నీలమత పురాణం-2

0
2

[box type=’note’ fontsize=’16’] “ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజులు పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ, అసందర్భం కానీ ఏమీ లేదు” అంటున్నారు కస్తూరి మురళీకృష్ణనీలమత పురాణం – 2’ అనువాద రచన లో. [/box]

[dropcap]జ[/dropcap]నమేజయ ఉవాచ!

మహాభారత సంగ్రామే నానా దేశ్య నరాధిపాః ।
మహాశూరాః సమాయాతాః పిత్రూణాం మహాత్మనామ్॥ (3)
కథం కాశ్మీరికో రాజా నాయాతస్త్రత్ర కీర్తయ్ ।
పాండవైర్ధార్త రాష్ట్రేశ్వ నా వృతః స కథం నృపః ॥ (4)

జనమేజయుడు అడుగుతున్నాడు:

“నా పూర్వీకుల నడుమ జరిగిన భారత యుద్ధంలో పాల్గొనేందుకు పలు విభిన్నమైన దేశాల నుండి, గొప్ప వీరులు వచ్చారు. పాల్గొన్నారు. కానీ కశ్మీర రాజులు ఆ యుద్ధంలో పాల్గొన్న సూచనలు లేవు. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం వహించే కశ్మీరుకు చెందిన రాజులను పాండుపుత్రులు కానీ, ధృతరాష్ట్ర సంతానం కాని ఎందుకని ఎంచుకోలేదు? ఎందుకని యుద్ధంలో తమవైపు పాల్గొనమని ఈ రెండు పక్షాల వారు కశ్మీర రాజును అడగలేదు?”

ఇదీ ప్రశ్న!

ఈ ప్రశ్నతో ‘నీలమత పురాణం’ ప్రారంభమవుతుంది.

గమనిస్తే ఈ ప్రశ్నలో ‘మహాభారత యుద్ధం నిజంగా జరిగిందా? లేదా?’ అన్న సందేహం లేదు. మహాభారత యుద్ధంలో వారు ఎలాంటి అస్త్రాలు, శస్త్రాలు వాడేరు? అన్న మీమాంస లేదు. పలు ప్రాంతాల నుండి రాజులు ఆ యుద్ధంలో ఎవరో ఒకరి వైపు నుండి పాల్గొన్నారు. అంటే, భారత ఖండంలో ఆ యుద్ధం ప్రభావానికి గురవని రాజ్యం లేదన్న మాట. ప్రతి రాజ్యం లోనూ ఆ యుద్ధం గురించిన చర్చ జరిగిందన్న మాట. అందుకే జనమేజయుడు యుద్ధం నిజంగా జరిగిందా లేదా? నిజంగా అక్షౌహిణుల సైన్యం పాల్గొందా? లేక లేని గొప్పలు చెప్పుకున్నారా? లాంటి ప్రశ్నలు అడగలేదు. సూటిగా ప్రశ్న అడిగాడు. “మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజుని పాండవులు కానీ, కౌరవులు కానీ తమవైపు పాల్గొనమని ఎందుకని అడగలేదు?”

గమనిస్తే అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా వివిధ పక్షాల వారు కలిసి కూటములు ఏర్పరచటం, మద్దతు సాధించటం, పోరాడటం ఏదో ఒక రూపాన జరుగుతూనే ఉంది. అప్పుడు రాజులు, ఇప్పుడు రాజకీయ పార్టీలు. అప్పుడూ ఇప్పుడూ దేశాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో కూటములుగా  ఏర్పడి మద్దతు ఆశించడం, “నువ్వు మా వైపు కాకపోతే మాకు వ్యతిరేకం” అన్నట్టు ప్రవర్తించడం ఉంది. అంటే ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది కానీ మారదు. అందుకే ఓ కవి ‘ఈ ప్రపంచం ముఖం పాతదే, కానీ ప్రపంచం కొత్తదిగా కనిపిస్తుంది’ అన్నాడు.

