నవమి – ఖండిక 7: భరతభూమి

0
3

[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 7వ ఖండిక భరతభూమి ‘. [/box]
[dropcap]‘భ[/dropcap]రతభూమి’ – ‘నవమి’ ఖండకావ్యంలోని 7వ ఖండిక.

***

వేదవేదాంగాల విజ్ఞానకాంతులన్
వెలుగొందునట్టిదీ విమల భూమి
శాస్త్రపురాణాల సారంపు నీతితో
నిర్మలంబైనదీ ధర్మభూమి
ఇతిహాసగ్రంథాల నింపారుబోధలన్
పులకించి నట్టిదీ పూతభూమి
బ్రాహ్మణములలోని పలుసూత్ర తలిచేత
దివ్యదీప్తుల నించు భవ్యభూమి
వివిధ యారణ్యకంబుల విస్తృతముగ
చెప్పబడినట్టి వాక్యవిశేశ తతుల
గరిమ చేతను కరముగ గణనకెక్కి
పరమపావనమయ్యేనీ భరతభూమి. (1)

షట్చక్రవర్తుల సచ్చరిత్రల తోడ
సత్కీర్తినార్జించి సరసమతిని
షోడశరాజుల శోభాయమానమౌ
పరిపాలనంబుల బరవశించి
దీక్షతో గంగను దివినుండితెచ్చిన
భువి భగీరథుచర్య బులకరించి
తనబాగునెంచక దానంబు నొసగిన
దనుజేంద్రు భావనన్ తనిసితనిసి
నీతినియమాలవర్తనన్ ఖ్యాతిగూర్చు
సచ్చరిత్రుల, ధీరుల, సారమతుల
సమతమమతల కెంతయో సంతసించి
నిరతమానందమున దేలు భరతభూమి. (2)

వాల్మీకి మునినాధు ప్రధితకావ్యములోని
ధర్మతత్వంబున మర్మమరసి
సాత్యవతేయుని సద్గ్రంథతతినున్న
నీతి న్యాయాలదౌ రీతిదెలిసి
కాళిదాస కవీంద్రు కావ్యగాథల చేత
నుత్తమవిలువల నూర్జితమయి
దండి కవితలోని మెండుగుణంబైన
లాలిత్యసంపదనోలలాడి
నిత్యనూతనమౌచును నెగడిమిగుల
పరమపావిత్ర్యయు తమన్నప్రతిభగాంచి
సంప్రదాయంపుటౌన్న త్యసరళిలోన
వరలు చుండెను సతతంబు భరతభూమి (3)

పలువిధ సంగీత స్వరమృదుధ్వనులచే
నిరతమానందాన కరిగిపోయి
నానావిధములైన నాట్యంపుసొబగులన్
హర్షాతిరేకంబునంది సతము
చెన్నైన శిల్పాల మిన్నంటుగరిమకు
కనువిందు నరదుచు ఘనతజెంది
రవివర్మ కృతమైన రంగుల చిత్రాల
సౌందర్య సృష్టికి సంతసించి
ప్రకృతిలోపలనున్నట్టి ప్రధితమైన
సతతహరితంబునౌచును సేరు మించు
దృశ్యతతిచేత కరమునుద్దీప్తమగుచు
వసుధ వెల్గొందుచుండు నీ భరతభూమి (4)

పరదేశవాసులు ప్రబలమౌ రీతిగ
‘రత్నగర్భ’యనంగ రాణకెక్కి
ఈదేశజనులెల్ల నెంతయో భక్తితో
‘పరదేవత’గ నెంచ పరవశించి
మమతో ప్రజలంత ‘మాతృమూర్తి’గ బిల్వ
ప్రేమాంబురాశి గాజేరుగాంచి
‘సహనశీలి’ యటంచు జగమంత బొగడంగ
పులకించి నిరతంబు చెలువుమీరి
దేశదేశాలవారు దురాశజెంద
వైభవోన్నతమౌచును వరలిసతము
పైరుపచ్చకు నెలవునైసేరుమించి
వాసినింగాంచి మించెనీ భరతభూమి. (5)

మహితమై యొప్పారు మంచుమలలవైన
దీప్తులకెంతయో తేజితమయి
గంగగౌతమికృష్ణకావేరినదులలో
ప్రవహించు నీటిలో పావనమయి
ముద్దుగూర్బెడురీతి మూడు వైపుల చుట్టు
ఉప్పుసంద్రంబు చేనూర్జితమయి
కన్యాకుమార్యాగ్ర కమనీయతలముచే
కరమునౌ సౌందర్యగరిమనంది
రామసేతువు నుండి యురమ్యమైన
శీతగిరికిని మధ్యనజెలగినట్టి
ప్రకృతి సిద్ధంపు శోభప్రభావమునకు
పారవశ్యంబు నందెనీ భరత భూమి (6)

ఆదిదంపతులకు నవనిలో నెలవైన
కైలాసగిరి చేత కాంతులీని
వనయోషధులకును నొనరౌచుసతతంబు
విశ్వవాసులచేత వినుతిగనియు
దివిజవర్గంబెల్ల దిరుగాడు కతమున
అమరభూమియనుచు ఖ్యాతినంది
తాపసశ్రేష్టుల దపముకు దావేచు
ఘనతపోవనమని గణనకెక్కి
నట్టిప్రశస్తమైన హిమాచలంబు
ఉన్నతంబును నౌచునునుత్తరాన
ధవళకాంతలతోడను తనరుచుండ
కరముమహానీయమైవెల్గు భరతభూమి (7)

పలురకంబులునైన భాషలచేతను
ఒప్పారినట్టిదౌ గొప్పభూమి
భిన్నజాతులతోడ పెద్దగురీతిగా
అలరారుచున్నట్టి యమలభూమి
బహుసంస్కృతులచేత నహరహంబునునొప్పి
చెన్నొందునట్టి విశిష్ట భూమి
వివిధ నాగరికతావిమల ధీధుతులతో
మేలుబంతిగ వెల్గుమెండు భూమి
రకరకంబులమతములరాణదేరసి
ఎన్నోకులములు కట్టుబాట్లెన్నోయున్న
భిన్నతను నుండియేకతన్ పెంపుజేసి
వరలు చుండెను విశ్వాన భరతభూమి. (8)

శివుని నెత్తినగంగ చిందినేలకువచ్చి
కాశిని మనుజుల కలుషముడుప
గౌతమిగంగయు కరుణాంతరంగయై
ఏడుపాయలునౌచు కీడుడుల్ప
శ్రీశైలమల్లన్న చెంతను ప్రవహించి
కృష్ణమ్మ జనులకు తృష్ణబాప
రంగనాథుని ముందు రాణతో ప్రవహించి
కావేరి పాపముల్ కడిగవేయ
నిర్మలంబౌచు మనము పునీతమగుచు
నిరతమానందమగృయైపరవశించి
నిత్యనూతనకాంతితో నెగడిమిగుల
సరసమతియౌచుదీపించె భరతభూమి. (9)

నందనోద్యానమై నయనవినోదమై
కాశ్మీరలోయలు కళలునింప
హరితమయంబునై ఆహ్లాదకరమునై
సస్యకేదారాలు చవుకుళింప
కమనీయభరితమై గణనీయయుతమునై
కేరళదృశ్యాలు సౌరు తీన
అందాలతావునై యలరు బూదావియై
కోనసీమయునెంతో కొమరుమిగుల
సరసమౌచును శృంగారగరిమయౌచు
మధురమౌచును సుమశరుమార్గమౌచు
నిరతమానందసంధాన కరణమౌచు
ప్రధితలీలను విలసిల్లు భరతభూమి (10)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here