[dropcap]ప్ర[/dropcap]కృతి రమణీయ దృశ్యకావ్యం నయాగరా జలపాతం. ఈ జలపాతాన్ని ఎన్ని సార్లు వీక్షించినా తనివి తీరదు. ఋతువులు మారుతుంటే వాటితోపాటు తన రూపాన్ని మార్చుకునే నయాగరా గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందుకే కవులంటారు ప్రపంచంలోని జలపాతాలన్నింటిని ఒక్కచోట కుప్పపోసి చూస్తే కనిపించేదే నయాగరా అని. నయాగరాను చూస్తే ఆ కవి వర్ణన తప్పుకాదేమో అనిపిస్తుంది. అందుకే ఈ నయాగరా అందాలని వీక్షించేదుకు మూడుసార్లు వెళ్ళి వచ్చాను.
ఈ మూడు సార్లు ఎటువైపు నుండి (కెనడా, అమెరికా) చూసినా తన అందాలతో కట్టిపడేసి, తనలో తడిసిముద్దయ్యేలా చేస్తుంది. ఇన్ని సార్లు చూసేందుకు అంతలా ఏముంటుంది అనేగా మీ ప్రశ్న.. దాని గురించి తెలిస్తే దాన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు. అంత అద్భుతమైనది ఆ నయాగరా..
నయాగరా గురించి…
భూతల స్వర్గమని మనం పిలుచుకునే అమెరికా, కెనడా సరిహద్దులలో ఉందీ జలపాతం. వరల్డ్‌లో అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం తర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్నరకు పైబడి పర్యాటకుల సందర్శనతో ఈ జలపాత ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి.
నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, ఆంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!
నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి. జూన్, జులై, ఆగస్టుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
కెనడా వైపు కన్నా అమెరికా వైపు జలపాతం వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ ఉంటుంది. అమెరికా వైపు సుమారు 1060 అడుగుల వెడల్పుతో 175 అడుగుల లోతులో నీరు పడుతుంటే, కెనడా వైపు సుమారు 2000 అడుగుల వెడల్పుతో గుర్రపు ఆకారంలో 140 అడుగుల లోతులో నీరు పడుతుంది. అంత ఎత్తు నుండి కిందకు దూకే పరవళ్లతో నయాగరా జలపాతం మహా అద్భుతంగా ఉంటుంది. తన సోయగాలతో ప్రపంచ వింతల్లోనే ఒకటిగా చోటు సంపాదించుకున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు.
మొదటి ప్రయాణం…
నయాగరా జలపాతాన్ని చూసేందుకు 1999లో మొదటి సారి వెళ్ళాను. అమెరికాలోని ఓహియో నగరంలో మావారి బాల్య స్నేహితుడు సుదర్శన్ రెడ్డి, జయ దంపతులు నివసిస్తుంటే వాళ్ళను కలిసేందుకు వెళ్ళినప్పుడు మొదటిసారి నయాగరాని చూడటం.
చిన్ననాటి స్నేహితులు కాబట్టి చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. వాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడికీ ట్రాన్స్‌ఫర్ అయినా అక్కడికి వెళ్ళివచ్చేవాళ్లం. వీళ్ళు కలకత్తాలో ఉంటే కలకత్తాకు, బాంబేలో ఉంటే బాంబేకి దూరంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వాలిపోయేవాళ్లం. అంతంటి స్నేహం మా ఇరు కుటుంబాలది. చివరకూ అమెరికాలో ఉన్నారని తెలిసినా చూడటానికి వచ్చేశాం.
మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి గ్రే గ్రౌండ్ బస్‌లో ఓహియో చేరుకున్నాం. ఓహియో అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ముఖ్య నగరం. ఓహియో అనే పేరు సెనెకా పదం నుండి వచ్చింది. ఓహియో అంటే ‘గొప్ప నది’ లేదా ‘మంచి నది’ అని అర్థం.
