Site icon Sanchika

నీడ తొక్కిన ఆట!

[dropcap]మ[/dropcap]హి:

“ఆకేసీ పీటేసి

పప్పెట్టీ బువ్వెట్టీ

చారేసీ పెరుగేసీ

అత్తారింటికి దారేదంటే

కిత కిత కిత…”

పక్క గదిలోంచి పాప ముద్దుముద్దు మాటలు వినిపిస్తుంటే, చేస్తున్న పని ఆపి లాప్టాప్ మూసి పరిగెత్తాను.

నిన్న సాయంత్రం నేర్పించిన పాటని మనవరాలు తిరిగి పాడుతుంటే మురిసిపోతూ చూస్తోంది అమ్మ. బయట వరండాలో కూర్చున్న నాన్నగారు కూడా వచ్చి నవ్వుతూ వింటున్నారు. ఒక పెద్ద బార్బీని వొళ్లో పెట్టుకుని అన్నం పెడుతున్నట్లు ఆడుతూ, పాడుతోంది పాప. తనని ఆటలో మాయపుచ్చి పెరుగన్నం తినిపిస్తోంది అమ్మ. అమెరికా నుంచి నిన్న సాయంత్రమే వచ్చాం. జెట్లాగ్ వదలకుండానే పని పట్టుకుంది నన్ను. అలసటతో సతమతమవుతున్నా, పాపని అమ్మ చూసుకోవడంతో చాలా రిలీఫ్‌గా ఉంది.

గదిలో మూలగా గుండ్రటి టేబుల్. దాని మీద సైజుల వారీగా పేర్చి ఉన్నాయి నా చిన్నప్పటి బార్బీలు, టెడ్డీలూ. ఎన్ని జ్ఞాపకాలు ఈ గదితో నాకు. 25 సంవత్సరాల తర్వాత ఈ ఊరు వచ్చాను. నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం, అంతకు ముందే నేను ఇక్కడ చదవనని హైదరాబాద్‌కి వెళ్ళి పెదనాన్న గారింట్లో ఉండడం, ఆ తర్వాత అమెరికా, ఉద్యోగం, కెరీర్. అమ్మ పోరగా పోరగా ముప్పై సంవత్సరాలొచ్చాక పెళ్ళి చేసుకున్నా. పాప ఇంకో ఐదేళ్ళ తర్వాత వచ్చింది మా జీవితం లోకి. మధ్య మధ్యలో ఇండియా వచ్చినా, ఆ సమయంలో నాన్నగారు వాళ్ళు ఈ ఊర్లో లేరు. ఒక వేళ ఉండివున్నా మళ్ళీ ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉండే ధైర్యం ఉందా నాకు!

ఎవరన్నారు జ్ఞాపకాలు మధురమని? అవి గుర్తొచ్చినప్పుడల్లా ఆనందం దొరుకుతుందనీ?

నా జ్ఞాపకాలు అలా కాదు. తరచి చూసుకున్నప్పుడల్లా దుఃఖం ముంచుకొచ్చే జ్ఞాపకాలు. చిన్నప్పటి ప్రాణ స్నేహితురాల్ని కళ్ళ ముందు పెట్టే జ్ఞాపకాలు.

ఎక్కడ బార్బీని చూసినా గౌరి గుర్తొస్తుంది. మా లంగాలు కుట్టే లక్ష్మక్క దగ్గరకి వెళ్ళి, మిగిలిపోయిన ముక్కలు తెచ్చి బార్బీకి గౌన్ కుట్టే గౌరి. అలాంటి బొమ్మ కావాలని వాళ్ళమ్మని పీడించుకు తిన్న గౌరి. అంతేనా.. ?! అంతవరకే అయితే గతం గుర్తుకురావడం బరువెందుకవుతుంది.

బొమ్మలా ఉన్న తన కూతుర్ని ముద్దు పెట్టుకుంటున్న గౌరి ముఖం. దానితోబాటు, “ఎంచక్కా ఆడుకో గౌరమ్మా! నీ కూతురు నీ బార్బీ బొమ్మలా లేదేటి. పద్నాలుగేళ్ళు ఏమంత తేడా అని…” మరియత్త తల నిమురుతూ చెప్తుంటే గౌరి కనుకొలకుల్లోంచి జారిన కన్నీటి బొట్టు.

బహుశా అప్పుడే.. ఆ కన్నీట్టి బొట్టులోంచే మా స్నేహం కూడా జారిపోయింది. “ఇంక నువ్వొద్దు” అన్న భావం గౌరి కళ్లలో. అదే చివరిసారి గౌరిని చూడ్డం. సరిగ్గా పాతికేళ్ళు అయింది.

ఇంతకీ మొదటి సారి గౌరిని ఎప్పుడు చూశానూ?

* * *

పన్నెండేళ్లపాటు అక్కడక్కడా పని చేసి, స్వంత ఊరికి ట్రాన్ఫర్ మీద వచ్చారు నాన్న. వస్తూనే పాత ఇల్లు పడగొట్టించి విశాలంగా ఇల్లు కట్టించి మమ్మల్ని తీసుకు వచ్చేశారు.

