నీలమత పురాణం – 23

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]సా[/dropcap]ధారణంగా నదులు ఎత్తయిన కొండ ప్రాంతాలలో ఒక చిన్న నీటి ఊట నుండి ఆరంభమవుతాయి. క్రిందకు ప్రవహిస్తాయి. తరచూ వర్షం పడుతూండడం వల్ల, ఇతర చిన్న చిన్న ప్రవాహాలు కలుస్తూండడం వల్ల అది ఒక ప్రవాహంలా మారుతుంది. కొండ పై నుండి సమతల ప్రదేశాలు చేరుతుంది. ఇక్కడ కూడా ఇతర ఉపనదులు వచ్చి కలుస్తూండడం, పై నుండి కొత్త నీరు అందుతుండటం నదిని ముందుకు తోస్తుంది. ఇలా ప్రవాహం భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రవహిస్తూ ముందుకు సాగుతుంది. కొన్ని సందర్భాలలో మారిన భౌగోళిక పరిస్థితులు నదీ ప్రవాహ దిశను మారుస్తాయి. ఆ నదికి నీటిని తెచ్చి ఇచ్చే ఉపనదుల దారులు మళ్ళిస్తాయి. దాంతో కొండ పై నుండి దిగిన నదికి కొత్త నీరు అందడం తగ్గిపోతుంది. దాంతో  నది దిశ మారవచ్చు. నది ఎండిపోవచ్చు. ఒక నది ప్రవాహ జీవితంలో ఇలాంటి అనేక దశలుంటాయి. సంఘటనలుంటాయి. పురాణాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భారతదేశంలో ప్రవహించే నదుల చరిత్రను తెలుసుకోవచ్చు. ఆ చరిత్రను ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలతో పోలిస్తే, ఏ మాత్రం తేడా లేకుండా సరిపోవటం చూసి పూర్వీకుల అత్యద్భుతమైన పరిశీలనాశక్తికి, విజ్ఞానానికి జోహార్లు అర్పించవచ్చు.

‘నీలమత పురాణం’ ఇందుకు భిన్నం కాదు. ఈ పురాణంలో ప్రదర్శించిన అంశాలు పురాణ రచయిత విజ్ఞానానికి ఆశ్చర్యపరుస్తాయి. అంతే కాదు, పురాణ పఠనం  వ్యక్తికి భౌతిక, సామాజిక, భౌగోళిక, ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తుందో స్పష్టం అవుతుంది. కావ్యాలు చదువుతుంటే  ఆ కావ్యాలలో అడవుల వర్ణనల్లో వారు ప్రస్తావించిన వృక్షాలు, వృక్షాల జాతులు ఆధునిక బాటనీ పాఠ్యపుస్తకాలకు ఏ మాత్రం తీసిపోవు. ఇది దాదాపుగా అన్ని అంశాలకు వర్తిస్తుంది.

పార్వతి నదిలా మారేందుకు రసాతలాన్ని ఎంచుకోవడంలో కూడా ఇలాంటి భౌగోళిక సత్యం కనిపిస్తుంది. నీటి ఊట భూమి నుంచి వెలుపలికి వస్తుంది. మనకు భూగర్భ జలం తెలుసు. భూమిలో జలం ఉన్నా, అది బయటకు రావటానికి మార్గం కావాలి. ఆ మార్గం ఎలా ఏర్పడిందో నీలమత పురాణం చెబుతోంది. పార్వతి నది రూపం ధరించి ప్రవహించాలంటే ముందుగా భూగర్భంలో నీటి రూపం ధరించాలి. దాన్ని ‘రసాతలం’ అంటున్నారు. అక్కడ నీటి రూపం ధరించిన తరువాత నీరు బయటకు వచ్చేందుకు శివుడు మార్గం ఏర్పరిచాడు. అలా ఏర్పడిన మార్గం నుండి వెలికి వచ్చి నీరు ప్రవహించే మార్గాన్ని కశ్యపుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ శివుడు, పార్వతి, కశ్యపుడు వంటివన్నీ ప్రతీకలు. భౌగోళిక విజ్ఞానాన్ని దైవ ప్రతీకల రూపంలో వివరిస్తోంది నీలమత పురాణం. శివుడు నది వెలుపలికి రావటానికి వితస్తి పరిమాణం కల గుంటను ఏర్పాటు చేశాడు కాబట్టి నది ‘వితస్త’ అయ్యింది.

కశ్మీరంలో పార్వతి నదీ రూపం ధరించి ప్రవహిస్తోందని దేశం నలుమూలలా తెలిసింది. పలు దేశాలలో తెలిసింది. దాంతో ప్రజలు నలుమూలల నుండి కశ్మీరుకు రాసాగారు. నదిలో స్నానమాడి తమ పాపాలను కడుగుకోసాగారు. వారిని చూసి అసహ్యించుకున్న పార్వతి మళ్లీ రసాతల లోకంలోకి అదృశ్యమయింది. కశ్యపుడు ఆమెని బ్రతిమలాడితే మళ్లీ ‘పంచహస్త’ దగ్గర భూమి పైకి వచ్చింది.

