Site icon Sanchika

నవ్వేజనా సుఖినోభవంతు -5: ఆన్ ది వే…

[box type=’note’ fontsize=’16’] ‘నవ్వేజనా సుఖినోభవంతు!’ శీర్షికన భావరాజు పద్మిని గారు సంచిక పాఠకులకు అందిస్తున్న హాస్యరచనలివి. ‘లేట్ మాస్టర్ జనరల్స్ అందరికీ ఇదే చికిత్సను అమలు చెయ్యాలని నా భావన’ అంటూ కావాలని ఆలస్యంగా వచ్చేవారిని ఏం చేయాలో ఈ రచనలో వివరిస్తున్నారు. [/box]

[dropcap]పూ[/dropcap]ర్వం‌ ఎవరైనా తపస్సు మెదలెట్టగానే భగవంతుడు ‘భక్తా, ఆన్ ది వే, ప్రొసీడ్,’ అని అభయమిచ్చేవారట. రాజకీయాల్లోకి ఒక‌కొత్త నేత ప్రవేశించగానే, స్వరాజ్యలక్ష్మి, ‘ఎ వెరీ వార్మ్ వెల్కం, ఆన్ ది వే, ప్లీజ్ వెయిట్’ అంటూ ఊరించేదట.‌ కూరగాయల విత్తనాలు నేలలో వెయ్యాలని రైతు సంకల్పించగానే, స్విగ్గీ లో సర్వర్ నుంచి నవరతన్ కూర్మా ఆర్డరిచ్చిన కస్టమర్ కి ‘యువర్ ఆర్డర్ ఈజ్ ఆన్ ది వే’ అని మెసేజ్ వచ్చిందట.‌… అలా ‌దరిమిలా ఈ పదం‌ ఇప్పుడొచ్చి మనమీద పడింది.

దీనికి సరైన తెలుగుపదం‌ కనిపెట్టలేక నా పంచప్రాణాలు నీరుగారిపోతున్నాయనుకోండి.‌ దారిలో ఉన్నా, వచ్చేస్తున్నా… ఇలా మీరో వంద పదాలు చెప్పినా, నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే, ఈ పదం వల్ల వచ్చే అనర్థాలను అర్ధాంతరంగా ఎన్నో సార్లు ఎదుర్కున్నాను. మచ్చుకు ఒకటి మీకోసం…

‘ఇవాళ ఐదింటికి కలుద్దామని అనుకున్నాం‌కదా, నేను వచ్చేసాను, మీరు బయల్దేరారా? ‘

‘ఓ, ఆన్ ది వే ఒక్క హాఫెనవర్లో అక్కడ ఉంటాను.’

అసలే స్త్రీలకు భూమాతలాగా సహనం ఎక్కువంటారు కదా. అందుకే అరగంటేగా ఎంతలోకి గడుస్తుందని ఓపిగ్గా నేలమీద గడ్డి పీకుతూ ఎదురు చూడసాగాను. కాసేపటికి పక్కనో గడ్డివాము తయారయ్యింది. అదికాస్తా ఓ దూడొచ్చి, దాన్ని తినడం తన జన్మహక్కులా భావించి, తిని చక్కా పోయింది. సదరు శాల్తీకి కాల్ చేసాను… అదే జవాబు… ఆన్ ది వే.

ఈలోగా ఆ చోట ఉన్న‌మొక్కల జాతులు, పేర్లు, బొటానికల్ నేమ్స్, వాటి వయసు, జనసంఖ్య, అన్నీ అంచనా వేసేసాను. ఆ తర్వాత పూలు, కాయలు, చివరికి ఆకులు కూడా లెక్కెట్టడం మొదలుపెట్టాను.‌ నరమాంస భక్షకురాలిలా నేను వృక్ష భక్షణ చేస్తానేమోనని అక్కడి వారికి డౌటొచ్చింది. అయినా పట్టించుకోకుండా నేను ఏకాగ్రతతో నా పనిని కొనసాగించాను. చివరికి ఆ చెట్లను ఆశ్రయించి ఉన్న పక్షుల నుంచి గబ్బిలాల సంఖ్య దాకా కూడా తేల్చి పారెయ్యడమనే అఘాయిత్యానికి ఒడిగట్టాను.

5 – 6 అయింది, 6 – 7 అయింది 7 – 8 అయింది 8 – 9 అయింది. ఫొన్ చేసినా సదరు శాల్తీ స్పందన లేదు.‌ అప్పుడే ఆలస్యంగా బుర్రలో లైట్ వెలిగింది… ఆన్ ది వే అని మొదటిసారి అన్నప్పుడు, సదరు శాల్తీ అప్పుడే నిద్ర లేచి, పళ్ళు తోముకుంటూ ఉండొచ్చని బోధ పడింది. ఆ తర్వాత స్నానాలు, పానాలు ఎన్నుంటాయి పాపం? అర్ధం చేసుకోరూ.