నా చిన్నప్పుడు మా ఇంట్లో పని చేసే పోలమ్మ మేనకోడలు గౌరి. గౌరి వాళ్ళ నాన్న మా నాన్నగారి ఆఫీసులో డ్రైవర్‌గా చేసేవాడు. మా కాలనీలోనే రెండు సందుల వెనక చిన్న ఇంట్లో వుండేది వాళ్ళ కుటుంబం. తను కూడా మా క్లాసే అవడంవల్లా, నాన్నకి కూడా గౌరి అంటే చాలా వాత్సల్యం ఉండడం వల్లా నాతో పాటు గౌరి కూడా మా ఇంట్లో ట్యూషన్‌కి వచ్చేది. అలా రావడం నానమ్మకి అంతగా యిష్టం వుండేది కాదు. ట్యూషను, స్కూలు అనే కాదు, గౌరి ఎప్పుడూ నాతో పాటే ఉండేది. పాఠాలు బుర్రకెక్కేవి కాదు గానీ ఆటలు, పాటలంటే మహాపిచ్చి దానికి. పడి చచ్చిపోయేది. సిమెంటు రేకుని గుండ్రంగా అరగదీసి తొక్కుడు బిళ్ళ ఆడడం, నీళ్లతో హద్దులు గీసి చిర్రి ఆట ఆడడం దాని దగ్గరే నేర్చుకున్నా. గుజ్జనగూళ్ళూ గూటీ బిళ్ళా అన్న తేడా ఉండేది కాదు. వెన్నెల రాత్రుల్లో దాని ఎగిరిపాటు చెప్పడానికి లేదు. నీడ తొక్కనీకుండా పిల్లలంతా దాక్కొనే ఆట ప్రతీ పౌర్ణమికీ స్పెషల్. నా నీడ తొక్కి అవుట్ చేసే వాళ్ళింకా పుట్టలేదు అనేది.

ఉన్న ఆటలు చాలవన్నట్లు కొత్తవి కాయించుకొచ్చేది. తనే కొత్త కొత్త రూల్స్ పెట్టేది. కబుర్ల పుట్ట. మధ్య మధ్యలో “నోరిప్పవేంటే బాబూ..” అని ఆగి, నేనేమీ చెప్పకముందే, గుక్క తిప్పుకోకుండా మళ్ళీ మొదలెట్టేది. అంత వాగుడు కాయా అంత హుషారు పిల్లా కూడా నా గదిలోకి వచ్చి, ఆ గుండ్రపాటి టేబుల్‌నీ, దాని మీద వరసలుగా పేర్చి ఉన్న నా బొమ్మల సంపదనీ చూడగానే మెత్తగా అయిపోయేది. అందులో పొడుగ్గా ఉన్న బార్బీని ఒక్క సారి పట్టుకునీ పట్టుకోనట్టు అంటుకుని వదిలేసేది. నిరాశ కాబోలు. అప్పటి వయసుకి నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు అనిపిస్తోంది.

* * *

కన్నీళ్ళతో, జ్ఞాపకాల తెరలు కమ్మిన ముఖాన్ని చూస్తోంది అమ్మ. కళ్ళలో నీళ్ళ సుడులు తిరుగుతుంటే చప్పున లేచొచ్చి దగ్గరకి తీసుకుంది. చెంపల మీదకి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నా, “గౌరిని ఎలా అయినా కలవాలి”

“మరియత్తని కనుక్కుందాంలే” అనునయిస్తూ అంది అమ్మ.

గౌరిని చివరి సారి చూసిన రోజు!

అది హాస్పిటల్‌లో ఉందని ముందు రోజే పుష్ప చెప్పింది. నానమ్మకి తెలిస్తే చంపేస్తుందని తెలుసు. అసలే పరీక్షలు దగ్గర్లోకొచ్చాయి కూడానూ. ఎవరో చనిపోయారని ముందు రోజే నానమ్మ ఊరెళ్ళింది అదృష్టం కొద్దీ. పొద్దున్నే ఏమీ తినకుండానే హాస్పిటల్‌కి పరిగెత్తా. మరియత్త నర్సుగా పని చేసే హాస్పిటలే.

రూమ్ బయట నుంచుని లోపలికి తొంగి చూసిన నా గుండె జారిపోయింది. ఆరేడు నెలల క్రితం బాత్రూం తలుపు వేసుకుని బావురుమంటూ ఏడుస్తున్న గౌరిని చూసి బెదురుగా ఇంటికి వచ్చేసాక, మళ్ళీ యిదిగో యిప్పుడు హాస్పిటల్ లోనే చూడడం. నొప్పి తెరలుతెరలుగా వస్తున్నట్లుంది. అల్లాడిపోతోంది గౌరి. పళ్ళ బిగువున ఆపుకొని ఉన్నట్లుండి “అమ్మా” అని కేకలేస్తోంది. లోపలికి వెళదామనే వుంది. కానీ నా కాళ్ళు నేలకి అతుక్కుపోయి అడుగు ముందుకి పడట్లేదు. దూరంగా గౌరి తల్లి తవిటమ్మ మరియత్తతో మాట్లాడుతోంది. మరియత్త గౌరికీ నాకే కాదు, ఊర్లో అందరికీ అత్తే. దుప్పటి బిగించి పట్టుకున్న గౌరి కాస్త స్థిమితపడినట్లు ఆగి, చెయ్యెత్తి వాళ్ళిద్దరికీ సైగ చేస్తోంది.

మరియత్త నవ్వుతూ దగ్గరికొచ్చి, గౌరి కడుపు మీద నెమ్మదిగా రాస్తూ “కాస్త ముక్కాలి గౌరమ్మా” అంటోంది.

