేహం కుదిరింది. అక్కడి నుంచి శ్రీశ్రీ సాహితీ ప్రస్థానం అప్రతిమానంగా సాగుతూ పోయింది.

కటిక దారిద్య్రం

డిగ్రీ పూర్తయ్యాక 1930లో విశాఖపట్నానికి తిరిగి వచ్చేశాడు శ్రీశ్రీ.. అప్పటి నుంచీ దారిద్య్రం ఆయన్ను వెంటపడి తరిమింది. అన్నార్తి తప్ప ఏదీ లేదు. .. తాము తినాలి.. కుటుంబం ఆకలి తీర్చాలి.. ఎలా? ఒకటే సమస్య.. ఎలాగైనా ఉద్యోగం వెతుక్కోవాలి. ఇందుకోసం ఒకసారి ఖరగ్‌పూర్ నుంచి కలకత్తా దాకా రైలు పట్టాలపై ఇరవై మైళ్లు శ్రీశ్రీ నడిచాడు. విశ్వవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా కనాకష్టం పడ్డ కుటుంబాల్లో శ్రీశ్రీ కుటుంబం ఒకటి. ఈనాడు సమస్త తెలుగు సాహితీ లోకం మహాకవిగా దేన్నైతే నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నదో.. మరో నూరేళ్ల పాటు శ్రీశ్రీని సజీవంగా ఉంచగలిగిన మహాకావ్యం మహాప్రస్థానంలోని అనేక గీతాలను ఈ కష్టకాలంలోనే.. ఈ దారిద్య్రం నీడలోనే రాశాడు.

శ్రీశ్రీ ఎంత పేదరికాన్ని అనుభవించాడంటే.. బతకటం కోసం విశాఖలోని సొంత ఇంటిని అమ్ముకోవలసి వచ్చింది. విశాఖ హార్బరులో టైమ్ కీపర్‌గా, పెయింగ్ క్లర్క్‌గా పనిచేశాడు. తాను ఇంటర్‌మీడియట్ చదువుకున్న కళాశాలలోనే జంతుశాస్త్ర విభాగంలో డెమోన్ స్ట్రేటర్‌గా పనిచేశాడు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీశ్రీ తాను చేసిన ఏ ఉద్యోగాన్నీ స్థిరంగా చేయలేకపోయాడు. ఇందుకు చాలా కారణాలు ఉండవచ్చు. తెలుగు తొలితరం జర్నలిస్టులైన నార్ల వెంకటేశ్వర రావు, న్యాపతి నారాయణమూర్తి మల్లవరపు విశ్వేశ్వరరావు, కప్పగంతుల సత్యనారాయణలతో పాటు ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశాడు. రాయిటర్స్ ఏజెన్సీ కాపీలను అనువాదం చేసి అంతర్జాతీయ, జాతీయ వార్తల పేజీలకు అందివ్వటం శ్రీశ్రీ విధి. కానీ, కొంతకాలానికే అతని పనితీరు అసంతృప్తిగా ఉందంటూ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ తరువాత కొంత కాలానికి మదరాసు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగం సంపాదించాడు. నాలుగు నెలల పాటు ఢిల్లీ నుంచి న్యూస్ రీడర్‌గా కూడా శ్రీశ్రీ పని చేశాడు. అక్కడ ఆయనకు ఓ చిత్రమైన పేరు వచ్చింది. ఉద్యోగంలో భాగంగా స్టాలిన్ గ్రాడ్ యుద్ధాన్ని వర్ణిస్తూ ఓ రోజు శ్రీశ్రీ వార్తలు చదివాడు. దీంతో ఆయనకు గాంధేయవాది అంటూ ఓ విచిత్రమైన ముద్ర వేశారు. ఉన్న పదవి ఊడగొట్టారు. శ్రీశ్రీని గాంధేయ వాది అనటం ఎక్కడి విడ్డూరమో అర్థం కాదు. ఉద్యోగం కోసం భారత దేశంలో శ్రీశ్రీ తిరగని చోటు లేదు. లక్నో, అలహాబాద్, కలకత్తా, విశాఖపట్నం, విజయనగరం.. ఇలా కన్న ఊరు దగ్గర నుంచి కనిపించిన ప్రతిఊరులోనూ కాలుమోపాడు. లక్నోలోని ఓ మిలటరీ కంటోన్మెంట్‌లో లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ శ్రీశ్రీ మలేరియా పీడనతో అల్లాడిపోయాడు. ఈ మలేరియాయే.. శ్రీశ్రీని మద్యపానానికి అలవాటు చేసింది. ఇక్కడ మిలటరీ కంటోన్మెంట్ అధికారులు శ్రీశ్రీని కమ్యూనిస్టు అని తెలుసుకుని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒకరు గాంధేయవాది అన్నారు.. మరొకరు కమ్యూనిస్టు అన్నారు. ఇద్దరూ అతని ఉద్యోగాన్ని తీసేసారు. చివరకు బాల్యస్నేహితుడైన అబ్బూరి వరద రాజేశ్వర రావు ప్రోత్సాహంతో, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని సెక్రటేరియట్‌లో పౌర సంబంధాల అధికారిగా చేరాడు. ఇక్కడా ఎంతోకాలం ఉండలేకపోయాడు. చివరకు మళ్లీ మద్రాసు చేరుకుని సినిమా అవకాశాల కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. 1950 నుంచి సినీరచయితగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి శ్రీశ్రీ జీవితం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవటం ప్రారంభించింది. దరిద్రం పట్టుకుంటే వదలని విక్రమార్కుడిలా శ్రీశ్రీని వేటాడింది.. వెంటాడింది.. అయినా శ్రీశ్రీ జంకలేదు.. వెరవనూ లేదు. జీవితమంతా పీడించాలని వచ్చిన దరిద్ర దేవత తానే విసిగిపోయి కొంతకాలానికి శ్రీశ్రీని విడిచి వెళ్లిపోయింది.

