Site icon Sanchika

నీలగిరుల యాత్రానుభవాలు-5

[box type=’note’ fontsize=’16’] నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

బైసన్ ఊటీ/కోటగిరి:

కోటగిరి హోటల్ యజమాని మా కోరిక మేరకు మాకు డౌన్ ఫ్లోర్‌లో ఒక వైపున చిన్న వంటగదిని ఏర్పాటు చేసి ఇచ్చారు – గ్యాస్, వంట గిన్నెలు, లోపల మంచి నీటి టాప్ వగైరాలతో. ఒక్కటే చిన్న ఇబ్బంది కోతులు వస్తే?

నేను హైదరాబాదు నుండి తీసుకు వెళ్లిన వంట సామాన్లు, ఫుడ్ ఐటమ్స్, పచ్చళ్ళు లోకల్‌గా కొన్న కూరలు అన్ని నీట్‌గా సర్దిపెట్టాను స్టవ్ గట్టు కింద.

రెండు రోజుల తరువాత మా తమ్ముడు, వైఫ్, మనవడితో వచ్చాడు. ట్రైన్‌లో కోయంబతూర్‌లో దిగి, బస్సులో కోటగిరికి వచ్చారు. ముందుగానే బుక్ చేసిన రూమ్‌లో దిగారు. ఇద్దరు ఆడవాళ్ళం బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ వండేవాళ్ళము. మగవాళ్ళు కోతులు రాకుండా మాకు కాపలా. మనవడు మానస్ కోతుల రాకను గట్టిగా అరిచి చెప్పేవాడు. కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ వండి తిని ఆస్వాదించేవాళ్ళము. పొద్దున్నే వేడి టీ హోటల్ కేర్‌టేకర్ ఇచ్చేవాడు.

రోజూ ఒక ప్రదేశానికి వెళ్లి చూసి వచ్చేవారం. వివరంగా చెబుతాను. కోటగిరికి 2018 మే లో తమ్ముడి ఫామిలీ, 2019 మే లో ఫామిలీ ఫ్రెండ్, వైఫ్‌తో వెళ్ళాము. 2022 ఏప్రిల్ చివరి వారం నుండి మే చివరి వారం వరకు బస. మే రెండవ వారం నుండి మా అమ్మాయి ఫామిలీ జాయిన్ అయ్యింది. కోవిడ్ కారణంగా రెండేళ్ళు ఎలాంటి పర్యటనలూ లేవు.

హోటల్ బాల్కనీలో నుంచుంటే పచ్చని టీ తోటలు, పొడవాటి చెట్లు. చల్లని గాలులు. హఠాత్తుగా మా మానస్ కి అదేనండి తమ్ముడి మనవడికి పెద్ద సైజు గేదెలు లాంటివి కనిపించాయి గుంపుగా.

“తాతా! baffallows” అంటూ అరిచాడు.

అందరం వాటిని చూసాము. ‘యముండా!’ అనే యమ డైలాగ్‌లోలా యముని వాహనం మహిషి.

హోటల్ కేర్‌టేకర్ రాజు “అవి అడవి దున్నలు, ఇండియన్ బైసన్” అన్నాడు.

వాటికి పులి కూడా భయపెడుతుందట. వాటికి ఎదురే లేదు. తగ్గేదే లే! అన్నట్లు టీ తోటల్లో వీర విహారం. వాటితో పాటుగా పిల్ల బైసన్ ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలిట. రోజు వాటిని చూడటం ఒక సరదా మా మానస్‌కి.

ఇవి దక్షిణాసియా, నైరుతి ఆసియా ఖండ దేశాల్లో కనపడే జంతువులు. 1986లో వీటిని అంతరించిపోయే ప్రమాదం ఉన్నవిగా చెప్పారు.

అడవి దున్న అడవి పశువుల్లో ఎత్తైనది. అత్యంత బలమైనది.

బైసన్ (అడవి దున్న) వియత్నాం, కంబోడియా, మలేసియా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్ దేశాలలో ఉండేవిట. కానీ ప్రస్తుతం అవి శ్రీలంక లోనూ, ఇండియాలోని నీలగిరి ప్రాంతంలోనూ ఉన్నాయట. భూటాన్ లోని వైల్డ్ లైఫ్ శాంక్చరిలో కూడా బైసన్ ఉన్నాయి.

నేపాల్‌లో 1990లో అడవి దున్నలు 250-350 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. కానీ అవి ప్రస్తుతం కేవలం 112 మాత్రమే ఉన్నాయట. వాటిని నేపాల్ చిత్వాన్ నేషనల్ పార్కులో చూడొచ్చుట.

