[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది మూడవ ఖండిక ‘ జలజమా’. [/box]
[dropcap]జ[/dropcap]లజమా – ‘నవమి’ ఖండకావ్యంలోని మూడవ ఖండిక.
***
ఓయి! జలజమనీవిలనుదయభాను
దీప్తివిప్పారి కరముగ దిట్టనైతి
చక్కదనమున నంచును నిక్కుబోకు
మాపటేళకు నీకళిక మాయునమ్మ. 1
పగటిరాజు పట్ల వయ్యారములు జూపి
అతని ప్రేమ ముంచి యతులితముగ
తనదు పత్ని మరచు తంతుజేసితి వీవు
అక్క ఛాయ పట్ల అక్కసేల? 2
అందచందాల గరిమతో నర్కు సతము
లోలతను ముంచినాతని నాలివయ్యు
దక్షిణానాయకునిగను తద్దరీతి
కర్మసాక్షిని జేయుటన్ మర్మమేమి! 3
ఇనుడస్తాద్రికి జేరునంతవరకేనింపారునీయందమున్
కనువిందుందగజేయుచున్ కరముగాకాన్పించిభృంగాళికిన్
ఘనమౌనీదుమరందబిందుతతినిన్ కాంక్షింపగాజేయుటన్
చేనవేయాతడునబ్ధిగ్రుంకగను నిస్సారంబులైచేచ్చరన్. 4
ఇంతమాత్రమునకెయూమిడిసిపాటేల
అంతరించిపోవుయందమునకు
ఎంతగొప్పదైన నీవిశ్వమందున
కాలగర్భమందు కలియునమ్మ. 5
కనులుతెరచినీదు కాంతులజిందించి
సూర్యకిరణములను శోభమీరి
అదియేగొప్పటంచు నారాటపడుబోకు
కన్నుమూయగలవుకాలవశత. 6
అంతమేలేనియట్టి యీయవనియందు
అంతయున్ శాశ్వతమ్మంట భ్రాంతియగును
బ్రహ్మ సృజయించినట్టి యీ ప్రకృతియంత
నాశమౌనంచు తెలియుమో నళిన సుమమ. 7
అర్కడైనట్టి వానికే అస్తమయము
ఉదయములు కల్గు చుండ నీయుర్వియందు
క్షణికమైనట్టి సొగసుపై కాంక్షయేల
తరలిపోయెడు దానికై తర్కమేల? 8
మిథ్యయైనట్టి జగతిని తథ్యనునుచు
నిత్యమును చూచునది యెల్ల సత్యమనుచు
భావనం జేయుచుండుట భ్రాంతియగును
అట్టి సూక్తిని కాదన్నపుట్టి మునుగు. 9
సిరికి పీఠమేను కరముగ నలువకున్
జన్మనిచ్చినట్టి స్థలమునేను
అంచుగర్వపడకు అంబుజాతమ నీవు
వారి వలన నీకు వాసి వచ్చె. 10
అరయ రేరాజు వచ్చెడి తరుణమందు
కలువరాణియు విచ్చి నీ చెలువమంత
అంతరింపగ జేసి తానలరు మిగుల
కాలమొక రీతి నుండగ జాలదమ్మ. 11
అంతరించుట నిక్కము అందమిలను
కాంతి కలకాలముండక కరగిపోవు
పరువమొకరీతి నుండక తరగిపోవు
ఇంత మాత్రకే బింకమదేలనమ్మ. 12
నీదగు నిండుసోయగమనీదు విలాసము నీదుసత్కళల్
నీదు మరందమాధురులు నీదగుప్రాయము నీమెఱుంగులున్
నీదరితుమ్మెదార్భటులు నీదగు జీవితసౌరభింబులున్
సాదరమెప్పగా చనుట సత్యము సత్యమటంచెఱుంగుమా. 13
పుట్టినట్టి ప్రాణి గిట్టక మానదు
ఎప్పుడైనగాని యెన్నడేని
ప్రకృతి యందునున్న ప్రబలసత్యమిదియ
దీనినెఱుగకున్నజ్ఞానియగునె. 14
ప్రాణులెప్పుడైన పరువంబులోవచ్చు
రంగుహంగులకును పొంగిపోక
ప్రకృతి తత్త్వమెఱిగి పరమసత్యమెఱింగి
మసలుకొనుటకరముమంచిదగును. 15