మొదటి సారి వచ్చినప్పుడు వారం రోజులు వాళ్లింట్లోనే మకాం. ఆసలు వారం రోజులు వాళ్లతో ఎలా గడిచిపోయిందో తెలియనే తెలిదు మాకు. వాళ్ళకు సొంత వెహికిల్ ఉంది కాబట్టి హ్యాపీగా అన్ని ప్రాంతాలని చుట్టి వచ్చాం. మొదటి సారి నయాగరాను చూసేందుకు వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రి వేళలో నయాగరాను వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ టైంలో తీసుకెళ్ళారు. అక్కడే దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో ఏం కనిపిస్తుంది. ఏం చూస్తాం అనుకుంటాం కానీ నిజానికి రాత్రి వేళల్లో నయాగరా జలపాతాన్ని వీక్షించడం ఓ అద్భుతమే అనవచ్చు.
జలపాతాలని పగలు దర్శించడం వేరు. కానీ చీకట్లో చూడటమే వింత. అందుకే ఆ వేళలో చూడటం. నయాగరా జలపాతం చీకటి పడగానే మొత్తం దృశ్యం ఏదో స్వప్నలోకంలో ఉన్నట్లు మారిపోయింది. తారాజువ్వలు ఆకాశంలో నుంచి విచ్చుకొని రంగురంగుల పువ్వులను వర్షిస్తున్నట్లుగా, దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు ఫైర్ వర్కు ప్రదర్శన సాగుతుంది అక్కడ.
ఎక్కడో దూరం నుంచి ఫోకస్ చేసిన లేజర్ కిరణాలు ఈ నీటి ధారలను రంగులమయం చేసి నీటి తుంపర్ల మీద ఇంధ్రధనస్సులా పడి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంత విశాల ప్రాంతంలో జలపాతంలో రంగులు మారుతున్నట్లు చేసిన ఏర్పాట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ దృశ్యాన్ని చూస్తూ టూరిస్టులంతా హర్షాతిరేకంతో బిగ్గరగా అరుస్తువుంటే… ఆ రాత్రి అద్భుతమనే చెప్పవచ్చు.
ఆ వెండి వెన్నెల్లో తారాజువ్వల మధ్య నయాగరాను వీక్షించాక హోటల్‌కు వెళ్లి పోయాం. తిరిగి ఉదయం కెనడా బార్డర్ నుండి నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లాం. ఇదంతా కూడా ఓ రెయిన్ ఫారెస్టు. చినుకులతో, నీటి తుంపర్లతో ప్రదేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి నుండి చాలా ప్రదేశాలను చూపించారు. చూపించడమే కాకుండా ప్రతి ప్రదేశం గురించి చక్కగా వివరించారు. వారి అతిథ్యం మేం ఎప్పటికీ మరిచిపోలేం.
రెండోసారి (2004) స్నేహితురాలు శ్రీలతో కలిసి నయాగరా జలపాతాన్ని చూసేందుకు వెళ్ళాం. ఆమె, డాక్టర్ సుదర్శన్ గారు న్యూయర్క్ క్యాపిటల్ అయిన ఆల్బమాలో ఉంటుంది. తనతో మేం వారం రోజులు పాటు గడిపాం. వారం రోజుల్లో మేం అక్కడే ఉండే చిన్న చిన్న ప్రదేశాలకు పిక్నిక్ లాగ వెళ్ళేవాళ్లం. ఉదయం పూట మమ్మల్ని కార్లో తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళేది. మాబాబు మాతోపాటు వచ్చాడు కాబట్టి తనకు చూపిద్దామని అందరం కలిసి వెళ్ళాం. రాత్రికి దగ్గర్లో ఉన్న మాటల్లో రూమ్ తీసుకొని మర్నాడు ఉదయం కూడా నయాగరా చూడటానికి వెళ్ళాం. మా బాబుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని దగ్గరుండి నయాగరా అందాలను దగ్గరుండి మరీ చూపించాలని జలపాతం దగ్గర ఉన్న టేబుల్ ర్యాక్ కాంప్లెక్స్‌కు వెళ్ళాం. అదో వ్యూ పాయింట్. లిఫ్టులో 125 అడుగుల కిందకి తీసుకెళ్ళి ఒక గ్లాసు డోరులోంచి జలపాతాన్ని చూడవచ్చు. నీటి మట్టానికి 25 అడుగుల ఎగువన ఒక బాల్కనీ కట్టారు. మూడువైపులా రైయిలింగ్స్ ఉంటాయి. నిమిషానికి సుమారు 20 కోట్ల లీటర్ల నీరు 175 అడుగుల లోతుకు పడి, వందల అడుగుల ఎత్తుకు లేచిన చల్లటి నీటి తుంపర్లు ముఖాన్ని తడుపుతుంటే…. ఆ మనోహర దృశ్యాలను వివరించడానికి మాటలు చాలవనుకోండి.
