నీలమత పురాణం – 51

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]రా[/dropcap]జగురువు రాజును ఈ సందరమూ, మంగళకరమూ అయిన సింహాసనంపై కూర్చోబెట్టాలి. సింహాసనంపై పులిచర్మం ఉంచాలి.

చేతుల్లో మంగళకరమైన వస్తువులు పట్టుకున్న ప్రజలు రాజుని దర్శించాలి. గొడుగును, ఆయుధాలను, ఏనుగులను, గుర్రాలను పూజించిన తరువాత, రాజు కోసం ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగును రాజు అధిరోహించాలి. ఏనుగుపై నుంచి రాజు ప్రజలపై ధనవర్షం కురిపించాలి. అడిగినవారికి అడిగినంత ధనం అందివ్వాలి. అలా ప్రజలకు ధనం అందిస్తూ రాజు నగరమంతా తిరగాలి ఏనుగుపై.

ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సామంత రాజులను సన్మానించాలి. నగరంలోని ప్రధాన పౌరులను ధనంతో సత్కరించి, వారిని సాదరంగా పంపించివేయాలి.

రోజు ఉదయం నిద్ర లేవగానే రాజు దేవతలను పూజించాలి. ద్విజులను, అగ్నిని పూజించి నేతిలో తన ముఖ ప్రతిబింబాన్ని దర్శించాలి.

ఆపై, రాజు తిథి, వార, నక్షత్రాలకు సంబంధించిన ప్రకటనను వినాలి. ఆపై రాజగురువు, వైద్యుడు, జ్యోతిష్యుడి సూచనలను పాటించాలి. రాజ దర్బారులో నిష్పాక్షికంగా వ్యవహరించాలి. న్యాయం చేయాలి. రాజు ఎవరినీ అవమానపరచకూడదు. రాజ్యంలోని అసంతృప్తులను, వ్యతిరేక భావనలను అదుపులో పెట్టాలి.

దుర్గాత్వాదస్య దేశస్య పరిచక్ర భయం వినా।
స్వభేదేనేహ నశ్యన్తి బద్ధమూలా నరాధిపా॥

కశ్మిరు ప్రాంతాన్ని చేరుకోవటం అంత సులభం కాదు. దుర్గమమైన అరణ్యాలు, పెట్టని కోటలాంటి మంచు పర్వతాలు, లోయలు, నదులతో పరివేష్టితమయిన కశ్మీరును చేరటం అంత సులభం కాదు. కాబట్టి కశ్మీరుకు బయట నుంచి శత్రువుల భయం లేదు. కానీ కశ్మీరు ప్రభువులు అంతర్గత కలహాల గురించి భయపడాలి. ఎందరో రాజులు అంతర్గత కలహాలు, అసంతృప్తులు, క్రోధాలు, ద్వేషాల వల్ల ప్రమాదాన్ని పొందారు. దెబ్బతిన్నారు. నీలమత పురాణం ఇదే చెప్తోంది.

కశ్మీరు చరిత్రను పైపైన చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది.

భారతదేశంలోని ఇతర ప్రాంతాల రాజులు కశ్మీరుపై దాడి చేసి కశ్మీరును ఆక్రమించిన దాఖలాలు కశ్మీరు చరిత్రలో లేవు.

శ్రీకృష్ణుడు గోనందుడిని ఓడించాడు, అదీ గోనందుడు జరాసంధుడి పక్షం వహించి యుద్ధంలో పాల్గొన్నందువల్ల తప్ప దురాక్రమణ తలంపుతో కాదు. కశ్మీరు రాజును సంహరించిన శ్రీకృష్ణుడు, కశ్మీరును పార్వతిగా బావించి రాణి యశోవతికి అధికారం అప్పగించి వెళ్ళాడు. హుణులు భారతదేశంపై దాడి చేసినప్పుడు వారు పశ్చిమ కశ్మీరు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అంతకు ముందు కశ్మీరు రాజులు ఇతరులకు సహాయంగా యుద్ధానికి వెళ్ళటం ఉంది. అలెగ్జాండర్‌తో పోరాడుతున్న పురుషోత్తముడికి సహాయంగా ‘అభిసారుడు’ కశ్మీర సైన్యం తీసుకుని వెళ్ళాడు. కశ్మీర రాజుకు వ్యతిరేకంగా కుట్ర జరిపి ‘మిహిరకులుడు’ అధికారాన్ని హస్తగతం చేసుకునేసరికి అతను కశ్మీరీ అయ్యాడు. హుణుడయినా అతని తరం కశ్మీరులో స్థిరపడడంతో అతడిని కశ్మీరీయులు పరాయివాడిగా బావించలేదు. కశ్మీరుకు చెందిన రాజు లలితాదిత్యుడు టిబెట్, కన్యాకుబ్జ, మగధ, కామరూప, కళింగ ప్రాంతాలను కశ్మీరు రాజ్యంలో భాగం చేశాడు. ఇతడు గుజరాత్, మాల్టా వంటి ప్రాంతాల వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. అంటే కశ్మీరు రాజులు దేశంలోని ఇతర ప్రాంతాలపై యుద్ధం చేశారు తప్పించి, కశ్మీరుపై భారతదేశంలోని ఇతర రాజులు, రాజ్యాలు దాడులు చేయలేదు. కశ్మీరు రాజు అవసరమైనప్పుడు కశ్మీరు రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని మగధ నుంచి రప్పించి కశ్మీరుకు రాజుగా నిలిపారు. చివరికి కశ్మీరుపై మంగోలులు దాడి చేయటంతో కశ్మీరులో తురకల ప్రాబల్యం పెరిగింది. కానీ రాజు మాత్రం కశ్మీరుకు చెందినవాడే. చివరికి టిబెట్టు నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చి కశ్మీరులో ఆశ్రయం పొందిన బౌద్ధుడు రించన కశ్మీరుపై అధికారం సాధించి, ఇస్లాం మతం స్వీకరించడంతో కశ్మీరులో ఇస్లాం రాజ్యానికి వచ్చింది తప్ప యుద్ధంలో గెలిచి కాదు. ఈ రించన అధికారాన్ని అధిక సంఖ్యలో ఉన్న కశ్మీరీ హిందువులు వ్యతిరేకించడంతో, రాజ్యాధికారాన్ని నిలుపుకునేందుకు రించన అధిక సంఖ్యలో ముస్లింలను తన రాజ్యంలోకి ఆహ్వానించాడు. వారి మద్ధతుతో అధికారాన్ని నిలుపుకున్నాడు. రించన తర్వాత రాజ్యానికి వచ్చిన వారికి వ్యతిరేకంగా ‘షామీర్’ కుట్ర జరిపి అధికారాన్ని హస్తగతం చేసుకోవటంతో కశ్మీరులో ‘ఇస్లాం’ పాలన ఆరంభమయింది. అంతే నీలమత పురాణంలో చెప్పినట్టు కశ్మీరు సమస్య – బలహీనత, అంతర్గత కలహాలు, అసంతృప్తులు తప్ప బయటి శత్రువులు కాదన్న మాట!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here