Site icon Sanchika

నీలమత పురాణం – 33

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

చతుర్వింశతి సంఖ్యాయాం త్రేతాయాం రఘునందనః।
హర్మానుష్యో భవితా రామో దశరథాత్మజః ॥

24వ త్రేతాయుగంలో హరి మానవ రూపం ధరిస్తాడు. దశరథుడి కుమారుడిగా జన్మిస్తాడు. ఈ సంఘటనను ఆరంభంలో చిన్నగా, ఆ పై అతి పెద్దగా సంబరాలతో పండుగగా జరుపుకోవాలి.

నీటిలో, పాలలో, నెయ్యిలో నానిన ధాన్యాలతో తయారుచేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించాలి. బంధుమిత్రులను, బ్రాహ్మణులను గౌరవించాలి. రాముడి భార్య సీతను చిత్తశుద్ధితో పూజించాలి. తొమ్మిదవ రోజున పిండి, తేనెలతో కలిపిన పిండి పదార్థాలతో భోజనాలు పెట్టాలి. కరిశినిని పూజించాలి. పదవ రోజున వరి అన్నంతో పలు రకాల వంటలు చేసి స్నేహితులు, బంధువులు, బ్రాహ్మణులకు భుజింపచేయాలి. పదవ రోజున శక్తి కొలదీ పిండి వంటలు చేసి బంధు మిత్ర సహితంగా భుజించాలి. చక్కని సంగీతం వినాలి. పవిత్ర వస్తువులను స్పృశించాలి. హరిని ధ్యానించాలి.

కృష్ణపక్షం 14వ రోజున ఉపవాసం ఉండాలి. శుభ్రంగా స్నానం చేసి శివుడిని అర్చించాలి. శివలింగానికి అభిషేకం చేయాలి. సుగంధ ద్రవ్యాలు పూయాలి. పూలమాలలు వేయాలి. ఎర్రటి దుస్తులు అర్పించాలి. పలు రకాల పిండి పదార్థాలు నివేదించాలి. జాగరణ చేయాలి. శివుడి స్తోత్రాలు వినాలి. శివధర్మాలను స్మరించాలి.

శివార్చనలో సగం ఉడికిన బార్లీ, తీపి పదార్థాలతో తయారైన ఖాద్య ద్రవ్యాలను నైవేద్యంగ అర్పించాలి. శివుడిని పూజించటం వల్ల గణాలపై ఆధిపత్యం సిద్ధిస్తుంది. రుద్రలోక నివాసం లభిస్తుంది.

ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో జరుపుకోవాల్సిన పండగల విధి విధానాలను చెప్తాను జాగ్రత్తగా విను.

ఉపవాసం ఆచరించి, శుభ్రంగా స్నానం చేసి, అలంకరించుకుని, సాయం సమయంలో మంచులో దీపాలను ఉంచాలి.

దేవతలను, పిత్రుదేవతలను అర్చించాలి.

తరువాతి రోజు ఇళ్ళను అందంగా అలంకరించాలి. మందిరాలను ధాన్యం, మాలలతో అలంకరించి చిత్తశుద్ధితో పూజించాలి. సీతాదేవిని పూలమాలలతో, సుగంధ ద్రవ్యాలతో అర్చించాలి. ఆటలు, పాటలు, నృత్యాలతో అత్యంత ఆనందాలతో పండుగను జరుపుకోవాలి.

మరుసటి రోజు తనని తాను అలంకరించుకుని, పవిత్ర వస్తువులను స్పృశించి ప్రత్యేకంగా పండుగను జరుపుకోవాలి.

ఆ రోజు తన మీద ఆధారపడి ఉన్నవారికి, బ్రాహ్మణులకు బహుమతులు ఇవ్వాలి. వారు ఇచ్చిన బహుమతులను స్వీకరించాలి. వీరికి కాక బంధువులను, కళాకారులను కూడా సత్కారం చేసి బహుమతులు ఇవ్వాలి.

ఎవరికైతే మాదకద్రవ్యాలు, పానీయాలు సేవించే అలవాటు ఉంటుందో వారు ఆనందంగా మదిరను సేవించాలి. బ్రాహ్మణులు ప్రత్యేకమైన పానీయాలు సేవించాలి. గర్భగుడిని సుగంధ ద్రవ్యాలతో నింపేయాలి.

ఆ రోజు ఎలాంటి దూషణలు, తిరస్కారాలు ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. కలసి ఉండే మహిళలు, అందమైన వస్త్రాలతో, సుగంధం నిండిన శరీరాలతో, నిలువెల్లా ఆభరణాలతో, మగవారితో కలిసి ఆటలు ఆడాలి. పాటలు పాడాలి. పౌర్ణమి రోజు ‘ఆర్యమా’ను పూజించాలి.

రాత్రంతా ఆటలు, పాటలు, వాయిద్యాల మ్రోతల నడుమ జాగరణ చేయాలి. ఇలా కృష్ణపక్షం ఐదవ రోజు వరకూ గడపాలి. నాట్యం చేసిన వారిని, గాయకులను, వాయిద్యకారులను సముచితంగా సత్కరించాలి.

అయిదు రోజుల పాటు ‘పర్వత’ అన్న మూలికతో తయారు చేసిన ఆహారాన్ని సేవించాలి. ఈ అయిదు రోజులు మహిళలు సర్వావయవ సర్వాభరణ భూషితులయి సంతోషంగా ఉండాలి.

ఆ అయిదవ రోజు నుంచి కశ్మీరుకు ‘ఋతుస్రావం’ ఆరంభమవుతుంది. ఆ రోజు నుంచి కశ్మీరు ప్రజలు పెద్ద ఎత్తున పూజలు ఆరంభించాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version