Site icon Sanchika

నీలమత పురాణం – 15

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణంతోనే కాదు, భారతీయ ఇతర పురాణాలతో కూడా ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు మనకు అసంబద్ధంగా, అనౌచిత్యంగా, కట్టుకథల్లా తోచే విషయాలు పురాణాలలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా పురాణాలపై మనకు ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఈనాటికీ జోరుగా సాగుతున్నాయి. అంటే వీటిని చూపించి పురాణాలన్నీ పనికిరానివని కొట్టిపారేసే వీలునూ వాడుకుంటూ సమాజాన్ని పౌరాణిక విజ్ఞానానికి దూరం చేస్తున్నారు. అంటే సమాజాన్ని గతానికి దూరం చేస్తున్నారన్నమాట. గతం లేక నిన్న మొన్న కళ్ళు తెరిచిన నాగరికతలు తమకు లేని ‘గొప్పతనాన్ని’ సృష్టించుకుంటుంటే వారసత్వంగా అందించిన గతాన్ని మనం ఎవరో సృష్టించిన అపోహల ఆధారంగా వదులుకుని ప్రపంచం ముందు బికారుల్లా నిలబడుతూ, అదే ‘అభ్యుదయం’, అదే ‘అభివృద్ధి’ అనుకుంటున్నాం.

పురాణాల్లో నాగులు, పిశాచాలు, వానరులు ఇలా బోలెడంతమంది ప్రసక్తి వస్తుంది. నాగులు మాట్లాడుతాయి. వానరులు సముద్రాలు దాటుతారు. ఇవన్నీ కట్టుకథలని నమ్మించడం సులభం. ఎందుకంటే, నాగులు అనగానే పాములు, పిశాచాలు అనగానే పీక్కు తినేవారు, వానరులు అనగానే కోతులు అని అర్థం చెప్పడం సులభం. నీలమత పురాణంలో కూడా నాగులు కనిపిస్తాయి. కద్రువ, వినత కథ ఉంది. గరుడుడున్నాడు. గరుడుడి నుంచి రక్షించమని వాసుకి విష్ణువుని ప్రార్థిస్తే, వాసుదేవుడు సతీసరోవరం ఉన్న సతీదేశం నాగులకు ‘క్షేమకరం’ అని సూచించాడు. దాంతో, నాగులు సతీసరోవరంలో హాయిగా ఉన్నారు. ఇంతలో జలోద్భవుడు వచ్చాడు. వాడిని చంపేందుకు దేవతలు వచ్చారు. కశ్యపుడు వచ్చాడు. జలోద్భవుడి మరణం తర్వాత కశ్యపుడు, నాగులను మనుషులతో సహవాసం చేయమన్నాడు. నాగులు ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించి పిశాచాలతో సహవాసం చేయమన్నాడు.

ఇప్పుడు ఒక నిమిషం ఆగి ఈ నాగులు ఎవరు? పిశాచాలు ఎవరు? అని ఆలోచించాల్సి ఉంటుంది. నీలమత పురాణంలో ప్రధానంగా నాగులు, పిశాచాలు కనిపిస్తాయి. కశ్మీరు పరిసర ప్రాంతాలలో దార్యులు, అభిసారులు, గాంధారులు, జుహుందరులు, శకులు, ఖుసాలు, తంగణాలు, మాందవులు, మద్రలు, అంతర్గిరులు, బహిర్గిరులు.. ఇలా పలు జాతుల ప్రసక్తి వస్తుంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే ఒక నాగుడి పేరు ‘యవనప్రియ’. అంటే యవనుల ప్రసక్తి కూడా వస్తుందన్న మాట. ఇదంతా చూస్తుంటే, నిజంగా నాగులు అంటే పాములేనా? అన్న అనుమానం వస్తుంది.

భారతీయ ప్రాచీన వాఙ్మయంలో ప్రధాన సమస్య ఏమిటంటే ప్రతీకలు. ప్రతీకలను అర్థం చేసుకోవటంలో అసలు విషయం అర్థమవడం ఆధారపడి ఉంటుంది. నీలమత పురాణం రచించిన కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పటి అనుభవాలు, ఆలోచనల ఆధారంగా ప్రతీకలు ఏర్పడ్డాయి. వాటిని ఇప్పటి అనుభవాలు, ఆలోచనలతో అర్థం చేసుకుని విశ్లేషించాల్సి ఉంటుంది. పదాలు, శబ్దాలు, అప్పుడూ ఇప్పుడూ ఒకటే అయినా, అర్థంలో అప్పుడూ, ఇప్పుడూ ఎంతో మార్పు వచ్చింది. కాబట్టి ఏ పదానికి అర్థాన్ని తీర్మానించేడప్పుడయినా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పైపైన చూసేసి అర్థాలు నిర్ధారించేయటం అనర్థదాయకం. భారతీయ పురాణాలను పాశ్చాత్యులు అర్థం చేసుకుని వ్యాఖ్యానించిన వైనం ఒకసారి తెలుసుకుంటే మనకు జరిగిన అన్యాయం స్వరూపం స్పష్టమవుతుంది.