సినిమారంగంలోకి ప్రవేశించిన తరువాత ఆయన జీవితం చాలా వరకు మారిపోయింది. ఆయన పాటలు జనానికి మరింత చేరువ చేయటమే కాకుండా.. 1950లో ఆహుతి డబ్బింగ్ సినిమాకు పని చేయటంతో రెండు దశాబ్దాల పాటు వెన్నంటి ఉన్న దరిద్రం దూరం అయింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ, అందులో పాటలు హెచ్‌ఎం రెడ్డి దృష్టికి వెళ్లాయి. అందులో ప్రేమయే జనన మరణ లీల అన్న పాట ఆయనకు బాగా నచ్చింది. అది శ్రీశ్రీకి సినిమాల్లో ముందుకు వెళ్లటానికి మార్గం చూపెట్టింది. హెచ్‌ఎంరెడ్డి శ్రీశ్రీని పిలిపించి ఆయన సినిమా నిర్దోషి(తెలుగు) నిరపరాధి(తమిళం) సినిమాల్లో పాటలకు అవకాశం కల్పించారు. అందులో శ్రీశ్రీ రెండు పాటలు రాశాడు. ఆ తరువాత నెలకు 300 రూపాయల జీతంతో రెడ్డిగారి కంపెనీలో ఆస్థానకవిగా స్థానం సంపాదించారు. అక్కడి నుంచి ఆయన ఆదాయం మెరుగుపడటం, లాభదాయకమైన పరిస్థితికి చేరుకోవటం జరిగింది. మద్రాసులో శ్రీశ్రీ ఇల్లు కొనుక్కున్నాడు. ఓ కారును కూడా కొనుక్కున్నాడు. అల్లూరి సీతారామరాజులో తెలుగువీర లేవరా వంటి పాటలు.. శ్రీశ్రీని అపురూప స్థాయికి తీసుకెళ్లాయి.

ఇక్కడే శ్రీశ్రీ మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతటి దారిద్య్రం వెంటాడుతున్నప్పటికీ, పొగిడితే పొంగిపోవటం, తిడితే క్రుంగిపోవటం శ్రీశ్రీకి తెలియదు. తన అమూల్యమైన కవిత్వాన్ని తిట్టిన వాళ్లను కూడా ఆయన ఎన్నడూ అసహ్యించుకోలేదు. ప్రభవ కవితలను ముందుగా విమర్శించింది కొంపెల్ల జనార్ధనరావే. పరిచయం కాకముందే కొంపల్లె శ్రీశ్రీ కవితల్ని విమర్శించాడు. ఆ తరువాత ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. తన కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోలేదు. ఈ పేదరికమే.. తన మహా ప్రస్థానాన్ని శాసించింది. అందులోంచే మహాకవిత్వం పుట్టుకొచ్చింది. ‘‘నా సమస్త రచననూ మెచ్చుకునే ఒక పురిపండా, ఒక జనార్ధనరావు, ఒక అబ్బూరి రామకృష్ణారావు, అంతే కాదు.. ఒక విశ్వనాథ సత్యనారాయణ కూడా ఉండగా ఇక నేనెవరికైనా ఎందుకు భయపడాలి?’’ ఇదొక్కటి చాలు.. శ్రీశ్రీ మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి. జీవితంలో తానేదనుకుంటే అది చేశాడు. దేనికీ ఏనాడూ భయపడలేదు. చెప్పదలచుకున్నది ఖచ్చితంగా చెప్పాడు.

1929లో శ్రీశ్రీ నుంచి సుప్తాస్థికలు వెలువడింది. అప్పటికి ఆయనలో మార్పు ప్రారంభమైంది. కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటి వారి ప్రభావం నుంచి క్రమంగా బయటపడి తన్ను తాను ఆవిష్కరించుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి సొంత గొంతుక వినిపించటం మొదలైంది. తాను మాష్టారుగా పని చేస్తున్న రోజుల్లోనే గతి తార్కిక భౌతిక వాదాన్ని చదవటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎక్కడ చూసినా స్వాతంత్య్ర ఢంకారావం… స్వేచ్ఛ కోసం తహతహ.. ఈ ఉద్యమాలు, ఆందోళనలు.. అలజడులు.. తాను ముందుకు నడవాల్సిన మార్గాన్ని స్పష్టంగా నిర్దేశించాయి. ప్రజలకు అందుబాటులో.. ప్రజలను చైతన్యశీలంగా ముందుకు తీసుకుపోయే రచనలను చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఆ తరువాత ఆయన ముత్యాల సరాలపైన తీవ్రమైన కృషి చేసి సాధించాడు. ముత్యాల సరాల కొత్త పోకడలు శ్రీశ్రీ కవిత్వంపై తమ ప్రభావాన్ని నిలుపుకున్నాయి. ఇంతటితో శ్రీశ్రీ ఆగిపోలేదు. కొన్ని పాశ్చాత్య పుంతలను తొక్కాడు. రొమాంటిక్ కవిత్వంతో పాటు, ఫ్యూచరిజం.. పారిశ్రామిక రంగంలోని కుట్రల్ని, కుళ్లును, శిథిల స్థితిని ఆకళింపు చేసుకున్నాడు. అవ్యక్త, వ్యక్తావ్యక్త అంతర్గత చైతన్య మానసిక వాదపు సాహిత్యరీతులను రకరకాలుగా తన కవితా మార్గంలో ప్రసరింపజేశాడు. అనల్పమైన కవితాఝరిని ప్రవహింపజేశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here