మైడ్ ఆఫ్ ది మిస్ట్….
వెళ్ళిన వెంటనే అందరం కలిసి నయాగరా జలపాతాన్ని చూశాక ఆ జలపాత పరవళ్ళను మరింత దగ్గర నుండి చూడాలని టికెట్లు కొనుక్కొని ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. సుమారు 100మంది పట్టే డబుల్ డెక్ మోటార్ బోటు ఇది. అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళు ఇస్తే అందరం వాటిని వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. అది రెండస్తుల బోటు. అది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ అదొక అందమైన అనుభవం.
ఒక రకంగా జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హోరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీరు కూడా గట్టిగా తాకుతుంది. నదిపై బోటులో వెళుతుంటే…. ఒక వైపు భయంగా ఉన్నా… మరో వైపు సాహసం చేస్తున్న థ్రిల్ కలుగుతుంది. అంత ఎత్తు నుండి నీటి ఉధృతి, తుంపర్లతో తడిసి ముద్దయిపోవలసిందే…!!
ఆ అద్భుత దృశ్యాలను చాలా మంది తమ కెమెరాల్లో, సెల్‌ఫోన్లలో బంధిస్తుంటే మేము కూడా ఫొటోలు తీసుకున్నాం. ఇక్కడ పిల్లా, పెద్ద అనే తేడా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం అక్కడ.
డాక్టర్ సుదర్శన్ గారు లీవ్ పెట్టి మరీ మాతో వచ్చిన ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆ దంపుతులిద్దరు సాయంత్రం పూట బర్బిక్‌తో తయారు చేసిన చికెన్, మటన్, మొక్కజొన్న కంకులతో వేడి వేడిగా స్నాక్స్ తీనిపించేవాళ్లు. చాలా రుచిగా అనిపించేవి. మమ్మల్ని ఫై స్టార్ హోటల్‌కు తీసుకెళ్లారు.
ఆ ప్రయాణంలో ఒక్క పైస కూడా మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వలేదు. వారి అతిథ్యాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం.
2014లో ఇంకోసారి….
