[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ఉవాచ దేవీ భర్తురమ్ చారుచంద్ర విభువనా।
రసాతలే నదీరూపం కరిష్యామి జగద్గురో॥
భారతీయ ధర్మంలో జీవితంలోని ప్రతి క్షణం, విశ్వంలోణి ప్రతి అణువు ధర్మంతో, దైవంతో ముడిపడి ఉందనడానికి నిదర్శనం ఇది.
“సతి, శచి, గంగ, అదితి, యమున, దితి, కరిశిని వంటి వారంతా నదులుగా ఎలా మారారు?” అన్న గోనందుడి ప్రశ్నకు బృహదీశ్వరుడు సమాధానం ఇస్తున్నాడు.
ఒక సమయంలో పార్వతీదేవి కశ్యపుడిని దర్శించుకునేందుకు వెళ్ళింది. అప్పుడు కశ్యపుడు దేవిని ప్రార్థించాడు, అభ్యర్థించాడు. తాను సృజించిన అందమైన కశ్మీరుకి నీటిని బహుమతిగా ఇవ్వమని కోరాడు. అదితి, దితి, గంగలు ‘సరే’ అన్నారు. కానీ కరిశిని, ఉమ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారు.
అప్పుడు కశ్యపుడు శంకరుడిని ప్రార్థించాడు. ప్రసన్నం చేసుకున్నాడు. సతీదేవిని నదిగా మారి కశ్మీరంలో ప్రవహించేట్టు ఒప్పించమని భగవంతుడిని అభ్యర్థించాడు.
శంకరుడు అతడిని కరుణించాడు.
కశ్యపుడి మాట వినమని సతీదేవిని అభ్యర్థించాడు.
తదో వచాత్ హరో భార్యా కురు కశ్యప భాషితమ్।
ఇమ్యక్తువా భగవతా హరేణ పరమానందరాత్॥
సతీదేవి భర్త మాటను మన్నించింది. కశ్యపుడిని అడిగింది.
“ఈ దేశం (కశ్మీరం) నా శరీరం. అంటే ఈ దేశం నేను అవడం వల్ల, ఇది నాది అవడం వల్ల స్వాభావికంగా అది పవిత్రం అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ నేను నదిగా ప్రవహించి దేశాన్ని పవిత్రం చేయాల్సిన అవసరం ఏముంది?”
గమనిస్తే, పురాణాలలో ప్రతి అంశం ఎంతో లాజికల్‌గా హేతుబద్ధంగా ఉంటుంది.
ఎవరికయినా వచ్చే సందేహం ఇది.
‘కశ్మీరం పార్వతితో సమానం’ అన్నాడు శ్రీకృష్ణుడు.
అంటే స్వతహాగా, ప్రాకృతికంగా కశ్మీరం అతి పవిత్రం అన్నది నిస్సందేహం. అలాంటప్పుడు మళ్ళీ పార్వతి నదిగా మారి కశ్మీరును పవిత్రం చేయాల్సిన అవసరం ఏముంది? దైవం అంటేనే అతి పవిత్రం. అతి పవిత్రమైన దాన్ని పవిత్రం చేసేందుకు ఆ దేవతే నదిగా మారటం ఏమిటి?
దేవతలకు కూడా అదే సందేహం వచ్చింది.
ఆమె ప్రశ్నకు కశ్యపుడు సమాధానం చెప్పాడు.
