నయ (గారాల) వంచన

2
2

[dropcap]శాం[/dropcap]త పనులన్నీ ముగించుకుని సాయంత్రం నడకకు బయలుదేరింది. 60 నిండాయి. కొన్ని బాధ్యతలు తీరాయి. ఆరోగ్యం వైపు శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది.

పైగా చెల్లెలు వనజ కోడలు డాక్టర్. వాళ్ళు కూడా అదే ఊరిలో ఉన్నారు. “అత్తయ్య గారూ! ఈ 21వ శతాబ్దంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి అక్షరాలా మనం పాటించాలి. సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రతీ ఆర్నెల్లకూ మెడికల్ చెకప్ అవసరం. ఈ వయసులో మీరు బరువు పెరగకూడదు. ఏం తింటున్నారు, ఏం వ్యాయామం చేస్తున్నారు – ఇవన్నీ పద్ధతిగా ఉండాలి. ఇందువలన మనకేం జరుగుతోందో మనకే తెలుస్తుంది. ఇందులో ముఖ్యమైన అంశం నడక. ప్రతి రోజూ 40 నిమిషాలు నడవండి. ఉదయమైనా, సాయంత్రమైనా సరే” అన్నది.

ఉదయం రొటీను, పనులు, తప్పవు కనుక సాయంత్రం ఈ పని పెట్టుకొన్నది శాంత. చకచకా నలభై నిముషాలు నడవడమూ, ముచ్చెమటలు పెట్టేక పార్కులో కూర్చుని సేదతీరి ఇల్లు చేరుతుంది.

సాధారణంగా ఎవరితోనూ సంభాషించే అలవాటు లేదు. అవకాశమూ లేదు. వారం రోజులుగా గమనించిన విషయం ఏమంటే, తను రోజు కూర్చునే బెంచీ మీద ఒకామె కూర్చుని ఉంటోంది. తను రాగానే ఓ చివరికి జరిగి పోతుంది. శాంత ఆమెను పరిశీలించింది. తనకన్నా పదేళ్లు పెద్ద అని అంచనా వేసింది. చదువుకున్న వ్యక్తి లాగా , క్రమశిక్షణ గల మహిళగా తోచింది.

“ఈ మధ్య మీరు కొత్తగా వచ్చేరా? మీ పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ?” అంటూ మాట కలిపింది.

“అవునండి. ఈ కాలొనీకి కొత్తే. నా పేరు భవాని. నేను ఒక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాలుగా చేసి రిటైర్ అయ్యేను” అన్నది.

ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు అని, ఈ మధ్యనే ఇక్కడ ఒక ఇల్లు కొని మార్పులు, చేర్పులు చేసుకొని, ప్రవేశించేమని చెప్పింది.

ప్రథమ సంతానం కొడుకు, మనోహర్. పెద్దమ్మాయి లక్ష్మి బొంబాయిలో ఉంది. రెండో అమ్మాయి సౌమ్య ఈ ఊళ్ళోనే ఉంది.

“మరి అబ్బాయి, కోడలూ?” శాంత అడిగింది.

“అబ్బాయి ఇక్కడ ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు” అన్నది. అతని గురించి చెప్పినప్పుడు ఆమె ముఖంలో రంగులు మారేయి.

‘ఏమో ఎవరికి ఏ సమస్యలు ఉంటాయో?’ అనుకుంది శాంత. కాస్సేపు గంభీరంగా ఉండిపోయింది. ‘జీవితాలు ఒక రకంగా వెళ్లవు. ఎవరి జీవితమూ పూల బాట కాదు. అప్పడి నుండి వాళ్లంతా సుఖంగా ఉన్నారు అన్నది కథలకే ముగింపు!! జీవితం కథ కాదు కదా’ అనుకొన్నది.

