Site icon Sanchika

నీలమత పురాణం – 26

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కశ్మీరేషు జనో నిత్యం వసతాం భీమవిక్రమ।
క్లిష్యేత్ హి సదా లోకః నిష్క్రామన్ ప్రవిశన్ పునః॥

‘నీలమత పురాణం’లో పై శ్లోకం చదవగానే గుండె ఝల్లుమంటుంది!

కశ్మీరంలో ఆరు నెలలు పిశాచాలు, ఆరు నెలలు మనుషులు ఉండేట్టు భగవంతుడు అనుగ్రహించాడు. దాంతో ఆరు నెలలు అవగానే ఆహార పదార్థాలు వెంటతీసుకుని కశ్మీరు వదిలివెళ్తారు ప్రజలు. అందరు వెళ్ళారు కానీ చంద్రదేవుడు మాత్రం వెళ్ళలేదు. చంద్రదేవుడు  విజ్ఞానవంతుడు. వయసులో పెద్దవాడు. దాంతో అతను కశ్మీరు వదిలివెళ్ళటానికి ఇష్టపడలేదు. కశ్మీరంలోనే ఉండిపోయాడు.

ఆరు నెలలవగానే ఆకలిగొన్న సింహాల్లా పిశాచాలు కశ్మిరం వచ్చి చేరాయి. వస్తూనే వాటి దృష్టి చంద్రదేవుడిపై పడింది. అయితే అవి చంద్రదేవుడిని పీక్కుతినలేదు. తినేస్తే క్షణాల్లో అదృశ్యమై పోతాడు చంద్రదేవుడు. కాబట్టి చంద్రదేవుడిని ఓ ఆటవస్తువులా ఆడుకోవాలని నిర్ణయించుకున్నాయి పిశాచాలు. పైగా పిశాచాల రాజు ‘నికుంభుడు’ పిశాచాలు మనుషులను చంపకూడదని ఆదేశించాడు. అందుకని పిల్లలు తేనెటీగను దారానికి కట్టి ఎలా ఆడుకుంటారో అలా చంద్రదేవుడితో ఆడుకోవటం ఆరంభించాయి, ఆనందించసాగాయి. మనిషిని ఒకేసారి చంపటం కన్నా ఇలా బ్రతకనీయకపోవటం, చావనీయకపోవటంలో అమితమైన ఆనందం ఉందని అర్థం చేసుకున్నాయి.

అయితే చంద్రదేవుడు అలసిపోయాడు. ఓ వైపు దుర్భరమైన చలి, మరోవైపు కత్తుల్లా వీచే చల్లటి గాలులు, ఇంకో వైపు పిశాచాల పైశాచికానందం. దాంతో ఇక చంద్రదేవుడు భరించలేకపోయాడు. అతడు పిశాచాల నుంచి తప్పించుకుంటు ఎటు వెళ్తున్నాడో తెలియకుండా భ్రమించసాగాడు. అతడికి తాను ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అలా పిశాచాల నుంచి తప్పించుకుని తిరుగుతూ తిరుగుతూ అతడు ‘నీల’దేవుడి నివాసం చేరుకున్నాడు.

నీలదేవుడు నాగుల దైవం. అతడు అతి శక్తివంతమైన, భయంకరమైన విషం కల నాగులు సేవ చేస్తుండగా, పిశాచాల రాజు ‘నికుంభుడు’ పరిచర్యలు చేస్తుండగా, అందమైన నాగ యువతులు అతడి ఆజ్ఞ కోసం వేచి యుండగా, విశ్రాంతిగా ఉన్నాడు. పెద్ద సంఖ్యలో నాగులు అతని గుణగానాలు చేస్తున్నాయి.

ఇంతమంది ఇన్ని రకలుగా గౌరవిస్తూ పరిచర్యలు చేస్తున్న అతడే నీలుడని చంద్రదేవుడు గ్రహించాడు.

చంద్రదేవుడు నీలుడిని సమీపించి వందనం చేశాడు. మోకాళ్ళు భూమికి తాకేట్టు కూర్చుని రెండు చేతులు జోడించి నీలుడిని పొగుడుతూ ప్రార్థన చేశాడు.