‘ఫెర్గ్యూసన్’ అనే అతడు ‘ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్’ అనే పుస్తకంలో ‘నాగులు’ అనేవారు ‘ట్యూరానియన్లు’ అన్న అభిప్రాయం వ్యక్తపరిచాడు. ‘Turan’ అన్నది మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం పేరుకు ఇరానియన్ల పురాణ గాథ ఆధారం. ‘ట్యురాన్’ అన్నది కోపిత్ దాగ్, ఆత్రెక్ లోయ, తూర్పు ఆల్ఫ్రెజ్ పర్వతాలు, హెల్మంద్ లోయ, బాక్ట్రియా, మార్జియానా అనే ప్రాంతాలను కలిపి సూచించే పేరు. ‘షాహ్మమే’ ప్రకారం ఈ ప్రాంతాలలో సంచార తెగలుండేవి. ఆ సంచార తెగల రాజు ‘తుర్’ (Tur). అతని వల్ల ఈ ప్రాంతాలకు ‘తురాన్’ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉండేవాళ్ళు ట్యురానియన్లు. ఆ తెగకు చెందిన వారు ‘నాగులు’ అన్నది ఫెర్గ్యుసన్ అభిప్రాయం. వారు ఇరాన్ నుంచి బారతదేశం ఉత్తర ప్రాంతాలకు వచ్చారనీ, వారిని ఆర్యన్లు ఓడించారన్న అభిప్రాయాన్ని ఫెర్గ్యుసన్ ప్రకటించాడు. ఇతడి ఉద్దేశం ప్రకారం ఆర్యన్లు, ద్రవిడియన్లు నాగులను పూజించరు. కాబట్టి ‘నాగులు’ వేరే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారన్నది ఈయన వాదన. ఇది తప్ప ఇతని వాదనకు మరో సమర్థన లేదు.

‘జనరల్ కన్నిన్‌గామ్’ అనే ఆయన నాగులు డ్రాగన్‌ని పూజించేవారిగా బావించాడు. దీనికి ఆధారం ఆయనకు దొరికిన నాణేలు. ఆ నాణేల మీద నాగులను పూజించే బొమ్మ ఉంది. బ్రాహ్మి లిపి ఉంది. ఇవి ‘తఖుస్’ అనే రాజులకు చెందినవిగా నిర్ణయించాడు. ఈ ‘తఖుస్’లు నాగుల రాజు తక్షకుడి వారసుడు అని నిర్ణయించాడు. అంతే తప్ప తక్షకుడి వారసులు ఎవరు? అతని తరువాత వచ్చిన రాజులెవరు? అని పురాణాలను పరిశీలించనే లేదు. తీర్మానం మాత్రం చేసేసాడు.

