[dropcap]నీ[/dropcap] చెంపలపై చేరిన కెంపులు
నా గుండె గూటికి సంకెళ్లేస్తున్నాయే..
నా పాదాలని కదలనీక నీ ఎదరే నిలబెడుతున్నాయే!
నీ చిరునవ్వుల గమకాల సందళ్లు
నా యద వీణల్ని సుతారంగా తాకుతూ
నిరంతరం నీ తలపుల్లో ఊరేగేలా చేస్తున్నాయే!
నీ ముద్దు ముద్దు మాటలు ఆలకిస్తుంటే
నా మది పొందే ఆనందం అనంత పారవశ్యం
నీ సమ్మోహనాల పిలుపుల మహత్యాలు
నా జన్మంతా నీకై తపించే తన్మయాల తహతహలే చెలీ!
నీ చల్లని చూపుల హాయిదనాల సోయగాలు
నా చైతన్యాల స్ఫూర్తిదనాలు..
నీ ప్రేమల సౌందర్యాల సౌభాగ్యాలే
నాకు సిరుల వరాల సంబరాల జాతరలే సఖీ!
నా ఊపిరి రాగానికి ఆలంబన..
నా నడకల బాటలకి ప్రేరణ..
నా జీవన పథానికి మార్గనిర్దేశనం..
నా రేపటి జయ కేతనాలకి సంకేతం..
నా సమస్తం నువ్వే నేస్తం!