ఇది ఒక అద్భుతమైన విషయం. కొండపైన నీటి ఊట వెలువడుతుంది. తరువాత అది అదృశ్యం అవుతుంది. అదే ధార మరోచోట మళ్లీ వెలికి వస్తుంది. కాస్త దూరం ప్రవహించి మళ్లీ అదృశ్యం అవుతుంది. మళ్లీ కాస్త దూరంలో వెలికి వస్తుంది. ఇలా నది అదృశ్యం అవటానికి ఒక కారణం, మళ్లీ వెలికి రావటానికి ఒక కారణం చెప్తూ నదీ ప్రవాహ గతిని అర్థవంతం చేస్తుంది నీలమత పురాణం. అంతే కాదు, అలా కారణాలు చెప్తూ ఆనాటి సామాజిక అంశాలను కూడా స్ఫురింపచేస్తుంది. ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు తన నీటిలో స్నానమాడి మలినాలను కడుగుకోవాలని రావటం చూసిన వితస్త అదృశ్యమయింది. అప్పుడు కశ్యపుడు ‘నాగ పంచస్త’ దగ్గర బ్రతిమలాడి నదీ ప్రవాహాన్ని వెలికి తెచ్చాడు. ఒక గవ్యూతి దూరం ప్రయాణించగానే నది ‘కృతజ్ఞత’ లేని మనిషిని చూసింది. మళ్లీ అదృశ్యం అయింది.

కశ్యపుడు మళ్లీ బ్రతిమాలాడాడు. ఒప్పించాడు. దాంతో ఒక క్రోసు దూరంలో మళ్లీ వెలికి వచ్చింది. కాస్త దూరం ప్రవహించిన తరువాత స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి స్నానం చేయటం కోసం రావటం చూసింది. మళ్లీ అదృశ్యం అయిపోయింది. ఈసారి కశ్యపుడితో పాటు వేల సంఖ్యలో బ్రాహ్మణులు కూడా ప్రార్థించారు. దాంతో నరసింహ ఆశ్రమం వద్ద వెలికి వచ్చింది.

కాస్త దూరం ప్రవహించగానే బ్రాహ్మణ హంతకుడు కనిపించాడు. మళ్లీ వెంటనే అదృశ్యం అయిపోయింది నది.

అప్పుడు కశ్యపుడు కొన్ని సుందరమైన శ్లోకాలతో నదిని ప్రార్థిస్తాడు. కశ్మీరు పాదాలను శుద్ధి చేసేందుకు నదిగా మారిన పార్వతి, పాపులను చూసి అదృశ్యం అయిపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సందేహాలకి కశ్యపుడి ప్రార్థనా శ్లోకాలు సమాధానాన్నిస్తాయి.

పాపానాం పాపనార్థాయ ప్రార్థతాసి మహాపగే।
తస్మాత్ పావయ పావని మా ప్రణాశం ప్రజాషుగే ॥

పాపుల పాపాల నుంచి కశ్మీరును పవిత్రం చేసేందుకు అవతరింపబడిన వితస్త పాపులను చూడగానే అంతర్థానం అవటం కశ్యపుడికి అర్థం కాలేదు. అందుకని ఆమెను ప్రార్థించాడు.

తల్లీ… పర్వతపుత్రికా! ఋషుల అందరి నమస్సులు అందుకునే నేల, అందరికీ వరాలిచ్చే నేల, హరుడి సాంగత్యంలో అత్యంత పవిత్రంగా భాసిల్లే నేల ఎలాంటి బాధ, దుఃఖం, మలినాలు లేని అతి చల్లటి నీటితో ప్రవహించే నీ తీరాన దేవీ దేవతలు జలకాలాడుతారు. నీ పవిత్ర వారిధరారాశిలో మునకలు వేసి జనులు పాపవిముక్తులై పవిత్రులు అవుతారు. ఏ పాపాత్ములను చూసి నువ్వు పారి పోతున్నావో ఆ పాపాత్ములే నీ నీటితో పరిశుద్ధులై దివ్య రోచిస్సులతో నీ నదీ తీరంలోనే అలరారుతారు. నిప్పులో ఎంతటి మలినమైనదైనా భస్మమవుతుంది. నిప్పు మాత్రం ఎల్లప్పటికీ పరిశుద్ధంగానే ఉంటుంది. అలాగే ఎలాంటి పాపాత్ములను అయినా పరిశుద్ధులను చేసే నువ్వు ఎల్లప్పటికీ పవిత్రంగా, పరిశుద్ధంగానే ఉంటావు. కాబట్టి పాపాత్ములను పరిశుద్ధులను చేయి. వారి దర్శన మాత్రంతో అంతర్థానం అవ్వకు.

కశ్యపుడి ప్రార్ధనలతో సంతుష్టి చెందిన దేవత “నేను సామాన్య పాపాత్ముల పాపాలను కడగి వేయగలను. కానీ అత్యంత దుష్టాత్ముల పాపాలను తొలగించలేను. ఇందుకు మీరు లక్ష్మీదేవిని అభ్యర్ధించాలి. ముల్లోకాలను  పవిత్రులను చేయగల శక్తి లక్ష్మీదేవిది. అదితి, దితి, మహానది, గంగలు కూడా ఆమెతో సరిపోలరు. కాబట్టి లక్ష్మీదేవిని అభ్యర్థించండి” అంది పార్వతి.

ఇక్కడ మనం గమనించాల్సిన ధర్మసూక్ష్మం ఒకటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here