భవానీగారితో పరిచయం పెరుగుతోంది. ఇద్దరి స్వభావాలు కలవడం వలన చెలిమి ఏర్పడింది. ఒక రోజు శాంత “భవానీ గారూ మా ఇల్లు ఈ పక్కనే ఉంది. ఒకసారి మా ఇంటికి రండి” అంది. ఆమె అంగీకరించింది.

శాంత భర్త శ్రీనివాస్ తలుపు తీసేరు. “మా వారు బాంకు మేనేజర్ చేసి రిటైర్ అయ్యేరు” అని పరిచయం చేసింది. ఇంట్లోకి తీసుకొని వెళ్లి హాల్లో కూర్చుండ పెట్టింది. వేడిగా కాఫీ కలిపి ఇచ్చింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. చీకటి పడింది. కారు డ్రైవరు రామయ్యను పిలిచి “కారు బయిట పెట్టు. భవాని గారిని వారింట్లో దింపుదాము” అన్నది. ఆమె దిశా నిర్దేశం చేయగా వాళ్ళ ఇల్లు చేరేరు. పోర్టికోలో లైటు వెలుగుతోంది. బెల్ కొట్టంగానే ఒక అమ్మాయి తలుపు తీసింది. “ఇల్లు తెలిసిందిగా – మరో మారు వస్తాను భవాని గారూ, ఇంకా వంటా అదీ చేసుకోవాలిగా” అంది.

“అలాగే తప్పకుండా. థాంక్యూ శాంతా” అని ఆమె వీడుకోలు పలికింది.

స్నేహంలో కొంచెం నమ్మకం, ఆత్మీయత పెరిగి, ఎదుట వ్యక్తి తన మాటలను గౌరవంతో వింటారనే అంచనా వచ్చేక మనుష్యులు తమ వ్యక్తిగత విషయాలను మరొకరితో పంచుకుంటారు. ఈ షేరింగ్ వలన కొంత ఓదార్పు, ఊరట కలుగుతాయి. గుండె బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. ఒక రోజున భవానీగారు శాంతతో ఇలా అంది “శాంతా నా మనుమడు మారుతి అమెరికాలో చదువు పూర్తి చేసుకున్నాడు. వచ్చే శనివారం ఇంటికి వస్తున్నాడు”.

“అలాగా చాలా మంచి వార్త” అంది శాంత.

“మనుమడి మీదే ఆశలన్నీనూ, మావీ మా అబ్బాయి మనోహర్‌వీ”.

భవానీ గారు ఎదో చెప్పదలుచుకున్నట్లు గ్రహించి వింటోంది శాంత. “మనోహరు ఆ రోజుల్లో కర్నాటక రాష్ట్రంలో దావణగెరెలో ఇంజినీరింగ్ చదివేడు. తరువాత బొంబాయి IIT లో M.Tech చేసేడు. వెంటనే అక్కడే ఉద్యోగంలో ప్రవేశించేడు. కొంత కాలం గడిచేక “పెళ్లి చేసుకో నాయనా సంబంధాలు చూడమంటావా” అన్నాము. “చెల్లెళ్ళిద్దరికీ కానీయండి అమ్మా” అన్నాడు. నాలుగేళ్ల వ్యవధిలో అమ్మాయిలిద్దరి వివాహాలు చేసేము.

ఒకరోజు హఠాత్తుగా మనోహర్ ఒక అమ్మాయిని వెంటబెట్టుకొని వచ్చేడు. ఆమె అపురూప సౌందర్యవతి.

కళ్ళు తిప్పుకోలేని అందం. ఆ కనుముక్కు తీరు, అందమైన మెడ, సోయగము, సన్నగా పొడవుగా, పొందికగా అజంతా శిల్ప సుందరిలా ఉంది. మంత్రముగ్ధుల్ని చేసే తీరుగా ఉన్న ఆమె సొగసు, ఆడవారినే ఆకర్షించే స్థాయిలో ఉంది. ఆమె చేతిలో చేయి వేసి తీసుకొని వచ్చేడు మనోహర్. నేను మా వారు ఆశ్చర్యం సంభ్రమం పెనవేసుకొని అలా నిలబడిపోయేము.