‘కశ్మీరు పార్వతి. కానీ ఆ కశ్మీరు భూభాగంపై మనుషులు నివసిస్తున్నారు. పిశాచాలు నివసిస్తున్నాయి. ముఖ్యంగా, మనుషులు పిశాచాలు కలిసి నివసిస్తున్నారు. కాబట్టి మనుషులు తప్పనిసరిగా ‘పాపం’ వైపు ఆకర్షితులవుతారు. వారి బుద్ధి తప్పుత్రోవలు పట్టడం తథ్యం. దాంతో ఇతర దేశాలలో వారు అపకీర్తి పాలవుతారు. అవమానాల పాలవుతారు. దుష్ట కార్యకలాపాలను జరిపేవారిగా గుర్తింపు పొందుతారు. దాంతో వారంతా మలినాలమయం అవుతారు. అలాంటివారు నివసించడం వల్ల ఆ మలినాలు కశ్మీరానికి అంటుకుంటాయి. ఆ మలినాలను తొలగించి కశ్మీరును పరమ పవిత్రం చేయగల ఏకైక శక్తి సతీదేవి. అతి పవిత్రమై, సకల దేవతలు నివసించే ఈ భూభాగంపై దుష్కర్మలు జరపటం ఎంతో బాధాకరం. కాబట్టి, ఈ నిజాన్ని అవగాహన చేసుకుని దయ ఉంచి ఈ భూమిపై నదిగా మారి ప్రవహిస్తూ, ఈ భూభాగాన్ని పవిత్రం చేయమ’ని అభ్యర్థించాడు కశ్యపుడు.
ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా దైవానికి సంబంధించినది ఏదైనా పవిత్రమైనదే. కాని మనిషి మనసులో ఒక వైచిత్రి ఉంది. దానిలో ఎప్పుడూ మంచి చెడుల నడుమ నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దీన్ని వివరిస్తూ కూడా భారతీయ తత్వంలో ఒక కథ ఉంది.
భగవంతుడు దేవతలను రాక్షసులను సృష్టించిన తర్వాత వారికి ఆహారంగా దేన్ని నియమించాలా అని చాలా ఆలోచించాడు. దేన్ని చూపించినా రాక్షసులు, దేవతలు సంతృప్తి చెందటం లేదు. దేన్నీ ఆహారంగా స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. చివరికి భగవంతుడు మనిషిని చూపించాడు. మనిషిని చూడగానే ‘ఇతడే మా ఆహారం’ అని ఒకేసారి దేవతలు, రాక్షసులు అరిచారు. ఏయే అంగానికి చెందిన దేవతలు, రాక్షసులు ఒకేసారి ఆయా అంగాలలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
అంటే మనిషి శరీరంలోని ప్రతి అంగంలో దేవతలున్నారు. రాక్షసులు ఉన్నారు. కంట్లో చూపు దేవత, చూపు రాక్షసుడు; చెవిలో శ్రవణ దేవత, శ్రవణ రాక్షసుడు… ఇలాగన్న మాట. దాంతో దేవతలు కానీ, రాక్షసులు కానీ శక్తి కోసం మనిషిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఎవరికి ఆహారం అందించాల’న్నది మనిషి నిర్ణయిస్తాడు. మనిషి వంచి చూస్తే కంట్లోని మంచి దేవత శక్తిమంతుడవుతాడు. మనిషి దుష్టమైనవి చూస్తే, అతడి కంట్లోని దృష్టి రాక్షసుడు శక్తిమంతుడవుతాడు. కాబట్టి మనిషి సత్కర్మలు చేస్తే మనిషిలోని దైవం శక్తిమంతుడవుతాడు. మనిషి దైవంగా ఎదుగుతాడు. మనిషి చెడు వైపు ఆకర్షితుడయి, దుష్టకర్మలు చేస్తే, మనిషిలోని రాక్షసుడు శక్తిమంతమవుతాడు. మనిషి రాక్షసుడవుతాడు. మనిషి రాక్షసుడు అవటానికి కష్టపడనవసరం లేదు. కాని దైవత్వాన్ని గుర్తించడానికి కష్టపడాలి. మానవ మనస్తత్వం కూడా ఇదే. ‘మనిషి తనలోని జంతు లక్షణాన్ని అణచి, మానవత్వాన్ని శక్తిమంతం చేసి మనిషిగా నిలవాలి’ అంటుంది తత్వం.
మానవ మనస్తత్వంలో చెడు వైపు సులభంగా ఆకర్షితమయ్యే లక్షణం గ్రహించిన కశ్యపుడు పిశాచాలతో కలసిన మనుషులు త్వరగా చెడు వైపు ఆకర్షితులవుతారు, పాపం చేస్తారు; కాబట్టి వారి ద్వారా కలుషితమయ్యే కశ్మీరాన్ని పవిత్రం చేయాలని ఋషి సతీదేవిని అభ్యర్థించాడు. ఆమె నదిగా మారాల్సిన ఆవశ్యకతను వివరించాడు.