“నాగుల మహారాజువు, నీలి కలువ తనుకాంతి కలవాడవు, నీలమేఘ తతుల పోలినవాడవు, నీలి జలాల నివసించువాడవు, ఓ నాగదేవుడా, ఏడు వందల పడగలు కలవాడా, ఏడు గుర్రాలు పూన్చిన రథంలో మెరిసే సూర్యుడిలా వెలిగేవాడా, నీలి ఆకాశంలోని అమరుల పోలినవాడా, నిన్ను బ్రాహ్మణాలు స్తుతిస్తాయి. వేదాలు స్తుతిస్తాయి. నాగులు నిన్ను ఆకాశంలో సూర్యుడిలా పూజిస్తాయి. నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు. ఆపదలో ఇరుక్కున్నాను, రక్షించు, నన్ను రక్షించు” అని ప్రార్థించాడు.

నిజానికి నీలమత పురాణంలో నీలుడే ప్రధానం కాబట్టి చంద్రదేవుడు నీలుడిని ఇంకా ఇంకా పొగిడాడు. నీలుడి వల్లే బ్రహ్మ అనంతుడయ్యాడని, పవిత్రుడయ్యాడని అంటాడు. “నీ తపస్సు, రోచిస్సుల వల్లనే మంచు, నీరు, వర్షాలు భూమికి లభిస్తాయి. నీలాంటి సంతానం వల్లనే ప్రజాపతి కశ్యపుడు మరింత గొప్పవాడయ్యాడు. దేవదానవుల యుద్ధంలో వందల, వేల సంఖ్యలో రాక్షసులను సంహరించావు. నాగవాసుకిలా విష్ణువుకి నువ్వు అత్యంత ప్రీతిపాత్రుడివి” ఇలా చాలా పొగుడుతాడు చంద్రదేవుడు.

చంద్రదేవుడి పొగడ్తలకు, అతడి భాషకు, భావనాబలానికి ప్రసన్నుడవుతాడు నీలుడు.

“ఓ చంద్రదేవా… విద్యావంతుడవు, విజ్ఞానవంతుడవు. నువ్వు నా అతిథివి. నీకు శుభం అవుతుంది. ఏదైనా ఒక వరం అడుగు. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా ఇంటికి రావచ్చు. ఇష్టమైనన్నాళ్లు సుఖంగా, సంతోషంగా ఆతిథ్యం స్వీకరించవచ్చు” అన్నాడు.

“నాగనాయకా, తప్పనిసరిగా నాకు వరం ఇవ్వాలి. నువ్వు నాకు ఇవ్వగలిగే వరమే నేను కోరుతాను. ఓ శక్తిశాలీ, కశ్మీరంలో మనుష్యులు ఎల్లప్పుడూ నివసించే వరం ఇవ్వు. ఒక చోట నివసించడం అలవాటయిన వారు అన్నీ వదిలి కొత్త స్థలానికి వెళ్ళటం, కొన్నాళ్ళకి మళ్ళీ వెనక్కు వచ్చి నివసించటం అత్యంత కష్టతరం, దుర్భరం. అది అతి దీనావస్థ. ఇళ్ళు వాకిళ్ళు వదిలి ఇతర పట్టణాలకు వెళ్ళాల్సిరావటంలోని వేదన, అది అనుభవించిన వారికే తెలుస్తుంది. కాబట్టి కశ్మీరు ప్రజలు కశ్మీరులోనే నివసించే వరం ఇవ్వు. ఇదే నేను కోరుకునేది.”

చంద్రదేవుడు నీలుడిని కోరిన వరం ఒళ్ళు జలదరింపజేస్తుంది.

ఒక పద్ధతి ప్రకారం కశ్మీరు నుండి కశ్మీరీ పండితులను వెడలనడపటం గుర్తుకువచ్చి మనసు బాధామయం అవుతుంది.

ఎంతటి దుర్భరమైన పరిస్థితి!!

మహారాజుల్లా స్వంత ఇళ్ళల్లో, తరతరాలుగా తమ తమ ఊళ్ళల్లో స్థిరపడి ఉన్నవారు ప్రాణాలు అరచేత పట్టుకుని అన్నిటినీ వదిలి మరో ప్రాంతానికి తరలి వెళ్ళాల్సి రావటం ఊహిస్తేనే ఒళ్ళు కంపించే అతి దుర్భరమైన స్థితి. దీనికి తోడు తమ వేదన, తమ రోదన, తమ దైన్యం పట్టని తమ స్వంత దేశవాసుల నడుమ కాందిశీకుల్లా, ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చి పరాయి దేశం వాళ్ళలా ఉండాల్సి రావటం ఇంకా దుర్భరమైన స్థితి. ఇది చాలదన్నట్టు, పరాయి దేశానికి చెందిన వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వస్తే దేశమంతా వారి పైన సానుభూతి వెల్లువ కురిసింది. కానీ స్వంతదేశంలోనే కాందిశీకుల్లా బ్రతుకుతున్న వారి పట్ల  సానుభూతి అటుంచి, వారి పట్ల తూష్ణీంభావం ప్రదర్శించడం, అసలు అలాంటి సమస్య ఒకటుందన్న సృహ లేనట్టు ప్రవర్తించడం ఇంకా బాధాకరం.

