నీలమత పురాణం – 18

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఏవ ముక్తస్తదా నీలః పితరం చాహ ధార్మికః।
నిత్యమేవ హి వత్స్యాయో మనుష్యైః సహితా వయం॥
న పిశాచైస్తు వత్స్యాయో దారుణైర్దారుణ ప్రియైః।
ఏవం బృవలి నాగేంద్రే నీలం విష్ణురభాషత॥

[dropcap]ఆ[/dropcap]రు నెలలు పిశాచాలతో, ఆరు నెలలు మనుషులతో సహవాసం చేయాలన్న కశ్యపుడి మాటలను విన్న నీలుడు చేతులు జోడించాడు. వినయంగా అన్నాడు:

“మేము మనుషులతో కలిసి జీవించేందుకు సిద్ధం. కాని క్రూరులు, క్రూరత్వాన్ని ఇష్టపడే పిశాచాలతో కలిసి బ్రతకడం కష్టం. అది మాకు ఇష్టం లేదు.”

నీలుడి మాటలు విన్న విష్ణువు అభయం ఇచ్చాడు.

మునివాక్యం యే భవితా నీలైవమ్ యే చతుర్యుగమ్।
తతః పరం యే సుఖినో మనుష్యైః సహ వస్త్యధ॥

“మునివాక్యం ఒక చతుర్యుగం వరకూ వర్తిస్తుంది. ఆ తరువాత మీరు మనుషులతో కలిసి జీవించవచ్చు” అన్నాడు విష్ణువు.

“కాశ్మీరులో పిశాచాలు ఎప్పుడూ బలహీనమవుతాయి. వాటికి శక్తి కోసం అవి ఆరు నెలలు ఎడారి ప్రాంతాలకు వెళ్తాయి. కాశ్మీరులో ఉన్న మనుషులు నాగులను పూజిస్తారు. మనుషులు నాగులకు చెందిన భూములపై నివసిస్తున్నారు కాబట్టి నాగులను పూజించడం తప్పనిసరి. ఈ భూమిపై నివసించే మనుషులు నువ్వు (నీలుడు) నిర్ణయించి నిర్దేశించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలి. అలా పాటించినవారు ధనధాన్యాలతో తులతూగుతారు” అన్నాడు విష్ణువు.

విష్ణువు చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. భారతీయ ధర్మంలోని సూక్ష్మమైన అంశం ఇది.

మనం ఒకరికి చెందిన ప్రాంతాలకి వెళ్తాం. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం. వారి సహాయ సహకారాలతో లాభాలు పొందుతాం. సుఖంగా జీవితం సాగిస్తాం. వారితో కలిసి మెలిసి హాయిగా జీవిస్తాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఎవరి ప్రాంతానికి వెళ్తామో వారిని గౌరవించినప్పుడు, మనం వెళ్ళిన ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించినప్పుడు, ఆ ప్రాంతంలోని నియమ నిబంధనలను పాటించినప్పుడు, ఆ నియమ నిబంధనలను పాటిస్తూ కూడా మన ప్రత్యేకతను నిలుపుకున్నప్పుడు, ఆ ప్రత్యేకతని నిలుపుకోవడం అక్కడి వారికి ఎలాంటి ప్రతిబంధం కానప్పుడు. ఇది మనకు ఉగ్గుపాలతో నేర్పటం జరుగుతుంది. ఇలా ఎదుటివారి ఇష్టాయిష్టాలను గౌరవించటం, వారికి ఇబ్బంది కాకుండా ప్రవర్తించటం, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మనగలగటం ఒక్క భారతీయులకే సాధ్యం. ఎందుకంటే అది భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, మనస్తత్వాలతో ఒక భాగం.

