[శ్రీమతి మాలా కుమార్ గారి ‘నీ జతగా నేనుండాలి!’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]శ్రీ[/dropcap]మతి మాలా కుమార్ ‘ఏమండీగారు’ పాత్ర ద్వారా ప్రసిద్ధులు. తన రచననలను ఫేస్‍బుక్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా పాఠకులకు చేరుస్తున్నారు. ‘నీ జతగా నేనుండాలి!’ కథాసంపుటిలో 53 కథలున్నాయి. చాలావరకూ చిన్న కథలే. చిన్న కథలలోనే కుటుంబ విలువలూ, సామాజిక విలువలనూ పాత్రల ద్వారా ప్రకటించారు.
~
తోబుట్టువులతో బంధం నిలుపుకోవాలనుకునేందుకు, వారి కుమారుడినో/కుమార్తెనో తన అల్లుడుగానో/కోడలిగానో చేసుకునేవారు గతంలో. మేనత్తకో/మేనమామ భార్యకో కూతురు పుడితే, ‘నీ పెళ్ళాం రా’ అని ఆ పిల్ల బావతో పెద్దవాళ్ళు పదే పదే అనడం జరిగేది. ఒకటి రెండు తరాలలో అదేమంత తప్పుగా అనిపించలేదు. కానీ ఆధునిక తరానికి వచ్చేసరికి పిల్లల ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా తాము వారి జీవితభాగస్వాములను నిర్ణయించకూడదన్న భావన పెరగడం వల్లో/దగ్గరి బంధువుల వివాహాలు అంత ఆరోగ్యప్రదం కావన్న శాస్త్రీయ స్పృహ బలపడడం వల్లో – మేనమామ/మేనత్తల పిల్లల్ని చేసుకునే ధోరణి తగ్గింది. చిన్నతనంలో తన బావే తన భర్త అని పెద్దవాళ్ళు పదేపదే చెప్పడంతో, అదే నిజమని నమ్మిన గౌరి – బావ తనని పెళ్ళి చేసుకోకపోవడంతో షాక్‍కి గురవుతుంది. మరొకరిని భర్తగా ఆహ్వానించలేకపోతుంది. కాలక్రమంలో ప్రకాష్‌తో పెళ్ళవుతుంది. ఆమె సమస్యపై అవగాహన ఉన్న ప్రకాష్, ఆమెకు మంచి స్నేహితుడిగా మారి తరువాత ఆమె ప్రేమను పొందుతాడు ‘నీ జతగా నేనుండాలి!’ కథలో. రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం పొందిన కథ ఇది.
నల్లగా, ముఖం మీద మచ్చలతో పుట్టిన శాంభవి తల్లిదండ్రులు దూరమవడంతో, ప్రేమగా పెంచిన అమ్మమ్మ చనిపోవడంతో, పరాయి పంచన బతకాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అత్త దుర్గమ్మ ఆమెని హేళన చేస్తూ, నిరంతరం సాధిస్తూ వేధిస్తుంది. ఎదురింటి వాళ్ళతో జరిగిన ఓ సంఘటన కారణంగా, శాంభవిని ఇంట్లోంచి బయటకు తోసేస్తుంది. ఓ మంచి మనిషి ఆదరణ దక్కి, శాంభవి తాను ఎంచుకున్న రంగంలో రాణించి, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంది ‘మట్టిలో మాణిక్యం’ కథలో.