“అమ్మా, నాన్నగారూ, ఈమె పేరు సువర్చల. దావణగెరెలో చదివినప్పుడు నాకు జూనియర్. మేమిద్దరం ప్రేమించుకున్నాము. ఆమెకూడా తర్వాత బొంబాయి వచ్చింది. ఈ మధ్యనే వివాహం చేసుకున్నాము” అన్నాడు.

నేను తొందరగానే తేరుకున్నాను. పరుగున లోపలికి వెళ్లి పళ్లెంలో దీపం వెలిగించి తీసుకుని వచ్చేను. కుంకుమ భరిణ తీసుకొని వచ్చి సువర్చల నుదుట కుంకుమ దిద్దేను. వాళ్లిద్దరికీ హారతి ఇచ్చేను. లోపలికి తీసుకొని వచ్చేను. వాళ్లు నాలుగు రోజులే ఉన్నారు. కోడలు ఎప్పుడూ ముభావంగా ఉంది, ముళ్ల మీద ఉన్నట్లు. ఇంట్లో కలయ తిరుగలేదు. ముఖంపై చిరునవ్వు లేదు. తెలుగు రాదు సరే – నేను ఇంగ్లీషులో మాట్లాడితే కూడా “అవును, కాదు, ఓహో” తప్ప పొడిగించలేదు. ఆ టైంలో రెండో అమ్మాయి సౌమ్య వాళ్ళు తిరుపతి వెళ్ళేరు. వాళ్ళు ఉంటే బాగుండేది అనుకున్నాను. ఏ పదార్థం ఇష్టంగా తినలేదు.

వాళ్లిద్దరూ చాలా పనులు ఉన్నాయి అని వెళ్ళిపోయేరు.

అబ్బాయి మునుపటిలా ఆప్యాయంగా మాట్లాడలేదు. అనుకోని ఈ సంఘటనలకు ఏం చెయ్యాలో తోచలేదు. ఓ ఆరు నెలలు గడిచేయి.

“నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. తప్పని సరి పరిస్థితుల్లో వెళుతున్నాను.” అని ఫోనులో చెప్పేడు మనోహర్.

“మరి కోడలు?” అన్నాను.

“ఆ అదే బలమైన కారణం. అక్కడ PhD కోర్సు చెయ్యడానికి ఓ యూనివర్సిటీలో ఆమెకు సీటు వచ్చింది” అన్నాడు.

కొడుకు దేశం విడిచి వెళ్ళిపోతున్నాడంటే పేగు తెగినంత దుఃఖం పొంగి వచ్చింది. చేసేదేమీ లేక నోరు మూసుకుని దిగమింగేను. కొంచెం తేరుకుని “మంచిది నాయనా – ఎక్కడ ఉన్నా సరే మీరిద్దరూ సుఖంగా ఉండాలి. కలకాలం పిల్లా పాపలతో వర్ధిల్లండి. దేముడిని రోజూ ఇదే కోరుకుంటాను” అన్నాను.

నేను నా ఉద్యోగంలో బిజీగా ఉన్నాను. మా వారు గవర్నమెంట్ సర్వీసులో ఇంజినీరుగా చేస్తూ రిటైర్మెంటుకు కొంచెం ముందు ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడ మోటారు పంపు సెట్లు తయారుచేసే యూనిట్‌ను ప్రారంభించేరు. మోడరన్ యుగం వచ్చింది. అందరి జీవితాల్లోనూ మార్పులు వచ్చేయి. నూతులలోనుండి ఎవరూ నీళ్లు తోడుకోవడం లేదు. పంపు సెట్లు పెట్టుకొని సౌకర్యంగా కుళాయిలు పెట్టుకొంటున్నారు. ఆలా మా వారు పెట్టిన యూనిట్ బాగానే నడుస్తోంది. మనోహర్ గురించి అంతగా ఆలోచించడం మానేసేం. ఉత్తరాలు తక్కువే. ఒక సారి మాత్రం మీకు మనవడు పుట్టేడు అని రాసేడు. ఆనందిచేము. చూస్తూ ఉండంగా అబ్బాయి ఇండియా వదిలి మూడేళ్లయింది.

