Site icon Sanchika

నీ బతుకు చూస్తా!

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం ‘ద ట్రూమన్ షో’, ‘నైట్‌క్రాలర్’ అనే రెండు ఇంగ్లీషు సినిమాలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు. [/box]

[dropcap]సి[/dropcap]నిమా అయినా, నాటకం అయినా, నవలైనా వేరొకరి జీవనచిత్రణమే. అందుకే మనిషికి అవంటే ఆసక్తి. వేరొకరి జీవితంలోకి తొంగిచూసి అందులోని తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే వ్యక్తుల నిజజీవితాలలో జరిగే సంఘటనలు గురించి కూడా కొంతమందికి ఆసక్తి ఉంటుంది. పక్కింట్లో గొడవ జరుగుతుంటే తొంగిచూసే వాళ్ళే ఎక్కువ. ఈ బలహీనతని సొమ్ము చేసుకునే టీవీ కార్యక్రమాలు కూడా వచ్చేశాయి. ‘బిగ్ బాస్’లో ఇరవై మందిని ఒకచోట ఉంచి వారికి రకరకాల సమస్యలు సృష్టించి వినోదం చూడటం అలవాటైంది. కొన్నాళ్ళకి ఒక మనిషి జీవితమంతా టీవీలో ప్రత్యక్షప్రసారం చేసినా అశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటిది జరుగుతుందని 30 ఏళ్ళ కిందటే ఊహించారు రచయిత అండ్రూ నికోల్. దర్శకుడు పీటర్ వియర్ కోరిక మీద ప్రేక్షకులకి నచ్చే విధంగా కథను చెక్కారు. పదహేను స్క్రీన్ ప్లేలు రాసిన తర్వాత పదహారోది పీటర్‌కి నచ్చింది. అదే 1998లో వచ్చిన ‘ద ట్రూమన్ షో’ చిత్రంగా రూపుదాల్చింది.

కథలోకి వెళితే ఒక టీవీ సంస్థ ఒక బిడ్డని దత్తత తీసుకుని చిన్నప్పటి నుంచి అతని జీవితాన్ని ‘ద ట్రూమన్ షో’ పేరు మీద టీవీలో ప్రత్యక్షప్రసారంగా చూపిస్తూ ఉంటుంది. అయితే అతని జీవితంలో ఉన్నవారందరూ నటులే అతను తప్ప. తన జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తున్నారని అతనికి తెలియదు. అంతరిక్షం నుంచి కనిపించేంత పెద్ద గుమ్మటం నిర్మించి అందులో ఒక చిన్న ప్రపంచమే నిర్మిస్తాడు ఆ షో ‘స్రష్ట’ క్రిస్టాఫ్. అందులో సూర్యచంద్రులు కూడా కృత్రిమమే. వాతావరణాన్ని కూడా నియంత్రించవచ్చు. ఎంత భారీ బడ్జెట్టో ఊహించండి. ఆ చిన్న ప్రపంచంలో ఒక ఊళ్ళో ఉంటాడు ట్రూమన్. చుట్టూ సముద్రం ఉంటుంది. అదీ కృత్రిమమే. ట్రూమన్‌కో భార్య. ఆమె కూడా నటియే. తల్లి వేరుగా నివసిస్తూ ఉంటుంది. ఆమె కూడా నటియే. తండ్రి చిన్నప్పుడు సముద్రంలో తుఫానులో మరణించాడు. దాంతో ట్రూమన్‌కి సముద్రమంటే భయం. ఇది కావాలని క్రిస్టాఫ్ పెంపొందించిన భయమే… ట్రూమన్ ఊరు విడిచి వెళ్ళకుండా. ఇక తండ్రి కూడా నటుడే అని వేరే చెప్పక్కరలేదు.

ట్రూమన్ ప్రతి కదలికని చిత్రీకరించటానికి వేల కొలదీ కెమెరాలు ఉంటాయి. షోలో ‘ఇప్పుడొక చిన్న బ్రేక్’ అనే అవకాశం లేదు. ఎందుకంటే ఆ చిన్న బ్రేక్‌లో ట్రూమన్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటన జరగవచ్చు. అందుకని కథలోనే నటులు వివిధ ఉత్పత్తులకు ప్రచారం (అడ్వర్టైజింగ్) జరిగేలా చూస్తారు. ఉదాహరణకి ట్రూమన్ కారు దిగి తన ఆఫీసుకి వెళుతుంటే రోజూ కనపడే ఇద్దరు పరిచయస్థులు గోడ మీద ఓ బ్యాంక్ ప్రచారచిత్రం కనపడేలా అతన్ని నిలబెట్టి కుశలప్రశ్నలు వేస్తారు. ట్రూమన్ భార్య మెరిల్ షాపింగ్‌కి వెళ్ళి వచ్చి అందమైన ప్యాకింగ్‌లో ఉన్న చాకుని చూపించి “ఈ చాకు ఎంత పదునైనదంటే అన్ని కూరలూ క్షణాల్లో తరిగెయ్యవచ్చు” అంటుంది. ఈ రకంగా ప్రచార ఆదాయం కూడా వస్తుంది.