కొత్తగా ఇల్లు కట్టుకుని, కొత్తగా లాండ్‌లైన్ కనెక్షన్ పెట్టించుకున్న ఓ అనిత, భాస్కర్‍లకు ఓ చిత్రమైన సమస్య ఎదురువుతుంది. “ప్లీజ్ కెన్ ఐ స్పీక్ విత్ సారికారాజ్?” అంటూ ఓ కాల్ వస్తుంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా ఫోన్ పెట్టేస్తుంది అనిత. కానీ తరువాతి రోజుల్లో వేర్వేరు వ్యక్తులు సారికారాజ్‌తో మాట్లాడవచ్చా? అని ఫోన్ చేయడం, ఆ పేరుగల వాళ్ళెవరూ ఇక్కడ లేరని చెప్పడం – విసిగిపోతారా దంపతులు. మూడు ఫోన్లూ, ఆరు అరుపులుగా రోజులెళ్ళిపోతుంటాయి. ఇంతకీ ఆ సారికారాజ్ ఎవరో ఏమిటో తెలుసుకోవాలంటే ‘దయచేసి సారికారాజ్‌తో మాట్లాడవచ్చా?’ కథ చదవాలి.
యుద్ధాలు జరుగుతున్న సమయంలో సైనికుల జీవితాలెలా ఉంటాయో చాలా కథలు చెప్పాయి. యుద్ధాలు లేని సమయంలో ఎలా ఉంటాయో ‘ధీర’ కథ చెబుతుంది. “అలా చెప్పరు. మనమే అర్థం చేసుకోవాలి. వీళ్ళల్లో ఎంత మంది తిరిగి వస్తారో..” అంటూండగానే గొంతు పట్టుకుపోయింది మిసెస్ గుప్తాకు. ఈ వాక్యం చదివితే సైనికుల/సైనికాధికారుల భార్యల వేదన అర్థమవుతుంది.
వ్యసనమనే ఊబిలో చిక్కుకుని, కూతురు ప్రేమ కన్నా తన వ్యసనం ముఖ్యం కాదని అనుకుని, స్నేహితుడి సాయంతో, భార్యనీ, కూతురుని తిరిగి గెల్చుకున్న శ్రీహర్ష కథ ‘చాందినీ’.
లిఫ్ట్ అంటే భయం ఉన్న అరుంధతికి ఎదురైన సమస్యలని హాస్యంగా చెప్పిన కథ ‘అలమారా లిఫ్ట్’. ఆఖరి వాక్యం హైలెట్ ఈ కథకి.
పెళ్ళి హాలు ముందు నల్ల కళ్ళద్దాలు అమ్మడం ఎప్పుడైనా చూశారా? విన్నారా? లేదా? అయితే ‘చూపులు కలవని శుభవేళ’ కథ చదవండి, కారణం తెలుసుకోండి, నవ్వుకోండి.
‘పెళ్ళంటే ఇరుజీవితాల కలయిక, ఇరు హృదయాల కలయిక. జీవితాంతము ఒకరి కొకరు తోడు, నీడ’ అని అనుకున్న కోడలికి, పెళ్ళంటే “ఇరు జీవితాలే కాదు, ఇరు కుటుంబాల కలయిక కూడా” అని చెప్పి, వివాహబంధం, కుటుంబం విలువని అత్తగారు చెప్పిన కథ ‘మనసు తెలిసిన చందురుడా’.
జీవితంలో ఒక దశలో అంతా శూన్యంగా అనిపిస్తుంది. అందరి మధ్యా ఉంటున్నా, ఒంటరిగా అనిపిస్తుంది. నిస్పృహ ఆవరిస్తుంది. అలాంటి స్థితిలోనే చిక్కుకున్న ఓ తల్లికి ఆమె కూతురు ఇచ్చిన సలహా ఏంటి? ‘మనసు చేసే గారడీ’ నుంచి ఆమె ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే, ‘గుండెకీ గుబులెందుకూ’ కథ చదవాలి.
కళకళలాడుతూ జరగాల్సిన పెళ్ళి వేడుక ఎలా వెలవెలపోయిందో ‘రాజా కీ ఆయేగీ బారాత్’ కథ చెబుతుంది.
‘సారీ, మర్చిపోయా’ కథ వృద్ధాప్యంలో ఎదురయ్యే మతిమరుపు గురించి, దాన్ని దూరం చేసుకోడానికి/తగ్గించుకోడానికి ఏం చేయాలో చెబుతుంది.
