[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]పూ[/dropcap]జారులు ఉపవాస వ్రతం చేయాలి. తరువాత హోమాగ్నిని అర్చించి, ప్రతిరథ, శబ్ద, వర్ధ, ఆయుష్య, అభయ మంత్రాలు; విష్ణు, శుక్ర, సరిత, బ్రహ్మ, రుద్ర, వరుణ మంత్రాలు వల్లె వేయాలి. నగరమంతా అందంగా అలంకరించాలి. నగరం దారుల రెండు వైపులా పతాకాలతో నింపివేయాలి. దారులలో దుమ్ము లేవకుండా, దారులన్నీ నీళ్ళు చిలకరించాలి. పౌరులు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి, పూలమాలలు వేసుకోవాలి. నృత్యకత్తెలు, ప్రముఖ పౌరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు, అధికారులు అందరూ కలిసి పాటలు పాడుతూ రాజభవనం చేరాలి.
దారులన్నీ నటీనటులు, నృత్యకత్తెలు నృత్యాలు చేస్తుండాలి. రాజు, పరిశుభ్రుడై మళ్ళీ పాలు, పెరుగు, నెయ్యి, గో మూత్రం, గోమయంతో స్నానం చేయాలి.
గణాధికరులు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు వరుసగా పశ్చిమం, దక్షిణం, తూర్పు, ఉత్తర దిక్కులలో నుంచుని రాజుకు స్నానం చేయించాలి. మట్టి తోను, తగరం, వెండి బంగారాలతో చేసిన పాత్రలలో పాలు, పెరుగు, నెయ్యి, నీరు నింపు నలుగురూ వరుసగా వాటిని రాజుపై పోస్తూ స్నానం చేయించాలి.
ఇది చదివిన తరువాత పలు రకాల ఆలోచనలు కలుగుతాయి.
ఇంతవరకు మనం చదివిన ప్రతి గ్రంథంలో, ప్రతి శాస్త్రంలో బ్రాహ్మణులు ఉత్తములు, ఉన్నతులు అనీ, వారిని అందరూ ప్రత్యేకంగా చూడాలి, గౌరవించాలి అనీ ఆలోచనలు కనిపిస్తాయి. అందుకు భిన్నంగా ‘నీలమత పురాణం’లో బ్రాహ్మణులకు ఎలాంటి ప్రత్యేకత ఇవ్వటం కనబడదు. బ్రాహ్మణులు పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, మంత్రాలు చదువుతున్నారు. అంత వరకే. ఈ బ్రాహ్మణులను, ఇతరుల వలెనె, అందరితో పాటు సమానంగా గౌరవించడం కనిపిస్తుంది.
సంబరాలలో భోజనాలు చేసేప్పుడు బంధువులు, మిత్రులు, సేవకులు, బ్రాహ్మణులు అని వరుసగా చెప్పడం కనిపిస్తుంది. బహుమతులు, ఇచ్చేటప్పుడు, దానాలు ఇచ్చేటప్పుడు కూడా స్నేహితులకు, కళాకారులకు, సేవకులకు, పనివారలకు, బ్రాహ్మణులకు అనటం కనిపిస్తుంది. బ్రాహ్మణులను భూసురులని కొలవటం, వారిని ప్రత్యేకంగా చూడడం కనబడదు. బ్రాహ్మణుల దౌష్ట్యం, అహంకారం, అణచివేతలు అని ఏదైతే పనికట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారో అలాంటివి ఏవీ నీలమత పురాణంలో కనబడవు. వారినీ అందరితో సమానంగా చూడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది.
రాజు స్నానం చేస్తున్నాడు. అతడికి పవిత్రమైన పంచగవ్యాలతో స్నానం చేయిస్తున్నారు. చేయించేది గణాల అధికారులు, శూద్రులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. ఎవరెవరు ఏ వైపు నిలుచుని స్నానం చేయించాలో కూడా స్పష్టంగా ఉంది.
రాజు విష్ణువుతో సమానం. రాజు శివుడితో సమానం. రాజు ప్రజల పాలకుడు. అది అతని స్థానం. కాబట్టి బ్రాహ్మణుడు లేదు, శూద్రుడు లేదు, క్షత్రియుడు లేదు. అందరూ రాజుకు సమానమే. ఇక్కడ రాజు క్షత్రియుడు మాత్రమే అన్న నియమం లేదు. ప్రాచీన భారతదేశ చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, క్షత్రియుడు మాత్రమే రాజు అవ్వాలని లేదు. ఎవరైనా చొరవ తీసుకుని రాజ సింహాసనం ఆక్రమించవచ్చు. చేయవలసిందల్లా ధర్మరక్షణ, ధర్మపాలన. అంతే… ధర్మపాలన దైవకార్యం. ధర్మాన్ని రక్షిస్తే అది సమాజాన్ని రక్షిస్తుంది. అలాంటి ధర్మాన్ని రక్షించే రాజు ముందు అందరూ సమానమే. రాజుకు అందరూ సమానమే. అందుకే రాజుకు అందరూ స్నానం చేయిస్తున్నారు. అంటే, రాజు ప్రజలను సమానం చూస్తే రాజు ప్రజల గౌరవ మన్ననలనందుకుంటాడని సూచనప్రాయంగా చెప్తున్నదన్న మాట.