మనిషినైతే నియంత్రించగలరు కానీ మనసుని ఎలా నియంత్రిస్తారు? కాలేజీలో ట్రూమన్‌తో మెరిల్ ప్రేమాయాణం సాగిస్తుంది కానీ ట్రూమన్ లారెన్ అనే ఇంకో అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు. లారెన్ కూడా నటియే… కాలేజీలో వేరే విద్యార్థులు కూడా ఉండాలిగా మరి. లారెన్‌కు అతని మీద నిజంగానే ప్రేమ కలుగుతుంది. అతనికి అతని జీవితం గురించి నిజం చెప్పాలనుకుంటుంది. కానీ చుట్టూ కెమెరాలే. మిలిటరీ వాళ్ళు వచ్చి ఆమెని లాక్కుపోతారు. ఏదో కేసు కారణంగా ఆమె కుటుంబం ఫిజీ అనే దేశానికి వెళ్ళిపోయిందని ట్రూమన్‌కి చెబుతారు. మెరిల్‌ని పెళ్ళి చేసుకున్నా లారెన్‌ని మరచిపోడు ట్రూమన్. ఏదో ఓ రోజు ఫిజీ వెళ్ళాలని రహస్యంగా అనుకుంటూ ఉంటాడు. ట్ర్రూమన్, మెరిల్‌ల శృంగారం టీవీలో చూపించరు, కానీ అతనితో శృంగారానికి ఒప్పుకునే ఆమె నటిస్తుందనేది స్పష్టం. లారెన్‌గా నటించిన సిల్వియా బయటి ప్రపంచంలో ట్రూమన్ స్వేచ్ఛ కోసం జరిగే ఉద్యమంలో చేరుతుంది. ఒకరిది ధనాశ, ఒకరిది ప్రేమ.

ఒకరోజు కారులో వెళుతుంటే రేడియో సిగ్నల్లో తేడా వచ్చి తన కదలికల వివరాలు రేడియోలో వినపడతాయి ట్రుమన్‌కి. షో నిర్వాహకులు ఒకరితో ఒకరు పంచుకుంటున్న సమాచారమది. ఇంకా కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. దీంతో ట్రూమన్‌కి తన జీవితంలో ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వస్తుంది. మెరిల్‌కి చెబుతాడు. ఆమె కొట్టిపారేస్తుంది. తన ప్రాణస్నేహితుడికి చెబుతాడు. అతను నవ్వుతాడు. చివరికి తన భార్య కూడా కుట్రలో భాగమే అని అనుమానం వస్తుంది. అమెని కత్తితో బెదిరిస్తాడు. ఆమె ప్రాణభయంతో కెమెరా వంక చూసి “ఏదో ఒకటి చేయండి” అంటుంది. పర్యవసానంగా ఆమె షో నుంచి నిష్క్రమిస్తుంది. క్రిస్టాఫ్ ట్రూమన్‌ని తిరిగి ‘మామూలు’ మనిషిని చేయటానికి అతని తండ్రిని మళ్ళీ ప్రవేశపెడతాడు. అతనికి ఇన్నాళ్ళూ జ్ఞాపకశక్తి లేదని, ఇప్పుడు తిరిగి వచ్చిందని నమ్మిస్తారు అందరూ. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ గిమ్మిక్కు!

ఇలా ఒకరి జీవితాన్ని నియంత్రించటం మోసం కదా అని క్రిస్టాఫ్‌ని అడిగితే అతని బాగోగులు నేను చూసుకుంటున్నాను, బయటి ప్రపంచంలో అయితే ఎన్నో కష్టాలు పడాలి అంటాడు. మనసుకు నచ్చినట్టు ఉండలేకపోతే ఎన్ని సుఖాలుండి ఏం లాభం? క్రిస్టాఫ్ లాంటి వాళ్ళు ఇలా ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. వారికి కావల్సింది కీర్తి, ధనం. దాని కోసం ఒక మనిషిని కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నాడు. అతని భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు. మనిషికి సుఖదుఃఖాలను కలిగించే హక్కు దేవుడికి మాత్రమే ఉంది. అలా కాక తానే దేవుడిలా ఒక మనిషిని శాసించటం అపరాధమే అవుతుంది. చట్టపరంగా ట్రూమన్‌ని దత్తత తీసుకున్నాను కాబట్టి నాకు హక్కు ఉంటుంది అంటే అది ధర్మం కాదు. చట్టం వేరు, ధర్మం వేరు.

