[box type=’note’ fontsize=’16’] డా.కాళ్ళకూరి శైలజ రచించిన ‘నవతరానికి రోల్‌మోడల్ గాంధీజీ’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి. [/box]
నవతరానికి రోల్‌మోడల్ గాంధీజీ – పుస్తక సమీక్ష
[dropcap]“నా[/dropcap] జీవితమే నా సందేశం” అన్న మహాత్మాగాంధీ ఒక్క మాటతో తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారు. డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారు నేటి ‘నవతరానికి రోల్‌మోడల్ గాంధీజీ’ అంటూ బాపూజీ పై భక్తితో గుదిగుచ్చిన ఈ వ్యాససంపుటికి, గాంధీగారి సందేశానికి సమానమైన శీర్షిక పెట్టారు. వేయిమాటలేల ఒక్క మాట చాలు అన్నట్టుగా. పసితనం లోనే గాంధీగారి జీవిత చరిత్ర చదివి ఆకర్షితురాలైన శైలజ గారు అదే క్రమశిక్షణ తాను పాటించి ఒక వైద్యురాలిగా మానవ సేవా రంగంలో సమాజానికి సేవ చేస్తూ తాను స్వయంగా ఆదర్శంగా నిలబడి, ఈ పుస్తకం తీసుకురావడంతో, ‘చేసిన వారికే చెప్పే అధికారం ఉంటుంది’ అన్న ఆర్యోక్తి నూటికి నూరు పాళ్ళూ నిజమైంది.
1950లో కాకినాడలో స్థాపించబడిన గాంధీభవన్, నాటినుంచీ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడం ఎంతో మంచి సంగతి. ఈ వ్యాసాలన్నీ ప్రముఖ సైన్స్ రచయిత శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారితో కలిసి శైలజ రాయగా, వివిధ పత్రికలలో ప్రచురించబడినవి.
శైలజ వృత్తి రీత్యా డాక్టర్, సున్నిత హృదయ, స్వయంగా కవయిత్రి,రచయిత్రి కావడం వల్ల మహాత్మా గాంధీగారి గురించి రాసిన వ్యాసాల్లో ఆ ఆర్ద్రత ప్రతిఫలించింది. జీవిత చరిత్రలెప్పుడూ శ్రమ తీసుకుని చదవవలసి ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా గాంధీగారి మొత్తం జీవితగమన సారాన్ని, సరళంగా విద్యార్థులు/యువత చదవడానికి వీలుగా, వారి మనసులకు హత్తుకునేట్టుగా అందించారీమె. గాంధీ ఫిలాసఫీని సునిశితంగా పట్టుకుని అక్షరీకరించారు. గాంధీగారిపట్ల తన గౌరవాన్నీ, భక్తినీ ఈ విధంగా ప్రకటించుకున్నారు.
తన ఆదర్శ వ్యక్తిత్వంతో మన దేశాన్నే కాక ప్రపంచంలో అనేక దేశాలనూ, అక్కడి ప్రజలనూ ప్రభావితం చేసారు మహాత్మాగాంధీ. ఆ మహానుభావుని సిద్ధాంత ప్రభావంతోనే నెల్సన్ మండేలా పోరాట బాటలో నడిచి దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. గాంధీ స్ఫూర్తి తోనే అమెరికా కూడా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆధ్వర్యంలో నల్లజాతీయుల బానిసత్వపు సంకెళ్లను తొలగించుకోగలిగింది.
శాంతి, అహింసల్ని ఆయుధాలుగా చేసుకుని ప్రజలందరినీ ఒక త్రాటిపై నిలుపుతూ స్వాతంత్రోద్యమాన్ని నడిపి భారతదేశాన్ని దాస్యపు చెరనుండి విడిపించిన మహనీయుడు గాంధీజీ. మానవజాతిపట్ల గొప్ప ప్రేమ మరియు వారి సేవ అనే రెండు నియమాలను నిష్ఠతో జీవిత పర్యంతం పాటిస్తూ నిలబడిన మహా మనీషి పూజ్య బాపూజీ. నిజాయితీ, సర్వజన శ్రేయస్సు వారి స్వప్నం. గాంధీ, మహాత్ముడు ఎలా అయ్యారో, ఆయన ఆధునిక తరానికి రోల్‌మోడల్‌గా నిల్చి ఉండడానికి గల కారణాలన్నీ ఈ సంపుటిలోని వ్యాసాలు వివరిస్తాయి. సత్య సందేశం ఇచ్చి, యావత్ప్రపంచం చేత కీర్తింపబడ్డ గొప్ప మానవుడు, ప్రపంచనాయకుడు, మన జాతిపితగా పిలవబడిన వారూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
అస్పష్టత లేకపోవడం, సరళమైన నిరాడంబర జీవితం, పట్టుదల, కార్య శుద్ధి ఆయన ఆభరణాలు. గాంధీ గారి లక్ష్యం కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు. భారతదేశాన్ని ఒక కుటుంబంలా ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలో అనే విషయాలపై సమగ్ర దృష్టీ, సంపూర్ణ అవగాహనా ఉన్నవారాయన. వారి సున్నితత్వం, భావుకత, సత్యం గురించి ఆయన చెప్పిన భాష్యాలు మనల్ని ఆయన పట్ల గౌరవంతో కూడిన భక్తులుగా మారుస్తాయి. గాంధీ మార్గాన్ని నేటి యువత ఆకళింపు చేసుకుని ముందుకు సాగితే ఎంతో బావుంటుంది. గాంధీ గారి ఆలోచనా స్రవంతి తరతరాలకూ స్ఫూర్తిదాయకం. సూడో సక్సెస్ కాక యథార్థమైన విజయం సాధించాలంటే నేటితరం చదవలసిన పుస్తకం ఇది. ఈ వ్యాసాల్లో గాంధీ గారి గురించిన ప్రతి ఒక్క కోణమూ ప్రతిఫలించింది, పర్యావరణ సంరక్షణతో సహా.