2014లో మేం కెనడా వెళ్లాం. ఈ ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి వయా ట్రైన్. వాస్తవానికి మేము అక్కడికి వెళ్ళే వరకూ కూడా దాని గురించి తెలియదు. ఒక సూటల్లో రూమ్ తీసుకొని ఓ రాత్రి ఉన్నప్పుడు అక్కడున్న ఓ అమ్మాయి అడిగింది. “మీరు ఎక్కడికెళ్తున్నారు” అని. మేం ఇక్కడ దగ్గర్లో ఉన్న ప్రదేశాలను చూడటానికి అని చెప్పాం. “అవి ఎప్పుడైనా చూడోచ్చు కానీ. ముందు మీరు కెనడా వచ్చేరంటే కచ్చితంగా మీరు వయా ట్రెయిన్ ఎక్కాలి. ఇది కెనడా వాళ్ల జీవిత కాలపు స్వప్నం. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ ట్రైన్ ఎక్కడం మీస్ కాకుండా చూసుకొండి” అని అమ్మాయి చెప్పింది. ఆమె ఇచ్చిన ఓ సలహాకు వెంటనే ఆమెనే టికెట్లు బుక్ చేయమని అడిగాం. “మీరు ఒక టూ నైట్‌కు తీసుకొండి చాలా తక్కువలో వస్తుంది. అంటే లాస్ట్ మినిట్ సేల్ ఉంటాయి. అది నేను బుక్ చేస్తాను” అని చెప్పింది. అలా చాలా తక్కువ ధరలో మాకు ట్రెయిన్ బుక్ చేశారు. నిజంగా ఎంత ఆనందించానో.. మనం వెళ్లాలని ఆశ, కోరిక ఉంటే చాలా మనకు అలాంటివారే తటస్థ పడతారు. మనల్ని ప్రోత్సాహించేవాళ్లు, దారి చూపించేవాళ్ళు మన చూట్టు ఉంటే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వయా ట్రెయిన్ ఎక్కాం. ఆ అమ్మాయే మాకు కెనడాలో ఏయే ప్రదేశాలు చూస్తే బాగుంటుందో చక్కగా చెప్పారు.
వయా ట్రైన్ కొందరి స్వప్నం…
కెనడాలో ఇది అతి ముఖ్యమైన జర్నీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెయిన్ ఎక్కడం అక్కడి ప్రజలు జీవిత కలగా భావిస్తారు. వయా ట్రైన్ అనేది కెనడాలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
మేం పొద్దున్నే స్టేషన్‌కు వెళ్లి ట్రెయిన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రెయిన్ ఉదయం ఐదింటికి ఉంది. కానీ మేం నాలుగింటికే ప్లాట్‌పామ్ దగ్గరకు వెళ్లాం.
మేం వెళ్లేసరికే మాకన్నా ముందే ఒక ముసలావిడ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె వయసు 84 ఏండ్లు. ఆమె దగ్గరకు వెళ్ళి నేను కాసేపు మాట్లాడాను. ట్రెయిన్ కోసం తాను మూడింటి నుండి వెయిట్ చేస్తున్న అని చెప్పింది. అమె అలా చెబుతుంటే కాస్త వింతగా అనిపించింది, ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చిందో అని. అదే అడిగాను. “మూడింటికే ఎందుకు వచ్చారు మీరు. ఐదింటికి రావొచ్చు కదా?” అని. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా “నాకు ఈ ట్రెయిన్ ఎక్కలన్నది నా కల, ఈ కోరిక కొన్ని ఏండ్లది. అందుకే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఉత్సహంలో నాకు రాత్రంత నిద్ర కూడా పట్టలేదు. అందుకనీ రెండింటికే నిద్రలేచి రెడీ అయి మూడింటికల్లా స్టేషన్ దగ్గర కొచ్చి
ట్రెయిన్ కోసం ఎదురుచూస్తున్నాను” అని అంది. అమె అలా చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తానోక టీచరట. తాను సంపాందించిన సంపాదనలో కొంత భాగం ఈ ప్రయాణం కోసం దాచిపెట్టుకుందని చెప్పింది. అలా ఆమె జీవిత కాలపు కలను నెరవేర్చుకుంటోన్నది. మేం కూడా ఆ చలిలో తనతో పాటు కూర్చున్నాం.
ఆమెను చూసిన తర్వాత ఈ వయసులో కూడా ఎంత సాహసం, ఎంత ఉత్సహాం కదా అనుకున్నాం. నిజానికి ప్రయాణికులకు కావాల్సింది ప్రోత్సాహం కాదు, ఇలాంటి వాళ్ల అనుభవం ఉంటే చాలు ఎంత దూరమైన సరే వయసుతో సంబంధం లేకుండా తిరిగేయొచ్చు. ఇలా వాళ్ల జీవితమే కదా మాలాంటి వాళ్ళకు ప్రోత్సహం. ఆమెను చూసి మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలా ఆ రోజంతా మేం ట్రెయిన్‌లో గడిపాం. సహజంగా ట్రెయిన్ జర్నీ అనగానే ఎవరికైనా ఆనందమే కదా!. అలాంటిది మేం వెళ్లే బ్రెయిన్ అన్నీ ట్రెయిన్స్ కన్నా భిన్నమైనది, ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.