ట్ర్రూమన్‌కి తానున్నది మాయాప్రపంచం అని తెలుస్తుంది. జగం మిథ్య అనేది ప్రత్యక్షంగా అనుభవమౌతుంది. ఆ పరిస్థితుల్లో మనముంటే ఏం చేస్తాం? ఇదే బావుంది అని ఉండిపోతామా లేక బయటపడాలని ప్రయత్నిస్తామా? అక్కడే ఉండిపోతే మనం కూడా ఇతర నటుల్లో ఒక నటుడిగా మారిపోతాం. క్రిస్టాఫ్ ట్రూమన్‌కి నిజం చెప్పి అతన్ని ఉండిపొమ్మంటాడు. ట్రూమన్ అక్కడే ఉండిపోతే ఇక షో మామూలు సీరియల్‌లా మారిపోతుంది. ఎంతమంది చూస్తారు? ఈ విషయం క్రిస్టాఫ్ ఆలోచించడు. అహంకారం అతణ్ణి అంధుణ్ణి చేస్తుంది. అతనికున్నది మమకారం కాదు, అహంకారమే. షో చూసేవాళ్ళు తగ్గిపోతే ఏం చేస్తాడు? ట్ర్రూమన్‌ని వదిలించుకోవటానికి ప్రయత్నించడా?

ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనమంతా ట్రూమన్ లమే. అయితే ట్రూమన్‌కి అనుభవమైనట్టు ఈ మిథ్యాజగత్తులో ఉన్న మనకు జగం మిథ్య అనేది అనుభవం కావటం కష్టం. అది తెలిస్తే నిర్లిప్తంగా ఉండిపోవచ్చు. మన ధర్మం మనం చేస్తూ జరిగేది జరగనీ అనుకోవచ్చు. ఇంకా ఏదో కావాలి అనుకుంటే ఆ కోరికలకి అంతు ఉండదు. క్రిస్టాఫ్ చేసినది తప్పే, అతను దేవుడిగా మారాలనుకున్నాడు కాబట్టి. కానీ దేవుడి జగత్తులో మనం దేవుడి చేతిలో బొమ్మలమే. శుభాశుభాలను దేవుడికి వదిలేసి నిర్లిప్తంగా ఉంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటాడు. జగన్నాటకంలో మనం మన పాత్ర నిర్వహించి నిష్క్రమించవచ్చు. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు “మనం జీవితంలో చేయవలసినది అభినయమే” అంటారు. ఇది కొంచెం కఠినంగా అనిపించినా నిజమే అనిపిస్తుంది. అందరూ మనవారే అన్నట్టు ప్రవర్తించాలి. కానీ బంధాలు శాశ్వతం కాదు అనే ఎరుక కలిగి ఉండాలి.

భారీ బడ్జెట్టుతో ఇలాంటి షో నడపటం సాధ్యమా అని అనిపించకమానదు. సాధ్యం కాదు కాబట్టే ఇంతవరకూ నిజంగా ఎవరూ చేయలేదేమో? చట్టపరంగా కూడా ఇది సాధ్యం కాదు. ఒక మనిషి గోప్యతకు భంగం కలిగించటం నేరం. ఒకవేళ నేరం కాకపోతే ఏదో రూపంలో ఇలాంటి షోలు ఇప్పటికే వచ్చేవి. తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అని ఉండేవారు ప్రేక్షకులు. ‘బిగ్ బాస్’ చూడట్లేదా? సెలెబ్రిటీల జీవితాల మీద ఆసక్తి చూపించటం లేదా?

