నీలమత పురాణం – 32

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]పౌ[/dropcap]ష్యమాసం కృష్ణపక్షంలో 12వ రోజున ఉపవాసాన్ని ఆచరించాలి. ఆపై శుభ్రంగా స్నానమాచరించాలి. తిలతైలంతో అర్చన చేయాలి. బ్రాహ్మణులకు తిలోదకాలు అర్పించాలి. ఇది పాపాలను తొలగిస్తుంది.

పధ్నాలుగవ రోజున, సూర్యోదయానికి ముందే వితస్త లేక విశోక కాకపోతే చంద్రావతి, హర్షపథ, త్రికోటి, సింధు, కనకవాహిని వంటి పవిత్ర నదులలో దేనిలోనైనా చల్లటి నీటిలో స్నానమాచరించాలి. ఇలాంటి నదులు పరిసర ప్రాంతాలలో లేకపోతే తటాకాలు, సరస్సులలోనైనా స్నానం ఆచరించవచ్చు.

యముడికి ఒక పేరు ఉచ్చరిస్తు తర్పణాలు విడవాలి. యముడు, ధర్మరాజు, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వనాశక వంటి నామాలు ఉచ్చరిస్తూ ఏడుమార్లు తర్పణాలు విడవాలి.

స్నానమాచరించి ధర్మరాజును పూలతో, ధూపదీపాలతో, ప్రసాదంతో పూజించాలి. తిలతైలం, నెయ్యి కలిపి అగ్నిని అర్చించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలాంటి కర్మలు ఆచరించడం వల్ల పాపాలు నశిస్తాయి. ఘోరమైన పాపాలు నశిస్తాయి. పాపాన్ని ప్రక్షాళన చేసుకోకుండా వ్యక్తి పరిశుద్ధుడు ఎలా అవుతాడు? కాబట్టి తప్పనిసరిగా పూజాదికాలు నిర్వహించాలి. పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి.

పౌష్య మాసం కృష్ణ పక్షం శ్రావణంలో కలిసిన సమయాన స్నానమాచరించడం అతి పవిత్రం.

మాఘ మాసం శుక్ల పక్షం నాలుగవ రోజున ఐశ్వర్యం కలవారు ఉమాదేవిని దీపాలతో, ధాన్యంతో, పూలమాలలతో, సుగంధ ద్రవ్యాలతో పూజించాలి. ఉప్పు, చక్కెర, కుంకుమ, పలు విభిన్నమైన పుష్పాలతో స్త్రీలను, ముత్తయిదువులను పూజించాలి. ఆశ్వయుజంలోనూ, జ్యేష్ఠంలోనూ ఇలాగే పూజలు చేయాలి. మహిళలు తప్పనిసరిగా ఈ పూజాదికాలను నిర్వహించాలి.

మాఘ మాసం పౌర్ణమి రోజున తిలలతో శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. కాకులకు తగిన రీతిలో అహారాన్ని అందించాలి.

మాఘ మాసం దాటిన తరువాత మూడు రోజులు వైభవంగా పూజల సంబరాలు నిర్వహించాలి. ఆ పూజలు జరిపే పద్ధతులు చెప్తాను. జాగ్రత్తగా వినండి…

‘నిత్య కళ్యాణం… పచ్చ తోరణం’ అంటే ఏమిటో ‘నీలమత పురాణం’లో పూజాదుల నిర్వహణను వివరించే శ్లోకాలు స్పష్టం చేస్తాయి. భారతీయ తత్వంలో మానవ జీవితం ప్రతి క్షణం ఆనంద సంబరాల మయం. మనిషి పాపి అయినా దానికి పరిహారం ఉంటుంది. పాప ప్రక్షాళన కోసం ఎవరినీ దేబిరించనవసరం లేదు. చేసిన పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి దాన్ని అనుభవించే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థించాలి. అర్చించాలి. అంతే తప్ప భగవంతుడి దగ్గర రికమండేషన్లు పనిచేయవు.

ప్రతి రోజూ పండగే. ప్రతి క్షణం పవిత్రమే. పండుగలు అంటే పిండివంటలు, బ్రాహ్మణులు, నైవేద్యాలు కాదు. పండుగలు ప్రక్షాళన దినాలు. ఉపవాసాలు, పూజలు వంటి వాటి ద్వారా వ్యక్తి తనలోని మలినాలను కడిగి వేసుకుంటాడు. భగవంతుడి ఆరాధన ద్వారా కలిగిన ఆత్మవిశ్వసంతో నిత్యజీవితంలోని ఒడిదుడుకులను, తుఫానులను ఎదుర్కునేందుకు సిద్ధమవుతాడు. అంతే తప్ప, తాను పాపినని భగవంతుడి ముందు పొర్లి పొర్లి ఏడవటం, రక్షించమని బ్రతిమిలాడడం భారతీయ ధర్మంలో భాగం కాదు.

ఇలాంటి జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి, పవిత్రంగా భావించాలి. ప్రతి క్షణం ఆనందంగా, సత్కార్యాలు జరుపుతూ నూరేళ్ళు జీవించాలి అన్నది భారతీయ ధర్మంలో అవిభాజ్యమైన సిద్ధాంతం. జీవితం ఏడుస్తూ బ్రతకటానికి, సర్వం పరిత్యజించి, అన్ని సుఖాలను త్యజించి, సమాజానికి దూరంగా ముక్కు మూసుకుని తపస్సు చేయటం కాదన్నది భారతీయ ధర్మంలో అడుగడుగునా కనిపిస్తుంది. కశ్మీర జీవితంలోని ప్రతిక్షణంలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here