ఇది చూస్తే భారతీయ సమాజం ఇప్పుడు ప్రచారం జరుగుతున్న రీతిలో లేదేమోననిపిస్తుంది. భారతీయ జీవన విధానం ఎప్పుడూ ఒక చట్రంలో బిగుసుకుని లేదన్న భావన కూడా కలుగుతుంది. నిజానికి పాశ్చాత్యులు, అంటే, ఎవరైతే భారతీయులను అనాగరికులుగా, తమకన్నా తక్కువ వారిగా, తమ బానిసలుగా భావించారో, వారు ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను ప్రామాణికంగా తీసుకుని మనం మన గురించి అభిప్రాయాలను ఏర్పర్చుకుంటున్నాం ఇప్పటికీ. ఆ అభిప్రాయాల రంగుటద్దాల ద్వారానే మన పూర్వికులను దర్శిస్తున్నాం. తీర్పులిచ్చేస్తున్నాం. సిద్ధాంతాలు చేసేస్తున్నాం. నీలమత పురాణం చదువుతుంటే ఈ భావన బలంగా కలుగుతూంటుంది. మన శాస్త్రాలను, మన చరిత్రను, మనం మన దృష్టితో దర్శించి అధ్యయనం చేసి విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందనిపిస్తుంది. ముఖ్యంగా కొందరు పనిగట్టుకుని భారతీయ ధర్మం గురించి దుర్వాఖ్యానాలు చేస్తూ దౌష్ట్య పూరితంగా వ్యవహరిస్తున్న తరుణంలో అసలు నిజాలను విశ్లేషించి వివరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది కూడా ఒక రకమైన స్వతంత్ర పోరాటమే. ఒకడు మరొకడిని బానిస అంటాడు. బానిస అయినవాడు తనని తాను బానిసగానే భావించుకుంటాడు. నమ్ముతాడు. అతడికి స్వతంత్రం ఇచ్చి వదిలినా, భౌతికంగా స్వాతంత్రం వచ్చినట్టు అనిపించినా మానసికంగా అతడు బానిసగానే ఉంటాడు. ‘నువ్వు బానిస కాదు’ అన్నవారిని నమ్మడు. ప్రస్తుతం సమాజం భౌతిక స్వేచ్ఛ పొందినా, ‘మానసిక బానిస’ స్థితిలో ఉంది. ఇందుకు నిదర్శనాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి.
రాజుకు స్నానం చేయిస్తున్నప్పుడు నలువైపుల నుంచి మంగళవాయిద్యాలు జోరుగా మోగాలి. సంగీత వాయిద్యాలకు తోడుగా, శంఖనాదాలు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగాలి. స్నానం చేసే సమయంలో శుభాకాంక్షాలను తెలియపరిచే గీతాలను గాయనీగాయకులు పాడాలి.
రాజు సామంతులు గొడుగులు, చామరాలు పట్టుకుని ఉండాలి. స్నానం చేసిన రాజును మళ్ళీ మట్టితో స్నానం చేయించాలి. రాజు తలను పర్వత శిఖరం పై నుంచి తెచ్చిన మట్టితో శుభ్రం చేయాలి. చెవులను చీమల పుట్టల నుంచి తెచ్చిన మట్టితో శుభ్రం చేయాలి. మందిరం నుంచి తెచ్చిన మట్టితో మెడను శుభ్రం చేయాలి. రాజభవనం నుంచి తెచ్చిన మట్టితో రాజు హృదయ స్థానాన్ని శుభ్రం చేయాలి. వీపును మందిరం నుంచి తెచ్చిన మట్టితో తోమాలి. ఏనుగు దంతం ఆధారంగా తవ్విన మట్టితో కుడి చేయిని శుభ్రం చేయాలి. ఎద్దు కాలితో తవ్విన మట్టితో మరో చేయిని శుభ్రం చేయాలి. వైశ్యుడి ఇంటి నుంచి తెచ్చిన మట్టితో నడుమును శుభ్రం చేయాలి. పద్మాలతో నిండిన సరస్సు నుంచి తెచ్చిన మట్టితో తొడలను శుభ్రం చేయాలి. ఇక్కడ శుభ్రం చేయటం అంటే పవిత్రం చేయటం అని అర్థం.
అతి గొప్ప సింబాలిజం ఇది. రాజు ఎంత గొప్పవాడయినా, ‘మట్టి’ మాత్రమే అని పరోక్షంగా తెలిపే పద్ధతి. ఆ కాలంలో ఇప్పటిలా సబ్బులు లేకున్నా, స్నానానికి రకరకాల ద్రవ్యాలుండేవి. కానీ అన్నిటినీ వదిలి దేశంలోని ప్రత్యేక స్థలాల నుంచి తెచ్చిన మట్టితో రాజు శరీరంలో ఒక్కో భాగాన్ని శుభ్రం చేయటాం వెనుక ఉన్న తత్త్వాన్ని అర్థం చేసుకోవడం సులభం.
(ఇంకా ఉంది)