[box type=’note’ fontsize=’16’] “వొక మంచి అనుభవం కోసం దీన్ని చూడమని రెకమెండ్ చేస్తాను” అంటూ ‘నయనతార’s నెక్లేస్’ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
[dropcap]ఈ[/dropcap] వారం మరో లఘు చిత్రం. ఇది ఎంచుకోవడానికి నా కారణం ఇందులో నటించిన కొంకొణా సెన్ శర్మ. చిత్రం బాగున్నా బాగుండకపోయినా ఆమె నటన తప్పకుండా బాగుంటుంది అన్న నమ్మకంతో. నా నమ్మకం వొమ్ము కాలేదు, పైగా చిత్రం కూడా మంచి చిత్రం అని తేలింది.
గై డి మపాస నెక్లేస్ గుర్తుకొస్తున్నదా? ఆత్మ దానిదే. ఆహార్యంలో మార్పులున్నాయి. ఒక లఘు చిత్రానికీ, ఓ పూర్తి నిడివి చిత్రానికీ మధ్య తేడాలలో ముఖ్యమైనది ఏమిటంటే పూర్తి నిడివి చిత్రంలో దర్శకుడు/రచయిత చెప్పదలచుకున్నది నెమ్మదిగా, తొందర లేకుండా, వొక్కో సంఘటనే పేర్చుకుంటూ పోయి, ప్రేక్షకులలో ఆయా ఎమోషన్లు కలిగిస్తూ చెప్పే వీలుంటుంది. ఎక్కువ డీటైల్స్ ని కేప్చర్ చెయ్యడానికి అవకాశం వుంటుంది. కాని లఘు చిత్రాల్లో అంత వీలుండదు కాబట్టి ఆ మిసాన్సెన్లు, ఆ మోంటేజీలు, ఆ క్లుప్త స్టేటిక్ షాట్లు, వీటిని వో కవి తన కవితలో పదచిత్రాలు అల్లుకున్నట్టుగా అల్లాలి. ఇందులో వో ఉదాహరణ చెప్పాలంటే అల్కా జీవితం ఎలా వున్నదో చెప్పడానికి గోడ మీద రెపరెపలాడుతున్న వేలాడదీసిన కేలెండరు, కూత పెడుతున్న కుక్కరు, నీళ్ళు ఆగిపోయి ఒక్కో చుక్కే పడుతున్న నల్లా, అక్వేరియంలో చేపలు వగైరా చూపిస్తాడు దర్శకుడు. అదె నయనతార దగ్గరికొస్తే మొదటి సీన్ లోనే ఆమె వో యూట్యూబ్ వీడియో లో చూస్తూ తను మేకప్ చెసుకుంటుంది ఆ వీడియోలో చూపించిన మాదిరిగానే. మేకప్ అయ్యాక ఆమె క్షణం పాటు మొహం వేలాడేసుకుని అద్దం ముందు ఏదో ఆత్మావలోకనం చేసుకుంటున్నట్టో, ఏ వాస్తవిక సమస్య గుర్తొచ్చినట్టో, మరొకటో సూచించేలా నిలబడిపోతుంది నయనతార. వొక్క చిన్న సన్నివేశంలో ఇదంతా, ఇంతకంటే ఎక్కువ చెప్పగలిగే నటి కొంకొణా.
వో లఘు చిత్రాన్ని పోటీ పడగలిగేది వొక వ్యాపార లఘు చిత్రమే. అది మరింత ప్రభావవంతంగా వుంటుంది. అది మన మనస్సును తాకే విధంగా, మన జీవితం మన కలల జీవితం అందంగా చూపిస్తుంది. అయితే దాని ఉద్దేశం అంతిమంగా ఆ వస్తువును అమ్మడం, మన మనసులో దాన్ని పొందాలన్న కోరికను పుట్టించడం కాబట్టి దాన్ని పక్కన పెడదాము. లఘు చిత్రం అవన్నీ చేస్తుంది, కాని కథ పట్ల, సినెమా వ్యాకరణం పట్ల నిజాయితీతో. అందుకే లఘు చిత్రాలు దర్శకులకు సవాలే కాదు, లఘు పాఠాలు కూడా.
జయదీప్ సర్కార్ దర్శకత్వం, అపర్ణా చతుర్వేది-అనుకుర్ ఖన్నాల స్క్రిప్టు చాలా బాగున్నాయి. దానికి గోడచేర్పు కొంకొణా-తిలోత్తమల నటన. వాళ్ళ నటనలో ఆ కాంట్రాస్ట్, ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడేలా చేసింది. విరాజ్ సింఘ్ కెమెరా, సోమేశ్ సాహా సంగీతం కూడా కథకు వో లోతును ఇచ్చాయి.వొక మంచి అనుభవం కోసం దీన్ని చూడమని రెకమెండ్ చేస్తాను.