మన దేశంలో వాటి సంఖ్య 1990లో 12000-22000 నడుమ ఉండేది.

అవి పశ్చిమ కనుమల్లో (వెస్ట్రన్ ఘాట్స్), దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా వాయనాడ్, ఊటీ, నాగర్‌సోల్, ముదుమలై, బందీపూర్‍లో కనిపిస్తాయి. బైసన్‌లు రాత్రి పూట మాత్రమే ఎక్కువగా తిరుగుతుంటాయట. వాటికి ప్రమాదం లేదని అనుకుంటే పగలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. మనుషుల వల్ల అవి చాలా వరకు దూకుడుగా, కోపంగా ఉంటాయి. ఒక బైసన్ 600-700 కిలోల బరువు ఉంటుంది.

బైసన్ ఇండియన్ ఆర్మీ 54 ఇన్‌ఫాంట్రి డివిజన్‌కి మస్కట్. దీన్ని bison division అంటారు.

గోవా, బీహార్ లకు ఇది రాష్ట్ర జంతువు.

ఇంకా! ఆఁ ! Red bull energy drink లోగో bison. ఇవీ బైసన్ విశేషాలు.

మేము మా ప్రయాణంలో అందరి లాగా టూరిస్ట్ స్పాట్స్ చూసాము. వాటికంటే ఎక్కువగా స్థానిక సంగతులు విషయాల మీద దృష్టి పెట్టాం. నాలుగు ఫోటోలు, 2-3 రోజుల హడావుడి ట్రిప్స్‌లో స్థానికులతో పరిచయం, వారి చరిత్ర, సంస్కృతీ, ఆహార వివరాలు తెలిసే అవకాశం ఉండదు కదా? అందుకే మా బస ప్రతిసారి 2-3 వారాలు ఉంటుంది. అందువల్ల పరిచయాలు, కొద్దిపాటి స్నేహాలు, ఆ ప్రాంతపు విశేషాలు తెలిసాయి.

కోటగిరి:

మాకు ఇష్టమైన ప్రాంతం, మమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షించే ఊరు కోటగిరి. ఊటీ నుండి సుమారుగా ఒక గంట దూరంలో ఉంది. ఊటీ మెట్టుపాళ్యం రూట్‌లో. ఊటీ నుండి కోటగిరి డ్రైవ్ చాలా ఆహ్లదకరం. చుట్టూ పచ్చటి చెట్లు, చల్లని గాలి, చక్కని దారులు, సింగల్ రోడ్, టీ తోటలు. కోటగిరి చిన్న ఊరు. కానీ అన్ని వసతులున్నాయి. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రంగా ఉంది. ఒక రోజు నాకు గిడ్డీగా అనిపిస్తే వెళ్లి చూపించుకున్నాను. అక్కడి ప్రజలు మేము టూరిస్ట్ అని గుర్తుపట్టి, లైనులో నన్ను ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్లనిచ్చారు. స్టాఫ్ సాఫ్ట్ స్పోకెన్.. ఇక్కడి స్టేట్‌లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు బాగా వెళ్ళటం చూసాము. మేము తిరిగి చూసిన కుగ్రామాలలో కూడా వైద్యశాలలు ఉన్నాయి.

కోటగిరిలో మంచి స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్,ఇంటర్నేషనల్.

చక్కటి పార్కులున్నాయి. నెహ్రు పార్కు లో ప్రతీ ఏడాది మే నెల మొదటి వారంలో వెజిటబుల్ షో ఉంటుంది.

పాండియన్ రాజ్ మెమోరియల్ పార్క్ ఒక ప్రైవేట్ పార్క్. చక్కగా నిర్వహించబడుతోంది. చాలా బాగుంటుంది.

ఊరిలో ఎటుచూసినా పచ్చని టీ తోటలు, పూల చెట్లు, కూరల పంటలు, యూకలిప్టస్, పైన్ ట్రీస్. కోటగిరి దాటి గ్రామాలకు పోతుంటే అనేక చిన్న పెద్ద జలపాతాలు కనబడతాయి. టీ తోటల్లో ఉండే వాలులలో పెద్ద బావులు ఉంటాయి, వాన నీరు అందులోకి వెళ్లేలా ఉన్న ఏర్పాట్లు నీటి విలువ వీరికి తెలుసని చెబుతాయి.