ఓ రోజు సాయంత్రం ఇంటి ముందు ఓ టాక్సీ ఆగింది. అబ్బాయి చేతులో పిల్లవాణ్ణి పెట్టుకొని దిగేడు. దూరం నుంచి చూసేను. గేటు దగ్గరకు పరుగున వెళ్లేను. కోడలు ఎంతకీ దిగలేదు. “సువర్చల ఏదిరా” అన్నాను.

“అమ్మా వీడు నీ మనుమడు, మారుతి. పట్టుకో. సామాన్లు ఇంట్లో పెట్టనీ”.

నేను ఆత్రం పట్టలేక మళ్ళీ “కోడలు ఏదిరా” అన్నాను.

“కోడలు రాలేదు. రాదు. లేదు. సరేనా?” అన్నాడు. ఎంతో నెమ్మదిగా. ఏ మాత్రం ఆవేశం గాని కోపం గాని లేకుండా చాలా మామూలుగా చెప్పేడు.

నా ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు. ఇంక నోరు మెదపలేదు.

తలుపులన్నీ తీసి ఉన్న కారణంగా, నేను కనపడలేదని మా వారు హాల్లోనుండి వరండాలోకి వచ్చేరు. ఈ సంభాషణ విన్నారో లేదో తెలీదు. “పిల్లవాణ్ణి నాకివ్వు భవానీ, సామాన్లు దింపించి లోపల పెట్టించు” అన్నారు. ఆ పని అయ్యేక మారుతిని ముందుగా తీసికెళ్ళి కాళ్ళు చేతులు కడిగి పాలు తాగించేను. వాళ్ళ తాతగారికి అప్పచెప్పి నేను వంట ప్రారంభించేను. మారుతికి భోజనం పెట్టేక మేము ముగ్గురము భోజనం ముగించేం. ఉన్నంతలో సంతోషం ఏమంటే పిల్లవాడికి కొత్త లేదు. పెద్ద అల్లరి కూడా లేదు. మా ఇద్దరి దగ్గరా బాగానే అలవాటు పడ్డాడు.

మనోహర్ దగ్గర తెలిసిన నిజాలు దిమ్మెర పోయేలా ఉన్నాయి. “సువర్చల మనస్సు నాకు అంతు చిక్కలేదు. అమెరికా వెళ్లిన క్షణంనుండీ ఆమె ప్రవర్తన మారి పోయింది. మాట తీరు కఠినమైంది. నేను యూనివర్సిటీకి వెళ్లి నా కోర్సులో చేరుతాను. నీ ఉద్యోగం వేరే ఊరు. దూరం కదా. నువ్వు అక్కడుంటేనే మంచిది. వెళ్లి నీ పని నువ్వు చేసుకో” అంది.

