Site icon Sanchika

నీలమత పురాణం – 54

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]త[/dropcap]పస్తు స్నాపనం కార్యం విధినా యేన తచ్ఛృణు!

ఏడు రోజులు వివిధ దేవతలను శ్రద్ధాభక్తులతో పూజించిన తరువాత దేవతలకు స్నానం చేయించే విధానాన్ని వివరిస్తున్నాను విను.

మందిరంలోని దైవమందిరాన్ని శుభ్రపరిచి ఔచిత్య పరిధిలోని రంగులతో అలంకరించాలి. విభిన్నమైన రంగు రంగు పూలతో అలంకరించిన విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, పాటలు, నృత్యాల నడుమ కల్పశాఖ సూచనల ప్రకారం విగ్రహాలకి స్నానం చేయించాలి.

ఆ పై ప్రజలు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా పవిత్ర జలాల్ని తీసుకువచ్చి, మేళతాళాల నడుమ విగ్రహానికి స్నానం చేయించాలి. పవిత్ర జలాన్ని పరిసర ప్రాంతాలలో ఉన్న పవిత్ర ప్రదేశంలోని పుష్కరిణి నుంచి సేకరించాలి. ఆ జల పాత్రను ఏనుగుపై గానీ, గుర్రాలు లేదా ఎద్దులు లాగుతున్న శకటంపై గానీ తేవాలి. పద్ధతి ప్రకారం ఆ నీటితో విగ్రహాలకి స్నానం చేయించాలి.

గమనిస్తే ఇక్కడ పూజారి ప్రసక్తి లేదు. ప్రజలు నృత్యాలు చేస్తూ, గుంపులా వచ్చి, పవిత్ర జలాన్ని తెచ్చి విగ్రహానికి పద్ధతి ప్రకారం స్నానం చేయించాలి అంటున్నాడు నీలుడు. అంతే తప్ప, నీటిని తెచ్చి పుజారికి ఇస్తే, పూజారి స్నానం చేయించాలి అనటం లేదు. ఇది చూస్తే ఉత్తర భారతంలోని పలు శివ మందిరాలలో భక్తులు తామే అభిషేకం చేస్తారు. ఇది గుర్తుకు వస్తుంది. కశ్మీరు శైవమయం అయినా, ఇక్కడ దైవం ఎవరు అన్న ప్రసక్తి లేదు. ఏ దైవాన్నయినా ప్రజలు ఇలా సామూహికంగా స్నానం చేయించటం, పూజించటం నీలమత పురాణంలో పలు సందర్భాలలో కనిపిస్తుంది.

అనేక ఉత్సవాల సమయంలో దేశవ్యాప్తంగా సామూహికంగా పూజలు చేయటం, ఊరేగింపుగా వెళ్ళటం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో పూజలు పూజారులు చేస్తున్నా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడం చూస్తూనే ఉన్నాం. బహుశా ఆ కాలంలో ఇలాంటి పద్ధతి ఏమైనా ఉండి ఉండవచ్చు. కానీ నీలుడు ప్రత్యేకంగా పూజారి ప్రసక్తి తేవటం ఏదో కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంది.

ఇలాంటి పూజల సమయంలో నగరాన్ని సుందరంగా అలంకరించాలి. దారి పొడవునా జండాలు, దీపాలు సుందరంగా అమర్చాలి.

విగ్రహాన్ని ఉత్సవంలా, ఊరేగించాలి. తన సైన్యంతో రాజు ఈ ఊరేగింపును అనుసరించాలి.

ఒకవేళ ఆ నగరానికి రాజు లేకపోతే, నగర ప్రధాన పౌరుడయిన అధ్యక్షుడు ఊరేగింపును అనుసరించాలి. మార్గమంతా ప్రజలు ధూపదీప నైవేద్యాలతో విగ్రహాన్ని అర్చించాలి. జయజయధ్వానాలు చేయాలి. దైవనామాలు, మంత్రాలు పెద్దగా వల్లె వేయాలి. ఇలా నగరమంతా ఊరేగింపుగా తీసుకువెళ్ళిన తర్వాత మందిర ప్రవేశం చేయాలి. మందిరంలో ప్రవేశిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున గీతాలు పాడాలి. నృత్యాలు చేయాలి. నాటక ప్రదర్శనలిస్తూ జీవిక సాగించెవారు నాటక ప్రదర్శనలిచ్చి ప్రజల మెప్పు పొందాలి. ఆటగాళ్ళు ఆటల్లో తన నైపుణ్యం ప్రదర్శించాలి. అలా నైపుణ్యం ప్రదర్శించిన ఆటగాళ్ళకు, మల్లయోధులను తగురీతిన సత్కరించి, బహుమతులు ఇవ్వాలి.

ఈ క్రీడా ప్రదర్శనలు, కళాప్రదర్శనలు చూసే సమయంలో ప్రేక్షకులకు కూడా తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి. కనబడని పరోక్ష ప్రేక్షకుల కోసం ఆహారాన్ని వెదజల్లాలి.

అంటే, ప్రత్యక్షంగా దర్శించే ప్రేక్షకులను సత్కరించాలి, పరోక్షంగా కనబడకుండా చూసే ప్రేక్షకులకు ఆహారాన్ని వెదజల్లాలి అన్నమాట. ఈ పరోక్షంగా ప్రదర్శనలను తిలకించే ప్రేక్షకులు పంచభూతాలు, ఇతర సూక్ష్మజీవులు.

అంటే దైవం ప్రీతి కోసం జరిపే పూజలను, ప్రదర్శనలను సామాన్య ప్రజలతో పాటు సృష్టిలోని సమస్త జీవులు దర్శిస్తాయని నమ్మకం ఉండేదన్న మాట.

ఇప్పటికి కూడా మనం కనబడే వాటినే కాక కనబడని వాటినీ పూజించటం, మెప్పించాలని ప్రయత్నించటం చేస్తూనే ఉన్నాం.

ఇలా పూజించటం వల్ల ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలం జీవిస్తారు. నీలుడు చెప్పిన విధంగా పూజలు చేస్తూ, చెప్పిన పద్ధతులను అనుసరిస్తే కశ్మీరు ప్రజలంతా ఆనందంగా, సుఖంగా ఉంటారు అంటాడు నీలుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version