నవమి – ఖండిక 4: పరోపకారము

0
2

[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది నాలుగవ ఖండిక ‘పరోపకారము’. [/box]
[dropcap]ప[/dropcap]రోపకారము – ‘నవమి’ ఖండకావ్యంలోని నాలుగవ ఖండిక.

***

ధాత్రిని పంచభూతములు తద్దయుమేలును జీవకోటికిన్
పాత్రతమీరజేయుచును ప్రాకటలీలను గాచుచుండగా
సూత్రము గోత్రముంగీలిగిశోభితుతానరుతేల మేలునే
మాత్రము మానవాళికిని మంచిగ నెంచరిదేమి పాపమో. 1

మంచిచెడ్డల రసి మసలుకొనెడు శక్తి
మాటలాడు నట్టిమేటి శక్తి
కలిగినట్టివాడు కలిలోన మనుజుండు
జగతి మేలు గోరదగివాడు. 2

ప్రకృతి లోపలనున్నట్టి ప్రాణులందు
మిన్నయైనది యంచు నమేయరీతి
చెప్పబడుచుండు మానవ జీవియంచు
వేద శాస్త్ర పురాణాల విపులముగను. 3

తలచనపకారికైనను ధాత్రియందు
భేదభావంబునెంచక ప్రేమతోడ
మిగులనుపకారమును జేయమేలటంచు
మనదు సంస్కృతి చెప్పదే ఘనముగాను. 4

బుద్ధిజీవి నరుడు పుడమిలో సతతము
సంఘజీవి యౌచు సాగుచుండు
అట్టి యెడల జనులు నన్నోన్యమౌ రీతి
సాయపడుటకరము సమ్మతంబు. 5

తోటి మానవునకు దోడుగ నిల్చియు
ఉపకరింప బూనుటుత్తమంబు
తలచ ధర్మమిదియ ధారుణియందున
పెద్దవారు జెప్పు సుద్ది యిద్ది. 6

మనుజ లోకమందు మనుగడ సాగించు
మనుజ గణమదంతమాన్యవృత్తి
ఒకరికొకరు మిగులనుపకారులయిరేని
పుడమి స్వర్గముగను పోల్చబడదె. 7

పరులకుపకారములు జేసి పరగువాడు
వాడె ధన్యుడు గణ్యుడు వసుధయందు
మహిత యశమును బొందెడి మాన్యుడతడె
మాధవుని మెప్పునందెడు మనుజుడతడె. 8

ఉపకారబుద్ధితో నుర్విలో వృక్షముల్
ఫలియించుచుండెను వనములందు
ఉపకారకాంక్షతో ఉద్వృత్తినదములు
మంచినీటి నొసంగు మానవులకు
ఉపకార భావాననుత్తమమేఘాలు
వసుధపై వర్షించి వరలుచుండె
ఉపకారమును నెంచి ఊర్జితంబగు రీతి
ఆలమంద లొసంగు పాల నిలను
ప్రతిఫలాపేక్ష లేకుండ ప్రకృతి సతము
పరులకుపకారమును జేసి పరగుచుండ
మహిని జీవించుచున్నట్టి మానవుండో
ప్రజకునుపకారమును జేయ పాడిగాదె. 9

ప్రకృతి తనకు తానె ప్రధితవకా రీతిగ
ప్రాణికోటికెపుడు ప్రాకటవలగ
మంచిజేయుచుండ మమతాస్వభావాన
జగతి నరుడు మేలు సలుపవలదే. 10

తోటిప్రజలకునెప్పుడు తోడుపడక
సాటివారికి తగురీతి సాయపడక
ఉర్వి జీవించువానిని గర్వియనరే?
మమత సమతలు లేనట్టి మనుజుడనరే? 11

కరము ధనధాన్య సమృద్ధి కల్గినట్టి
పదవి యధికారముల తోడ వరలునట్టి
బలముబలగాల్ చేతను చెలగునట్టి
ఎంతవారలునైనను నిజ్జగాన
పరుల సాయంబు లేకుండ బ్రతుకగలరె? 12

జాలి గుణము గల్గి చాలిన రీతిగ
ప్రజకు హితము జేసి పరగువాడు
వాడె మానవుండు వసుధ తలంబందు
మహిత యశుడు వాడె మాన్యుడతడె. 13

మంచి చేసెడివాడు సమ్మాన్యుడగును
పరులకును మేలుజేయగ వాసియబ్బు
ప్రజలకునునుపకరింపగ ప్రభుడు మెచ్చు
మానవుడు మాధవుండగు మార్గమిదియ. 14

చెడువానికైన గడ్డుశత్రువుకైన
కీడు జేయునట్టివాడికైన
చెడుగు జేయకుండ చేతనైనట్టుల
మంచి జేసి పంప మహితమగును. 15

తన స్వార్థము విడనాడియు
మనమున సద్వాంఛ తోడ మహిలో సతమున్
జనతకు మేలును సల్పెడి
మనుజుడెపో నుత్తముండు మతిమంతుడిలన్. 16

నాకు నొకరితో పనిలేదు నాకు నేనె
అన్నిటం బ్రజ్ఞాశాలిని యంచునెంచి
ఒంటివానిగ నుండుట నుర్వియందు
తగదు తగదయ్య మానవా తగదు తగదు. 17

కావున ధాత్రియందు ననుగల్గిన మానవ కోటియంతయున్
ఠేవయు దర్పముంకరము ఠీవికి బోక బరస్పరంబు సం
భావిత రీతి సాయమును పాడియు దప్పక సల్పుచుండినన్
దేవుని మెప్పునంది కడు దీనత బాసి సుఖంబులందరె. 18

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here