Site icon Sanchika

నీలమత పురాణం – 55

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కాలదోష సముచ్ఛిత్రం యత్కించిన్నీల భాషితమ్।
తత్సర్వం కురు రాజేంద్ర మమ వాక్సేనా మానద॥

[dropcap]నీ[/dropcap]లుడు చెప్పినవన్నీ పాటిస్తే కశ్మీరు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉంటారు. నీలుడు చెప్పిన మాటలను పెడచెవిన పెడితే ప్రజలు కష్టాలు అనుభవిస్తారు. అకాల వర్షాలు పడతాయి. అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయి. అకాల మరణాలు సంభవిస్తాయి. రాజు అర్థాంతరంగా మరణిస్తాడు. వరదలు వస్తాయి. కుంభవృష్టులు కురుస్తాయి. కరువు కాటకాలు తాండవిస్తాయి. అకాల మరణాలు సంభవిస్తాయి. రాజులు అర్థాంతరంగా మరణిస్తారు. రాజులు క్రూరులై ప్రజలను  హింసిస్తారు. మంచు విపరీతంగా కురుస్తుంది. అల్పాయుష్కులు, అర్ధాయుష్కులు అధికమవుతారు. ఇవన్నీ తప్పించుకోవాలంటే, సంతోషంగా, సుఖంగా జీవించాలంటే నీలుడు చెప్పినవాటిని తు.చ. తప్పకుండా పాటించాలి. ఒకవేళ కాలక్రమేణా ప్రజలు నీలుడు చెప్పిన వాటికి భిన్నంగా ప్రవర్తిస్తే, కలిగే కష్టాల నుండి తప్పించుకునేందుకు మళ్ళీ నీలుడు చెప్పినవాటిని ఆచరించాలి. సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఎవరైతే నీలుడు చెప్పినవాటిని ఆచరిస్తారో వారికి పశుసంపద వృద్ధి పొందుతుంది. ధనధాన్యాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సంభవిస్తుంది.

ఇది భారతీయ ధర్మంలో ప్రతి శాస్త్రంలోనూ పలు సందర్భాలలో కనిపిస్తుంది. ఏదో ఓ విషయం చెప్పి ఈ విధంగా చేస్తే శుభం కలుగుతుంది. లేకపోతే అనేక అనర్థాలు అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరిక కనిపిస్తుంది. ఇది చూసి కొందరు శాస్త్రాలన్నీ బ్రాహ్మణులు సృజించినవి. వారు బెదిరించి ప్రజలు తమ మాట వినేట్టు చేసుకున్నారు. ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందారు అని విమర్శిస్తారు. ఇదంతా ‘బ్రాహ్మణీయ భావజాలం’ అని ఈసడిస్తారు. దీన్ని ఆంగ్లేయులు Brahmanism అనడంతో ఇది ప్రచారంలోకి వచ్చింది. ప్రతీ దానికీ బ్రాహ్మణులే కారణమన్న అపోహ బలపడింది. ఇదెలాంటిదంతే పైపైన చూసి రోగ నిర్ధారణ చేసేయటం లాంటిది. లోతుగా వెళ్ళి విశ్లేషించకుండానే నిజ నిర్ధారణ చేయటం లాంటిది.