“నా జీవితాశయమే ఎలాగైనా అమెరికా రావాలి, PhD చెయ్యాలి. గొప్ప ఉద్యోగం సంపాదించాలి. అక్కడో వెలుగు వెలగాలి అని. నా ఆశయానికి అడ్డు వచ్చే ఏ పనీ నేను సహించను. అర్థం అయ్యిందా” అంది. అమెరికాలో ఉద్యోగం అనుకున్నంత తేలిక కాదు. ఇష్టం వచ్చినట్లు సెలవులు దొరకవు. వేరే చోటికి ట్రాన్సఫర్ కుదిరే పని కాదు. నేను అతి కష్టం మీద శుక్రవారం బయల్దేరి, శని ఆది వారాలు ఆమె దగ్గర గడిపి, రావడమే ఓ సమస్య. ప్రయాణం బడలికతో సోమవారం నా ఉద్యోగం నిర్వహించడం చాలా కష్టమయ్యేది. ఈ విషయం చెప్తే “నిన్నెవరు రమ్మన్నారు? కొన్నాళ్ళు ఆగలేవా?” అన్నది. తనకు సెలవులు ఇచ్చినా పనులున్నాయంటూ యూనివర్సిటీలోనే గడిపేది. ఈ లోగ సువర్చల గర్భవతి అయ్యింది. వార్త తెలిసేక ఆమెకు చాలా కోపం వచ్చింది. అబార్షన్ చేయుంచుకుంటానని పేచీ పెట్టింది. నేను బతిమలాడేను. బాబు పుట్టేడు. ఆమె చదువు పూర్తయేసరికి వేరే రాష్ట్రంలో చాలా మంచి కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అక్కడకు వెళ్ళవలసిందేనని పట్టు పట్టింది.

పిల్లవాణ్ని ఎవరు చూస్తారు అనే ప్రశ్న. “నువ్వు ఉద్యోగం మానెయ్యి. మనోహర్, నాతో పాటు రా. అక్కడే ఏదైనా చూసుకోవచ్చు” అన్నది. నెలలు గడిచేయి. నాకు దగ్గరలో ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో వంట, గిన్నెలు శుభ్రం, ఇల్లు మోపింగ్, క్లీనింగ్, కారు కడగటం, బట్టలు ఉతకటం, ఇస్త్రీ అన్నీ నేనే. ఇవికాక కిరాణా, పాలు వగైరా తేవడం. ముఖ్యమైన పని పిల్లవాడి ఆలనా, పాలనా. నా దినచర్య భరించలేక పోయేను. బ్రతుకు హీనం అనిపించింది. ఆమె దగ్గర బాధ పడ్డాను.

“ఎందుకు అలా ఏడుపు ముఖం పెడతావు? నీకు కుదర లేదు. పోనీ. ఎవరో ఒకరు, ఏం? ఎప్పుడూ భర్తే ఉద్యోగం చెయ్యాలా? భార్య ఇంట్లో ఉండాలా? ఇప్పుడు రోల్స్ తిరగబడ్డాయి. ఆఫ్ట్రాల్ దీనికి ఇంత రగడ ఎందుకు?” అన్నది సువర్చల.

రాను రాను నా స్థితికి నాకే కోపం పెరిగింది. సహనం చచ్చిపోయింది. ఇంత దయనీయంగా ఎందుకు బతకాలి అనిపించింది. “ఇండియాకు వెళ్ళిపోదాం. అక్కడ ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. పైగా ఈ పనులన్నీ చేయడానికి మనుషులు దొరుకుతారు. హాయిగా బతుకవచ్చు” అన్నాను.

“మనోహర్. నువ్వు ఎదో ఒక నాడు ఇలా అంటావని నాకు తెలుసు. బంగారంలాంటి నా ఉద్యోగం, నేను వదులుకోను. ఇండియానా!! ఇక్కడ నాకు వచ్చే జీతంలో ఐదోవంతు కూడా అక్కడ రాదు. నీకు బాధగా ఉందా, పోనీ నీవు వెళ్ళు. చూడు. నీతోపాటు నీ కొడుకుని కూడా తీసుకునిపో” అంది.

నేను పెద్ద షాక్ తిన్నాను. “నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోమని బతిమలాడేవు, ఇప్పుడిలా మాట్లాడడం న్యాయమా న్యాయమా?” అన్నాను.