కనీసం నీలమత పురాణం కాలంలో ఆరు నెలలకు కశ్మీరు ప్రజలు వెనక్కి తిరిగి వస్తారు. ఇప్పుడు కశ్మీరు వదిలిన పండితులు ఎప్పుడు తిరిగి తమ స్వస్థలం చేరుకుంటారో ఎవరికీ తెలియదు. ఇది మరీ దుర్భరం. ఊహకందని దైన్యం ఇది.

ఇక్కడ అప్రస్తుతమైనా, ఒక విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. దేశ విభజన సమయంలో ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్ చేరినవారి పరిస్థితి వేరు. పండితుల దుస్థితి వేరు. తమ స్వస్థలం పరాయి దేశంగా మారినప్పుడు వారు సర్వం వదిలి ప్రాణాలు రక్షించుకునేందుకు తమ దేశం వచ్చారు. కశ్మీరు భారతదేశంలో అంతర్భాగం. కశ్మీరులో తాము తప్ప మరెవ్వరూ ఉండకూడదన్న దుష్టబుద్ధితో, తద్వారా అధిక సంఖ్య తమది కాబట్టి, భారతదేశం నుంచి తాము వేరు అని నిరూపించి వేరు పడే దురాశతో పద్ధతి ప్రకారం పండితుడు అన్న వారందరినీ కశ్మీరు నుంచి తరిమివేశారు. కశ్మీరులో దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరు స్థిరపడే వీలు లేదు. తాము కాక ఉండే వేరే వారినీ తరిమివేశారు. ఇలాంటి పరిస్థితిలో దేశంలోని ప్రతి ఒక్కరూ స్పందించి ముక్తకంఠంతో కశ్మీరులో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి, పరిస్థితులు చక్కబెట్టేందుకు నడుం కట్టాలి. ఇందుకు భిన్నంగా దేశం ఉదాసీనంగా ఉండిపోయింది. మేధావులు కశ్మీరులోని మానవ హక్కుల గురించి కన్నీళ్ళు కార్చారు. ఇప్పటికీ కారుస్తున్నారు. భారత సైన్యంపై రాళ్ళు విసిరేవారిపై సానుభూతి చూస్పిస్తున్నారు. వారు రాళ్ళు విసిరేందుకు కారణాలు వెతికి సమర్థిస్తున్నారు. కానీ ఎందుకని తమ స్వదేశంలో తాము కాందిశీకుల్లా బ్రతకాలన్న కశ్మీరీ పండితుల ప్రశ్నకు సమాధానం లేదు. అసలు అలా అడిగే అవకాశమే వారికి ఇవ్వటం లేదు. పైగా వారు ఇలా తరిమివేతకు గురవటానికి వారిదే దోషం అన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆరు నెలల కోసారి ఇల్లు వదలాల్సి రావటం ఎంతో కష్టం అని చంద్రదేవుడు అనటం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇప్పటి పరిస్థితి చూస్తే చంద్రదేవుడు ‘ఏమనేవాడో’ అన్న ఆలోచన కలుగుతుంది.

ఏవమస్తు ద్విజశ్రేష్ఠ వసాన్విత ఇ నరాః సదా।
పాలయన్తస్తు మద్వాక్యం కేశవాద్యన్మయా శృతమ్॥

చంద్రదేవుడిని అనుగ్రహించాడు నీలుడు.

“నీ కోరిక నెరవేరుతుంది. కేశవుడి ఆజ్ఞ ప్రకారం, అతడి సూచనలను అనుసరిస్తూ కశ్మీరులో ప్రజలు నిరంతరం నివసించవచ్చు” అన్నాడు నీలుడు.

చంద్రదేవుడికి వరం ఇచ్చిన తరువాత అతడిని తన ఇంటికి తీసుకువెళ్ళి అతిథి సత్కారాలు చేసి, ప్రజలు కశ్మీరంలో సుఖంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలను చెప్తాడు. ఆరు నెలలు అతడి ఆతిథ్యం స్వీకరించి చంద్రగుప్తుడు తన స్వంత ఇంటికి వెళతాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version