Site icon Sanchika

నీలమత పురాణం – 44

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]”2[/dropcap]8వ కలియుగంలో విష్ణువు బుద్ధుడిగా జన్మిస్తాడు. అతడిని పూజించే విధానం చెప్తాను విను” అంటున్నాడు నీలుడు.

నీలుడు నాగు. నాగజాతి అతనిది. నాగార్జునుడిది కూడా నాగజాతే. నాగజాతికి చెందిన నీలుడు కశ్మీరులోని ప్రజలకు పలు దేవతల పూజలు, పండుగల గురించి చెప్తున్నాడు. అతడు దేవతలు, నదులు, కొండలు, పవిత్ర స్థలాలన్నిటి పేర్లు చెప్తాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడి పేరు కూడా ఆ పూజించదగ్గ దేవతల జాబితాలో చేర్చాడు.

సాధారణంగా చరిత్ర విశ్లేషకులు బుద్ధుడిని విష్ణువు అవతారంగా చూపిస్తోందన్న నిజం ఆధారంగా నీలమత పురాణం ఏ కాలానికి చెందినదో ఊహిస్తారు. తమ ఊహ నిజం అని తీర్మానిస్తారు. కానీ ఇలా ఊహించి తేదీలను నిశ్చయించడం ప్రమాదభరితం.

మన కళ్ళముందే సాయిబాబా హిందూ దేవీదేవతల జాబితాలో చేరిపోయాడు. ఈ పరిణామం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇది 80వ దశకంలో జరిగిందా, 90వ దశకంలో జరిగిందా? అంతకు ముందే ఉన్న ఆలోచన ఇప్పుడు స్థిరపడిందా? అన్నది తేల్చి చెప్పడం కష్టం.

అలాగే, సమాజంలో చిల్లర దేవుళ్ళంతా పీఠాధిపతులు, మఠాధిపతులు, అవతారాలు, అవధూతలుగా అయి ఆశ్రమాలు ఏర్పర్చుకునే వ్యవస్థ ఎప్పుడు, ఎలా ఆరంభమయింది, ఎలా వ్రేళ్ళూనుకున్నదో ఎవరూ చెప్పలేరు. మహా అయితే శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారిని ప్రస్తావిస్తారు కాని వారు ఏర్పరిచిన వ్యవస్థ, ఇప్పుదు మనం చూస్తున్న వ్యవస్థ వేరు.

భారతీయ ధర్మంలో శరీరానికి విలువ లేదు. వ్యక్తి ఆదర్శం, జీవితానికి ఇచ్చిన ప్రాధాన్యం శరీరానికి లేడు. అలాంటి సమాజంలో సమాధులకు, వ్యక్తి పూజకు ప్రాధాన్యం ఉండదు. మన ప్రాచీనులెవరికీ సమాధులు లేవు. అసలు స్మశానం బారతీయ సమాజంలో ప్రత్యేకంగా ఊరికి దూరంగా ఉంటుంది. అడుగుపెడితే స్నానం చేసి పరిశుభ్రం అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సమాజంలో సమాధులను పూజించటం, వాటిని పవిత్రంగా భావించడం ఎలా? ఎప్పుడు? ఎందుకు ఆరంభమయింది?

మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనల గురించి, సంభవిస్తున్న మార్పుల గురించి మనం ఖచ్చితంగా ఏమీ చెప్పలేనప్పుడు, ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ నాటి సంఘటనలను, సమాజంలోని మార్పులను ‘ఇప్పుడు జరిగింది’ అని చెప్పటం, అదే నిజమని నిర్ధారించటం, దాన్ని పట్టుకుని వేలాడటం వైజ్ఞానిక దృక్పథం ఎలా అవుతుంది?

గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారం ఎలా, ఎప్పుడు అయ్యాడన్నది ‘ఊహ’ మాత్రమే. ఎందుకంతే భారతీయ సమాజంలో ప్రతీ ఒక్కరినీ గౌరవించటం, ఆదరించటం, స్వీకరించటం అన్నది అంతర్భాగం కాబట్టి. కాబట్టి ఒకరు పూజించే దేవుడు, మనం నమ్మే దేవుడు కాకున్నా, అవమానించటం, చులకన చేయటం, కాదనడం అన్నది భారతీయ సమాజానికి తెలియదు. గౌతమ బుద్ధుడిని కూడా దైవంగా భావించి పూజించటం అన్నది  స్వాభావికంగా,  పాలు నీరు కలిసినంత ప్రాకృతికంగా, నదులు కలిసి ప్రవహించినంత స్వచ్ఛంగా జరిగి ఉంటుంది.

‘నీలమత పురాణం’ నాటికి బౌద్ధం ఉచ్చదశలో ఉంది. భారతీయ ధర్మం కూడా సమానంగా ఉచ్చదశలో ఉంది. అయినా రెండూ కశ్మీరంలో పరస్పరం సహజీవనం చేశాయి. ఎంతగా అంటే, పాలూ నీళ్ళూ కలిసిపోయినంత ప్రాకృతికంగా. ఇది నీలుడు బుద్ధుడిని పూజించాల్సిన విధానాన్ని వివరించటం స్పష్టం చేస్తుంది.

బుద్ధ విగ్రహాన్ని పవిత్ర జలాలలో స్నానమాడించాలి. శుభ్రం చేయాలి. పలు రకాల ఆభరణాలతో అలంకరించాలి. సుగంధ ద్రవ్యాలు పూయాలి. ఇదంతా శాక్యుల పద్ధతి ప్రకారమే జరగాలి.

ఇది జాగ్రత్తగా గమనించాల్సిన అంశం.

ఏ ప్రజలయితే విష్ణువును, శివుడిని, ఇంద్రుడిని, గంగను, యమునను, ఇతర దేవీదేవతలను పూజించారో, ఆ ప్రజలు బుద్ధుడిని కూడా పూజించాలి. కానీ పూజా పద్ధతి పూర్తిగా శాక్య పద్ధతుల ప్రకారమే జరగాలి.

భారతీయ సమాజ లక్షణాన్ని, మనస్తత్వాన్ని అత్యంత స్పష్టంగా ప్రదర్శిస్తుంది ఈ అంశం.

బుద్ధుడిని పూజించటం వల్ల ఎలాంటి పాపం లేదు, తప్పు లేదు. ఎందుకంటే, బుద్ధుడు విష్ణువు స్వరూపం కాబట్టి. ఆ బుద్ధుడిని బుద్ధుడిగానే పూజించాలి. శాక్యులు నిర్దేశించిన పద్ధతిలోనే పూజించాలి. ఎక్కడా ఘర్షణకు అవకాశం లేదు. ఎంతో సామరస్యపూర్వకంగా, సౌమనస్యంతో తనను తాను పరాయివాడిగా, భిన్నంగా భావించుకున్న వారిని కూడా మంచితనంతో గెలవటం ఇది. నీ దేవుడిని నా దేవుడిగా భావించి నీ పద్ధతిలోనే పూజిస్తా అంటే ఎవరికి అభ్యంతరం ఉంటుంది?

బుద్ధుడి పూజ జరిపే ముందు వారి పవిత్ర స్థలాలయిన విహారాలన్నింటికీ వెల్ల వేయాలి. చైత్యాల గోడలపై చిత్రలేఖనాలు నింపాలి. నాట్యగత్తెలు, నటులతో నృత్యాలు, నాటకాలు ప్రదర్శించి సంబరాలు జరుపుకోవాలి. శాక్యులకు చీవరాలు (బౌద్ధుల ప్రత్యేక దుస్తులు) సమర్పించాలి. ఆహారాన్నివ్వాలి. బౌద్ధ పవిత్ర గ్రంథాలను బహుకరించాలి. మాఘమాసం వచ్చే వరకూ ఇలా పూజలు, సంబరాలు జరుగుతూండాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version