“ఓ ఆదా – టేక్ ఇట్ ఈజీ మాన్. నువ్వు చాలా మెతక మనిషివని కనిపెట్టేను. గుమాస్తా అయిన మా నాన్న నా చదువుకు డబ్బులు పెట్టలేడు. నా కలలు తీరాలన్నా, ఆశలు నెరవేరాలన్నా, నువ్వు పనికొస్తావని ఆలోచించి ఏరి కోరి నిన్నెంచుకున్నాను. అంతే” అన్నది నవ్వుతూ.

నాకు విపరీతమైన నైరాశ్యం, వైరాగ్యం ఆవహించేయి. మోసగించబడ్డాను కదా. నా ఆత్మగౌరవం చావు దెబ్బ తింది. అంతే. “బీ డన్ విత్ హర్” అనుకున్నాను. నా ముఖ్యమైన సామాన్లు తీసుకొని మారుతితో ఇలా ఇండియా వచ్చేసేను… అది అమ్మా.. ” అన్నాడు మనోహర్. భవానీ గారి కంఠం వణికింది. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. వింటున్న శాంతకు కూడా చాలా ఆవేదన కలిగింది. ఆహా ఆమె తన గుండెల్లో దాచుకున్న బాధను నాతో షేర్ చేసుకుంది కదా!!! పొద్దు పోయింది. డ్రైవర్ వచ్చేడు. భవానీ గారిని వాళ్ళ ఇంటి దెగ్గర దింపేసి ఇల్లు చేరేము.

శాంతకు పిచ్చి ఎక్కినట్లు అయింది. జ్వరం వచ్చేసింది. నిస్సత్తువ ఆవరించింది. మానవ జీవితంలో ఎన్నో జరుగ వచ్చు, ఏమైనా జరుగవచ్చు కదా.. అనిపించింది. చిన్నప్పటినుండి తను చదివిన ఇంగ్లీషు, ఫ్రెంచి నవలలు, షేక్స్పియర్ డ్రామాలు గుర్తుకొచ్చేయి. మనిషి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? ఆనాడే ఆ రచయితలు మానవుని బుద్ధి ఎంత ఉన్నతంగా ఉండచ్చునో, ఎంత హీనంగా కూడా ఉండచ్చునో, స్వార్థం మనిషిని ఏ నీచ స్థాయికి చేరుస్తుందో చెప్పేరు కదా. స్త్రీలు మాత్రం ఏమి తక్కువ! ఆహా సువర్చల – “నయవంచన”. కాదు కాదు. నయగారాల వంచన!! తన అందంతో సొగసుతో హొయలు చూపించి వల వేసింది కదా. ఇలా ఆలోచనలు అలలుగా పొంగేయి. దిన చర్య తప్పదు. మనస్సు కుదుట పడటం లేదు. వారం తిరిగింది.

సాయంత్రం నడక మానేసేను కదా, భవానిగారు కూడా వచ్చేరో లేదో, వాళ్ళ మనుమడు వస్తాడన్నారు కదా. బిజీగా ఉన్నారేమో? అనుకుంది శాంత. ఆ రోజు భవాని గారి ఇంటికి వెళ్ళింది. ఒక యువకుడు తలుపు తీసేడు. మారుతి అయి ఉంటాడు. “బామ్మ గారు ఉన్నారా? శాంత వచ్చేరని చెప్పు బాబూ” అంది. లోపలికి వెళ్లి తను తెచ్చిన స్వీట్లు, పళ్ళు బల్ల మీద పెట్టింది. వారి కుమార్తెలిద్దరిని పరిచయం చేసేరు భవానిగారు. సరదాగా కబుర్లు చెప్పుకుని ఇంటికి బయల్దేరింది శాంత.

కొన్ని రోజులు గడిచేయి. ఇద్దరూ పార్కులో కలిసేరు. “హడావిడి సద్దు మణిగిందా?” అని శాంత పలకరించింది.

“ఆ అవును” – ఆమె మళ్ళీ గతంలోకి వెళ్ళింది.