చెడు అనకూడదు, వినకూడదు, కనకూడదు అని చెప్పే మూడు కోతుల బొమ్మ ఆయనకి ఎవరో చైనా దేశస్తుడు ఇచ్చారట. గాంధీ గారికి నచ్చిన ఈ స్లోగన్ నేటికీ గొప్ప సందేశమే! పురుషులతో సమానంగా కార్య నిర్వహణ చేయగల మహిళల పట్ల చూపే అణచివేత ధోరణి మనిషి చేసే అతి హేయమైన పని అంటూ, ‘మహిళలు న్యాయాన్ని కోరాలి కానీ, రాయితీలను కాదు’ అన్న గాంధీ గారు క్రాంతదర్శి. గ్రామ స్వరాజ్యం ఆయన ఆశయాల్లో మరొకటి. గాంధీ గారిని ఒక విలేఖరి “జీవితంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవరసరమంటారా?” అని అడిగిన ప్రశ్నకు “అదే లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకునే వాణ్ణి” అని జవాబిచ్చారట. గాంధీ గారిమీద ప్రత్యేకమైన ఆప్యాయత కలిగేటట్టుగా ఉండేవి ఆయన మాటలు. ఇంత గొప్ప వ్యక్తీ వారానికి ఒక రోజు మౌనవ్రతం పాటిస్తూ ఆత్మ పరిశీలన చేసుకునేవారట.
భర్తకు తోడూ, నీడగా ఉన్న కస్తూరిబాగాంధీ గురించీ, ఆరోగ్యమే అసలైన సంపద అంటూ కఠినమైన గాంధీగారి శరీర క్రమశిక్షణ గురించీ, పాత్రికేయునిగా గాంధీగారి పాత్ర, కంప్లీట్ వర్క్స్ అఫ్ గాంధీ గురించీ, నా ఒత్తిడిలో నాకు సంగీతం ఒక ఉపశమనం అని ఆయన అనడం, గాంధీ బైబిల్, ఖురాన్, సిక్కు, యూదు గ్రంధాలు చదవడం గురించీ, సత్యాగ్రహి సత్యం కోసం అహింసాయుతంగా ఆగ్రహం చెందడం గురించీ వివరిస్తూ మానవ జాతికి తనను తాను అర్పణ చేసుకున్న గాంధీ, నవతరానికి రోల్ మోడల్ ఎందుకు, ఎలా అవుతారో చెబుతాయి ఈ వ్యాసాలు.
బాపూజీ మన తెలుగు నేలపై పాదం మోపి, పర్యటించిన విశేషాలు ఈ సంపుటిలో ప్రచురించారు. ఈ వివరాలు చదువుతుంటే ప్రతి తెలుగు వాడికీ, అబ్బురంగానూ, గర్వంగానూ ఉంటుంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లోనూ, ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర లోనూ ప్రస్తుతపు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ప్రదేశాల వివరాలు చదువుతుంటే మనసు పులకిస్తుంది. ‘భలే తాత మన బాపూజీ!’ అంటూ స్కూళ్లలో పాడని వాళ్లెవరు? ‘గ్రేట్ సోల్’ అన్నమాటకు అర్ధం ఆయనే మరి.
ఇంత గొప్ప వ్యాసాల్ని మాలగా అల్లి పుస్తకంగా తేవడంలో డా.కాళ్ళకూరి శైలజ గారి కమిట్మెంట్ అత్యంత అభినందనీయం. పాఠశాలలన్నీ సరళంగానూ,హృద్యంగానూ ఉన్న ఈ పుస్తకం కాపీలను కొని, పిల్లలకు పెట్టే పోటీలలో బహుమతులుగా ఇవ్వొచ్చు. అప్పుడు ఈ సంకలనం విద్యార్థుల చేతుల్లో నలుగుతుంది. వాళ్లే అసలు టార్గెట్ పాఠకులు.
ఇంకా ఈ పుస్తకంలో తెలుగు నాట గాంధీ సాహిత్యం అంటూ గాంధీ గారి గురించి వచ్చిన 29 పుస్తకాల వివరాలు కూడా ఇచ్చారు. మరో పుస్తకం, గాంధీజీ భావాల ప్రభావంతో కొందరు రచయితలు రాసిన కథల్ని “తెలుగు కధల్లో గాంధీ మహాత్ముడు” పేరుతో ఒక కధల సంకలనం, 2018 లో శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్ గార్ల సంపాదకత్వంలో వచ్చింది. మొత్తం మానవాళినే తన ఆదర్శ జీవనంతో ప్రభావితం చేసిన పూజ్య బాపూజీ వెలకట్టలేని వజ్రం, ధన్యజీవి. పిల్లలతో పాటు పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ చదవడానికి వీలుగా ఇంట్లో ఉంచుకోదగ్గ విలువైన పుస్తకం ఇది.
***
నవతరానికి రోల్‌మోడల్ గాంధీజీ
రచన: డా. కాళ్ళకూరి శైలజ
ప్రచురణ: గాంధీ భవన్, కాకినాడ
పుటలు: 136
వెల: ₹ 125/-
ప్రతులకు:
- G.Malyadri
Vijnana Prachuranalu
162,Vijayalakshmi Nagar
Nellore:524 004,AP
Phone:9440503061. - Navodaya Book House
Opp.Metropillar 14
Kachiguda Crossroads
HYDERABAD -500 027.
Phone:040 – 24652387.