ట్రూమన్‌గా జిమ్ క్యారీ నటించాడు. హాస్యనటుడిగా పేరు గడించిన జిమ్ క్యారీ కోసం ఒక ఏడాది వేచి ఉండి చిత్ర్రీకరణ మొదలుపెట్టాడు దర్శకుడు పీటర్ వియర్. ఆ నమ్మకానికి న్యాయం చేశాడు జిమ్. క్రిస్టాఫ్‌గా నటించిన ఎడ్ హ్యారిస్‌కి ఉత్తమ సహాయనటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఆస్కార్లలో ఆండ్రూ నికోల్‌కి ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేషన్, పీటర్ వియర్‌కి ఉత్తమ దర్శకత్వం నామినేషన్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

షోలలోనే కాక వార్తల ద్వారా కూడా ప్రేక్షకులని ఆకర్షించే పద్ధతి పెరుగుతోంది. ‘ఎక్స్‌క్లూసివ్’ అని చెప్పి అందరికంటే ముందు సంచలన వార్తలను చూపిస్తే టీఆర్పీలు పెరుగుతాయని చానళ్ళు పోటీ పడటం చూస్తూనే ఉన్నాం. ఈ పద్ధతి వెర్రి తలలు వేస్తే (ఇప్పటికే వేసిందేమో!) వార్తల కోసం పెడదారులు తొక్కటం కూడా జరుతుంది. అది ఎంత దారుణంగా ఉంటుందో చూపించిన సినిమా ‘నైట్‌క్రాలర్’ (2014). ‘నిశాచరుడు’ అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం డ్యానీ గిల్రాయ్. దర్శకుడిగా ఇదే అతని తొలి చిత్రం.

లూయిస్ ఉద్యోగం దొరకక చిల్లర దొంగతనాలు చేస్తూ లాస్ ఏంజిల్స్‌లో జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక కారు ప్రమాదం జరిగిన చోట ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే చూస్తాడు. అతనితో మాట్లాడితే ఆ వీడియోలను వార్తా చానల్‌కి అమ్ముతాడని తెలుస్తుంది. ఇలాంటి పని చేసే వారిని స్ట్రింగర్స్ అంటారు. దాంతో లూయిస్ తాను కూడా ప్రమాదాలు, నేరాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళి వీడియోలు తీయటం మొదలుపెడతాడు. దీని కోసం పోలీసు వాళ్ళు వాడే పోలీస్ రేడియో కొంటాడు. పోలీసు వాళ్ళు నేరాల గురించి ఒకరికి ఒకరు ఇచ్చుకునే సమాచారం ఆ రేడియోలో తెలుస్తుంది. వీడియోలు తీసి ఒక టీవీ చానల్లో పనిచేసే నీనా అనే వార్తల డైరెక్టర్‌కి అమ్ముతాడు. నీనాకి సంచలన వార్తలు కావాలి. రాత్రి జరిగిన నేరాలు పొద్దున్నే 6 గంటల వార్తల్లో చూపించాలని తహతహలాడుతుంది. లూయిస్ పోలీసుల కంటే ముందుగా నేరం జరిగిన చోటికి చేరుకుని వీడియోలు తీయటం మొదలుపెడతాడు. చిత్రీకరణకి అనువుగా మృతదేహాలను కదపటానికి కూడా వెనకాడడు. వీడు సామాన్యుడు కాదు అని అర్థమౌతుంది నీనాకి. లూయిస్ తనకి పోటీగా ఉన్న ఒక స్ట్రింగర్‌కి చెందిన వ్యాన్‌కి బ్రేకులు పాడుచేయటంతో అతనికి ప్రమాదం జరుగుతుంది. లూయిస్ ఆ వీడియో కూడా తీస్తాడు. “తన దాక వస్తే కానీ తెలియదు” అన్నట్టు ఉంటుంది ఆ స్ట్రింగర్ పరిస్థితి. లూయిస్ ఎంత కర్కశుడో మనకు అర్థమౌతుంది.

నా అనే వారు లేని రిక్ అనే యువకుణ్ని తనకు సహాయంగా నియమించుకుంటాడు లూయిస్. అతను కొంత నీతిమంతుడు. కానీ డబ్బు ఆశ చూపించి అతనితో పని చేయించుకుంటాడు లూయిస్. ఒక రాత్రి ఒక సంపన్నుల ఇంట్లో హత్యలు జరిగాయని తెలుస్తుంది. దాడి మొదలైన సమయంలో ఇంట్లో ఉన్నవారిలో ఒకరు ఎమెర్జెన్సీ కాల్ (ఇండియాలో 100 కి చేసినట్టు) చేయటంతో ఆ సమాచారం పోలీస్ రేడియోలో తెలుస్తుంది. లూయిస్ పోలీసుల కంటే ముందు అక్కడికి చేరుకుని చనిపోయిన ముగ్గురు మనుషులను వీడియో తీస్తాడు. హత్య చేసిన వారు పారిపోతుంటే వారిని, వారి కారుని వీడియో తీస్తాడు. అయితే కేవలం చనిపోయిన వారి వీడియోని మాత్రమే నీనాకి పెద్ద మొత్తానికి అమ్ముతాడు. నేరస్థుల వీడియో తన వద్దే ఉంచుకుంటాడు. పోలీసులు లూయిస్‌ని విచారిస్తే సాయం చేయటానికే ఆ ఇంట్లోకి వెళ్ళానని చెబుతాడు. నేరస్థుల కారు నంబరు ఆధారంగా వారిని కనుగొని, పోలీసులకి సమాచారమిచ్చి, వారు అరెస్టు చేస్తుంటే వీడియో తీయాలని అతని పథకం. రిక్‌తో కలిసి బయలుదేరుతాడు. అతని పథకం తెలిసి రిక్ పోలీసులకి చెప్పేసి మన దారిన మనం పోదామంటాడు. లూయిస్ ఒప్పుకోడు. పోలీసులకి మొత్తం చెప్పేస్తానని బెదిరిస్తాడు రిక్. పోలీసులిచ్చే బహుమానంలో సగం కావాలని అడుగుతాడు. గత్యంతరం లేక లూయిస్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.