గౌరి మంచానికి ఆనుకుని ఒక స్టాండు. సెలైన్ బాటిల్ పెట్టి ఉంది దానికి. ఒక్కో చుక్కా కిందకి పడినప్పుడల్లా గౌరిని వొక నొప్పితెర కుదుపుతున్నట్లు అనిపిస్తోంది చూసేవాళ్లకి. సెలైన్ అయిపోడానికి యింకా ఎంత టైముందో మధ్యమధ్యలో చూస్తోంది మరియత్త. ఇదంతా అలవాటే అన్నట్లు మామూలుగా ఉంది ఆమె ముఖం. మొహంలో దయ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గౌరి వంటి మీద ఉన్న దుప్పటి కొంచం ఎత్తి చూసింది.

పొట్ట మీద రాస్తూ తవిటమ్మ వేపు చూసి, “పొట్ట మెత్తబడుతోంది తవిటమ్మా.. కాసేపు, అంతే” అంది. పక్కకి తిరిగి మొహం అంతా నవ్వు చేసుకుని, “అయిపోయినట్టే. బంగారు తల్లివి నువ్వు. మీ అమ్మ అయితే ఈ సరికి హాస్పిటల్ మొత్తం ముంచేసింది ఏడుపుతో” అంది.

పరాచికాలాడుతూ వాతావరణం తేలిక చేయాలని చూస్తోంది మరియత్త. కానీ ఎవరిమొహం చూసినా భయమే కనిపిస్తోంది. తలుపు దగ్గర నుంచున్న నన్ను అప్పటి దాకా ఎవరూ చూడ లేదు. అప్పుడే వత్తిగిలి పక్కకి జరిగిన గౌరి నన్ను చూసి కళ్ళు పెద్దవి చేసింది. ఆశ్చర్యమా కోపమా తెలీదు. గౌరి నన్ను చూశాక, అప్పుడు లోపలికి వెళ్దామనుకున్న నేను తన కళ్లలో భావం అర్థం కాక ఆగిపోయా. “తవిటమ్మా.. పెద్ద డాక్టరుతో మాట్లాడాను. నాకు బాగా దగ్గరోళ్ళని చెప్పాను. అయినా నాలుగేలన్నా అయ్యేట్టుంది” బెదురు కళ్ళతో చూస్తున్న గౌరి వాళ్ళమ్మకి చెప్పింది మరియత్త.

తవిటమ్మకి ఇవ్వమని చాటుగా అమ్మ ఇచ్చిన డబ్బులు నా గుప్పెట్లో ఉన్నాయి. కానీ ఎలా లోపలికి వెళ్ళడం? గౌరి కళ్ళల్లో నిరసన నన్ను కదలనివ్వట్లేదు. ఇంతలో గౌరి కేకలు ఎక్కువయ్యాయి. ఆగలేక లోపలికి పరిగెత్తా నేను. గౌరి పక్కన కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్నాను నాకు తెలీకుండానే. ఆరు నెలల క్రితం గౌరికీ, ఆ రోజు గౌరికీ ఎంత తేడా. మొహం ఉబ్బి, కాళ్ళకి నీరు పట్టి, ఇంత పొట్టతో భయంకరంగా ఉంది. గౌరిని వేరే గదిలోకి తీసుకెళ్తున్నారు. దార్లో గుళ్ళో తెచ్చిన విభూది పెద్దగా ఏడుస్తూ దాని మొహాన రాసి, మా అమ్మ పంపిన డబ్బు గౌరి వాళ్లమ్మకి ఇచ్చి దూరంగా గోడకి అతుక్కుని, ముడుచుకుని కూర్చున్నా.

‘కాకెంగిళ్ళెందుకే నీతో..’ అని నేను తినే జాంకాయలు లాక్కొని కొరుక్కుతిన్న నా నేస్తురాలు.. నాన్నమ్మ చూడకుండా మా వంట గదిలోకి చేరి గట్టు మీద కూర్చుని నాతో పోటీ పడి అమ్మ దగ్గర గారాలు పోయిన నా చిట్టి స్నేహితురాలు.. ‘ఇది వానపల్లి పళ్ళాలమ్మ కుంకం, ఇది మదీనా సాయిబు బాబా దర్గా భస్మం…’ అంటూ ఏవేవో పాముతూ నాలో బెరుకునీ, పిరికి తనాన్ని పోగొట్టాలని చూసిన నా ఆరిందాల తల్లి, నా బంగారు స్నేహం గౌరి యిప్పుడు చావుకీ ఆయువుకీ మధ్య కొట్టుకుంటోంది. బావురుమన్నాను.

చాలా సేపటి తర్వాత మరియత్త బయటకి వచ్చింది. పొత్తిళ్ళలో చిన్న పాపతో. చాలా సేపు యాతన పడిందట గౌరి. నెమ్మదిగా మరియత్త దగ్గరకి వెళ్ళి పాపని వేళ్ళ చివర్లతో భయంగా ముట్టుకున్నా. మెత్తగా నా పెద్ద బార్బీలా, ముద్దుగా ఉంది పాప. ఇంతలో గౌరిని తీసుకొచ్చి పడుకోపెట్టి పాపని పక్కలో వేసింది వాళ్ళమ్మ. కూతుర్ని ముద్దు పెట్టుకుంటున్న గౌరి కంటి చివరనుండీ జారిన నీటి చుక్క, గౌరి నా వేపు చూసిన చూపు, నేను బయటకి వస్తుంటే ఎదురు వచ్చిన అతను, నేను కాస్త దూరం వెళ్లానో లేదో ” ఛీ.. ఆడపిల్లా” అంటూ అతని అరుపు….. అదే చివరిసారి గౌరిని చూడడం. అయినా ఇప్పటికీ ఆ రోజుని మర్చిపోలేను.