మనోహర్ ఇంటికి వచ్చేసేక వాళ్ళ నాన్నగారితో కలిసి ఫ్యాక్టరీని పెద్దది చేసేడు. పథకాలన్నీ మనోహర్ వేసేడు. మషీన్లు కొనడం, బ్యాంకు లోన్, మార్కెటింగ్, బిజీ అయిపోయేరు. రెండో అమ్మాయి సౌమ్య మారుతిని తన ఇంటికి తీసుకెళ్లింది. తన పిల్లలతో పాటు అపురూపంగా పెంచింది. వాడు హాయిగా నవ్వుతూ ఆడుతూ తిరుగుతూ ఉంటే అందరం ఊపిరి పీల్చుకున్నాం. హైస్కూల్ స్థాయికి వచ్చేక మా ఇంటికి తీసుకొని వచ్చేము. చదువు బాగా సాగింది. మద్రాస్ ఐ.ఐ.టీ. లో బి టెక్ పూర్తి చేసేడు. ఎం. ఎస్ కోసం అమెరికా వెళ్ళేడు”అన్నది.

“శాంతా, మారుతి తన కోర్సులో ఆఖరున ఉండగా అనుకోని సంఘటన జరిగిందని చెప్పేడు. కొన్ని లెక్చర్ల కోసం ప్రముఖ కంపెనీల సి.ఈ.ఓ. లను పిలుస్తారని చెప్పేడు. అలా ఓ రోజు ఓ భారతీయ మహిళ తమ క్లాస్‌తో ఇంటరాక్ట్ అయింది అన్నాడు. ఓ వారం గడిచేక మారుతికి ఓ ఫోన్ కాల్ వచ్చిందిట.

“హలో, నేను ఎం. మాగంటి తో మాట్లాడుతున్నానా?” ఒక మహిళ గొంతు.

“ఆ . అవును. మీరెవరో తెలుసుకోవచ్చునా”.

“తప్పకుండా. నేను కూడా ఇండియా నుండే మైగ్రేట్ అయి వచ్చేను. సిటీ సుబర్బ్ లో మా ఇల్లు. మొన్న మీ క్లాసులో సెమినార్ ఇచ్చేను కదా. నేను ఎస్. జోసఫ్. వచ్చే ఆదివారం మా ఇంటికి రమ్మని కోరుతున్నాను. ప్లీజ్” అన్నది.

ఆ గొంతులోని నిజాయితీకి సరే అన్నాను. “కారు పంపిస్తాను ఎనిమిది గంటలకు” అన్నది. డ్రైవర్ పేరు కారు నంబరు వివరాలు మెయిల్ చేసింది.

ఆదివారం వారిల్లు చేరేను. సువిశాలమైన బంగళా. సాదరంగా పిలిచి లోనికి తీసుకు వెళ్ళింది. వేడి బ్రేక్ఫాస్ట్. ఇడ్లి, పూరి, కాఫీ వగైరా.

తరవాత డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళేము. మా సంభాషణ వివరాలు.

“నీవు ఎం మాగంటి – అంటే?”

“మారుతి మాగంటి”

“మీరు తెలుగు వారా”

“అవును”

“మనోహర్ మాగంటి తెలుసునా”

“ఆయన నా తండ్రి”.

ఆమె ముఖంలో రంగులు మారేయి. దుఃఖం, ఆవేశం, ఆనందం. ఎన్నో భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు గమనించేను.

కుర్చీ లోంచి లేచి అటూ ఇటూ తిరిగింది. కష్టపడి తన్ని తాను కంట్రోల్ చేసుకున్నట్లు తోచింది.

అతి కష్టం మీద “భగవంతుడా – ఎలా చెప్పాలి, బాబూ మారుతీ – నేను నీ తల్లిని. సువర్చల. ఇప్పుడు సువర్చల జోసెఫ్” అన్నది.

నాకేం అర్థం కాలేదు.

