Site icon Sanchika

నీలమత పురాణం-60

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]చం[/dropcap]ద్రపురంలో నివాసస్థలం కోరిన బ్రాహ్మణుడి కోరికను విశ్వగశ్వుడు మన్నించాడు.

“చంద్రపురంలో నా సుందర మందిరమంతా నీకు ధారాదత్తం చేస్తాను. దాన్లో నీకూ, నీ కుటుంబ సభ్యులకు అవసరమైనంత, సరిపడినంత స్థలాన్ని ఆక్రమించుకో” అన్నాడు.

రాజు మాటలను స్వీకరించాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న మహాపద్మనాగు.

దానం చేస్తున్నట్టు సూచనగా రాజు నుంచి జలాన్ని స్వీకరించాడు బ్రాహ్మణుడు. రాజును ఆశీర్వదించాడు. ఆపై నాగు రూపం ధరించాడు.

“నగరం వదిలి వెళ్ళిపో. నీ కుటుంబ సభ్యులను, అశ్వాలను, గజదళాన్ని, రథాలను, నీ మనుషులను, నువ్వు దాచిన ధనాన్ని అన్నిటినీ తీసుకుని వెళ్ళిపో. రాజా నాకు ఈ నగరం మొత్తం సరిపోతుంది, దాన్లో ఇంకెవరికీ స్థానం లేదు. నేను ఈ నగరాన్ని సరస్సుగా మార్చుకుంటాను. ఇక్కడ నివసిస్తాను. కాబట్టి మీరు త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపొండి.”

నాగుకు తన నగరాన్ని దానం చేసిన రాజు, చిరునవ్వుతో తన కుటుంబ సభ్యులను, ప్రజలను, అందరినీ వెంట తీసుకుని చంద్రపురానికి రెండు యోజనాల దూరంలో, నగరానికి పశ్చిమాన అందమైన నూతన నగరాన్ని నిర్మింపజేశాడు. ఈ నగరం ‘విశ్వగశ్వపురం’గా ప్రసిద్ధి పొందింది. తన వారందరితో నూతన నిర్మిత నగరంలో సుఖంగా ఉండడం ప్రారంభించాడు.

నాగమహాపద్ముడు నగరానికి వరదలు రప్పించాడు. ఫలితంగా చంద్రపురం సర్వం అత్యద్భుతమైన సరస్సుగా మారిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా ఆ సరస్సులో నివసించడం ప్రారంభించాడు మహాపద్ముడు.

ఒక యోజనం పొడవు, వెడల్పు కల ఈ సరస్సు అతి పవిత్రమైనది. అందమైనది. సహృదయుల హృదయాలకు ఆనందం కలిగిస్తుంది.

మహాపద్ముడి ప్రభావం వల్ల ఈ సరస్సులో మొసళ్ళు లేకుండా పోయాయి. ఆ సరస్సులో మహాపద్మనాగు ఆనందంగా నివసించాడు కుటుంబంతో.

ఇది మహాపద్ముడి సరస్సు ఆవిర్భావ కథ. నీకు చెప్పాను. ఇంకా ఏమేం వినగోరుతున్నావో తెలుపు మహారాజా?” అడిగాడు.

గోనందుడు అడిగిన అంశాలని, దాని వివరణను తెలుసుకునే ముందు ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది.

ఈ కథ ప్రకారం మహాపద్మనాగు చంద్రపురాన్ని సరస్సుగా మార్చటం కథ కృత్రిమంగా సరస్సును నిర్మించిన గాథలా తోస్తుంది. దీనిలో ఇంకా ఏమైనా ప్రతీకలు దాగి ఉన్నాయోమే ఆలోచించాల్సి ఉంటుంది. ఒక వేళ సరస్సు సహజమైనదైతే, నెమ్మదిగా నగరం నీటితో నిండుతూంటే, మహారాజు తన నగరాన్ని తరలించి నూతన నగరం నిర్మించటమో జరిగి ఉండాలి. దాన్ని జ్ఞాపకంగా భవిష్యత్తు తరాలకు అందించేందుకు పురాణ గాథ రూపొంది ఉంటుంది. పురాణాలు ‘ఇలా జరిగింది’ అని జరిగినదాన్నే చెప్తాయి. అయితే ఆ చెప్పటంలో అనేక విషయాలు ఆధునికుల బుద్ధికి అందని విషయాలు అసంబద్ధంగా తోచే విషయాలు అవటంతో వాటికి పుక్కిటి పురాణాలు అని కొట్టేయడం జరుగుతుంది. ఆయా గాథలలో నిబిడీకృతమై ఉన్న సత్యాలను, సంఘటనలను విస్మరించడం సంభవిస్తోంది.

ఈ కథలో గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడా సంఘర్షణ లేదు. ఒక రాజు కేవలం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తన నగరం మొత్తాన్ని వదిలి వెళ్ళిపోవటమనే అపూర్వమైన ఘట్టం భారతదేశంలోనే సంభవిస్తుంది.  ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి కథలు కల్పనలో కూడా కనబడవు. రాజు ఇచ్చిన మాటను మన్నించి ప్రజలంతా ఆ ప్రాంతం వదిలి మరో ప్రారంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవటం, ఎలాంటి నిరసనలు, వ్యతిరేకతలు ప్రదర్శించకుండా జరగటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖ్యంగా, ఎవరినీ గౌరవించని, ఎవరిని పడితే వారిని ముందూ వెనుకా చూడకుండా ఇష్టం వచ్చినట్టు విమర్శించే సమాజాన్ని చూస్తున్న మనకు ఒక రాజు ఇచ్చిన మాటను మన్నించి ప్రజలు తమ నివాసాలను వదిలి కొత్త స్థలంలో నివాసాలు ఏర్పరుచుకోవటం ఊహకు కూడా అందదు. ఓ కట్టు కథలా, కల్పనాఅ అనిపిస్తుంది. కానీ భారతీయ పురాణాలు సత్యం చెప్తాయి. నిజంగా జరిగిన విషయాలను చెప్తాయి. కాని అవి అర్థం కావటం వాటిని చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది.

ఆ కాలంలో వారికి ఈ కాలంలో జరుగుతున్న అంశాలు చెప్తే కట్టుకథలే కాదు, ‘కలికాలం’లా అనిపిస్తాయి. అధిక సంఖ్యలో ప్రజలు నాయకుడిని ఎన్నుకోవటం, అలా ఎన్నికయిన నాయకుడిని పరాజయం పొందిన వారు ఆమోదించక అల్లోకల్లోలం సృష్టించటం, గౌరవించాల్సిన ప్రతి సంస్థను, ప్రతి వ్యక్తినీ దూషించటం, హేళన చేయటం, కొందరు దాన్ని సమర్థించటం వంటి అంశాలు ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని కలిగిస్తాయి. ఏదన్నా గౌరవం లేదు, ఎవరినీ గౌరవించటం లేదు. టీచర్లంటే లెక్కలేదు, న్యాయస్థానాలంటే విలువ లేదు. పోలీసులంటే లెక్కలేదు. సైన్యం అంటే విశ్వాసం లేదు. దేన్నీ గౌరవించటం లేదు. ప్రతీదాన్ని విమర్శించటం, అసంబద్ధంగా, అర్థం పర్థం లేని వాదనలు చేయటం ఒక పద్ధతిగా మారిన సమాజానికి ఒక రాజు ఇచ్చిన మాటను మన్నించి ప్రజలందరితో నగరాన్ని వదిలిపోవటం కట్టుకథలా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. అదే అసలు బాధాకరమైన విషయం.

(ఇంకా ఉంది)

Exit mobile version