చివరికి తొమ్మిదింటికి మళ్ళీ ఫోను.‌

‘సారీ, ట్రై చేసాను. రావడం‌ కుదరలేదు. ఇంకోచోట అవసరంగా పనిపడింది‌. రేపు కలుద్దామా?’

ఇదేం విపరీతం? నాలోలోపల సిజ్లర్స్ రగలసాగాయి. వాటి తాలూకు ఆవిర్లు ముక్కులోంచి బయటకు రాసాగాయి. ‘ఏమయింది మానవత్వం?’ అంటూ ఇందాక గడ్డి తినిపోయిన దూడనడిగాను. చుట్టూ ఉన్న చెట్లు, వాటిమీదున్న జీవరాశులు నామీద సానుభూతి చూపించాయి. భారత కాలమానాన్ని అమెరికా టైమ్‌లో చెప్పిన సదరు శాల్తీ మీద పీకలదాకా కోపం వచ్చింది. అప్పటి నుంచి ‘ఆన్ ది వే’ అన్న పదం మీద కత్తిగట్టాను.

ముళ్ళపూడి వారి ప్రకారం స్త్రీల కాలమానం వేరు. మరి ఇలాంటి పురుషులకు ఏ కాలమానాన్ని కట్టబెట్టాలో నాకు అస్సలు అర్థం కాలేదు. మనకి అర్థం కాకపోయినా జరిగే అనర్థం ఏమీ లేదు, ఇలాంటి వాళ్లకు తగిన మొగుడు ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. అలాంటి మొగుడు ఈ ‘ఆన్ ది వే’లకు తగిలితే ఏం చేస్తాడంటే…

‘ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు?’

‘తొమ్మిదింటికి అనుకున్నాం కదా! జస్ట్ ఒక గంటలో అక్కడ ఉంటాను ఆన్ ది వే…’

చూస్తుండగానే ఉదయం 9 రాత్రి తొమ్మిది అయింది… ఈలోగా ఫోన్ మోగింది. అవతల ఆన్ ది వే గారు.

‘అనుకోకుండా ఒకచోట ఇరుక్కుపోయానండి. రాలేకపోయాను. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది కదా! రేపు ఎప్పుడైనా కలుద్దామా?’

‘పర్లేదు వెయిట్ చేస్తున్నాను, రండి.’

‘లేట్ అవుతుందేమో. ఏదైనా తినేసి వస్తాను.’

‘అలాగేరండి, నేనిక్కడే ఉంటాను. కలుద్దాం.’

మొత్తానికి అక్కడికి పదకొండింటికి తేలారు ఆన్ ది వే గారు. బుద్ధి చెప్పదలుచుకున్న బుద్ధ భగవానులవారు, పని చేయిస్తూనే ఉన్నారు.

‘ఆల్మోస్ట్ అయిందిగా, ఇక నేను వెళ్ళేదా?’ ఒంటిగంటకు ఆన్ ది వే గారి విన్నపం.

‘లేదు, ఇది సరిగ్గా పూర్తి కాలేదు. కంప్లీట్ చేసాకే వెళ్ళండి.’

మళ్ళీ పని‌మొదలు… ‘ఇలా కాదు, ఇది అలాగే రావాలి. మళ్ళీ ట్రై చెయ్యండి…’

దీనంగా ఆపసోపాలు పడుతున్న ఆన్ ది వే గారికి ఆ మధ్యలో నిద్ర వచ్చింది, ఆకలేసింది, తలనొప్పి వచ్చింది, ఒళ్ళు తూలిపోయింది. కానీ ఈ బుద్ధ భగవానులవారు కారుణ్యాన్ని ఆ సరికే ట్యాంక్‌బండ్‌లో తొక్కి రావడం వల్ల, ఏమాత్రం కనికరం చూపలేదు. చివరికి తెల్లారి అయిదింటికి ఒక చిన్న దిండిచ్చి,  అక్కడే తన ఆఫీస్ లో చిన్న కునుకు తీసే అవకాశం ఇచ్చారు.

జైల్లో పెట్టినట్టు ఆఫీసులో బంధించేసి, కదలకుండా మెదలకుండా రాత్రంతా, కిక్కురుమనకుండా పనిచేయించే సరికి, దెబ్బకి ఆన్ ది వే గారి కాలమానం ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోయింది.

‘మీకు టైం సెన్స్’ ఉందా అనడిగితే ‘నాన్సెన్స్, అలాంటి సినిమా ఒకటొచ్చిందా, మిస్ అయ్యానే…’ అని నిట్టూర్చే భారతావనిలో ఉన్న లేట్ మాస్టర్ జనరల్స్ అందరికీ ఇదే చికిత్సను అమలు చెయ్యాలని నా భావన. ఇక‌నుంచి ఎవరైనా ఆన్ ది వే… అంటే, దాని అర్ధమేంటో మీరు డీకోడ్ చేసుకోగలరుగా…

‘ఎప్పుడో అప్పుడొస్తే వస్తా. అక్కడే తగలడు.’ అనన్నమాట.

Exit mobile version