[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘నీలకంఠం భజేహం!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“ఆ[/dropcap] నాడు, ఆ పట్టుదల ఏవిఁటీ, ఈ రోజు ఈ పట్టుదల ఏవిఁటీ, రెండూ అర్థం కావట్లేదు తల్లీ, నీ విషయంలో!”
హిమవంతుల వారి సతీమణి, సాక్షాత్పార్వతీ జనని యైన మేనకాదేవి మాటలివి.
తమ గారాల కూతురు పార్వతిని ఉద్దేశించి అన్నవే, ఆ మాటలు!
“వద్దమ్మా, నిండు జీవితం ముందున్నది, ఇట్లా తొందర పడవద్దు. ససేమిరా వద్దనవల్సిన దానివి ఈ విపరీత మేవిఁటమ్మా, సరేనంటావు?! మమ్మల్ని బాధపెట్టటం న్యాయమేనా నీకు ఈ విధంగా”-
ఇవి తండ్రి హిమవంతుని అనునయ వాక్యాలు ఆ వెంటనే!
మళ్ళీ ఆవేశంగా మేనకాదేవి అందుకుంది:
“ఆ రోజేమో – వద్దు ఈ సంబంధం, మహరాజు నొకడిని తెస్తాను తల్లీ, ఈ బూదిపూతల వాడు, సర్పాన్ని విలాసంగా మెడలో ధరించే వాడు, ఎక్కడెక్కడో తిరగరాని చోటుల తిరిగేవాడు – వద్దని అంత చెప్పినా మీ నాన్న- విన్నావు కాదు, శఠం పట్టి కూర్చున్నావు!
అదొక్కటేనా, పైగా ఎండకు ఎండీ, వానకు తడిసీ, చలికి వడవడ వణికీ, తపస్సు కూడా చేశావు కాదటే, ఈయన తోడిదే నా జీవితం అనీ!”
హిమవంతుడు ఏదో గుర్తు వచ్చినట్లు, ఇంకో రకంగా నచ్చజెప్ప చూశాడు.
“ఇంత తపస్సూ నువ్వు చేస్తుంటే, స్వయంగా ఆయనే వచ్చి వటువేషం కట్టి మరీ – వెనుకకు లాగజూసినా, వినక, అతని మాటలూ పెడచెవిని బెట్టి కాదమ్మా, స్వతంత్రించి అతనితోనే నా వివాహం అని నిర్ణయం తీసుకున్నావు.
నీ సుఖమే పరమావధిగా ఉన్న మేమూ, సరే కానివ్వమన్నాం, ఘనంగానే కానిచ్చాము కూడా!
ఇప్పుడీ తంటా ఏమిటి, చాలా విడ్డూరంగా ఉందమ్మా, మీ ఇద్దరి వైనమూ! విషం తాగుతానని ఆయనా, తాగండి పర్వాలేదు అని నువ్వూ!”
“ఆ యుగయుగాలుగా తగువు పడుతున్న రాక్షస దేవతా వర్గాల కోసమా ఈ అపూర్వ త్యాగం! ఏం తెలివే, దీని తరువాత మాత్రం వారు సఖ్యంగా ఉంటారనా మీ భ్రమ”, తల్లి ఆవేశంగా అన్నది మళ్ళీ!
***
అంతా విని, పార్వతి, “ఏంటమ్మా, ఎవరునుకుంటున్నారు ఆయన అంటే! సర్వజ్ఞుడైన జగత్సంరక్షణకారుడమ్మా! ఆడి ఆడి అలసే సృష్టి విలాసానికి లయ రూప విశ్రాంతి నిచ్చే ప్రాణి హితకరుడమ్మా!
జరిగిన సృష్టిని పోషించటం ఒక ఎత్తైతే, లయింప చేయటం అంత కన్నా ముఖ్యమైనది, ఆ మహత్కార్యం చేసేది ఈ ప్రభువే నమ్మా!
కానీ ఆ లయ అన్నది, తగిన సమయంలో జరగవలసిన మహత్కార్యం, ఈ సృష్టిచక్ర నిర్వహణలో!
ఇట్లా యథేచ్ఛావర్తనమై, కాలకూటమై విరుచుకు పడుతుంటే, లోకాలను దహింపజేస్తుంటే, వారంతటి సర్వసమర్ధులు ఊరికే ఉపేక్షించి కూర్చుంటారా?!
అమృతం ఆయనకు అధికంగా ఒనగూర్చేదీ ఏమీ లేదు, విషం చేయగల హానీ ఏమీ లేదు, నమ్మండి నా మాట!
అందుకే ఆయన ఆ సంసిద్ధత, నా యీ అంగీకారం! దిగులు పడాల్సినదేదీ లేదిందులో, నిశ్చింతగా ఉండండి.” అని అంది.
***
ఇంతలో అక్కడికి అప్పుడే వచ్చిన నారదుల వారు, “అయిపోయిందమ్మా, నగరాజ నందినీ! పని పూర్తై పోయింది, ఇక అమృతోద్భవం తథ్యం” అన్నారు, యథాలాపంగా, ఆనందంగా!
