Site icon Sanchika

నీలమత పురాణం-70

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కపటేన చ దాస్వామి  నరాణాం  దర్శనం యదా।
తదా సంజ్ఞామవాప్ స్వామి కపటేశ్వర ఇత్యతః ॥

[dropcap]ము[/dropcap]ని కోరిన కోరిక శివుడిని సంతుష్టి పరిచింది.

“కర్రలో దైవాన్ని దర్శించిన వారందరికీ ముక్తి ప్రసాదించేందుకు నా గణాలలో ఒకడయిన నంది దర్శనంతో వారు రుద్రత్వం పొందుతారు. నేను వారికి మారు రూపంలో దర్శనమిస్తాను. అంటే నన్ను వారు నా మారు రూపంలో నన్నుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ బోలెడంత జలప్రవాహం ఉంటుంది. ఈ జల ప్రవాహంలో తేలే కర్ర దుంగలలో నన్ను దర్శించగలుగుతారు” అని వరం ఇచ్చాడు శంకరుడు.

ఇలా అసలు రూపంలో కాక మారు రూపంలో దర్శనం ఇచ్చి తరింపచేస్తాడు కాబట్టి ఇక్కడ శంకరుడిని కపటేశ్వరుడు అంటారు.

కపటేశ్వరుడన్న పేరు వెనుక ఉన్న కథను వివరించాడు బృహదశ్వుడు.

మళ్ళీ గోనందుడికి ఒక సందేహం వచ్చింది.

ఆ సందేహాన్ని గురించి తెలుసుకునే కన్నా ముందు మనం కొద్దిగా ఆగి ‘కపటేశ్వరుడు’ అన్న పేరు గురించి కాస్త చర్చించాల్సి ఉంటుంది.

నీలమత పురాణానికి ఆంగ్లానువాదం  కపటేశ్వరుడిని ‘kapalesvara’ ‘kapoteswar’ గా అనువదించింది.

కపాలేశ్వరుడు అన్న పేరు శివుడికి ఉంది. కానీ కపటేశ్వరుడు అన్న పేరు అంతగా కనబడదు. ఇది కశ్మీరుకే ప్రత్యేకమయినది.

అనంతనాగ్‌కు తూర్పున ఉన్న లోయను ‘కుథర్’ అంటారు. కుథర్ అన్న పేరు కపటేశ్వర అన్న పేరుకు రూపాంతరంగా భావిస్తారు. జ్యేధేశ్వర్ అన్న పేరు జ్యేధర్‌గా, త్రిపురేశ్వర అన్న పేరు త్రిఫర్‌గా మారటం నిరూపితమయింది. కాబట్టి కపటేశ్వర్ కుథర్‌గా మారి ఉండవచ్చని భావించడంలో పొరపాటు లేదు. కుథర్‍కు దగ్గరలో ‘అచ్చబల్’ దగ్గర ‘పాపశుండ’మనే పవిత్ర సరస్సుఉండేది. పాపశుండం అంటే ‘పాపనాశిని’ అని అర్థం.

నీలమత పురాణంలోనే కాక, ‘హరచరిత చింతామణి’ అనే గ్రంథంలో ఈ పవిత్ర స్థలం గురించి ఒక ప్రత్యేక అధ్యయనం ఉంది. ఈ తీర్థ మహత్యం గురించి వివరిస్తుందీ అధ్యాయం.

కపటేశ్వర తీర్థం గురించి అల్ బెరూనీ కూడా రాశాడు. ఆయన ‘వితస్త ఆరంభమయ్యే స్థలానికి ఎడమవైపున కుదై శాశ్ర/కపటేశ్వర అన్న సరస్సుఉంది. వైశాఖ మాసం మధ్యలో శివుడు ఇక్కడ దర్శనం ఇస్తాడ’ని రాశాడు. అలాగే ఐన్-ఎ-అక్బరీలో, అబుల్ ఫజల్ కూడా ఈ పవిత్ర స్థలం ప్రస్తావన చేశాడు. ‘కోటిహార్ గ్రామానికి దగ్గరలో లోతైన సరస్సు ఉంది. దాని చుట్టూ రాతితో కట్టిన పెద్ద గుడి ఉంది. సరస్సులో నీరు తగ్గినప్పుడు గంధంతో తయారైన మహాదేవుడి విగ్రహం కనిపిస్తుంది’ అని రాశాడు అల్ బెరూనీ.

ఇప్పటికీ సరస్సు చుట్టూ వర్తులాకారంలో రాతితో కట్టిన గోడలు కనిపిస్తాయి. సరస్సులోకి మెట్ల నిర్మాణం ఉంది. రాజతరంగిణి రచయిత కల్హణుడి ప్రకారం కల్హణుడి కాలం కన్నా ఒక శతాబ్దం ముందు మాళవరాజు భోజుడు ఎంతో ఖర్చు పెట్టి సరస్సు చుట్టూ రాతి గోడ కట్టించాడు, మెట్లు కట్టించాడు.

