Site icon Sanchika

నీలమత పురాణం – 31

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]క[/dropcap]శ్మీరును కశ్యపుడు నిర్మించిన ముహూర్తంలో కూడా పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలి. ఆ రోజు కశ్మీరు ప్రజలంతా శుభ్రంగా స్నానం చేసి, అందంగా అలంకరించుకుని, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, సంతోషంగా సన్నిహితులతో, స్నేహితులతో కూడి సంబరాలు చేసుకోవాలి.

సంగీత వాయిద్యాలు ఆనందకరంగా మ్రోగిస్తూ శుభప్రదమైన గీతాలు పాడాలి. కొత్త దుస్తులు కుట్టించుకోవాలి.

‘పానం చ పానపైపేయం’. తాగాలని ఉన్నవారు, తాగుడు అలవాటు ఉన్నవారు సుబ్బరంగా తాగవచ్చు.

ఈ ఆట పాటలు, సంబరాలు సూర్యుడిని సంతృప్తి పరుస్తాయి.

మాఘం లోని ఏడవ రోజున, ఆషాఢంలోని ఏడవ రోజున కూడా ఇదే పద్ధతిని పాటించాలి. ఈ రకంగా ఈ మూడు నెలలలో ఏడవ రోజున సంబరాలు చేసుకునే వారికి సూర్యలోకం సిద్ధిస్తుంది.

మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున ఆహారాన్ని కేవలం రాత్రి పూట మాత్రమే సేవించాలి. చంద్రుని పూజించాలి. పూల మాలలతో, ద్రవ్యాలతో, పలు రకాల ఆహార ద్రవ్యాలతో, దీపాలతో, పళ్ళతో, ఉప్పుతో, అగ్నితో పూజించాలి. బ్రాహ్మణులను పూజించాలి. భర్త, కొడుకు బ్రతికి ఉన్న స్త్రీలను పూజించాలి. భర్త, కొడుకులు బ్రతికి ఉన్న బ్రాహ్మణ స్త్రీలకు ఎర్రని చీరలను బహుకరించాలి. చెల్లెలికి, అత్తలకు, స్నేహితుల భార్యలకు కూడా ఎర్రని చీరను బహుమతిగా ఇవ్వాలి. ఈ పౌర్ణమికి అందరూ సంతోషంగా సంబరాలు చేసుకోవాలి.

ప్రతివారూ యథాశక్తి పూజలు చేసుకోవాలి. శక్తి లేని వారు పూజలు చేయకున్నా ఫరవాలేదు. పౌర్ణమిన మహిళలు ప్రత్యేకంగా పూజలు చేయాలి. హేమంత, శిశిరాల్లో నీలుడిని పూజించాలి. స్థానిక నాగులను అర్చించాలి. మేరు పర్వతంపై పూచిన పూలు, పళ్ళు, ఆకులను హిమాలయాలకు అర్పించాలి. బక పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో పూజించాలి. బార్లీ ప్రసాదం పెట్టాలి. బార్లీని నెయ్యితో వండిన పదార్థాలను బ్రాహ్మణులకు ఇవ్వాలి. రోజంతా ఆటలు, పాటలు, నృత్యాలతో ఆనందంగా సంబరాలు చేసుకోవాలి.

మంచు కురిసే వేళలో కొత్తగా తయారయిన మద్య పానీయాలను అలవాటు ఉన్నవారు ఆనందంగా స్వీకరించాలి. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఇష్టమైన ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసుకుని భుజించాలి.

శ్యామ దేవతను పూలతో, సుగంధ ద్రవ్యాలతో బహురుచికరమైన ప్రసాదాలతో పూజించాలి.

వెచ్చని దుస్తులు ధరించి ఈ కురిసే మంచులో స్నేహితులు, సేవకులు, పిల్లలు, బంధువులతో కలిసి కూర్చుని సంబరాలు చేసుకోవాలి. ఈ సందర్భం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను సేవించాలి. సంగీతం వినాలి. సంగీతాన్ని ఆనందించాలి. నృత్యాలు చేయాలి. మహిళలను గౌరవించాలి.

పుష్యమి నాటి 8వ రోజున ‘శుద్ధి’ కర్మలు చేయాలి. మాఘమాసం 8వ రోజున మాంసంతో, ఫాల్గుణ మాసం ఎనిమిదవ రోజున తీపి పదార్థలతో పూజలు జరపాలి. ఈ నెలల్లో తొమ్మిదవ రోజున మరణించిన మహిళలకు శ్రాద్ధ కర్మలు చేయాలి. శ్రాద్ధ కర్మలు జరిపిన రాత్రుళ్ళు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి, స్త్రీ సంగమం పరిత్యజించాలి. పుష్యమి నెల పౌర్ణమి రోజున ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు, నెయ్యి పూసుకుని శుభ్రంగా స్నానం చేయాలి. స్నాన జలంలో పలురకాల ఔషధాలను  కలపాలి. ఆపై నారాయణ, శ్రుక, సోమ, బృహస్పతి లను విడివిడిగా పూజించాలి. పై దేవతలను వారికి సంబంధించిన మంత్రాలతో పూజించిన తరువాత బ్రాహ్మణులకు శక్తి కొలదీ దానాలు ఇచ్చి నెయ్యి, పాలతో తయారయిన పదార్థాలను ఆనందంగా భుజించాలి. పూజలు చేయించిన పూజారికి చక్కటి వస్త్రం ఇవ్వాలి.

ఈ రకంగా పూజలు చేయటం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలాంటి స్నానం వల్ల పాపాలు నశిస్తాయి. ఆరోగ్యం కలుగుతుంది.

ఉత్తరాయణంలో విష్ణుభక్తులు విష్ణువును, శివభక్తులు శివుడిని యథాశక్తి పూజించాలి. విగ్రహాలకు నెయ్యి పూసిన తరువాత, నెయ్యితో విగ్రహాలను తయారు చేయాలి. ఈ విగ్రహాలను మూడు నెలల పాటు పూజించాలి. బ్రాహ్మణులకు ఇంధనాన్ని, ఆవులకు గడ్దిని శక్తిని అనుసరించి ఇవ్వాలి. ఇలా జరిపిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు. సుఖిస్తారు. మరణాంతరం సుఖలోకాలను పొందుతారు.

(ఇంకా ఉంది)

Exit mobile version