[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది ఐదవ ఖండిక ‘మానవా ‘. [/box]
[dropcap]మా[/dropcap]నవా – ‘నవమి’ ఖండకావ్యంలోని ఐదవ ఖండిక.
***
శ్రీరమణీ మనోహరుని, చిన్మయనాముని, శేషశాయినిన్
నారద తుంబురాది మునినాధులు స్తోత్రము జేయు దేవునిన్
నీరద గాత్రుడౌ హరిని నిత్యము భక్తిని గొల్పు భూజనుల్
నీరజనాభు దీవెనల నిచ్చలు నొంది తరింత్రు మానవా! (1)
ధరణిని మంచి చెడ్డలను దద్దనెఱుంగుచు ధర్మబుద్దితో
వరలుచు శాంతిమార్గమున వాసి గడించుచు సత్యమూర్తులై
కరమున సత్ప్రవర్తనను కాలము బుచ్చుచు నెల్లభంగులన్
పరులకు సాయమెంచు ప్రజ పల్వుర మెప్పును బొందు మానవా! (2)
మమతను నించిడెందమున, మానసమందున మానతత్వమున్
సమతను నెంచి సంతతము, సాగగ జేయుచు జీవయాత్రలన్
అమలిన భావసంపదను నభ్యుదయంబును బొందుచున్ జనుల్
సుమధురమైన భాషణల శోభితులౌటను మేలు మానవా! (3)
పరులకు మేలు గోరుచును, ప్రాకటతిలను సేవ జేయుచున్
నిరతము శత్రు కోటికని నిక్కముగా గశుభంబు సల్పుచున్
కరముగ నున్న బోనరడు గౌరవమందును గాన యిట్టులన్
ధరణిని దుష్టవర్తనను తద్దయు నుండుటమేలా మానవా! (4)
నీమము తోడ భూజనులు నిర్మలవృత్తిని మంచి కార్యముల్
కామిత మొప్పజేయుచును గౌరవమందుచు సంఘమందునన్
ధీమతు తాచుమెల్గుచును దివ్యులు మెచ్చగ సంచరించుచున్
భూమిని వాసి గాంచుచును భూజితులవ్వరె వారు మానవా! (5)
పొలమును దున్ని విత్తునిడి పోడిమి మీరగ బైరు చెంచుచున్
సలిలము నందజేయుచును జక్కగ మిక్కిలి గాపు గాయుచున్
ఫలితము నందగోరుటయు బాడియ నందగ జెల్లుగా నివ్యా
కులమతులౌచు హలికులు కొందల మందుటమేల మానవా! (6)
పెద్దలపట్ల గౌరవము, బేరిమియం వినయంబు భక్తియున్
ఒద్దిక తోడ నుండ గలియోర్పును నేర్పును చిత్తశుద్ధియున్
హద్దులు మీరకుండ గలవాని కరంబును గాని వర్తనన్
తద్దయు గల్గువారలిల ధన్యులు గణ్యులుగాదె మానవా! (7)
దేశముపట్ల భక్తియును దివ్యపు భావము గలిపేరులున్
ఆశయు ధ్యాసయుంగరము నంకిత దీక్షను దేశసేవయే
ఆశయసిద్ధిగా దలచి యందరు మెచ్చగ జాలి సంపదన్
నాశము లేని రక్షణను నైపుణి జేయుట వీలు మానవా! (8)
ఈ మహి మాతృభాష యెడనెక్కుడ బ్రేమయు గల్గియున్ సదా
కామితమొప్పదానికిని గౌరమిచ్చియు నాత్మశుద్ధితో
భూమిని నభ్యసించుచును బూజితమంచును నెంచుచూ బ్రజన్
నీమముతోడనున్న నుపునీతులు నేదురుగాదె మానవా! (9)
జానెడు పొట్టకోసమని సత్యము ధర్మము శాంతవృత్తినిన్
తానిలవీడయున్ నరుడు దబ్బరలాడుచు దర్పితుండునై
జానుల హేళనన్ సలిపి సాధుజనాళికి బాధనిచ్చుచున్
కానడు వాని దుస్థితిని గౌరవమెంచడిదేమి మానవా! (10)
ఏకతబాడు జేయుచు ననేకత హెచ్చగ గోల జేయుచున్
సాకులు వెన్నోజెప్పుచును చక్కటివృద్ధిని జంపివేయుచున్
నాకమువంటి భూమినిటు నాశముజేయుచు స్వార్థ బుద్దితో
వ్యాకులమొందగా జనుల యాసనడంచుట మేల మానవా! (11)
అన్నము బెట్టు చేతికిని హానిదలంపక ప్రేమభావనన్
మినృగురీతి మంచినిడి మేలు ఘటిల్లగజేయ నెంచుచున్
ఉన్నతమైనడెందమున నుర్వినరుండును నుంటజెల్లుగా
కున్నను జీవితంబునను నూర్జితుడేనెనతండు మానవా! (12)
మాయజగత్తునందు గల మర్మమెఱుంగక నెందరెందరో
హేములైన కార్యములనేర్పడజేయుచు మందబుద్దులై
కాయముపైని మోహమున గాంచక ఇల నిత్యసత్యమున్
కాయము కాలునట్టిదియె కట్టెలయందునగాదే మానవా! (13)
మతమది మంచి చెప్పినను మత్సరభావము వీడకుండగా