ఇంకా కోటగిరి గురించిన ఇతర వివరాల్లోకి వస్తే ఒకప్పుడు ఫారెస్ట్ బ్రిగేడ్ వీరప్పన్ పాలించిన సత్యమంగళం అడవికి దగ్గర అవటంతో కోటగిరిని మొదటిసారిగా అందరికి తెలిసేలా చేసిందిట. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత అక్కడ వేల ఎకరాల్లో ఎస్టేట్ కొనటంతో ఎవ్వరికి అంతగా తెలీని ఈ గ్రామం వార్తల్లోకి వచ్చిందిట. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని కొడనాడ్ కొండలపై తొడసీలు నివసిస్తున్నారు. వారి గ్రామం కొండ అంచుల వద్ద ముగుస్తుంది, అక్కడ నుండి సత్యమంగళం అడవి మరియు మైసూరులోని కొన్ని ప్రాంతాలను చూడొచ్చట.

అంతే కాదు నెమ్మదిగా ఈ గ్రామం ఊటీకి వచ్చే పర్యాటకులకి గమ్యంగా మారుతోంది. ఊటీ లాగ హడావుడిగా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుండి మేము ఊటీ బస్సులో sightseeing కి వెళ్ళాము. అన్ని ప్రాంతాలకు చక్కని బస్సు టాక్సీ సౌకర్యం ఉంది.

కోటగిరి మరియు కొడనాడ్ యొక్క సాంస్కృతిక చరిత్ర – తొడసీల చరిత్రతో ముడిపడి ఉంది. నీలగిరి ప్రాంతంలో ఉన్న నాలుగు గోత్రాస్ లేదా తెగల్లో తోడా ఒకటి. ఇతరులు కోతాలు, కురుంబాలు, ఇరులలు ఉన్నారు. ఇరులు మరియు కురుంబలు అడవిలోనే ఉంటారు. కోతాసీలు ఊటీకి వెళ్లారు. తొడసీలు, పాండవ వంశానికి చెందిన వారని వారి నమ్మకం.

అర్జున, కృష్ణ వారికి దేవుళ్ళే. హస్తినాపురి పాండురాజు వంశం వారసులని వారి నమ్మకం. నిజమే కాబోలు. మనకేం తెలుసు?

వీరి గుడి గడ్డితో కప్పబడిన పైకప్పుతో ఉన్న ఆర్చ్ ఆకారంలో ఉన్న రాతి దేవాలయం. భూమికి దగ్గరగా ఓపెనింగ్ కలిగి ఉంటుంది. తోడాల ఇల్లు నమూనా ఒకటి ఊటీ బొటనికల్ పార్కులో ఉంది. పూజారి గర్భగుడిలోకి పాకాలి. ఆలయంలోకి ప్రవేశించే హక్కు అతనికి మాత్రమే ఉంది. విగ్రహం ఐదు రకాల బంగారం మిశ్రమంతో తయారు చేయబడి ఉంటుందిట. ఇతరులకు ప్రవేశం ఉండదు. పూర్వీకుల మాదిరిగానే ఆలయం సమీపంలో పూజారి ఉంటాడుట. తన తెగ కథలను మరియు పౌరోహిత్యాన్ని వారసత్వంగా పొందుతాడుట. కొడనాడ్ కొండలపై సుమారు 2,000 తోడా కుటుంబాలు ఉన్నాయిట. వారు నివసించే బెడుకల్ మండ్ జయలలిత కొడనాడు ఎస్టేట్‌కి దగ్గర.

కొడనాడు వ్యూ పాయింట్ వద్ద కొందరు తోడా మహిళలు తమ ప్రాంత వస్తువులను అమ్ముతుంటారు. అందులో తెల్లని వస్త్రంపై ఎరుపు నలుపు రంగు దారాలతో అందంగా కుట్టి అమ్మే దుపట్టా లాంటివి బావుంటాయి. గిఫ్ట్‌గా కొన్ని కొన్నాను. బేరం చెయ్యటం వారిని చిన్నచూపుగా చూసినట్లు భావిస్తారేనని అని భయపడ్డాను.

పురుషులు తమ భార్యలు కుట్టిన సొగసైన దారంతో తెల్లటి దుప్పట్లను ఉపయోగిస్తారు. ఇది తొడసి స్త్రీలు పాటించే సంప్రదాయమని చెప్పి, రూపవతి మరో దుప్పటి కుట్టేందుకు సిద్ధమైంది.

కోటగిరి చాలా తక్కువ సందడితో తమిళ గ్రామం యొక్క అందాలను కలిగి ఉంటుంది. ఉయిలట్టి, కెంకరాలోని గ్రామాలు తమిళం మరియు కన్నడ మిశ్రమ భాష మాట్లాడే బడుగలకు నిలయంగా ఉన్నాయి. బడుగలు కూడా కోటగిరి వారసత్వంపై తమకు హక్కు ఉందని నమ్ముతారు.