కొన్ని నచ్చని సంఘటనలు జరిగినప్పుడు అవి మనల్ని ఎలా మార్చబోతున్నాయో మనకి తెలీదు. పెద్దవుతున్న కొద్దీ, ఆలోచనలూ, అనుభవాలూ విస్తృతమవుతున్న కొద్దీ గాయం లోతు మరింత పెరుగుతుంది. గౌరికి జరిగింది ఎంత పెద్ద అన్యాయమో చదువు కోసం బయట ప్రపంచంలోకి వచ్చాక తెలిసింది నాకు. యూనివర్సిటీ టాపర్‌ని అయినప్పుడూ, ఉద్యోగం సాధించుకున్నప్పుడూ, రాఘవతో నా పెళ్ళి అయినప్పుడూ, పాప పుట్టినప్పుడూ.. నా జీవితంలో ప్రతీ ఆనంద ఘడియలోనూ నా నేస్తం కోల్పోయిన జీవితం నా కళ్ల ముందుకి వచ్చేది. వాన ముసురుల్లో, చీకటి దారుల్లో ఎక్కడికెళ్ళినా బావురుమంటున్న నా బేల గౌరీ గుర్తొచ్చేది.

* * *

గౌరి:

మరియత్తతో ఫోన్ మాట్లాడాక మనసు మనసులో లేదు. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మహీ గురించి వినడం. పాతిక సంవత్సరాలు! చెప్తున్న క్లాస్ మీద ధ్యాస లేదు. పిల్లల్ని గ్రౌండ్‌కి వెళ్ళి ఆడుకోమని చెప్పి స్టాఫ్ రూంకి వచ్చేశా. మహీ ఇండియా వచ్చిందట అని కృష్ణకి మేసేజ్ చేసి, ఫోన్ సైలెంట్‌లో పెట్టి కూర్చున్నా. దూరంగా పన్నెండు, పదమూడేళ్ల పిల్లలు చెట్ల కింద చేరి, కబుర్లు చెప్పుకుంటున్నారు. నేనూ, మహీ కనిపిస్తున్నాం నాకు వాళ్లలో.

మొదటి సారి మహీని ఎప్పుడు చూసాను!

“సుబ్బమ్మ గారి అబ్బాయిని ఈ ఊరుకి మార్చారంట. ఇల్లు సౌకర్యంగా కట్టుకుంటున్నారు”, నాన్న ఎవరికో చెప్తుంటే విన్నా. మా కాలనీలో రెండు సందుల అవతల వాళ్ళిల్లు. అంతకు ముందున్న పాత పెంకుటిల్లు పడేసి కొత్త బంగ్లా కట్టారు. లారీలోంచీ సామాన్లు దించుతున్నప్పుడు అటుగా వెళ్లాన్నేను. మిడీ వేసుకుని పొందిగ్గా ఓ పక్కన కూర్చొనుంది వొక అమ్మాయి. నా వయసే వుంటుందేమో. అటూ ఇటూ తిరక్కుండా, పెద్దోళ్ళ చేత నాలుగు తిట్లు తిట్టించుకోకుండా అలా కుదురుగా ఎలా ఉంటారో పిల్లలు. ఆ యింటాయన ఆఫీసులోనే మా నాన్న డ్రైవర్. వినయంగా సామాన్లు దించుతూ సర్దుతున్నాడు. ఆఫీసరుగారు బయటకి వచ్చినప్పుడల్లా ఇంకా వంగిపోతున్నాడు. పచ్చి తాగుబోతు అయిన మా నాన్న, క్షణం తీరికా దమ్మిడీ ఆదాయం లేనట్లు ఉండే మా నాన్నని అలా చూడడం కొత్త నాకు. తాగలేదు కాబట్టి కావొచ్చు, భయంతో అయినా మొహం కాస్త తేటగా ఉంది. మా పోలమ్మత్తని కూడా అక్కడ పనికి కుదిర్చేసినట్లున్నాడు మా నాన్న. తను కూడా అప్పుడే చొరవగా సామానందుకుని సర్దుతోంది.

మర్నాడునుండే స్కూళ్ళు మొదలు. ఎనిమిదో తరగతికి మొదటిరోజు. హిప్పీ క్రాఫ్, వీ కట్ షర్ట్, కుచ్చుల స్కర్ట్‌తో వచ్చిన కొత్తమ్మాయిని చూసి అందరూ నోళ్ళు తెరుచుకుని చూస్తుండగానే, నా పక్కన కూర్చున్న మరియత్త కూతురు పుష్పకి చెప్పా గర్వంగా “మా ఈఈ గారమ్మాయి”.

అందరూ ఆ అమ్మాయివంక బెరుగ్గా చూస్తుంటే నేను మాత్రం దగ్గరకి వెళ్ళి పలకరించా.