నిశాచరుడంటే రాక్షసుడు అనే అర్థం ఉంది. అయితే లూయిస్ పూర్తిగా రాక్షసుడు కాదు. రాత్రివేళ పనిచేస్తాడనే అర్థమే ఇక్కడ వర్తిస్తుంది. చిన్న చిన్న నేరాలు చేస్తాడు. డబ్బు కోసం చట్టాలను కాస్త అతిక్రమిస్తాడు. అబద్ధాలాడి తప్పించుకుంటాడు. అసలు రాక్షసులు ఎప్పటికైనా బయటపడతారు. లూయిస్ లాంటి వాళ్ళు తేలికగా దొరకరు. నీనా కూడా తక్కువేం కాదు. హత్యల వీడియో ప్రసారం చేసేటపుడు మృతుల ముఖాలని స్పష్టంగా చూపించకుండా, ఏ చట్టాలను అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ప్రసారం మాత్రం ఆపదు. హత్య జరిగిన చోట డ్రగ్స్ దొరికాయని తెలిసినా ఆ విషయం వార్తల్లో చూపించదు. ఇలాంటి నేరం మీ ఇంట్లో కూడా జరగవచ్చు అని జనాన్ని భయపెట్టడమే ఆమె ముఖ్య ఉద్దేశ్యం. రిక్ కాస్త నయం. అయితే లోకం తీరు ఇంతే అనే దశకు చేరుకుంటాడు. లూయిస్‌ని వదిలి పోవచ్చు, కానీ వెళ్ళడు. నెమ్మదిగా అవినీతికి అలవాటుపడతాడు.

సంచలనమైన వార్తలు చూడాలనే ప్రేక్షకుల కోరిక, తద్వారా వార్తా చానళ్ళలకు వచ్చే రేటింగ్స్ వల్ల లూయిస్ లాంటివాళ్ళు పుట్టుకొస్తారు. వారు తమ ప్రయోజనాల కోసమే పని చేస్తారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకం. సంచలనాలు చూపించటమే కాక సంచలనాలు సృష్టించే దాకా దిగజారుతారు. లూయిస్ తెలివైనవాడు కావటంతో పోలీసులకు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటాడు. ఇలాంటి వారినే ‘సోషియోపాత్స్’ అంటారు. వీరికి మనస్సాక్షి ఉండదు. ఇతరుల మనోభావాలు, వేదన వారికి అనవసరం. వీరిని దూరం పెట్టాలి కానీ పెంచి పోషించకూడదు. లూయిస్‌ని ప్రోత్సహించేది నీనా అని అనిపించినా పరోక్షంగా పెంచి పోషించేది ప్రేక్షకులే.

లూయిస్‌గా జేక్ జిలెన్హాల్, నీనాగా రెనే రుసో, రిక్‌గా రిజ్ అహ్మద్ నటించారు. సామాన్యుడిలా కనిపించినా నేరం జరిగిన చోట కరడుగట్టినట్టుండే పాత్రలో జేక్ అద్భుతంగా నటించాడు. అతని కళ్ళు గాజు కళ్ళలా ఏ భావమూ కనిపించకుండా ఉంటాయి. ఇలాంటి మనిషి మనకెప్పుడూ ఎదురుపడకూడదు అనిపిస్తుంది అతన్ని చూస్తే. చిత్రం చివర్లో ఊపిరి బిగబట్టి చూసేంత ఉత్కంఠ ఉంటుంది. డ్యానీ గిల్రాయ్ కి ఈ చిత్రానికి గాను ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Exit mobile version