కోయంబత్తూర్ నుండి వచ్చిన ‘సన్యాసి’ పేరు మీదుగా రంగస్వామి కొండలు తూర్పున కనిపిస్తాయి… అదే పేరుతో వ్యూ పాయింట్ ఉందిట. మేము వెళ్ళలేదు. కొడనాడు వ్యూ పాయింట్ నుండి దూరంగా అల్లదిగో అంటూ వాచ్ గార్డ్‌ టిప్పు సుల్తాన్ కట్టిన కోట అంటూ చూపిస్తారు. ఈ ప్రాంతం అడవిలో అడవి జంతువుల కదలికలు ఎక్కువట. అందుకని పర్యాటకుల్ని వెళ్లనివ్వరట. మంచిదే కదా? వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకు.

ఇక్కడి ఊరిలోనే కాదు ఎక్కడికి వెళ్లినా మీకు లోకల్ బ్రాండ్ టీ, చాకోలెట్స్, కొన్ని spices , అరోమా ఆయిల్స్, ఇతర ఆయిల్స్ విరివిగా దొరుకుతాయి. కొనకుండా ఉండలేము. టీ ఫ్యాక్టరీలు కొన్ని టూరిస్ట్‌లకి గైడెడ్ టూర్స్ ఏర్పాటు చేస్తాయి. టీ తయారీ వివరిస్తారు. శాంపిల్ టీలు తాగటానికి ఇస్తారు. అమ్ముతారు. కొన్నాము.

తోడా:

తోడా ప్రజలు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాలలో నివసించే ద్రావిడ జాతి సమూహం. 18వ శతాబ్దం మరియు బ్రిటీష్ వలసరాజ్యానికి ముందు, తోడా స్థానికంగా కోట, బడుగ మరియు కురుంబతో సహా ఇతర జాతి వర్గాలతో కలిసి ఉన్నారట.

తోడా సాంప్రదాయకంగా ముండ్ అని పిలువబడే చోట నివసిస్తుంది, ఇందులో మూడు నుండి ఏడు చిన్న గడ్డి ఇళ్ళు ఉంటాయి, వీటిని సగం బ్యారెల్స్ ఆకారంలో నిర్మించారు. పచ్చిక బయళ్లకు అడ్డంగా ఉంటాయి. వారి ఆర్థిక వ్యవస్థ గేదెపై ఆధారపడింది, దీని పాల ఉత్పత్తులతో వారు నీలగిరి కొండల పొరుగు ప్రజలతో వ్యాపారం చేస్తారు. తోడా మతం పవిత్రమైన గేదెను కలిగి ఉంటుందిట.

సాంప్రదాయ తోడా సమాజంలో ఒక స్త్రీ ఒక కుటుంబంలోని సోదరులందరినీ వివాహం చేసుకునే ఆచారం గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అది ఆచరణలో లేదు. 20వ శతాబ్దంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం లేదా అడవుల పెంపకం కోసం బయటి వ్యక్తులను అనుమతించడం వల్ల కొంత తోడా పచ్చిక బయళ్లను కోల్పోయారుట.

తోడా భూములు ఇప్పుడు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్నాయి, ఇది UNESCO ద్వారా ఎంపిక చేయబడిన అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్; వారి భూభాగం UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది.

తోడాలు శాఖాహారులు. కొంతమంది గ్రామస్థులు చేపలు తింటారు. గేదె పాలను వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు: వెన్న, వెన్న పాలు, పెరుగు, జున్ను. అన్నం ప్రధానమైనది, పాల ఉత్పత్తులు మరియు కూరలతో తింటారు.

తోడా మతం ప్రకారం, దేవత టీకిర్షి మరియు ఆమె సోదరుడు మొదట పవిత్రమైన గేదెను సృష్టించారు. తరువాత మొదటి తోడా పురుషుడు, స్త్రీని సృష్టించారు.

తోడా మతం ఉన్నత-తరగతి పురుషులను పవిత్రమైన పాలకులుగా ఎన్నుకొని, వారికి పాడి పూజారులుగా పవిత్ర హోదాను ఇచ్చిందట. 1922లో సర్ జేమ్స్ ఫ్రేజర్ ప్రకారం పవిత్ర పాలదారుడు తన ఇంట్లో ఉన్నప్పుడు వంతెనల మీదుగా నడవడకూడదుట. అతను కాలినడకన, ఈత ద్వారా నదులను దాటాల్సి వచ్చింది. ప్రజలు బూట్లు ధరించడం లేదా ఏ రకమైన తొడుగులతో పాదాలను కవర్ చెయ్యకూడదుట.

