Site icon Sanchika

నీలమత పురాణం – 50

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]పౌ[/dropcap]రులంతా శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి చేతులలో శుభకారకాలు, మంగళకారకము అయిన వస్తువులను పట్టుకుని నడవాలి.

అప్పటికే స్నానం పూర్తయిన రాజు, మళ్ళీ మంత్రించి, పవిత్రం చేసిన నీటితో స్నానం చేయాలి. నీటిలో ఓషధులు, అన్నిరకాల సువాసన ద్రవ్యాలు, విలువైన వజ్రాలు, అన్ని బీజాలు, అన్ని పూలు, పళ్ళు, దుర్వగడ్ది, గోరోచనం రంగు, మూలికలు అన్నింటినిటినీ కలిపి స్నానం చేయాలి.

ముందు భద్రాసనంపై కూర్చున్న పూజారి, అందమైన దుస్తులలో శుభ్రంగా, ఆనందంగా ఉన్న ప్రజలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రప్రముఖులు, రాజనర్తకిలు, వ్యాపారులు – అందరూ జ్యోతిష్కులు సూచించిన విధంగా, పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో రాజును అభిషేకించాలి.

స్నానం చేసి, శుభ్రమై, పూలమాలలు, ఆభరణాలు ధరించిన రాజు సమస్త దేవీదేవతలను పూజించాలి. శుభకరము, మంగళప్రదమైన వస్తువులను తాకాలి. నైవేద్యం అర్పించాలి. తరువాత పూజారులు, జ్యోతిష్కులు, బ్రాహ్మణులతో సహా ప్రముఖలందరికీ తన శక్తి కొద్దీ ధనాన్ని ఇచ్చి సత్కరించాలి. దేశంలో ప్రతి ఒక్కరూ భయం లేకుండా ధైర్యంగా సంతోషంగా జీవించాలని ప్రకటించాలి. అంతేకాదు, బంధనాలలో ఉన్న మనుషులను, జంతువులన్నింటినీ విడుదల చేసి స్వేచ్ఛ ప్రకటించాలి. అయితే ఎవరయితే సమాజంలో ముళ్ళలా ఉంటూ, శాంతికి సౌఖ్యానికి భంగం కలిగించే రీతిలో ప్రవర్తిస్తారో వారిని  మాత్రం బంధవిముక్తులను చేయరాదు.

‘నీలమత పురాణం’లో రాజుకి జరిగే వైభోగం చూస్తుంటే ప్రపంచంలో ఏ నాగరికతలోనూ, ఏ రాజు  కూడా ఇలాంటి మన్ననలు అందుకోలేదనిపిస్తుంది. ఎందుకంటే రాజు అనగానే ఏ నియంతనో, క్రూరుడో, ప్రజలను పట్టిపీడించేవాడో, అధికార మదంతో ప్రజలను అణచివేసే దుష్టుడో, ఐశ్వర్యంతో విర్రవీగుతూ, మత్తులో జోగుతూ, పాలనను పనికిరాని వారికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు విలాసాలలో గడిపేవాడో అన్న అభిప్రాయం బలపడి ఉంది. పాశ్చాత్య పురాణాలు, గాథలు ఇలాంటివే. దాంతో వారి ప్రభావంతో మనకు కూడా రాజులన్నా, అధికారులన్నా ఇలాంటి అభిప్రాయమే స్థిరపడింది. వామపక్ష ప్రేరేపిత అపోహల ప్రభావంతో ధనికుడు, అహంకారి అన్న ప్రతివాడూ ధూర్తుడు, మోసగాడు అన్న అభిప్రాయం నెలకొంది.