దీని వెనుక మరొక కారణం ఉంది. ప్రవహించే నదిలో మలినాలు నిలవవు, కొట్టుకుపోతాయి. అలా ప్రవహిస్తూ కశ్మీరులోని మలినాలను కలిపివేసుకుని కశ్మీరును పవిత్రం చేయమని అభ్యర్థిస్తున్నాడు. భారతీయ ధర్మానికి సంబంధించిన ఏ అంశాన్నయినా ఒకే కోణంలో చూస్తే సరిపోదు. దాన్ని పలు విభిన్నమైన కోణాలలో విశ్లేషించాలి. పలు విభిన్నమైన స్థాయిలలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కశ్యపుడి ఆ వివరణ విన్న సతీదేవి అతడి అభ్యర్థనను మన్నించింది. నదిగా ప్రవహించేందుకు అంగీకరించింది. అయితే సతీదేవి దేవలోకానికి చెందినది. నదిగా ప్రవహించాల్సింది మానవ లోకంలో. కాబట్టి తాను ‘రసాతలం’లో నదీరూపం ధరిస్తానని చెప్పింది. ఆ రసాతలం నుంచి భూలోకంలోకి రావటానికి ఆమె పర్వతాన్ని ఎంచుకుంది. నీలుడు ఎక్కడ నివసిస్తాడో ఆ పర్వతాన్ని ఎంచుకుంది. శివుడు త్రిశూలంతో నీలపర్వత పాదాల వద్ద తన ప్రవాహానికి మార్గం ఏర్పాటు చేస్తే తాను భూలోకంలో ప్రకటితమవుతానని చెప్పింది. తాను ప్రకటితం కాగానే కశ్యపుడు హలంతో తనకు ప్రవాహ మార్గం ఏర్పాటు చేయాలని, ఆ మార్గంలో తాను ప్రవహిస్తూ సింధు మహానదిలో కలుస్తానని చెప్పింది.
తేన శూలప్రహారేణ నిష్క్రమ్యాహం రసాతలాత్।
హలమార్గేణ యస్యామి యావత్సింధుమ్ మహానదమ్॥
ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటుంది.
దైవం అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు చేయలేదు. రసాతలంలో నది రూపం ధరించి, శివుడు కల్పించిన ద్వారం నుంచి భూమిపైకి ప్రవేశించి, ఋషి ఏర్పరిచిన మార్గంలో ప్రవహిస్తూ సింధునదిలో కలుస్తోంది. సతీదేవి నదీరూపం ధరించింది. ఆ నదిని ‘వితస్త’ నది అంటారు. దాన్ని ఇప్పుడు ఝీలం నది అని అంటున్నాం. ఈ ఝీలం నది శివుడు ఏర్పాటు చేసిన ‘బేసిన్’ (basin) నుంచి వెలికి వచ్చింది. దీన్ని ‘వెరినాగ్’ సరస్సు అంటున్నారిప్పుడు. ఈ ‘వెరినాగ్’ సరస్సు పీర్ పంజాల్ పర్వత శ్రేణుల పాదల వద్ద ఉంది. ఇది కశ్మీరుకు దక్షిణాగ్నేయ దిక్కున ఉంది. అటు నుంచి కశ్మీరులో ప్రవహిస్తూ, ఉపనదులను కలుపుకుని శ్రీనగర్ వులార్ సరస్సుల గుండా ప్రవహిస్తూ పంజాబ్ చేరుకుని, చీనాబ్ నదితో కలుస్తుంది. చీనాబ్, సట్లెజ్ నదితో కలిసి ‘మిథాన్‌కోట్’ వద్ద సింధునదిలో కలుస్తుంది. అంటే ఆనాటి ఋషులు నది జన్మస్థలం నుండి దాని ప్రవాహ మార్గం, దాంతో పాటు సాగర సంగమం వరకు క్షుణ్ణంగా తెలుసుకున్నారని అర్థం. ఇప్పటి లెక్కల్లో ఈ నది ప్రవాహ మార్గం 725 కి.మీ.!
(ఇంకా ఉంది)