వయా ట్రెయిన్….
జనరల్ గా ఏ ట్రెయిన్లయినా ఐరన్‌తో ఉంటాయి. మహా అయితే కాస్త లగ్జరీగా ఉంటాయి. హంగూ ఆర్భాటాలతో మూస్తాబు చేసి ఉంటాయి. కానీ ఈ ట్రెయిన్ అలాంటి ఇలాంటి ట్రెయిన్ కాదు. అందుకే కదా ఆ ముసలావిడ ఆ వయసులో కూడా తను కూడా దీన్ని ఎక్కాలని తహతహలాడింది.
కెనడా ప్రభుత్వం ప్రకృతి అందాలను వీకించేందుకు ప్రత్యేకంగా గ్లాస్‌తో నిర్మాణం చేయించింది ఈ ట్రెయినను. ఈ ట్రైయిలో ప్రయాణం చేస్తూ ఎంచక్కా జర్నీ పొడవునా బయటి ప్రదేశాలను, ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. బోగీలు అంతా గ్లాస్ తోనే ఉంటాయి. కింది వైపు, పక్కవైపు, పైని వైపు ఎటూ చూసిన గ్లాస్ తోనే ఉంటాయి. అందుకే బయట కనిపించే వాటిని స్పష్టంగా చూడవచ్చు. చూస్తూనే మన కంటికి కనిపించే దృశ్యాలను ఎంచక్కా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ట్రెయిన్ కాస్త కాస్ట్లీ అని చెప్పవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది ఈ ట్రెయిన్ జర్నీకి. మా తర్వాత వెళ్ళి, ఆ ట్రెయిన్ ఎక్కిన మా స్నేహితులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు. అంత ఎందుకైంది. మేం వెయ్యి రూపాయాల్లో చూసొచ్చామని చెప్పాను. అయితే వాళ్లు బుక్ చేసుకున్నది పూర్తిగా అక్కడే ఉండి చూడటానికి. మేం నార్మల్ ట్రెయిన్ మాదిరి బుక్ చేసుకొని అక్కడి ప్రదేశాలను చూడటం జరిగింది.
ఆ ట్రెయిన్‌లో జర్నీతో ప్రయాణికులకు కావాల్సిన భోజనం, టీ, కాఫీ, బ్రెడ్ ఇంకా చాలా పదార్థాలను సప్లయ్ చేస్తారు. మేం మాత్రం ఎక్కువగా వేటిని ఆర్డర్ చేయకుండా కేవలం ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగి అలా అందులోనే కూర్చుండిపోయి నాలుగు గంటలు ప్రయాణం చేసి తర్వాత మళ్లీ తిరిగొచ్చి భోజనం ఆర్డర్ చేసుకొనే వాళ్లం. అలా రోజంతా ట్రెయిన్ లోనే గడిపేవాళ్లం. అందుకని మాకు కాస్త తక్కువనే ఖర్చు అయింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకు ఈ ట్రెయిన్ జర్నీ అద్భుతమనే చెప్పాలి.
మేయి ఈ ట్రెయిన్ జర్నీలో మొదటగా అలస్కాకు చేరుకున్నాం. అక్కడి నుండి విక్టోరియా, తర్వాత విజిలర్స్, తర్వాత క్యూబెక్ ఇలా రెండు రోజుల పాటు ఆ ట్రెయిన్లో ప్రయాణం చేయడం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనే చెప్పవచ్చు.
ఆ ట్రెయిన్ జర్నీ తర్వాత క్యూబెక్ నుండి టొరంటోకు బస్సులో వెళ్ళిపోయాం. బస్సులో వెళ్లేందుకు అమెరికాలో ఉన్న కుమార్ అనే అబ్బాయి బస్ బుక్ చేసి మాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఓసారి కెనడా వైపు నుండి నయాగరా చూడాలని బయలుదేరాం.
