నీలమత పురాణం – 45

3
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]మా[/dropcap]ఘ మాసం శుక్ల పక్షం 11వ రోజున ఉపవాసం ఉండాలి. 12వ రోజున వైశాఖంలో పూజించినట్లుగా పూజించాలి. ఇలా పూజలు చేసి బ్రాహ్మణులకు తిలదానం ఇవ్వాలి. తేనె దానం ఇవ్వాలి. ఇలా దానాలు చేయడం వల్ల జీవితంలో చేసిన పాపాలు నశిస్తాయి. ‘ధర్మరాజుకు సంతోషం కలగాలి’ అన్న భావన కలుగుతుంది. తరువాత దేవతలను, అశ్వాలను పండిన బార్లీతో పూజించాలి.

సంగీత వాయిద్యాలు మధురంగా  మ్రోగుతుండగా, బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి.

జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తరువాత 8 వ రోజున వినాయకుడిని, అతని గణాలతో సహా పూజించాలి. తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. మధురమైన గాన కచేరీలు నిర్వహించాలి. బ్రాహ్మణులను సంతోషపెట్టాలి.

ప్రతి నెల పౌర్ణమి తరువాత 8 వ రోజున వినాయకుడిని విధిగా పూజించాలి. ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల తలచిన పనులు విజయవంతం అవుతాయి. ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రం ఆకాశంలో మెరుస్తున్నప్పుడు వాయుదేవుడిని సుగంధ ద్రవ్యాలతో, పూల మాలలతో, నైవేద్యాలతో, ధాన్యాలతో, పూలతో పూజించాలి. శుక్ల పక్షం అంతంలో అయిదు రోజులు గాన కచేరీలు, సంగీత వాయిద్య కచేరీలు నిర్వహించాలి. ఇవి దేవతలకు సంతోషం కలిగించి వారు వచ్చేట్టు చేస్తాయి. 11, 12, 14 రోజుల్లో ధనహోత్ర జరపాలి. రెండు రాత్రుళ్ళు జాగరణ చేయాలి. 13వ రోజున నాటకాలు వేయించాలి. నటీనటులకు శక్తి కొలది ధనాన్ని అందజేయాలి.

సాధారణంగా కేశవుడికి హింసాత్మకమయిన బలులు ఇచ్చేటప్పుడు బుధజనులు ఏం చేయాలి? ఆషాఢ మాసం చివరిలో వాయుదేవుడిని ప్రార్థించినట్టే ఇతర దేవుళ్ళను కూడా పూజించాలి.

దక్షిణాయనంలో బ్రాహ్మణులకు పిండి, పాలు, చక్కెర, ఆకుకూరలు, గొడుగు, చెప్పులు, పూలమాలలు, పాత్రలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో కశ్యపుడిని పూజించాలి. ఈ పూజలో ఆవులను, గేదెలను పూజించాలి.

శ్రావణ మాసంలో వితస్త, సింధునది సంగమ స్థలంలో శుభ్రంగా స్నానం చేయాలి. దేవదేవుడు విష్ణువును పూజించాలి. బ్రాహ్మణుల నుంచి ఆశీర్వచనం స్వీకరించిన తరువాత నది ఒడ్డున ఆహారాన్ని సేవించాలి.

ఆ రోజు సామవేద శ్రవణం చేయాలి. పెళ్ళి కాని పిల్లలు నదిలో నీళ్ళలో ఆడుకోవాలి. చంద్రుడు శ్రావణ నక్షత్ర మండలం చేరినప్పుడు సంగమ జలంలో స్నానం చెసిన వారు ఐశ్వర్యాలు పొందుతారు.

శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి నాడు 28వ ద్వాపర యుగంలో మధుసూదనుడు మానవుల కష్టాలు తొలగించేందుకు మానవ రూపంలో జన్మించాడు. ఆ రోజు నుంచీ దేవీ దేవతలను పూజించడం ఆరంభించాలి. దేవకి, యశోదలను సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పూజించాలి. గోధుమలు, బార్లీలతో చేసిన తినుబండారాలను నైవేద్యం పెట్టాలి. పాలు, పళ్ళు అర్పించాలి. పూజలు ఇలా జరిపిన తరువాత రాత్రి పూట పెద్దగా సంబరాలు జరుపుకోవాలి.

ఆ మరుసటి రోజు సూర్యోదయం కన్నా ముందే లేవాలి. రంగు రంగుల దుస్తులు వేసుకోవాలి. నడి ఒడ్డుననో, చెరువు సమీపంలోనో మధురమైన గానాన్ని వినాలి. సంగీతాన్ని ఆస్వాదించాలి.

బార్లీ, చెరుకురసం, మిరియాలు, నెయ్యి వంటి వాటితో చేసిన పదార్థాలను ఆ రోజు స్వీకరించాలి. శుక్ల పక్షం రోజున అశ్వాలను పూజించాలి. పితృదేవతలను పూజించాలి. శ్రాద్ధకర్మలను నిర్వహించాలి.

శుక్ల పక్షంలో ప్రతీ రోజూ మహేంద్రుడు, శచీదేవిలను పూజించలై. మహేంద్రుడి బొమ్మను శుభ్ర వస్త్రంపై ముద్రించి, జ్యోతిష్కుడు సూచించిన సమయంలో సూచించిన విధంగా అర్చించాలి.

గోవులను పూజించాలి. మహేంద్రుడితో పాటు ఇతర వీరులనూ పూజించాలి. వారిని వారి వారి ఆయుధాలు, వాహనాలతో సహా పూజించాలి. అయిదవ రోజున నన్ను అంటే నీలుడిని పూజించాలి. వివిధ సుగంధ ద్రవ్యాలు, ధూపదీప నైవేద్యాలలో పూజించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న నాగులను కూడా పూజించాలి.

తరువాత ఇంద్ర పక్షంలో శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. ఒక్క 13వ రోజున మాత్రం మామూలు శ్రాద్ధకర్మలు ఉండకూడదు. ఆ రోజు ఆయుధాల ద్వారా మరణం పొందినవారికి శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. ఈ శ్రాద్ధ కర్మలు అందరూ నిర్వహించాలి. ఇతరులు చేసే దానాల మీద ఆధారపడి జీవించేవారు, కార్మికులు, అందరూ ఈ కాలంలో శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. పితృదేవతలు ఆశించేది ఒక్కటే. వర్ష, మాఘ మాసాలలో తమకు పాలు తేనెలను అర్పించేవారు తమ వంశంలో జన్మించాలని కోరుకుంటారు వారు.

దుర్గాదేవి మందిరంలో రాత్రిపూట ఆయుధాలను పూజించాలి. పూజ అయిన తరువాత ఉదయం శుభ్రంగా స్నానం చేయాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here