‘కలనల్ టోడ్’ అనే ఆయన నాగులు ‘షేషేస్నాగ దేశం’ అంటే ‘శేషనాగ దేశం’ నుంచి వచ్చారని తీర్మానించాడు. ఆ దేశం ఎక్కడుంది? అంటే ప్రాచీన  ‘Scythian, Tochari of Strabo, The Tak-i-uks of the Chinesa, The Tajuks of Thurkistan’లు ఉండే దేశం అని తీర్మానించాడు. ప్రొఫెసర్ ‘సి.ఎస్. వాకె’, ‘నాగులు’ ఇక్కడి వారే అనీ, ప్రాచీన అనాగరిక జాతికి చెందినవారు అన్నాడు. ‘కార్లైల్’ అనే ఆయన ఆర్యన్ల ప్రాచీనులు, అసురులు, నాగులు అన్నాడు. డాక్టర్ ఎ. బెనర్జీ అనే ఆయన “అసురులు, నాగులు సంబంధీకులు. నాగులు పరాజితులై, శక్తిహీనులు అవటంతో అసురులు బలహీనమయ్యారని Asura India అనే పుస్తకంలో రాశాడు. డా. గ్రీసన్ అనే ఆయన “నాగులు హుంజునగర్ ప్రాంతాంలోని ‘బురుషక్సి’ భాష మాట్లాడే ప్రాచీన ఆర్యేతర జాతికి చెందినవారు” అని ప్రతిపాదించాడు. ఎల్. బి. కెన్నీ అనే ఆయన “నాగులు ద్రావిడులు” అని ప్రకటించాడు. ఆర్యులు రావడం వల్ల వీళ్ళు ఉత్తర భారతం నుండి దక్షిణాదికి పారిపోయి వచ్చారని నొక్కి చెప్పాడు. ‘ఓల్థామ్’ అనే ఆయన నాగులు సంస్కృతం మాట్లాడేవారనీ, సూర్యుడిని పూజించేవారని, వీరి జెండా పడగ అయి ఉంటుందనీ, అందుకని నాగులయ్యారని రాశాడు. కొందరు, ఎలాగయితే పాశ్చాత్యులలో ‘Werewolf’ (తోడేలు మనిషి) ఉందో, వీళ్ళు అలాంటివాళ్ళు అని అభిప్రాయపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, నిజం ఒక్కటే.. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఏదేశంలోనయినా, ఏ ప్రాంతంలో నయినా తూర్పుననే ఉదయిస్తాడు. కానీ, భారతీయ విజ్ఞానాన్ని విశ్లేషించే విషయానికి వచ్చేసరికి నిజం అన్నదాని అర్ధం మారిపోయింది. నాగులు….అన్న విషయంపై ఇన్ని విభిన్నమయిన, పరస్పర సంబంధంలేని, విరుద్ధమయిన ఆలోచనలు, ప్రతిపాదనలు చూస్తేనే ఎన్నెన్ని ఊహాగానాలు సత్యాలుగా మనగురించి మనం నమ్ముతున్నామో అనిపిస్తుంది. తీర్మానాలు చేస్తూ, అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న వాళ్ళెవరికీ భారతీయ ధర్మం పట్ల, పురాణాల పట్ల గౌరవం, అవగాహన, భక్తి ఉన్నట్టు కనబడదు. భారతీయ మనస్తత్వం, దృక్కోణం, జీవలక్షణం వంటి విషయాలపై కనీసపుటాలోచన ఉన్నట్టు అనిపించదు. ముఖ్యంగా తాము సత్యంగా భావించిన అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని తమకు తెలుస్తున్న విషయాలను తాము సత్యంగా భావించిన చట్రంలో ఇమడ్చాలన్న ప్రయత్నం, తపన తప్ప తమకు తెలిసింది కాక ఇంకో సత్యం ఉంటుందన్న ఆలోచన కనబడదు.

‘ఆర్యులు ఎక్కడి నుంచో ఇక్కడి వచ్చారు’ అని తీర్మానించారు కాబట్టి, ఇక్కడ ఎవరయినా ప్రాచీనంగా కనిపిస్తే వాళ్లు స్థానికులని, ఆర్యులు వచ్చి తరిమేశారని తీర్మానిస్తారు. అంతే తప్ప, ఆర్యులు నిజంగా వీరితో కొట్లాడారా? ఎక్కడి నుంచయినా వచ్చారా? ఇక్కడి వాళ్ళేనా? వంటి విషయాలను లోతుగా విశ్లేషించడం కనబడదు. అయితే, ఈ తీర్మానాలన్నీ ప్రామాణికం అవడం, ఈనాటికీ ఎలాంటి ఆధారం, నిరూపణలు లేని ఊహాగానాలు ‘సత్యం’గా చలామణీ అవుతూ ప్రామాణికంగా భావించడం వెనుక అనేక రాజకీయ, మానసిక, సాంస్కృతిక, సాంఘిక కారణాలున్నాయి. కానీ ‘సత్యశోధన’, ‘వైజ్ఞానిక దృక్కోణం’, ‘నిష్పాక్షిక విశ్లేషణ’ అన్నవి మాత్రం లేవు.

ఈ విషయంలో ఇంకా లోతుగా చర్చించేకన్నా ముందు, వేదాలలో, పురాణాలలో, భారతీయ వాఙ్మయంలో ‘నాగుల’ ప్రస్తావన ఎలా వచ్చిందో ఒకసారి పరిశీలిస్తే అసలీ ‘నాగులు’ ఎవరు? అన్న విషయంలో కొంతయినా అవగాహన ఏర్పడే వీలుంటుంది.

(సశేషం)

Exit mobile version