ఈ సారి ప్రయాణంలో మాకు నయాగరా వద్ద ఇండియా నుండి వచ్చిన డాక్టర్ రమా, ప్రసాద్ దంపతులు కలిసారు. మేము నలుగురం కలిసి అక్కడే డబుల్ బెడ్ రూం తీసుకొని అక్కడే ఉండి ఆ ప్రాంతాలనన్నింటిని చూడాలని ప్లాన్ చేసుకున్నాం. ముచ్చటగా మూడోసారి…
ఎలాగూ రూం తీసుకున్నాం కాబట్టి స్వయంగా వండుకొని ప్రశాంతంగా ఆ ప్రాంతాలనన్నింటినీ చూడాలని బయలు దేరాం. ఈ సారి మా ప్రయాణంలో కేవలం నయాగరా జలపాతాన్ని చూడటమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా కవర్ చేయాలని అనుకున్నాం. అందుకే నయాగరా చూశాక చుట్టుపక్కల వంతెనలు ఉన్నాయంటే వాటిని చూద్దామని వెళ్ళాం.
జలపాత మార్గంలో ఉన్న ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి. ఈ వంతెనలన్నీ కెనడా, అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మిత మయ్యాయి. నాలుగు చక్రాల వాహనదారులు, పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు. వీటిలోనే రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి. అవి.. పీస్ బ్రిడ్జ్, రెయిన్‌బో బ్రిడ్జ్, వర్ల్‌పూల్ బ్రిడ్జ్, లూయిస్టన్-క్వీన్షన్ బ్రిడ్జ్,మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20, 30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.
అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తూ తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.
మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.
టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ కొత్తవి ఉంచింది.
జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్ షూస్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం.
ప్రతి ప్రయాణంలో మనకు ఎంతో మంది కలుస్తారు. కానీ కొందరే ఎప్పటికి నిలిచి ఉంటారు. అలాంటి జయ వాళ్లు ఒకరు.
అమెరికా, కెనడా లాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ట్రాన్స్‌పోర్టుకు కష్టం అవుతుంది. అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ట్రెయిన్స్, గ్రే గ్రౌండ్ బస్సులు మాత్రమే ఉంటాయి. మామూలుగా అక్కడ ట్యాక్సీ ఎక్కలంటే చాలా కాస్ట్లీ. అందుకే మేము గ్రే గ్రౌండ్ బస్సులోనే వెళ్ళేవాళ్లం. ఆ గ్రే గ్రౌండ్ బస్సులోనో దగ్గరి ప్రాంతాలకు తిరిగాం. దూర ప్రాంతాలకు మాత్రం ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివ్వకుండా వారే అన్నీ చూసుకున్నారు. ఎంత అదృష్టవంతులమో కదా అలాంటి స్నేహితులన్ని పొందడం.
ఈ యాత్రలో అక్కడున్న మనవాళ్ల జీవన విధానం ఎలా ఉన్నాయో గమనించే ప్రయత్నం చేశాను. అక్కడి మన వాళ్ల అనుభవాలు, మనసత్వాలు, జీవిత విధానం ఇవన్నీ మనం కూడా ఆకళింపు చేసుకున్నాం. మన వాళ్ళు అయినప్పటికీ మనది కానీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడినప్పుడు అన్నిట్లో కూడా మార్పు వస్తుంది కదా. వాళ్లు తినే ఆహారం, ఆలోచన విధానం, వారి జీవిత గమనం అన్నిట్లోను ఎంత మార్పు…. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అన్నట్లు ఇక్కడున్న మన వాళ్ళు ఇక్కడి అలవాట్లకు అలవాటు పడిపోయారేమో అనిపించింది. ఒకటి మాత్రం నిజం ఎక్కడున్నా అతిథ్యంలో మన వాళ్ళను మించిన వాళ్ళు లేరనే చెప్పవచ్చు.