“ఎన్నో ఏళ్ల క్రితం మీ నాన్నగారు నిన్ను తీసుకుని ఇండియా వెళ్ళేరు. అప్పుడు నేను యువతిని. కలలు, ఆశలు సాధించిన విజయంతో గర్వం, అతిశయం నిండిన మనిషిని. ఎంతో ఉన్నత పదవికి వెళ్ళాలి, అన్నది ఒక్కటే నా ఆలోచన. అందుకు నా భర్త, కొడుకు అడ్డంకి అనిపించింది. దర్పంతో ముందుకు సాగేను. జీవితంలో రాజీ ప్రసక్తి లేనే లేదు. మనోహర్ చాలా మంచివారు. ఎన్నో సహించేరు. ఇండియా వెళదాము. అక్కడ ఇద్దరం మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుదాం అన్నారు. నేను విన లేదు.

కాల గర్భంలో ఇరవై ఏళ్ళు పైగా దొర్లిపోయేయి. కొన్ని పరిస్థుతుల ప్రభావం వల్ల నేను జోసెఫ్‌ను పెళ్లి చేసుకున్నాను. అతను కారు యాక్సిడెంట్‌లో మరణించాడు. చాలా కాలంగా నేను ఒంటరిని. “మారుతీ నాదో రిక్వెస్ట్. ప్లీజ్. నువ్వు నా దగ్గర ఉండిపో. అమెరికాను ల్యాండ్ అఫ్ ఆపర్చునిటీస్ అంటారు కదా. మేధావులకు ఆకాశమే హద్దు. నాకు మిలియన్ల సంపత్తి ఉంది. ప్లీజ్. ఆలోచించు” అన్నది.

నేను నిశ్చేష్టుడనయ్యాను. ఇబ్బందిగా కదిలాను.

“అమ్మా అని ఒక్క సారి పిలువు నాయనా” అని చేయి పట్టుకుని అడిగింది.

నా నోరు పెగల లేదు. ఐదు నిముషాలలో తేరుకుని నిలబడ్డాను.

“నీ నిర్ణయం చెప్పు బాబూ”

“మీకు మెయిల్ చేస్తాను”

బామ్మ గారూ రెండు రోజుల్లో నా ప్రయాణం. సామాన్లు సద్దుకున్నాను. ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్ అయ్యి ఇలా మెయిల్ పంపేను.

“డియర్ ఎస్ జోసెఫ్ – నా చదువు పూర్తి అయ్యింది. నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఇలాంటి సంఘటన ఎదురు అవుతుంది అనుకోలేదు.

మీరు, మీ పదవి, మీ సంపద, ఇవేవీ నన్ను ఆకర్షించలేదు. ఎప్పుడో వద్దనుకున్నారు. అత్తయ్యే అమ్మయ్యింది. తన పిల్లలతో పాటు నాకు కూడా ప్రేమ అనురాగం పంచింది. బంగారు బాల్యం చవి చూసేను. నాన్న, బామ్మ, తాతగార్ల యొక్క వాత్సల్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేయి. ఎంత మంచి కుటుంబం మాది!!! చదువులో ముందుకి సాగేను. ఒత్తిడి లేని జీవితం, నాకు విజయాలనే ఇచ్చింది. ఇప్పుడు మరో మజిలీ అవసరం లేదు.

అమ్మా! అని పిలవమన్నారు. మహాభారతంలో కుంతీ దేవి గుర్తుకు వచ్చింది.

ఐ రిమైన్.

ఎం మాగంటి.”

“శాంతా – మనుమడి మాటలు విని దగ్గరకు పిలిచి శిరస్సు నిమిరేను – వెయ్యేళ్ళు వర్ధిల్లు నాయనా అన్నాను”.

శాంత ఆనంద బాష్పాలు తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. “ఎంత మహోన్నతమైన కుటుంబం మీది. అందరికీ జోహార్లు” అన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here