అప్పటికే టీసీ సబ్మిట్ చేసి వచ్చిన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి “మా నాన్న పేరు రాములు” అని చెప్పా. “వెరీ గుడ్. ఇద్దరూ ఒక చోట కూర్చోండి” అని వెళిపోయారాయన. “రా… లోపలికెళ్దాం,” ఆరిందలా మహీ చేయి పట్టుకుని గర్వంగా క్లాసులోపలికెళ్ళా. అంత పెద్ద ఆఫీసరు, నిన్న మా నాన్న అలా వంగిపోవడానికి కారణమైన ఆఫీసరు ఈ రోజు వాళ్ళమ్మాయిని నా చేతుల్లో పెట్టేటప్పటికి నా గొప్ప అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు ఇంకో అడుగు పొడుగయినట్లనిపించింది. నన్ను చదివించడం మా నాన్నకీ ఇష్టం లేదు. చదవాలని నాకూ అంత బలంగా ఏమీ లేదు. కానీ, నేను స్కూలుకీ రావడమూ, ఆ ఊర్లో పెద్దోళ్ళు చదివే కిరస్తానీ స్కూల్లో కాకుండా మహీని మా స్కూల్లో చేరడమూ.. మొదటిసారి ఆ స్కూల్ భలే ఉందనిపించింది నాకు.

ఈఈ గారి అమ్మాయి నుంచి చిన్నగా మహీకీ, ఏమేకీ, ఒసే తింగరీ అని పిలవడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు. నేను మహీ వాళ్ళింటికి వెళ్ళడం వాళ్ల నానమ్మకి ఇష్టం ఉండేది కాదు. అదీ కాక ఎప్పుడూ తాగి, అమ్మని కొట్టి నానా అల్లరి చేసే నాన్న కబుర్లు మా పోలమ్మత్త నుంచి ఆ ఇంటికి వెళ్ళేవి. నాన్న యాగీ చూసీ, వినీ నాన్నమ్మకి మేం అంటే ఒక యేవగింపుగా ఉండేది. కానీ మహీ నాన్న గారికి ఇవేం పట్టేవి కాదు. మహీ అమ్మ మాత్రం అటు అత్తయ్యకి చెప్పలేక, ఇటు భర్తకి చెప్పలేక నా ఉనికి ఇష్టం అయీ కానట్టు ఉండేది.

పూవులా ఉండే మహీ, మెత్తగా మాట్లాడుకునే దాని అమ్మా నాన్న, పట్టుజరీ చీరెల్లో ఎప్పుడూ హాల్‌లో కూర్చుని కుడి చేతిలో మాల లెక్కపెట్టుకుంటూనో, దూదితో వత్తులు చేసుకుంటూనో ఉండే వాళ్ళ నాన్నమ్మ.. అదో కొత్త ప్రపంచం. మా ఇంట్లో ఊహించడానికి కూడా ఎప్పుడూ ఇలాంటి వాతావరణం ఉండదు. వాళ్ల నాన్నగారి దగ్గర పసిపిల్లలా గారాలు పోతుండేది మహీ. అసలు ఒక్క పెద్ద మాట కానీ, విసుగుతో కూడిన వొక స్వరం కానీ అక్కడ వినిపించేవి కావు.

తమకింద పనిచేసే ఒక డ్రైవర్ కూతుర్లా నన్ను చూసేవారు కాదు. ఎప్పుడన్నా మహీకి బట్టలు తెస్తూ నానమ్మ చూడకుండా నాకూ ఇచ్చేవారు. మొదట్లో మా నాన్నకి భయపడి నేనూ ‘సార్’ అనే దాన్ని. కానీ, ఆ పిలుపు – ‘అంకుల్’ గా చాలా తొందర్లోనే మారిపోయింది. ముఖ్యంగా మహీ బొమ్మలు. అలాంటి బొమ్మలు కావాలని ప్రాణంగా ఉండేది నాకు. జీతం డబ్బులన్నీ తాగుడికి తగలేసి, బియ్యానికి, పప్పుకీ అడిగినా అమ్మని చావ బాదే నాన్న ఉండే ఇంట్లో నాకు బొమ్మలెక్కడ నుంచి వస్తాయి. ఎప్పుడైనా కర్మ కాలి అడిగినా.. పెళ్ళిచేస్తే ఇద్దర్ని కనే దానివి, కాడిలా పెరిగావ్ బొమ్మలు కావాలా.. ఇవే తిట్లు ఎదురయ్యేవి.

మహీ వాళ్ళింట్లో ఉన్నంత సేపూ హయిగా ఉండేది. అంతకుముందు మాదిరిగా మరియత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించేసా. పుష్ప కూడా అప్పుడప్పుడూ దెప్పేది. పుష్పని కూడా మహీవాళ్ల యింటికి రమ్మని పిలిచినా అది ఎందుకో రావడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడో వొకసారి నా బలవంతం మీద వచ్చినా అది కాసేపే. మహీ మాత్రం తనని చాలా ఇష్టపడేది. పుష్ప కన్నా మరియత్తా, యేసు మామయ్యా మహీకి యింకా నచ్చేవారు. నాన్నమ్మకి తెలీకుండా మా ఇంటికి వచ్చేది మహీ. మామూలప్పుడు తను వస్తే, వినయంతో వంగిపోయే నాన్న, తాగినప్పుడు చెలరేగి పోయేవాడు. నేను పెద్దమనిషిని అయిన దగ్గర్నుంచి స్కూల్ మానేయమని ఒకటే గొడవ. బయట రోడ్లమీద, స్కూల్లో ఆకతాయి మొగపిల్లలు ఏడిపించడానికి పెట్టే రకరకాల పేర్లు తనకి ఎలా తెలిసేవో. ఊహించేవాడేమో మరి తెలీదు. అవన్నీ అంటూ యింట్లో నన్ను చావబాదేవాడు. తాగుడు, అనుమానం. నాన్న అంటే నాకు గుర్తొచ్చేవి అవే. ఇక్కడ వన్నీ మోస్తున్నామని నన్నూ, మా పోలమ్మత్తనీ బూతులు తిట్టేవాడు. జీతమంతా నాన్న తాగుడికి అయిపోతుంటే అమ్మ అప్పుడప్పుడూ కూలికి వెళ్ళాల్సి వచ్చేది. ఆ డబ్బులు కూడా లాక్కునేది కాక అమ్మ పనిచేసే చోట వుండే రైతులతో, కూలీలని తీసుకెళ్ళే మేస్త్రీలతో రంకుకట్టి అమ్మని తెగ కొట్టేవాడు. ఎన్ని కష్టాలు పడైనా సరే నన్ను మాత్రం బాగా చదివించాలని అమ్మ తాపత్రయ పడేది.