పండక్కి అత్తారింటికొచ్చిన కొత్తల్లుడు – మాటిమాటికీ భార్యని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడంలోని రహస్యమేమిటో తెలియాలంటే, ‘అత్తకూ అల్లుని మురిపెం’ కథ చదవాలి.
‘అమ్మమ్మకు విడాకులు తప్పాయ్!!!’ కథ కరోనా కాలపు లాక్‌డౌన్ నేపథ్యంగా సాగుతుంది. ఆ ఉపద్రవం మానవాళికి ఎంతో చేటు చేసినా, బంధాల విలువ తెలిపి మనుషులను దగ్గర చేసింది. “మొన్నటి వరకూ వృద్ధాశ్రమంలా ఈసురోమంటూ ఉన్న ఊరు ఇప్పుడు పిల్లలతో కరోనా పుణ్యమాని కళకళలాడుతోంది” అనుకుంటుంది ఈ కథలోని ప్రధాన పాత్ర.
‘పంచవటి’ ఆర్ద్రమైన కథ. తల్లికి అపురూపమైన కానుకనిచ్చిన పిల్లల కథ.
ఒంటరితనాన్ని జయించడానికి, కష్టసుఖాలలో పాలుపంచుకోవడానికి తోడొకరు ఉండాలి, ఆ తోడు ఒక వ్యక్తి కాకుండా సంఘం అయితే? వీధి అరుగు అవుతుంది, రచ్చబండ అవుతుంది. అదే, ఆధునికత సంతరించుకుని ‘హ్యూమన్ లైబ్రరీ’ అవుతుంది.
అనవసరమైన వాటికి దిగులు పడి, మాటిమాటికి సారీ చెపితే ఆత్మస్థైర్యం కోల్పోతామనీ, మన డిగ్నిటీ మనం నిలుపుకోవాలనీ, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలని ఓ తల్లి కూతురికి చెబుతుంది ‘వడ్లగింజలో బియ్యం గింజ’ కథలో.
చేతికర్ర మీద ఉన్న వృద్ధుని చేతి మీద, ఓ చిన్నారి చేయి ఆసరాగా ఉన్న చిత్రానికి, ఫేస్‌బుక్ లోని ‘మన కథలు – మన భావాలు’ అనే సాహితీ సమూహంలో కథ రాయమని ఇచ్చిన టాపిక్‌కు రాసిన కథ ‘సహచరి’. చక్కని కథ.
కంటోన్‍మెంట్ ప్రాంతంలో ఎన్.టి.ఆర్. గారి ‘దానవీరశూరకర్ణ’ సినిమా షూటింగ్ జరిగినప్పుడు జరిగిన సంఘటనలతో అల్లిన కథ ‘అయినదిపో… మేమేల పోవలె… పోతిమిపో…’.
‘The Mystery of India’s Missing 54 Soldiers’ ఆధారంగా అల్లిన ‘నీకై వేచేను’ కథ మనసుని భారం చేస్తుంది. తెలిసీ తెలియక డ్రగ్స్‌కి అలవాటు పడిన వాళ్ళని తొలినాళ్ళలోనే సరైన మందులిప్పించడం ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా మామూలు మనుషులను చేయవచ్చని చెబుతుంది ‘మాయాజాలం’ కథ.
‘శ్రావణ సమీరం’ కథ సరదాగా ఉన్నా, జీవితం ఎలా ఉన్నా, ఎంత హాయిగా ఉండచ్చో చెబుతుంది.
కాలం ఆగిపోదని, దాని మానాన అది కదులుతూ, దాని ధర్మం అది నిర్వహిస్తూనే ఉంటుందనీ, మనమూ దానితో పాటు కదలాలి, ఒకే చోట ఆగిపోకూడదనీ, కాలమే అన్ని గాయాలను మాన్పుతుందని చెప్పిన చక్కని కథ ‘ఇష్టసఖి’.
