Site icon Sanchika

నీలమత పురాణం – 47

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]దు[/dropcap]ర్గాదేవి మందిరంలో శాస్త్రాల పుస్తకాలను పఠించి, పూజించిన తరువాత పనిముట్లతో పనిచేసేవారు, కళాకారులు తమ పనిముట్లను, కళలను, కళ సృజించేందుకు వాడే సాధనాలను పూజించాలి.

పూజలు మంత్రాల నడుమ సంగీత వాయిద్యాలను, ఆయుధాలను మందిరంలోకి తీసుకురావాలి. సుఖం, శాంతి నిండిన మనస్సుతో బ్రాహ్మణుల మంత్రాలతో దేవికి నివేదించిన ఆహారాన్ని పెరుగుతో కలిపి స్వీకరించాలి. ఆ ప్రసాదాన్ని బంధువులు, స్నేహితులు, జ్యోతిష్కులుకు కూడా పంచాలి. పూలు, పళ్ళతో నిండుగా వున్న వృక్షాలను, అందంగా అలంకరించుకున్న మహిళలను పూజించాలి.

నీలమత పురాణంలో కొన్ని విషయాలు చదువుతుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. అనేకమైన ఆలోచనలు కలుగుతాయి.

వివేకానందుడు ప్రపంచవేదికపై నిలబడి ఒక విషయం స్పష్టంగా ప్రకటించాడు. భారతీయ ధర్మం ఎంతో ప్రాచీనమైనది, అద్భుతమైనది, సజీవమైనది. అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉదయించే సూర్యునికి తర్పణాలు విడుస్తూ స్మరించిన మంత్రాలను ఈనాటికీ స్మరిస్తూ ఉదయించే సూర్యుడికి తర్పణాలు విడుస్తున్నారు. కాలం మారింది. పరిస్థితులు మారాయి. సూర్యోదయం మారలేదు. సూర్యాస్తమయం మారలేదు. భారతీయ ధర్మం ఆత్మ మారదు. ఇది సజీవ ప్రవాహంలా నిరంతరం నూతన పోకడలు పోతూ, తనని తాను పునర్నిర్వచించుకుంటూ, తన ఆత్మను పదిలంగా కాపాడుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటుంది. బాహ్య స్వరూపం ఏదైనా అంతరంగం మాత్రం అదే స్వచ్ఛత, అదే ఆధ్యాత్మిక, అదే భావనతో సాగుతుంది. దీన్ని సినీకవి శైలేంద్ర ‘మేరా జూతా హై జపానీ, యే పత్లూన్ ఇంగ్లిస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’ అని వ్యక్తపరిచాడు. అతని పాదరక్షలు జపాన్‌వి, ప్యాంటు ఇంగ్లీషువారిది, తలపై టోపీ రష్యాది, అదీ ఎర్ర టోపీ… కానీ హృదయం మాత్రం హిందుస్థానీ… ఇదీ భారతదేశం గొప్పదనం. ఇది భారతీయ సంస్కృతి సజీవంగా నిలబడటానికి ప్రధాన కారణం. భారతీయ ధర్మాన్ని నాశనం చేయాలని, భారతీయ ధర్మంపై తమ ఆధిక్యాన్ని నెరపుకోవాలని ప్రయత్నించే వారంతా గమనించాల్సిన అంశం ఇది. మనిషి శరీరంలో అసలు జీవం ఉండేది హృదయంలో. అది లేకపోతే మిగతా పైపై పటాటోపాలు, అలంకరణలూ అన్నీ వ్యర్థం. ఇది సజీవాత్మ. చిరంజీవి. దీన్ని నాశనం చేయాలని ప్రయత్నించే వాళ్ళు కలిసిపోయిన మట్టిలోనే వేళ్ళూనుకునీ మరీ స్థిరంగా నిలుస్తుందీ భారతీయాత్మ. ఇందుకు నీలమత పురాణం ఒక చక్కని ఉదాహరణ. ఎంత గొప్పగా జాతీయ సమైకత్యా భావన దేశంలో విస్తరించిందో అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంది నీలమత పురాణం.

ఈనాడు దసరా రోజున ఆయుధపూజ చేస్తాం. ఆయుధాలు అంటే పనిముట్లు కూడా. జీవికకు  ఉపయోగించే సాధనాలు. అందుకే ఇంట్లోని వాహనాలను పూజిస్తారు సామాన్యులు. ఆఫీసులు, కర్మాగారాలలో యంత్రాలను పూజిస్తారు. అది తమకు జీవిక ఇచ్చే దాన్ని గౌరవించటం. కళాకారులు కళాసృజనకు ఉపయోగించే వాటిని పూజిస్తారు. దేని ద్వారా తమకు జీవిక లభిస్తోందో దాన్ని గౌరవించడం ఇది. కామన్ సెన్స్… ఆనాటి వాళ్ళకు కామన్ సెన్స్ లేదని ఈసడించి కాలరెగరేసేవారు గమనించవలసిన అంశం ఇది.

తమకు జీవిక ఇచ్చే దాన్ని గౌరవించి భద్రంగా చూసుకోవడం మౌలికమైన విషయం. బట్టలు కుట్టే వ్యక్తి బట్టలు కుట్టే యంత్రాన్ని విరగ్గొడితే ఎలా ఉంటుంది? పాలు పోసి జీవికను సాగించే వ్యక్తి పాలిచ్చే ఆవుకు తిండి పెట్టకుండా మాడ్చి చంపటంలో అర్థం ఉంటుందా? తాను ఆశ్రయించే కొమ్మనే నరుక్కునే మూర్ఖుడి పద్ధతి ఇది. ఇది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే కనబడుతున్నది ఏమిటీ? ప్రతి ప్రభుత్వరంగ సంస్థ నష్టాల్లో ఉంది, ప్రైవేటీకరణకు గురవుతోంది. సంస్థలలోని అధికారులు అవినీతికి పాల్పడి సంస్థలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం తెలుస్తోంది. ఇది ప్రభుత్వరంగ సంస్థల్లోనే కాదు, నిత్యజీవితంలో ప్రతి రంగంలో, ప్రతి అడుగులో తెలుస్తోంది. తమకు నీడనిచ్చే చెట్టును నరకటం, జీవాన్నిచ్చే నీటిని దుర్వినియోగం చేయటం, ఆహారాన్నిచ్చే నేలను నాశనం చేయటం… ఒకటేమిటి కనుచూపు విస్తరించినంత మేర, ఆధునిక యాంత్రిక సాధనాలు చూపించినంత మేర, తానున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వం కనిపిస్తోంది తప్ప కామన్ సెన్స్ కనిపించడం లేదు. ఇలాంటి వారికి – ‘మీకు జీవికనిచ్చే సాధనాలను దైవంలా భావించి పూజించండి, భద్రపరుచుకోండి’ అనటంలో మూర్ఖత్వం, అజ్ఞానం కనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version