[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘నీడ-నిజం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]ప్పిపోయిన నీడ ఒకటి
విరిగి ముక్కలై, గాయపడినా
అభిమానాల చిక్కు ముడిలో ఇరుక్కుపోయి
నిస్సహాయంగా చూస్తోంది.
పెనుమంటై ప్రజ్వరిల్లే హృదయంలో
గడ్డకట్టిన శీతాకాలపు స్వప్నమై
మబ్బులు మింగేసిన వెలుగు రేఖల్లోనూ
శరద్ జ్యోత్స్నా మిలమిలల్లోనూ కొట్టుకుపోతూనే ఉంది.
సీతాకోక చిలుకల రెక్కలమీదెక్కి తుళ్ళిపడుతూ
గాలి జూలును సుతారంగా నిమురుతూ
సప్తవర్ణ సముదాయపు నావనెక్కి ఊరేగే
విస్మయానంద ఝరిలో ఓలలాడుతోంది.
ఊహ చిటికెన వేలట్టుకు
అయోమయ జగత్తునూ
అసీమిత గతానికీ నీళ్ళొదిలి
అనాస్వాదిత వనసీమల్లోకి
రాయంచై కదిలిపోతుంది.
వేడి వేడిగా చూపులను విసిరే
వేసవి ఉదయం
కళ్ళల్లో సూదులను గుచ్చి
మంచు పూరెక్కల్లో మైమరచిన
ఆమె దేహాన్ని కరిగించి
మునిగి తేలుతుంటే
మైమరుపు ముక్కలై చెల్లాచెదరైన పాదరసంలా
జారిపోతూ వాస్తవాన్ని నిలబెట్టి కడిగిపారేస్తుంది