“నువ్వు పెద్ద టీచరవ్వాలి గౌరమ్మా…” అమ్మకి తెలిసిందదే.

ఎండ వేడి ఎలావుంటుందో కూడా తెలీనంత సుకుమారి మహీ. తనకీ, యీ పిచ్చిగౌరికీ ఎలా అంత స్నేహమయ్యిందో ఎవరికీ అర్థం అయ్యేది కాదనుకుంటా. నాన్నమ్మ ఆంక్షలవల్ల నేను మహీ గదిలోనుండీ కదిలేదాన్ని కాదు. మా యిల్లు అనే నరకం నుంచి బయట పడడానికైనా సరే బంగ్లాలో గడపాలనిపించేది. అదీ మహీ గదిలో, అందులోనూ మహీ పెద్ద బార్బీ బొమ్మతో.

* * *

ఆ రోజు ఆదివారం!

అప్పటి దాకా వాళ్ళింట్లోనే ఆడుకుని బయలుదేరబోతూ, “అమ్మ కార్జ్యం కూరొండుతోంది. అచ్చంగా కార్జ్యం” నాన్నమ్మకి వినబడకుండా రహస్యం గా చెప్పాను. కార్జ్యం ముక్కలంటే మహీకి చచ్చేంత ఇష్టం. ఆంటీకి మెల్లగా చెప్పి బయలుదేరింది నాతో.

బయట వరండాలోకి వస్తోంది మాంసం కూర వాసన. లోపలికి వెళ్ళేటప్పటికి నాన్న లేడు. హమ్మయ్య అనుకుని వంటగదిలోకి పరిగెత్తాం. గారంగా వేలాడుతున్న నా నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఇద్దరికీ చెరో ప్లేట్లో రెండేసి ముక్కలు వేసిచ్చింది అమ్మ. ఊదుకుని ఊదుకుని తింటున్నామో లేదో వెనక నుంచి పడిన నీడ చూసి మహీ ఉలిక్కి పడి ప్లేట్ వదిలేసింది.

ఎప్పుడు వచ్చాడో నాన్న. అప్పటికే తూలుతున్నాడు. బెదురుగా నా వెనక నుంచుంది మహీ. మత్తులో ఉన్నాడుగా. ఎదురుగా ఉన్నది పెద్దాఫీసరు కూతురనే స్పృహ కూడా లేదు. మామూలప్పుడు ఉండే వినయం లేదు. తిట్లదండకం ఎత్తుకున్నాడు. అప్పటికింకా వంట అవలేదని అందినవి అందినట్లు విసరడం మొదలెట్టాడు. అడ్డు రాబోయిన అమ్మని వంగదీసి రెండు గుద్దులు గుద్దాడు. నాకు అలవాటే. మహీ మాత్రం భయంతో బావురుమంది. అమ్మని తిడుతూనే, ఉడికీవుడకని అన్నంలో ఇంత కూర వేసుకుని బొక్కుతున్నట్లు తినడం మొదలెట్టాడు. మళ్లీ అంతలోనే వంటింట్లో ఓ మూల నుంచున్న మా దగ్గరకి వచ్చి, నా మొహాన ఒక పది రూపాయలు విసిరాడు కిళ్ళీ పట్టుకు రమ్మని.

అప్పటికే కోపంగా ఉందేమో అమ్మ. శివంగిలా లేచింది నాన్న మీద. “కొట్టు కెళ్ళే దారిలో నాగులుగాడితో యాతనగా ఉంది. ఆడ పిల్లల మీద కుక్కలా పడతన్నాడు. గౌరిని పంపడాకీల్లేదు” అని అరిచింది.

“దీన్ని తలొంచుకుని యెళ్ళమనవే. దీనికే యవ్వారాలు ఎక్కువయినియ్” మళ్ళీ మొదలెట్టాడు నాన్న. నాతో బాటు రాబోయిన మహీతో “నువ్వుండు వాన పడేటట్లుంది ఇప్పుడే వచ్చేస్తా..” అంటూ బయటకి పరిగెత్తాను.