అందుకే ప్రపంచంలో ఏ మూల చేరినా భారతీయులకు ఎవరితో ఎలాంటి సంఘర్షణలు చెలరేగిన దాఖలాలు లేవు. అలాగే ఎవరు భారతదేశం వచ్చినా, వారితోనూ ఎలాంటి ఉద్విగ్నతలు, సంఘర్షణలు జరగలేదు. ఇతర నాగరికతలు కొత్తవారిని అవమానంతో, భయంతో చూస్తే, భారతీయులు మాత్రం కొత్త వారిని ఆదరంతో చూస్తారు. ఆశ్చర్యంగా చూస్తారు. వారి నుంచి నేర్చుకునేది ఏదైనా ఉందేమోనని ఆలోచిస్తారు. ఎదుటివారిపై అధికారం చలాయించాలని చూడరు. ఎదుటివారిపై ఆధిక్యం నెరపాలని ప్రయత్నించరు. అందుకే వేరే ఏ ప్రాంతానికి వెళ్ళినా పాలలో నీళ్ళల్లా కలిసిపోయారు. వేరే ఎవరు భారత దేశానికి వచ్చినా సముద్రంలో ఉప్పులా మిళితమైపోయారు.

నీలుడికి విష్ణువు చెప్తున్న విషయం ఇదే. కశ్మీరులో ప్రథమంగా నివసిస్తున్నది నాగులు. అక్కడికి మనుషులు వస్తారు. వారితో నాగులు సహజీవనం చేయాల్సి ఉంటుంది. తమ ప్రాంతంలోకి రానిచ్చి తమతో సహజీవనం సాగిస్తున్నందుకు నాగులకు మనుషులు కృతజ్ఞులై ఉంటారు. నాగులను పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలతో అర్చిస్తారు. నాగుల ఆనందం కోసం నృత్యాలు చేస్తారు.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఒకసారి భారతదేశంలోని ఏ ప్రాంతంలో చూసినా ఇలా తాము ఎవరి స్థలంలో నివసిస్తున్నామో వారిని పూజించటం, వారితో కలిసిపోవటం చివరికి ఎవరు ఎవరో తెలియకుండా అందరూ ఒకటయిపోవడం కనిపిస్తుంది.

ఈ సందర్భంగా మరో విషయం ప్రస్తావించుకోవలసి ఉంటుంది. విదేశీ చరిత్రకారులు మొహెంజోదారో, హరప్పా ప్రాంతాలలో దొరికిన అవశేషాల ఆధారంగా భారతదేశంలో స్థానికులు, ఆర్యులు అన్న సిద్ధాంతాన్ని బలపరిచారు. ఆర్యులు వచ్చి స్థానిక నాగరికతను నాశనం చేశారు అని తీర్మానించారు, ఎలాంటి ఆధారాలు లేకున్నా. కానీ మొహెంజోదారో, హరప్పా, సరస్వతీ నదీ తీరాన వెలసిన నాగరికతల్లో ఎక్కడా సైన్యం ఆనవాళ్ళు లేవు, ఆయుధాలు లేవు, యుద్ధం ప్రసక్తి లేదు. ఇళ్ళకు తాళాలు లేవు. ఇది భారతీయ ధర్మం. పురాణాలలో కూడా ఎవరో వచ్చి దాడులు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడి వాళ్ళే అటు ఇటు తిరిగారు తప్ప ఎక్కడి నుంచో ఎవరో రాలేదు.

పాశ్చాత్యులు రాసింది పాశ్చాత్య చరిత్ర. అక్కడ ఒక తెగ మరో తెగను ఆక్రమించి వారిని తమ బలంతో సంపూర్ణంగా అణచివేశారు. అందుకే అక్కడ ఎదిగిన మతాలు కూడా అందరిపై ఆధిక్యం నెరపాలనీ, అందరూ తమ మాటే వినాలని పట్టుదలలు, అహంకారాలు ప్రదర్శిస్తాయి. కానీ భారతీయ ధర్మంలో, జీవన విధానంలోకి ఇలాంటి అహంకారాలు, పట్టుదలలు లేవు. అందరితో కలసి పోవడం ఉంది. సత్యం ఒకటే, పలువురు పలురకాలుగా దర్శిస్తారన్న విశ్వాసం కనిపిస్తుంది. నదులు ఎన్నెన్ని దిశలు ప్రయాణించినా చివరికి సముద్రమే గమ్యం అన్న గ్రహింపు ఉంది. నాగులు ఇక్కడి వారే. పిశాచాలు ఇక్కడివే. మనుషులు ఇక్కడి వారే. వారు సంచారం చేస్తు అనువైన ప్రదేశాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తాము స్థిరపడిన చోట నియమాలను గౌరవిస్తు అంతా ఒకటైపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here