నీలమత పురాణం – 37

1
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

వేదోప వేద వేదాంగ విద్యా స్థానాని కృత్సశః।
నాగా యక్షుః సుపర్లాశ్చ తథైవ గరుడారుణా॥

జంబూ శాకః కుశః క్రౌంచః శాల్మలీ ద్విప పత్రచ।
గోమేధః పుష్కరశ్చైవ ద్వీపాః పూజ్యః పృథక పృథక॥

[dropcap]వే[/dropcap]దాలు ఉపవేదాలు, వేదాంగాలు విద్య స్థానాలన్నీ, నాగులు, యక్షులు, పిశాచాలు, గరుడ, అరుణ వంటి వాటన్నింటినీ పూజించాలి. జంబూద్వీపం, శక, కుశ, క్రౌంచ, శాల్మలి, గోమేధ, పుష్కర ద్వీపాలను వేర్వేరుగా పూజించాలి.

‘నీలమత పురాణం’లో పూజించాల్సిన వాటి జాబితా చూస్తుంటే దేశంలోనూ, పురాణాలలోనూ ఏ విషయాన్నీ ఏ అంశాన్నీ వదలకపోవడం కనిపిస్తుంది. చిన్న గడ్డిపోచ నుంచి అంతరిక్షం లోని అనంతత్వం వరకూ ప్రతి విషయాన్నీ స్మరించడం, ప్రస్తావించి ధ్యానించటం  కనిపిస్తుంది. ఇది కూడా కశ్మీరు భారతదేశపు శిరస్థానం తప్ప ప్రత్యేకం కాదని నిరూపించే అంశం.

స్వయంభువ మనువు నుంచి ఆరంభించి బ్రహ్మ, దిక్కుల అధిపతులు, సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు, నెలలు, పక్షాలు… ఇలా ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా పూజించమనటం కశ్మీరు ధార్మికంగా, భౌతికంగా, మానసికంగా భారతదేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని నొక్కి చెప్పినట్లవుతోంది. గమనిస్తే, నీలమత పురాణం కశ్మీరు ఆవిర్భావం నుంచీ జరుగుతున్న విషయాలను చెప్తోంది. నాగులు సరోవరాన్ని తమ నివాసం చేసుకోవటం, రాక్షసుడు సరస్సును ఆక్రమించటం, కశ్యపుడు పూనుకుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహాయంతో నీటిని వెడల నడిపి జలోద్భవుడిని బలహీనుడిని చేసి సంహరింపజేయటం, ఆపై దేవతల నందరినీ ప్రార్థించి, నదీ రూపంలో వారిని ప్రవహింపజేయటం, కశ్మీరులో పిశాచాలు, నాగులు, మానవులతో సహజీవనం చేయించటం, ఈ సహజీవనం సవ్యంగా సాగాలంటే చేయాల్సిన పూజలను, పాటించాల్సిన విధులను నిర్దేశించటం కనిపిస్తుంది.

పాటించాల్సిన విధులలో ఒకటి అన్నిటినీ పూజించటం. కాలం,  కల్పం నుంచి ఆరంభించి భారతీయ ధర్మానికి, తత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ స్మరించి ధ్యానించమని నిర్దేశించడం కనిపిస్తుంది. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఈ విషయాన్ని గమనించి విశ్లేషించాల్సి ఉంటుంది.

కశ్మీరులో ప్రథమంగా నాగులు ప్రవేశించాయి. ఆ పై పిశాచాలు అడుగుపెట్టాయి. తరువాత మనుషులు కశ్మీరులో చేరారు. కానీ పిశాచాలు మనుషులను పీక్కు తినడం ఆరంభించాయి. దాంతో మనుషులు కశ్మీరం వదిలి పారిపోయారు. కశ్మీరం నిర్మానుష్యం అయిపోయింది. అప్పుడు చంద్రదేవుడు నీలనాగును ప్రార్థించాడు. అతడి సహాయంతో పిశాచాలకు మనుషులకు మధ్య సమన్వయం సాధించాడు. ఆ సమన్వయం నిలవాలంటే ఏమేం చేయాలో నీలుడు చెప్తున్నాడు.

నీలుడు పూజించమని చెప్తున్నవన్నీ భారతదేశం నలుమూలలా పూజలు అందుకుంటున్నవే. ఇవేవి కశ్మీరుకు ప్రత్యేకం కావు. వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, విజ్ఞానానికి సంబంధించిన ప్రతి అంశం భారతదేశం అంతటా పూజార్హాలే. ఈ రకంగా ఈ భారతీయ ధర్మంలోని అంశాలన్నింటినీ పూజించటం వల్ల ఆ ప్రాంతంలోని వారికి తాము ప్రత్యేకం అనో, దేవతలు నదుల రూపంలో ప్రవహించే భూమిలో నివసించే తాము ఇతరుల కన్నా భిన్నం అనో ‘అహంకారం’ ఎదగదు. ప్రత్యేక భావన ఊపు అందుకోదు. ఇందుకు భిన్నంగా ఇతర ప్రాంతాల కన్నా భిన్నమైన పూజా పద్ధతులు, అంశాలు ఉన్నాయంటే తాము ప్రత్యేకం అన్న భావన ఎదుగుతుంది. ఈ భావన తీవ్రమై ఒక స్థాయికి చేరిన తరువాత అది వ్యక్తుల నడుమ అడ్దుగోడలు నిలుపుతుంది. విచ్ఛిన్నకరమైన విద్వేష భావాలకు తావిస్తుంది.

