Site icon Sanchika

నీలమత పురాణం – 42

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

చైత్ర మాసే శుక్ల  పక్షే పంచదశ్యాం ద్విజోత్తమ।
యోద్ధం యాతి నికుంబస్తు పిశాచాన్వాలు కార్ణివే॥

[dropcap]నీ[/dropcap]లమత పురాణం ఇప్పుడు నికుంభుడిని, పిశాచాలను పూజించాలని చెబుతోంది.

“చైత్రమాసం శుక్లపక్షంలో పదిహేనవ రోజులు నికుంభుడు ఎడారి ప్రాంతంలో పిశాచాలతో పోరాడటానికి వెళ్తాడు. కాబట్టి ప్రతి ఇంట్లో మధ్యాహ్న సమయంలో పిశాచాలను, ప్రతి ఒక్క పిశాచాన్ని పేరు పేరునా పూజించాలి. ఆ పూజా విధానాన్ని నేను చెప్తాను” అన్నాడు నీలుడు.

భారతీయ ధర్మంలో ద్వేషం లేదు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవటం, ప్రేమించటం, పూజించటం కనిపిస్తుంది. ఇక దుష్టులు ద్వేషార్హులు కారు. వారు దుష్టులు ఎందుకయ్యారంటే, వారు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్ళాలని ప్రయత్నించినందుకో, లేక సంపూర్ణంగా స్వార్థం, లోభం, క్రోధాలకు లోనయి మానవత్వం లేకుండా ప్రవర్తించినందుకో. అంతే తప్ప, మిగతా అన్ని విషయాల్లో వారు సేవార్హులు, పూజార్హులు. అందుకే పురాణ గాథలలో రాక్షసులను కూడా గొప్పగా చూపించటం కనిపిస్తుంది. ద్వేషించటం, తూలనాడటం, చులకన చేయటం వంటి విషయాలుండవు. ఎందుకంటే, వారిని సంహరించాలంటే దైవం స్వయంగా దిగి రావాల్సి ఉంటుంది. అంత గొప్పవారు, దుష్టులయినా సరే, ప్రతీవారిని ప్రేమతో గెల్చుకోవటం భారతీయ ధర్మ లక్షణం.

నీలమత పురాణం అందుకే పిశాచాలను పూజించమంటోంది.

“మట్టితో, ఆకులతో, చెక్కలతో పిశాచాల విగ్రహాలను తయారు చేయాలి. ఆ విగ్రహాల్ని సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో, నూతన వస్త్రాలలో, విభిన్న రకాలయిన ఆభరణాలతో,  నైవేద్యాలతో పూజించాలి. ఈ నైవేద్యాలు, తీపి పదార్థాలు, మాంసం, పానీయాలు, పలు రకాల ఆయుధాలు, గొడుగులు, పాదరక్షలు, కర్ర వంటివి అర్పించాలి. మగవారు పిశాచాలను పూజించి వారికి చిరకాలం ఉండే ఆహారాన్ని అందించాలి. ఎందుకంటే పిశాచాలు ఎడారి ప్రాంతంలో యుద్ధానికి పోతున్నాయి. కాబట్టి త్వరగా పాడయిపోయే పదార్థాలు ఇస్తే సరిపోదు. దీర్ఘకాలం పాడవకుండా ఉండే ఆహార పదార్థాలు వారికి మూట కట్టివ్వాలి. మంచి పాటలు పాడాలి. అనర్ధ, తంత్రి వంటి వాయిద్యాలను మోగిస్తూ పాడాలి.

మధ్యాహ్నం పూజ అయిన తరువాత శక్తి కొద్దీ మళ్ళీ చంద్రోదయంలోగా పూజించాలి. బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోవాలి. ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయే సమయంలో తంత్రీ సాధనాన్ని మ్రోగించాలి.

మరుసటి రోజున కూడా పూజని సాగించాలి.

పూజ అయిన తరువాత దగ్గరలో ఉన్న కొండను ఎక్కాలి. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి పూజను కొనసాగించాలి. పాటలు పాడాలి. సంగీత వాయిద్యాలు మ్రోగించాలి. స్నేహితులతో కలసి ప్రత్యేక వంటలు భుజించాలి.

‘ఇరా’ అనే గంధర్వ కన్య విశ్వవసు దగ్గర ఉండేది. ఆమె శుక్ర శాపం వల్ల దేవతల సభకు దూరమైంది. ఆమె హిమాలయ పర్వతంపై అత్యుత్తమైన వృక్షంగా ఎదిగింది. నికుంభుడు కశ్మీరం వదిలి వెళ్ళగానే ఈ వృక్షం పలు రూపాలలోకి మామూలుగా అయిపోతుంది. ఇరా దేవి పుష్పాలతో అలంకరించుకున్నప్పుడు, పురుషులు శుభ్రమైన దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, చక్కని ఆలోచనలతో, శుభ్రమైన మనసుతో, దృష్టిని ఇరాపై నిలిపి ఇరా వృక్షాలున్న తోటకి వెళ్ళాలి. ఆనాడు ఇరా తోటకు భార్యాపిల్లలతో వెళ్ళలి. కుటుంబమంతా ఇరాదేవతను పూజించాలి. ధూప దీపాలతో పూజించి నైవేద్యం పెట్టాలి. ఆ తోటలోనే అందరూ కలసి భోజనం చేయాలి. బ్రాహ్మణులను, స్నేహితులను, వారి భార్యలను ఇరా పూలతో సత్కరించాలి. ఎర్రటి దారంతో పూలమాలలను కుట్టాలి. వాటిని తాను స్వయంగా ధరించి స్త్రీలకు బహుకరించాలి. ఆ సమయంలో పాటలు పాడాలి. వాయిద్యాలు మ్రోగాలి. నృత్యాలు చేయాలి.

ఇరాపూలతో కూడిన పానీయాలను సేవించాలి. పూలను దేవతలకు అర్పించాలి. కేశవుడ్ని ధ్యానించాలి. రుద్ర, బ్రహ్మ, చంద్రుడు, సూర్యుడు, కరిశిని, దుర్గలను కూడా ఇరా పూలతో పూజించాలి. దేవతలందరికీ ఇరా పూలంటే మక్కువ. నాగులకు కూడా ఇరా పూలంటే ఇష్టం.

వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజున పూజలు చేయాలి. బార్లీ గించజల్ను బ్రాహ్మణులకు దానం చేయాలి.

విష్ణువును కూడా బార్లీ గింజలతో పూజించాలి. ఆ రోజు బార్లీని భుజించాలి. గంగాదేవిని అర్చించాలి.

ఆ రోజు నిరంతరం దైవనామం స్మరిస్తూ, తర్పణాలు విడవాలి. పూజలు చేయాలి. స్నానాలు చేయాలి. దానాలు చేయాలి.

సింధునది ఒడ్డున ఉపవాసం తరువాత, ఈ పూజలను చిత్తశుద్ధితో, నిజాయితీగా భగవద్ధ్యానం చేస్తూ చేయాలి.”

(ఇంకా ఉంది)

Exit mobile version