జనమేజయుడి మాటలలో గమనించదగ్గ మాట ఒకటుంది. ‘ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఆక్రమిస్తుంది కశ్మీరు’ అన్నది. ఈ మాట ప్రకారం కశ్మీరు ప్రాచీన భారతంలో ప్రపంచంలోనే ప్రాధాన్యం వహించిందన్నది స్పష్టమవుతోంది. అయితే కశ్మీర ప్రాధాన్యం పౌరాణికంగా ఏమిటన్నది వైశంపాయనుడు జనమేజయునికి ఇచ్చిన సమాధానంలో వస్తుంది. కానీ వైజ్ఞానికంగా చూసినా ప్రపంచంలో కశ్మీర్ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.

ఒక సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో తొలి మానవుడు ఉద్భవించింది కశ్మీరులోనే. పాశ్చాత్య చరిత్రకారులు, పరిశోధకులు ఆది మానవుడు ఆఫ్రికాలో ఉద్భవించి, యూరప్ ద్వారా ఆసియా వైపు ప్రయాణించాడని నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అలా అయితేనే వారి సిద్ధాంతాలు నిలుస్తాయి. కానీ కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన సెంట్రల్ ఏసియన్ స్టడీస్‌కు చెందిన పరిశోధకులు, ఆది మానవుడు ఉద్భవించింది కశ్మీర్‌లోనే అన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. దీనికి ప్రేరణ ‘బూర్జహామ్’ అన్న ప్రాంతంలో తవ్వకాలలో బయటపడ్డ అనేక అంశాలు. ఇక్కడి తవ్వకాలలో ఆది మానవుడు, ముఖ్యంగా, భూమిలో గుంటలు తవ్వి వాటిలో నివసించే మనుషుల అవశేషాలు కశ్మీరులో లభించడం శాస్త్రవేత్తలకీ ఆలోచనను ఇచ్చింది. అంతే కాదు, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించే విషయం రామాపిథెకస్,  పంజాబికస్ విభాగాలకు చెందిన తొలి ‘హోమోఎరక్టస్’ మానవుడి ఛాయలు కశ్మీరులో లభించినవే అతి ప్రాచీనం అన్నది. అదీగాక భారతీయ ధర్మంలో అతి పవిత్రంగా భావించే అనేకం కశ్మీర్‌ ఒక్క ప్రాంతంలోనే దొరుకుతాయి. అన్ని ఒకే చోట లభిస్తాయి. శ్రీచక్ర చేప (మత్స్యవతారంగా భావిస్తారీ చేపను), పద్మం, భూర్జర పత్రం, దేవదారు వృక్షం, కేసరి, కస్తూరి, మంచు, శివుడు, నాగులు, మానవ రూపంలోని సర్పాలు వంటి వన్నీ కశ్మీరులో లభిస్తాయి. పౌరాణిక కథ ప్రకారం మానవ జీవుల బీజాలన్నింటినీ రక్షించి తెచ్చిన పడవ గమ్యం కశ్మీరు. అంటే ఏ రకంగా చూసినా, అటు పౌరాణికంగా, ఇటు విజ్ఞానశాస్త్రపరంగా అయినా కశ్మీరు అత్యంత ప్రాధాన్యం వహిస్తుందన్నమాట. ఇక సాంస్కృతికంగా కశ్మీరు ప్రాధాన్యం చెప్పనవసరం లేదు.

ఇంత ప్రాధాన్యం కల కశ్మీరు దేశం ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ, అసందర్భం కానీ ఏమీ లేదు. మహాభారత యుద్ధం జరిగిందా లేదా అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివిన తరువాత కీకరకాయ అన్నట్టు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం నీడలో వికృతమైన, మూర్ఖపుటాలోచనలకు విజ్ఞానశాస్త్రం ముసుగువేసి,  అజ్ఞానాన్ని విజ్ఞానమని భ్రమపెట్టి ప్రజలకు అసలైన విజ్ఞానం సరైన రూపంలో అందకుండా జరుగుతున్న ప్రయత్నాల ప్రభావంతో ఈ రోజు మనల్ని మనమే నమ్మని పరిస్థితి సమాజంలో నెలకొంది.

(మిగతా వచ్చే సంచికలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here