మన పూర్వీకులకు ఈ నిజం తెలుసు. మానవ మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నవారు. అందుకే భారతదేశంలో ఏ మూల అయిన ఒకే రకమైన అంశాలను నిర్దేశించారు.  స్థానిక పద్ధతులు   భౌగోళిక , సామాజిక పరిస్థితులను బట్టి వేర్వేరయినా మౌలికంగా అన్నిటినీ కలిపి ఉంచి ఏకత్రితం చేయగల భావాలు దేశమంతా స్థిరపడే ఏర్పాట్లు చేశారు. దాంతో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ధార్మికంగా ఐకమత్య భావన స్థిరపడింది. రాజులు, రాజ్యాలతో సంబంధం లేకుందా మనుషుల నడుమ ధార్మిక అనుబంధం ఏర్పడే వీలు కలిగింది. వ్యక్తి దేశంలో ఏ మూల ఏ రాజ్యానికి చెందిన వాడయినా ‘వారణాసి’ అతి పవిత్రం. హిమాలయం శివసన్నిధి. ఇలా ధార్మికంగా బంధం గట్టిపడేట్టు చేయటంతో అనేక ఒడిదుడుకులు, తుఫానులను తట్టుకుని భారతీయ ధర్మం సజీవంగా, సగౌరవంగా, సగర్వంగా తల ఎత్తుకుని నిలబడగలుగుతోంది.

వేదాలు, వేదాంగాలు, పురాణాలు దేశమంతటా గౌరవమన్ననలందుకుంటాయి, అవి పూజనీయాలు. ఇది గమనించే శంకరాచార్యులవారు దేశమంతటా పర్యటించి పలు స్థానాలలో పీఠాలు ఏర్పాటు చేశారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాలను ధార్మిక భావన అనే దారంతో గుదిగ్రుచ్చి ఏకం చేశారు. రామానుజాచార్యులు కూడా దేశం నలుమూలలా మఠాలు ఏర్పాటు చేశారు. ఇది ఈ దేశంలో ఈ ధర్మం సజీవంగా ఉండటంలో ఈనాటికీ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించటంలో తోడ్పడుతోంది. ఎక్కడికక్కడ ఈ ధార్మిక భావన గొలుసు తెగిపోయిందో, అక్కడక్కడ ప్రజలు తమ మూలాలను మరిచి, అస్తిత్వాన్ని కోల్పోయి పరాయీకరణం చెందారు. తాము ప్రత్యేకం, వేరు అనుకున్నారు. ఫలితం దేశవిభజన జరిగింది. కాబట్టి, దేశం ఐకమత్యంగా, శక్తిమంతంగా ఉండాలంటే దేశవ్యాప్తంగా ధార్మిక భావనలు జాగృతమయి దేశప్రజలు తమ నడుమ ధార్మికంగా ఉన్న అనుబంధాన్ని అవగాహన చేసుకోవాలి. అప్పుడే పలు రకాల విచ్ఛిన్నకరమైన ధోరణులు, విద్వేషపూరితమైన ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది. అది జరగనంత కాలం విచ్ఛిన్నకరమైన, విద్వేషపూరితమైన విషపుటాలోచనల విలయతాండవం వికృతంగా కొనసాగుతూనే ఉంటుంది. దేశ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతూనే ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా భారతదేశంలో ధార్మిక భావన, దేశభావనలు వేర్వేరు భావనలు కావు. అవి పడుగులో పేకలా కలిసిపోయాయి. దేశానికి, ధర్మానికి అభేద ప్రతిపత్తి. ఈ నిజాన్ని నీలమత పురాణంలోని అంశాలు స్పష్టం చేస్తాయి, నిరూపిస్తాయి.

ద్వీపాలను పూజించాలని చెప్పిన తరువాత నీలుడు సముద్రాలను పూజించాలని చెప్తున్నాడు. ఏయే సముద్రాలను పూజించాలో కూడా చెప్తున్నాడు. ఉప్పునీటి సముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మధు సముద్రం, చెఱకురసపు సముద్రం, రుచికరమైన నీటి సముద్రాలను అర్చించాలి.

ఉత్తర కురు, రమ్య, హైరాకృత, భద్రశ్రవ, కేతమాల, ఇలాకృత, హరివర్ష, కింపురుష, భరతవర్షలను పూజించాలి. భరతవర్షంలోని తొమ్మిది విభాగాలు ఇంద్రద్యుమ్న, కశేరు, తామ్రవర్ణ, గభస్తి, నాగ, సౌమ్య, గంధర్వ, వారుణ, మానవ ద్వీపాలను, ఆ ద్వీపాలను పరివృతమై ఉన్న సముద్రాలను పూజించాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here