మేనకాదేవి, హిమవంతుడూ ఇద్దరూ ఒకేసారి, “అది సరే, ఆ విషం సంగతి..” అంటూ పూర్తి చేసే ధైర్యం లేక ఆగిపోయారు.
“అదా, అయ్యవారు పుచ్చేసుకున్నారు” అన్నారాయన చాలా ప్రశాంతంగా! “ఇక నుంచీ పార్వతీపతి, నీలకంఠుడనీ పిలువబడుతాడు, కంఠ స్థానంలో నేరేడు చేసి, అంతటి గరళాన్నీ దాచేశాడుగా, అందుకని!”
ఏమీ కాదు ఆయనకు ఏది తాగినా అన్న ప్రగాఢమైన నమ్మకం స్ఫురిస్తోంది ఆ మాటల్లో!
ఔను, సర్వాశనుణ్ణే కంటిలో బంధించి నుదుటన నిలుపుకున్న జోదు మరి!
‘ఏమీ కాలేదు కదా, అమ్మయ్య’ అనుకున్నారు, జగదేక మాత అమ్మ, అయ్యలు, గుండెల నిండా ఊపిరి పీల్చుకుని!
“నారద మహర్షీ! ఎంత మంచి వార్త చెప్పారు స్వామీ”, అన్నారు కూడా, కాస్త నెమ్మదించిన మనస్సులతో!
***
“ఆయనకు ప్రమాదమని ఎట్లా అనుకున్నారు, ప్రమాదాల నుంచి లోకాలను తెప్పించే వాడే ఆయనైతే!
ఉదరంలోకి వెళితే అక్కడ ఉన్న సమస్త లోకాలకు ప్రమాదమని, కంఠం దగ్గరే ఆపేశాడమ్మా ఆ కటువుని. మరీ విడ్డూరం తల్లీ, దగ్గర ఉండి చూసిన వాణ్ణి చెపుతున్నాను, ఒక్క మార్పు లేదు ఆయన మొహంలో, అది తీసుకుంటుంటే!
కనులలో ఏ ఎరుపు జీరైనా తోచలేదు, ఆయన వహిస్తున్న చంద్రాదులలో ఎట్టి అలజడి కాదు కదా కదలిక కూడా లేదు!
అదీ శివుడి శాంత నిర్మల స్థితి ఆ విషం పుచ్చుకున్న వేళ కూడా!
ఇది అన్యులకు ఎవరికి తల్లీ సాధ్యం, ఈరేడు భువనాల్లో?!
తాను ఇచ్చేది శీతలామృత గంగాజల సమమైన దయనూ, తాను భరించేది మాత్రం హాలాహల విషాన్ని!
అదమ్మా, శివ తత్త్వం, సదా లోకశుభంకరం!
ఆయన జటాజూటంలో పట్టి ఆపకపోతే, ఆ మహోత్తుంగ తరంగ, సురగంగ ధరామండలాన్నే బద్దలు చేసేయగలదు. ఆ ఉధృతీ, ఆ మహా వేగం, ఆ సుడులూ అటువంటివి!
వాటిని జటాజూటపు ముడులలో బంధించ కలిగేది, ఒకే ఒక్కటి, శ్రీ శివ మహాశక్తి!
హరుని అంతరంగం అగాధం, ఆయన మహిమ అనంతం తల్లీ!
ఇక మీ అమ్మాయి సంగతి చెప్పేదేముందదమ్మా?!
మింగబోయేది కాలకూట విషమనీ తెలుసు, తన భర్తే అది గ్రహించబోతున్న విషయమూ తెలుసు, అయినా ప్రజకు మేలవుతుంది, లోకాలు రక్షింపబడతాయి అని వల్లె యన్నదమ్మా!
ఎంతటి మహా యిల్లాలో, మెడలోని మంగళసూత్రమే, ఆ విషం భర్త కంఠం దాటి లోపలకు పోకుండా ఆపుతుందిలే అన్న ధీమా ఏమో!
పరోపకారమే పరమధర్మం అని లోకానికి చాటి చెప్పిన పాఠం అమ్మా ఇది, సమస్త సురాసుర మానవ గణాలకూ!
శ్రేష్ఠులు ఆచరించి చూపినది కాదూ, లోకానికి ఆదర్శమౌతుంది!
ఈయన దేవశ్రేష్ఠుడూ, దేవతా సార్వభౌముడూ, కనుక మహదాదర్శం, పరోపకార గుణ పక్షపాతులకు!
నీలకంఠం భజేహం! నీలకంఠం భజేహం!”
అని శైవస్తుతి చేస్తూ నారాయణ నామ నిరత స్మరణులు, భాగవతోత్తములు నారదుల వారు సెలవు తీసుకున్నారు వారి నుంచి.
***
అంతా మౌనంగా వింటున్న జగదంబిక ముఖాన ఒక హాసరేఖ లీలగా గోచరించింది, ఆమె తల్లిదండ్రులకు!
ఆ అర్ధనారీశ్వరి మాత్రం, పతి ధ్యానంలో పూర్ణంగా లీనమైపోయింది, ఆ నాద తనువులో ఒకటై పోయింది!