తోడా దేవాలయాలు హిందూ దేవాలయాల నుండి భిన్నంగా ఉంటాయి. రాళ్ళతో కప్పబడిన గుండ్రని గొయ్యిలో నిర్మించబడ్డాయి. అవి నిర్మాణంలో తోడా గుడిసెల మాదిరిగానే ఉంటాయి. దేవాలయాలుగా పేర్కొనబడిన ఈ గుడిసెల దగ్గరకు స్త్రీలు వెళ్ళడానికి అనుమతించరు.

సాంకేతికత వల్ల, ఇతర జాతులతో బలవంతంగా కలిసి మెలిసి ఉండేలా చెయ్యటం వల్ల తోడాల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. వారు ప్రాథమికంగా పశుపోషకులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు, వారు ఎక్కువగా వ్యవసాయం మరియు ఇతర వృత్తులలోకి ప్రవేశిస్తున్నారు. గతంలో శాకాహారులుగా ఉండేవారుట, కానీ ఇప్పుడు కొందరు మాంసాహారం తింటారు.

చాలా మంది తోడా వారు ఆధునిక ఇళ్ళ కోసం తమ సాంప్రదాయ విలక్షణమైన గుడిసెల నిర్మాణం వదిలేసారుట. 21వ శతాబ్దం ప్రారంభంలో, సాంప్రదాయ బారెల్-వాల్ట్ గుడిసెలను నిర్మించడానికి ఒక ఉద్యమం లాంటిది వచ్చిందిట. 1995 నుండి 2005 వరకు, ఈ శైలిలో నలభై కొత్త గుడిసెలు కట్టారుట.

జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రార్ వీరి ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీకి GI హోదాను అందించారు, ఇది తరతరాల ఆచారం. తోడా ఎంబ్రాయిడరీ ఉత్పత్తులకు ఒకే ధర, కళకు డూప్లికేషన్ నుండి రక్షణ దొరుకుతోంది. వారి ఎంబ్రాయిడరీ షాల్ లాంటి దాన్ని కొడనాడు వ్యూ పాయింట్‌లో కొన్నాము. బావుంది. మహిళలతో వచ్చి రాని తమిళంలో మాట్లాడాను. నాగార్జున తమిళంలో అక్కడి ఒక ముసలి స్త్రీ తో మాట్లాడి కొంత సమాచారం సేకరించారు.

తోడా ఎంబ్రాయిడరీని, స్థానికంగా ‘పుఖూర్’ అని కూడా పిలుస్తారు. తోడా ప్రజలలో వారి స్త్రీలచే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ఆర్ట్, చక్కటి ముగింపుని కలిగి ఉన్న ఎంబ్రాయిడరీ, నేసిన వస్త్రం వలె కనిపిస్తుంది, కానీ తెలుపు కాటన్ వస్త్రం ఎరుపు మరియు నలుపు దారాలను వాడి తయారు చేస్తారు. ఎంబ్రాయిడరీ చేసిన బట్టకు రెండు వైపులా ఉపయోగపడేలా ఉన్నాయి. తోడా ప్రజలు ఈ వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నారు.

ఈ ఎంబ్రాయిడరీని తయారు చేసే తోడాలు (తోడాస్) ఒక చిన్న కమ్యూనిటీగా నివసిస్తున్నారు, 69 ఊర్లలో 1,600 మంది జనాభా ఉన్నారు. వారిలో దాదాపు 400 మంది ఎంబ్రాయిడరీ పనిలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు.

ఎంబ్రాయిడరీ చేసే మహిళలు తమ పనిని ‘ప్రకృతికి నివాళి’గా భావిస్తారు. మొత్తము 9 డిజైన్స్ ఉంటాయట. మృతదేహాన్ని ఎల్లప్పుడూ సంప్రదాయ డిజైన్లతో ఎంబ్రాయిడరీ చేసిన బట్టలో చుట్టి పాతిపెడతారు. అయినప్పటికీ, రోజువారీ ఉపయోగించే బట్టలలో రంగు చారలను ఉపయోగిస్తారు. సాంప్రదాయక వస్త్రంగా, దీనిని స్త్రీ పురుషులు అన్ని ఉత్సవాల సందర్భాలలో మరియు అంత్యక్రియలలో కూడా ధరిస్తారు. సమాజంలోని వృద్ధులు ప్రతిరోజూ ఈ వస్త్రాన్ని ధరిస్తారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version