ముఖ్యంగా అధునిక కాలంలో సంస్థానాధీశులు, చిన్న చిన్న రాజులు మత్తులో మునిగితేలి పాలనను పరాయివారికి వదిలి ఆత్మగౌరవం లేకుండా, బ్రిటీష్ వారి అడుగులకు మడుగు లొత్తుతూ అధికారం కోసం అన్యాయంగా ప్రవర్తించిన గాథలు ఈ ఆలోచనను బలపరిచాయి. ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని నమ్మిన తర్వాత చరిత్రను అదే దృష్టితో చూస్తూ విశ్లేషించి, తమ అభిప్రాయాలను, అపోహలను, చరిత్రలో రుద్ది వాటినే ప్రదర్శించడంతో, ఇలాంటి అభిప్రాయాలు స్థిరపడ్డాయి. భారతదేశం ఇందుకు భిన్నం అన్న ఆలోచన రావటం అటుంచి, ఎవరైనా అలాంటి ప్రతిపాదన చేస్తే కాదని, దూషించే తీవ్రమైన భావనలు ప్రదర్శించటం అలవాటయింది.

భారతదేశ వ్యవస్థలో రాజు ప్రధానపాత్ర పోషించినా ఇతర దేశాలలోలాగా రాజు సర్వస్వతంత్రుడు కాడు. సమస్త ప్రజల భాగ్యవిధాత కాడు. నియంత కాడు. రాజు భావన దైవ భావనతో ముడిపడి ఉంది. రాజు అవ్వాలంటే  వాడిలో విష్ణువు అంశ ఉండడం తప్పనిసరి అన్న భావన నెలకొని ఉంది. అంటే, వాడు క్షత్రియుడే కానవసరం లేదు, వాడు ఏ కులం వాడయినా, ఏ ప్రాంతం వాడయినా, ఎవరయినా వాడు రాజు అయ్యాడంటే వాడిలో విష్ణువు అంశ ఉండి తీరుతుంది అన్న భావన వల్ల ఎవరయినా రాజ పదవి చేపడితే వాడిని ఆమోదించారు, స్వీకరించారు. రాజు అయిన వ్యక్తి ఆ పదవికి అర్హుడు కాడని నిరూపిమితమైతే మాత్రం అతడిని ఆదరించలేదు. తిరస్కరించారు.

రాజులు సైతం తమ రాజ్యాధికారాన్ని ఒక బాధ్యతలా దైవదత్తమైన పవిత్ర బాధ్యతలా భావించారు తప్ప, అదేదో సర్వ సౌఖ్యాలు అనుభవించటానికి రహదారిలా భావించలేదు. ఈ నిజం నిరూపించేందుకు చరిత్రలో, పురాణాలలో అనేక గాథలున్నాయి. రాజతరంగిణిలో సంధిమతి గాథ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అన్నీ వదులుకుని సన్యాసిగా జీవిస్తూ శివధ్యానంలో బ్రతుకుతున్న సంధిమతిని ప్రజలు వేడుకొని, బ్రతిమిలాడి రాజ పదవిని కట్టబెడతారు. అతడు రాజభవనంలో ఉండక, కుటీరంలో ఉంటూ, రోజూ సహస్ర లింగార్చన చేసిన తరువాతనే రాజ్య వ్యవహారాలు చూస్తుంటాడు. సర్వసంగపరిత్యాగి రాజు అన్నమాట. రాజ్యంలో పరిస్థితులు కుదుటపడతాయి. రాను రాను సంధిమతి రాజ వ్యవహారల కన్నా ఆధ్యాత్మిక చింతనలో కాలం ఎక్కువ గడుపుతూంటాడు. దాంతో ప్రజలు మరొక వ్యక్తిని రాజుగా ఎన్నుకుని, ఆ విషయం భయపడుతూ సంధిమతికి చెప్తారు. సంధిమతి ఆ కొత్త రాజును స్వయంగా ఆహ్వానించి, రాజ్యం అప్పగించి, ‘హమ్మయ్య, నా బాధ్యత తీరింద’ని నిట్టూరుస్తాడు.  ఇలాంటి సంఘటన ఒక్క భారతదేశంలోనే సాధ్యం. రాజు అంటే ఇదీ మనకు (చూ.. కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు – రచన – కస్తూరి మురళీకృష్ణ).

(ఇంకా ఉంది)

Exit mobile version