[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నీ కలం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]డుస్తున్న బాటలో
ముళ్లుంటాయి
పూలు ఉంటాయి!
జరుగుతున్న జీవితాన్ని
విమర్శించే వాళ్ళుంటారు
ప్రశంసించే వాళ్ళు ఉంటారు!
ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా..
ఎవరు ఎన్ని రకాలుగా అంటున్నా..
నీదైన విధానంలో
నీకు నచ్చిన తీరుగా సాగు నేస్తమా!
ప్రతి పనిలో కష్టనష్టాలు ఉంటాయి..
ప్రతి పనిలో జయాపజయాలు ఉంటాయి!
ఓటమిని భరించు..
అప్పుడే విజయాన్ని అస్వాదించగలుగుతావు!
నమ్మిన వాళ్ళ మనస్సు నెప్పుడు బాధ పెట్టొద్దు..
పరిస్థితులు ఎలాంటివైనా తోడుండే వారి ఆత్మీయతను..
హితవచనాలను మరచిపోక ముందుకు అడుగెయ్!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు!
గేలి చేసిన వాళ్ళే మెచ్చుకునే రోజు వస్తుంది..
అక్షరాలే శ్వాసగా.. నేస్తాలై ప్రాణంగా..
ఆత్మవిశ్వాసాన్ని వెంటబెట్టుకుని ధీమాగా కదులు నేస్తం..
పదికాలాలు నిలిచే
ఉత్తమ సాహిత్యాన్ని
అమృతపు జల్లులా కురిపించాలి నీ కలం!