ప్రకృతి వర్ణనలతో, అందమైన ఆహ్లాదకరమైన కథ వ్రాయమని ‘పొన్నాడవారి పున్నాగవనం’ ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఇచ్చిన టాస్క్‌కు వ్రాసిన కథ ‘మౌంట్ రష్మోర్‍లో రాధామాధవులు’.
‘ఎంతైనా మన పిల్లలు సినిమా పిల్లల్లా కాదు, మంచి పిల్లలు!’ అని ఇద్దరు స్నేహితురాళ్ళు హాయిగా చెప్పుకుంటారు ‘నొప్పింపక తానొవ్వక’ కథలో. పేపర్‍లో చదివిన ఓ వార్తని కథగా మలిచారు రచయిత్రి.
‘వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండాలి’ అని కొడుకు ఇంటికి పండక్కి వచ్చిన వేణు తన భార్య సీతకి చెబుతాడు ‘పలుకా రాదుటే చిలుకా?’ కథలో. తరాలు మారుతున్నప్పుడు – అభిరుచుల్లోనూ, అవసరాల్లోనూ మార్పులు సహజం. అనివార్యమైన మార్పుని గుర్తించి మసలుకుంటే అభిప్రాయ భేదాలుండవు, మనస్పర్థలూండవని చెప్తుందీ కథ.
అమెరికాలో మంచు తుఫాను వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ‘మంచు తుఫానులో బామ్మా, మనవరాలు!’ కథలో చదవవచ్చు.
‘దరిద్రం వదిలింది’ కథ నేటి సమాజంలోని బాగా ప్రబలిన ఒక జాడ్యాన్ని ప్రస్తావిస్తుంది. తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో టివీ షోలల్లో సలహాలు చెప్పేవారు మూఢనమ్మకాలని పెంచిపోషిస్తున్న వైనాన్ని చెబుతుంది. ఆలోచింపజేస్తుంది.
‘మహామాయ’, ‘ఆమె ఎవరు’ – తన భర్త సైన్యంలో పనిచేస్తున్నప్పుడు జబల్‍పూర్‍లోనూ సిలిగురి లోనూ ఎదురైన అనుభవాలతో అల్లిన కథలు.
‘అత్తగారి బ్లాక్‍మనీ’, ‘మామగారూ – బాంక్ ఎకౌంట్స్’ చక్కని నోస్టాల్జిక్ కథలు. గత తరపు ఆప్యాయతలనీ, ఆనాటి ముందుచూపుని జ్ఞాపకం చేస్తాయి. తరువాతి కథలు ‘అత్తగారి మాట పట్టుచీరల మూట’, ‘కిడ్డీ బ్యాంక్’ – పిల్లలకి పొదుపు నేర్పాల్సిన ఆవశ్యకతని చెబుతాయి.
~
ఈ కథలలోని ఇతివృత్తాలు వర్తమాన సమాజంలోని అంశాలు. కథల్లోని పాత్రలకు సమస్యలూ ఉన్నాయి, పరిష్కారాలూ ఉన్నాయి. ప్రత్యేకించి హాస్య సన్నివేశాలు వ్రాయకపోయినా, సంభాషణలలో హాస్యం పలికించి, నవ్వులు పూయించారు మాలా కుమార్.
ఈ కథలలో కొన్ని చక్కని వాక్యాలున్నాయి. ఉదాహరణ:
“మనిషికి మనిషి కరువైనప్పుడు ప్రకృతిని మించిన సహచరి ఉండదు. ప్రకృతితో సాహచర్యం ఏర్పడినప్పుడు మనిషి తోడు అవసరం ఉండదు.” (‘నీ జతగా నేనుండాలి!)
అలాగే సందర్భానుసారంగా పాత్రలతో ఎన్నో పాటలు పాడించారు రచయిత్రి. వేగంగా చదివించి, హాయిగొల్పే కథలివి.
***
రచన: మాలా కుమార్ (కమల పరచ)
పేజీలు: 375
వెల: ₹ 175
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
~
రచయిత్రి: 9989051913
~
శ్రీమతి మాలా కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-mala-kumar/