మతమును చెడ్డగాదలచి మానిత మార్గమునందుబో కదా
కుతలము నందు సంతతము గుత్సితుడేచును సంచరించివే
వెతలను బొందువాడిలను వెఱ్ఱియనంబడు గాదె మానవా! (14)
అరయగ దుష్టవర్తనులునై నరులుండుట మేలు కాదు యీ
ధరణినినట్టి వారికిని తద్దయు సంఘమునందు గీర్తియున్
కరముగ మేలు గల్గుటయు గష్టమటంచును నార్యసూక్తులున్
వరలుచునుండగా బ్రజకు వర్ధిలుటెట్లు శుభంబు మానవా! (15)
నిలకడ లేని భూప్రజలు నిప్పును ద్రొక్కినకోతులంబలెన్
సలలితమైన భావనలు సల్పగనేరక జంచలాత్మలై
కలవరపాటు జెందుచును గంతులువైతురుగాని నెమ్మదిన్
తలపరు మంచిచేయగను ధారణియందు నిదేమి మానవా! (16)
ఆకలి కాలమిద్దియని యడ్డపుదిడ్డపు రీతిగా ప్రజన్
వేకువ నుండి రాతిరగు వేళయు వచ్చెడిదాక నెవ్వియో
ఆకునుబోకకందనటునక్కరమాలినైవైన మాటలన్
పోకిరుతాచు వాగుటది పూజితవృత్తియునేన మానవా! (17)
పండితులున్ ప్రభుద్దులును వైరిమదంబులడంచు రాజులున్
దండిగ యజ్ఞయాగములు ధరిత్రినిజేసిడి సోమయాజులున్
మండితవంశజాతులును మాన్యకవీశులు చక్రవర్తులున్
ఉండకనేగు సంపదనునుర్విని కోరగనేల మానవా! (18)
ఆశయడంచి మానసమునందున ధర్మగుణంబు నిల్పుచున్
ఈశుని నామచింతన మశేషితరీతిని జేయుచుండువౌ
నీశుని భంగిసంతతము నిద్ధరయందున నుండు వారలున్
కాశికనాధు దీవెనలగాంచి తరింతురుగాదే మానవా! (19)
సరసముగానిడెందమును సత్యమొకింతయులేని పల్కునున్
గురువునులేని విద్యయును, కూరిమిలేకనునుండు చిత్తమున్
వెరవునులేని చైదమును వేవురు మెచ్చని వర్తనంబునన్
విరివిగగల్గు భూప్రజలు విజ్ఞలు నౌటదియెట్లు మానవా! (20)
కవులము మేమటంచు గల కాలము నిల్వ గజాలు కైతలన్
భువికిని నందజేయగల పుణ్యచరిత్రల మంచుగర్వులై
సవినయ భావసంపదకు స్థానమునీని వివేకహీనులై
కవికులమంత కుంగరమ గౌరవమిత్తురిదేమి మానవా! (21)
కొందరు దుష్ప్రవర్తకులు గొందరు పాపులు, దుర్వినీతులున్
కొందరు గ్రూరచిత్తులును, కొందరు భ్రష్టులు, ద్రోహచింతనుల్
కొందరు దుష్టహంతకులు, గొందరు జోరులు, ద్రాగుబోతులై
కొందల మంద భూప్రజకు గుట్రలుజేయుటమేల మానవా! (22)
భారతమాత బిడ్డలయి వర్ధిలునట్టి పవిత్రజాతిలో
వీరులు న్యాయమూర్తులును విస్తృతకీర్తిని బొందు త్యాగులున్
మేరను మీరు బాండితిదిమేదిని గల్గు వేలుంగువేత్తలున్
కారణజన్ములట్లుగను గల్గుట భాగ్యముగాదె మానవా! (23)
సుందరమైన ప్రకృతిని, సోయగా మొల్కెడిప్రాణికోటినిన్
అందముజిందుచున్ మిగులహ్లాదము గూర్చు నికుంజపంక్తినిన్
విందులు జేసి సంతతము వేడుకనిచ్చు ప్రసూన జాతినిన్
పందెము వైచికాంచు బ్రజపాడు యొనర్చుటిదేమి మానవా! (24)
గొప్పకుబోయి యంతయును గోల్పడిడీల్పడి సాటివారితో
మెప్పును సైతమందకను మేలును బొందకనెంత మాత్రమున్
తెప్పరిలంగతేకనిల దిమ్మరబోయియు దిక్కుదోచకన్
ముప్పుఘటల్లెనంచు నిటుమూర్ఖతనేడ్వగనేల మానవా! (25)
ఈ దేశంబునబుట్టి నందులకు దామెంతేని యుప్పొంగచున్
మా దేశంబిది మాదుభూమియనుచున్ మాన్యంపు భావంబుతో
ఏ దేశంబును సాటి దీనికిలలో నెంచంగలేదంచు దా
మీదే శంబును గౌరవింపరె ప్రజల్ ఇంపొప్పగా మానవా! (26)
ఇయ్యది వేదభూమి తగనెంచగనిద్దియె కర్మభూమియున్
తియ్యనివైన సూక్తులను దీప్తివెలింగిన ధర్మభూమియున్
ఇయ్యవనీతలంబు బరుల్తెంతయొ యెంచిన రత్నగర్భబల్
నెయ్యపుగోర్కె దీని బ్రజ నేర్పున గాచుట నీతిమానవా! (27)