భారతదేశ చరిత్ర పురాణాలలో ప్రతీకాత్మకంగా నిక్షిప్తమై ఉంది. కానీ పురాణాలు పుక్కిటి పురాణాలయి, పౌరాణిక గాథలు పాశ్చాత్యుల ‘Myth’కి సమానార్థకాలు కావడంతో ‘చరిత్ర’ అర్థం మారిపోయింది. కానీ పురాణాలను జాగ్రత్తగా విశ్లేషించి, పరిశీలించి, పరిశోధిస్తే అనేక చారిత్రక సత్యాలు గ్రహింపుకు వస్తాయి. ఎప్పుడయితే కపటేశ్వరుడు ఆంగ్లంలో కపోతేశ్వరుడు, కపాలేశ్వరుడు అయ్యాడో, అప్పుడు కపటేశ్వరుడు ‘కుథేర్’కు దూరమవుతాడు. ముందే మన మేధావులకు శివుడు కర్ర దుంగ రూపంలో రావటం, వరాలివ్వటం అంతా అర్థం కావు. దాంతో పురాణాల మీద దుమ్మెత్తిపోస్తారు. నిజం ఆ దుమ్ము అడుగున మరుగున పడిపోతుంది.

దీనికి తోడు పాశ్చాత్య సిద్ధాంతాల ఆధారంగా భారతీయ పురాణాలను విశ్లేషిస్తారు తెలివైన మేధావులు. వచ్చిన చిక్కు ఏమిటంటే పాశ్చాత్యుల ఆలోచనా పద్ధతికి, వారి అభివృద్ధికి, భారతీయ ఆలోచనా విధానానికి అభివృద్ధికి హస్తిమశకాంతరం ఉంది. కానీ పాశ్చాత్య విమర్శన పరిధిలో భారతీయ విజ్ఞానాన్ని ఒదిగింపచేయాలన్న ఆతృతతో, మంచం నిడివిలో ఒదగని వాడి కాళ్ళు, తల, చేతులు కోసి మంచం పరిధిలో ఒదిగింపచేసేట్టు భారతీయ విజ్ఞానాన్ని కుంచింపచేస్తున్నారు. అదే విజ్ఞానం అని గొప్పగా భావించేస్తున్నారు. ఇందుకు భిన్నంగా భారతీయ దృక్కోణంలో మన పురాణాలను విశ్లేషిస్తే మన అసలు చరిత్ర మనకు తెలుస్తుంది. అంత వరకూ అసలు చరిత్ర దుమ్ములో కొట్టుకుపోతూంటుంది. కృత్రిమ చరిత్ర నిజంగా చలామణీ అవుతుంది.

శివుడు ‘కపటేశ్వరుడు’ అవటం వెనుక  సూక్షమైన అంశం ఉంది. మునులు శివుడు దర్శనం కోరి తపస్సు ఆరంభించారు. కానీ తమ పని సులభం అవుతుందని కశ్మీరు వచ్చారు. దాంతో శివుడు మారు రూపంలో దర్శనం ఇచ్చాడు, అదీ కర్ర దుంగ రూపంలో. దీని అర్థం భగవంతుడూ అణువణువూ ఉన్నాడని. జలం పవిత్రం. వాయువు పవిత్రం. వృక్షం పవిత్రం. శిల పవిత్రం. సృష్టిలోని కణకణం పవిత్రం. ఇదీ భావన. ఇంత వరకు పెద్దల  దృష్టి నీలమత పురాణం వైపు పెద్దగా ప్రసరించలేదు. లేకపోతే గంధం కర్ర మహేశ్వరుడి రూపంలో ఉండటాన్ని చూసి ఇక్కడ కొండజాతి వారో, ఆటవికులో ఉండేవారని, బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి వారిని తమలో కలిపేసుకోవటం కోసం వారి పూజా పద్ధతిని అనుసరిస్తూ, వారి దేవుడిని తమలో కలిపేసుకున్నారనీ పూరీ జగన్నాథుడి గురించి వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యానించి చలామణీ లోకి తెచ్చేవారు. మన చరిత్ర మొత్తం ఇలాంటి ఆధారం లేని ఊహల ద్వారా నిర్మితమై అసలు ఆత్మను వదిలేసింది.

బృహదశ్వుడు కపటేశ్వరుడికి ఆ పేరు వచ్చిన గాథను చెప్పిన తరువాత గోనందుడికి ఒక సందేహం వచ్చింది.

భవగాన్ శ్రోతుమిచ్ఛామి విష్ణోరాయ తూన్యహమ్।
కశ్మీరేషు ఫలమేషాం సన్నిధానాధ్వరేః పరం॥

కశ్మీరులో శివ దర్శన క్షేత్రాలు, తీర్థాలు, పవిత్ర స్థలాల గురించి గోనందుడు తెలుసుకున్నాడు. ఇప్పుడాయనకి కశ్మీరులోని విష్ణువుకు సంబంధించిన పవిత్ర స్థలాల గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ పవిత్ర స్థలాలు తెలుసుకోవటమే కాదు, వాటి గాథలు, దర్శన ఫలాలు కూడా తెలుసుకోవాలనిపించింది.

రాజు కోరికను మన్నించి బృహదశ్వుడు చెప్పడం ప్రారంభించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version