కొట్టుకి వెళ్ళేదారిలో అన్నీ మెకానిక్ షాపులు. కాస్త దూరం మదుగ్గా ఉంటుంది. పట్టపగలు కూడా భయమే. వర్షానికి బురదగా ఉంది రోడ్డు. లంగా పైకెత్తుకుని కాలు జారకుండా చూసి చూసి నడుస్తున్న నాకు వెనక నుంచి ఎవరో ఫాట్ మంటూ కొట్టడం పక్కన సందులోకి లాక్కెళ్ళడమే గుర్తు. ఇంజన్ ఆయిల్ వాసన గుప్పుమంటూనే కళ్ళు తిరిగి పడి పోయాను. స్పృహ వచ్చేటప్పటికి వళ్ళంతా పుండు. ఎలా వచ్చి ఇంటికి చేరానో తెలీదు. బాత్రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. తలుపు బలవంతంగా తెరిపించి చూసిన అమ్మ బావురుమంది.

ఆ తర్వాతేం జరిగిందో ఇప్పుడు గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. ఊరూ వాడా నా మీద సానుభూతి చూపించబోయినా పడనివ్వలేదు మా నాన్న. ఏ కన్న తండ్రీ బహుశా చేయని ద్రోహం చేసాడు నాకు. జరిగిన దానిని చిలవలు పలవలు చేసి, తానే ప్రచారం చేశాడు. కేస్ పెడదామని మహీ వాళ్ళ నాన్నగారు, మిగతా పెద్ద మనుష్యులు చెప్పినా వినలేదు. పైగా రాజీకి బేరం పెట్టాడు నాగులు దగ్గర. మహీవాళ్ల నాన్నగారు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. పరిష్కారం అంటారో, పరిహారం అంటారో కానీ, నన్ను ఆ నాగులుకే ఇచ్చి పెళ్ళి జరిపించాడు. నేను అయోమయం లోంచి తేరుకునే లోపే నా శరీరంలో మార్పులు మొదలయ్యాయి.

అప్పటి దాకా నాన్న ఎంత దుర్మార్గుడైనా చదువు, అమ్మ ప్రేమ, పుష్ప, మరియత్త, యేసు మామయ్య మహీ, మహీ ఇంట్లో బార్బీలు ఇదే లోకం గా బతికానేమో. కొత్తగా వంట్లో నలత, నెప్పి, అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి నన్ను హక్కుగా గాయపరిచే నాగులు ఇదంతా నరకంగా ఉండేది. రాజీపడి నాగులునుండీ గుంజిన డబ్బులతో నాన్న మరింత అరాచకంగా తయారయ్యాడు. కనిపించిన వాళ్ళందరి దగ్గరా సానుభూతి కోసం ఏడ్చేవాడు. తర్వాత మూడు నెలల్లో తాగీతాగీ చచ్చిపోయాడు. తాగి డ్యూటీ చేసినందుకు అప్పటికే సస్పెండ్ అయ్యాడు కాబట్టీ, ఆయన పోయినప్పుడు మాకు రూపాయి కూడా రాలేదు.

అన్నిటి కన్నా నన్ను కృంగ దీసింది- మహీ ఆ తర్వాత ఎప్పుడూ నన్ను కలవక పోవడం. పుష్ప దగ్గర చాలా సార్లు ఏడ్చేదాన్ని. నన్ను కూడా మహీతో సమానంగా చూసిన అంకుల్ కూడా ఒక్క సారి అయినా మహీని మా ఇంటికి పంపక పోవడం, మా పోలమ్మ అత్తని కూడా వాళ్ళింట్లో పని మానిపించడం ఇవన్నీ నన్ను మరింత కోతపెట్టాయి. పుష్ప చేత చాలా సార్లు కబురు పెట్టేదాన్ని. వాళ్ళ నానమ్మ వప్పుకోవట్లేదని చెప్పేదట. అంతకు ముందు కూడా నానమ్మకి తెలియకుండా వచ్చేదిగా మరి. మహీ మీద బెంగలో కొంత ద్వేషంగా మారిపోయింది.

నాకు పాప పుట్టినప్పుడు నన్ను చూడ్డం కోసమని మహీ హాస్పిటల్‌కి వచ్చినా నేను తన మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత అంతా మారిపోయింది. పాప పుట్టిన నాలుగు నెలలకే ఊర్లో ఏదో గొడవ జరిగి, అందులో నాగులు చచ్చిపోయాడు. ఆ తర్వాత సంవత్సరానికే అమ్మ చనిపోయింది. చుట్టాలున్నా ఎవరూ అక్కరకి రాలేదు. దేవతలా మరియత్తే ఆదుకుంది. తను పని చేసే సెయింట్ ఆన్స్ హాస్పిటల్ సిస్టర్స్ దగ్గరకి తీసుకెళ్ళింది నన్నూ, పాపనీ. అక్కడ హాస్టల్ లో ఉంటూ మళ్ళీ చదువుకోవడం మొదలెట్టా నేను. ఆ తర్వాత తెలిసింది అదీ పుష్ప ద్వారానే. అప్పుడు జరిగిన గొడవల్లో నన్ను చూసిన షాక్‌కి మహీకి ఫిట్స్ వచ్చేవట. వస్తే రోజుల తరబడి తగ్గేవి కాదట. దాంతో మహీ ఒక్క దాన్నే ఎక్కడికీ పంపేవారు కాదట. మెరుగైన వైద్యం కోసం అంకుల్ తనని తీస్కోని హైదరాబాద్ వెళిపోయారట. నాకు యివన్నీ తెలిసేటప్పటికే మహీ వాళ్ళ ఫ్యామిలీ వూరొదిలి వెళ్లిపోయింది. హాస్టల్‌లో ఉంటూ ఎక్కడ చదువుకున్నానో ఇప్పుడు అదే స్కూల్‌లో టీచర్ నేను. నన్ను అర్థం చేసుకుని ప్రాణం ఇచ్చే కృష్ణ వెన్నెల్లా నా జీవితంలోకి వచ్చాడు. తను కూడా నాతోపాటు అదే స్కూల్లో టీచర్. పాప కూడా సిస్టర్స్ మధ్యలో పెరిగింది. చక్కగా చదువుకుని మెడిసిన్ అయ్యి సెయింట్ ఏన్స్ లోనే ప్రాక్టీసు చేస్తోంది. జీవితం చాలావరకూ కుదుట పడినట్లు అనిపించినా, తరచూ మహీ గుర్తు వస్తూనే ఉంటుంది. అకారణంగా నేను తనపై చూపించిన ద్వేషం, నావైపు చివరిసారిగా బేలగా చూసిన మహీ, పాపని ముట్టుకుంటుంటే నేను అయిష్టంగా మొహం పెట్టడం ఇవన్నీ గుర్తుకు వస్తే నిద్ర పట్టదు నాకు.

ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మహీ తన గురించి వెతుకుతోందన్న కబురు. మరియత్త చెప్పింది వినగానే చాలా ఉద్వేగంగా అనిపించింది. మహీ నన్ను మర్చిపోలేదు. నన్ను కలవడానికి ఈరోజు సాయంత్రం మహీనే స్వయంగా వస్తానందట. విషయం పుష్పకి చెపితే “నేనూ వస్తానే” అంది వుత్సాహంగా. ఫోన్ చేసి నా కూతురుక్కూడా చెప్పాను. పుష్పత్త చెప్పిందమ్మా అంటూ నవ్వుతూ పెట్టేసింది తను. పాపా, నేనూ, కృష్ణా స్కూలు వాళ్లు యిచ్చిన వొక చిన్న క్వార్టర్ లో వుంటాం. అక్కడే కలుసుకోబోతున్నాం అందరం మళ్లీ చిన్నప్పటి మాదిరిగా.

సాయంత్రం అయిదయ్యింది. వస్తూనే బయట వాచ్‌మేన్ కి డబ్బులు ఇచ్చి కార్జ్యం ముక్కలు కొట్టించుకు రమ్మని పురమాయించాను. ఇన్ని రోజుల్లో ఒక్క సారి కూడా మహీని మర్చిపోకపోయినా, తను ఎక్కడుందో తెలుసుకోవాలని మాత్రం అనుకోలేదు. తనూ అంతేనా. ఒక్క సారి అయినా నేనెలా ఉన్నానో అని నన్ను వెతుక్కుంటూ రాలేదేం. ఎలా వస్తుందిలే. ఒకళ్లు పరిస్థితులతో, యింకొకళ్లు ఆనారోగ్యంతో యుద్ధం చేస్తున్నాం.

* * *

పుష్ప:

సెయింట్ ఏన్స్ కాంపౌండ్‌లో ఒక మూలగా. ముచ్చటగా చుట్టూ పూల మొక్కలతో ఉంటుంది గౌరీ ఉండే క్వార్టర్. నేను ఆటో దిగుతుండగానే పక్కన కార్ వచ్చి ఆగింది.

“మహీ” అని గట్టిగా వాటేసుకుని, తనని అతుక్కుని నుంచున్న బుజ్జిదాని బుగ్గలు పుణికి, పదండి అంటూ ముందు నడిచాను. మహీ ధ్యాస నామీద లేదు. ఎక్కడ ఉందో నాకు తెలీదా ఏంటి. లోపలికి వెళ్లగానే ఎదురుగా పాతికేళ్ళ అమ్మాయి. అందంగా హుందాగా ఉంది. పాతికేళ్ళ క్రితం వయసుకి మించి పెరిగిన గౌరి కూడా ఇలానే ఉండేది. మహీ చూపు ఆ అమ్మాయిని దాటి, యింకా వెనకెక్కడో వెతుకుతోంది. “గౌరి కూతురు. నీ పేరే. మహేశ్వరి” నవ్వుతూ చెప్పాను. ఒక్క క్షణం ఆగిపోయింది మహీ. అడుగు ముందుకి పడలేదు తనకి. సందేహిస్తూ దగ్గరికొస్తున్న మహేశ్వరిని గట్టిగా హత్తుకుంది..

లోపలికి వెళ్ళేటప్పటికి వంటగదిలో కూర తిప్పుతోంది గౌరీ. తన ధ్యాస కూర మీద లేదు తెలుస్తోంది. నవ్వుతూ చూస్తున్నా దాని వేపు “తల్లీ నీ ప్రాణ స్నేహితురాలు వచ్చింది వెళ్ళు” చిన్నప్పటిలా సాధిస్తున్నట్లు అన్నాననే అనుకున్నా. కానీ నా గొంతులో అప్పటి ఎత్తి పొడుపు లేదు. నెమ్మదిగా గౌరీ దగ్గరకు వెళ్ళి , “నేను చూస్తా కూర నువ్వెళ్లు” అన్నాను.

గౌరి నెమ్మదిగా అడుగులు వేస్తుంటే బయట మాటలు వినిపిస్తున్నాయి.

“నీ పేరు!” మహేశ్వరి అడుగుతోంది పాపని.

సిగ్గుపడుతూ చెప్తోంది పాప,

“గౌ.. గౌరీ పూర్ణిమ”

తడబడుతూ తూలుతున్న గౌరీ దగ్గరకు పరిగెత్తా నవ్వుతూ.

Exit mobile version