ఈ పురాణం పేరే నీలమత పురాణం. నీలుడు నాగు. నాగు చెప్పిన పురాణం అన్నమాట. ఇందులో బ్రాహ్మణ ప్రసక్తి లేదు. నీలుడు చెప్పింది కశ్మీరు ప్రజలు ఏం చేస్తే ఆనందంగా ఉంటారో అన్నది. దానిలో ఎక్కడా బ్రాహ్మణులకు అగ్రస్థానం ఇవ్వటం కనబడదు. పైగా అందరినీ సమానంగా చూడటం కనిపిస్తుంది. రాజుని సైతం దైవంగా భావించినా సామాన్యుడిలా భావించటం, అతడు చేయాల్సిన ప్రతి పనిని నిర్దేశించటం కనిపిస్తుంది. పూజించాల్సిన దేవతల విషయంలోనూ ఎలాంటి పక్షపాతం లేదు. చెట్టు, పిట్ట, గుట్ట, మట్టి, నీరు, నిప్పు, గాలి ప్రతి ఒక్కదాన్నీ సమానంగా పూజించటం కనిపిస్తుంది. దీన్లో ఏ ఒక్కరి స్వార్థానికి పెద్ద పీట వేయటం, ఇతరులను తక్కువ చేయటం, అణచివేయటం కనిపించదు. అంటే, మన గురించి మనకు ఇతరులు ఏర్పరిచిన అభిప్రాయానికీ, అసలు నిజానికీ నడుమ ఎంతో తేడా ఉందన్న మాట. ఈ నిజం శాస్త్రాలను మన దృష్టితో చదివ్తే బోధపడుతుంది.

వైజ్ఞానికంగా కూడా ప్రతి ప్రాంతానికికీ తనదైన నైసర్గిక స్వరూపం ఆధారంగా అక్కడికి ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు, జీవన విధానం, వేషభాషలు, దుస్తులు ఏర్పడుతాయి. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగానే వారి జీవన విధానం ఉండటం అనేది ఆవశ్యకమైన విషయం. చలి ప్రాంతాలలో కేవలం ఓ ధోతీ, అంగవస్త్రం వేసుకుని తిరుగుతానంటే కుదరదు. వేడి అధికంగా ఉండే ప్రాంతాలలో ఉలెన్ కోట్లు వేసుకోవటం కుదరదు. కాబట్టి ఆయా ప్రాంతాల పరిస్థితులకు తగ్గట్టుగా అలవాట్లు నిర్దేశితమవుతాయి. ఆ అలవాట్లకు భిన్నంగా ప్రవర్తిస్తే, ఆ ప్రాంతాలలో కుదరదు. అనర్థాలు సంభవిస్తాయి. కాబట్టి ఆ ప్రాంతానికి తగ్గ పద్ధతులు చెప్పి, వీటిని పాటించాలి, లేకపోతే కష్టాలు సంభవిస్తాయి అని చెప్పటం సర్వసాధారణం. హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు వెళ్ళేవాళ్ళకు ప్రత్యేకమైన దుస్తులు, పరికరాలు అవసరం. హిమాలయాలలో రబ్బరు చెప్పులు వేసుకుని వెళ్తే శరీరం క్రిందకు, ఆత్మ పైకి పోక తప్పదు. కాబట్టి శాస్త్రాల బెదిరింపులు, హెచ్చరిక అజ్ఞానం, మూర్ఖత్వం, స్వార్థపూరితం అనుకుంటే అది వారి అహంకారం, అవగాహనా రాహిత్యం, అనర్థదాయకం తప్ప మరొకటి కాదు. అలాగని ప్రతి హెచ్చరికను చూసి భయపడాల్సిన పని లేదు. దాన్లో సత్యాన్ని గ్రహించాలి. విశ్లేషించాలి.  నిగ్గు తేల్చుకున్న తరువాతనే దాన్ని అనుసరించాలి. అంతే తప్ప ప్రతిదానికీ ముద్రలు వేసి అన్నిటినీ ఒకే గాటన కట్టి చూడటం వైజ్ఞానిక దృక్పథం కాదు. అంతే కాదు పురాణాలలో  మరో విషయం స్పష్టంగా తెలుస్తుంది. వారికి తెలుసు, ఏదైనా ఆరంభంలో ఉన్న స్వచ్ఛదనం కాలక్రమేణా మారిపోతుందన్న సత్యం వారికి తెలుగు. అందుకే కాలదోషం వల్ల ఒక వేళ ఈ పద్ధతులు మరుగున పడి అనర్థాలు సంభవిస్తే మళ్ళీ వీటిని పాటించడం వల్ల అనర్థాలను నివారించి ఆనందంగా జీవించవచ్చు అంటున్నాడు నీలుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version