నీలమత పురాణం-71

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

నిత్యం సన్నిహితో దేవో రాజన్ చక్రధరో హరిః।
తం దృష్ట్యా పుండరీకాశ్రదత్తమ్ దశదినఫలమ్ లభేత్॥

[dropcap]క[/dropcap]శ్మీరులోని హరివాసాల గురించి తెలుసుకోవాలన్న గోనందుడి కోరికను మన్నించి బృహదశ్వుడు చెప్పటం ప్రారంభించాడు.

“రాజా, భగవంతుడు నిత్యం చక్రధారి రూపంలో ఉంటాడు. పద్మనయనాల వాడి దర్శనంతోనే పది గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. జనార్దనుడు నిత్యం నరసింహుడి రూపంలో కొలువై ఉంటాడు. దేవదేవుడి దర్శనంతోనే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది.

రాజోత్తమా, వశిష్ఠుడు, కద్రు, వినత, గౌతములు కేశవుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాల దర్శనంతో అగ్నిష్టోమ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. మహాపద్మ సరస్సు ఉత్తర తీరాన కొలువై ఉన్న నరసింహస్వామి దర్శనంతో కూడా అగ్నిష్టోమ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది.

శుక్రుడు, వరుణుడు, బ్రహ్మ, ధనేశుడు, యముడు, హరుడు, దివాకరుడు, సాంబుడు, వహ్ని, పవనుడు, కశ్యపుడు, భృగు, పాలస్త్యుడు, అత్రి వంటి వారు ప్రతిష్ఠించిన విగ్రహాలు భూర్జస్వామి, మహాస్వామి, శతశృంగ, గదాధర, జనార్దన, భృగుస్వామి వంటివి మేరు నివాసం వద్ద, తైత్రియేశ్వర, దండకస్వామి, జనార్దన, రామస్వామి వంటి విగ్రహాలు ‘భావ’ దగ్గర; పశ్చిమాన నారాయణ స్థాన, వరాహ దగ్గర గజేంద్ర మోక్షణ, వరాహ నరసింహ, బహురూప, సప్త ఋషుల విగ్రహాలు సముక వద్ద; తుంగవాస, స్వయంభు, గుహవాస, యోగీశ, అనంత, కపిల, అశ్వశీర్శ, మత్స్య, హంస, కూర్మ, ఉత్తంక స్వామి వంటి విగ్రహాలు, వాలఖిల్యులు, గరుడుడు, జలవాసుడు ప్రతిష్ఠించిన పలు పడగలవాడు, వంటి విగ్రహాల దర్శనంతో పది గోవులు దానం చేసిన ఫలితం లభిస్తుంది.

వేనరాజు సంతానం అయిన పృథువు మగధలో ప్రతిష్ఠించిన విగ్రహ దర్శనం పౌండరిక పూజ నిర్వహించిన పుణ్యాన్నిస్తుంది.

గృధకూటంపై భృగువు ఆశ్రమస్వామిని ప్రతిష్ఠించాడు. భృగువు తనయుడు రామ ఆ విగ్రహాన్ని కొండ పాదాల వద్ద ఉన్న తన నివాసానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహ దర్శనంతో సకల పాపాలు నిస్సందేహంగా నశిస్తాయి.

బృహదశ్వుడు చెప్పిన ఈ విషయం వినగానే గోనందుడికి సందేహం వచ్చింది.

“భృగు పర్వతంపై ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఎందుకు మళ్ళీ గృధకూటం నుంచి క్రిందకు తీసుకువచ్చి ఆశ్రమంలో ప్రతిష్ఠించారు?”

బృహదశ్వుడు చెప్పటం ప్రారంభించాడు.

“హైహయ క్షత్రియులు తన తండ్రిని హత్య చేసినందువల్ల అతని తనయుడు రాముడికి క్రోధం కలిగింది. ఫలితంగా ఆయన 21 మార్లు భూవలయమంతా తిరిగి భూమిపై క్షత్రియులు లేకుండా చేశాడు. వెతికి వెతికి క్షత్రియ రాజులందరినీ సంహరించాడు. ఇరవయ్యొకటవ మారు క్షత్రియ రాజులను సంహరిస్తున్న సమయంలో కొందరు క్షత్రియులు తప్పించుకుని కశ్మీరు కోటను చేరారు. రాముడు వారిని వెంబడించి కశ్మీరు చేరాడు. కొండపై ఉన్న కోటలో దాగినవారిని వెతికి లాగి మరీ సంహరించాడు. వారి లోనూ కొందరు తప్పించుకున్నారు. వారు కశ్మీరును వదిలి మధుమతి, రాజనిర్మల నదుల తీరాలకు చేరుకున్నారు. రాముడు వారిని వెంబడించాడు, వారిని సంహరించాడు. అలా క్షత్రియులందరినీ సంహరించిన తరువాత రక్తంతో నిండిన చేతులతో కేశవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ప్రపంచవ్యాప్తంగానే కాదు, పలు లోకాలలో కూడా ఈ విగ్రహం ‘రాజవాస’గా పేరు పొందింది. ఈ విగ్రహాన్ని దర్శించిన రాజులకు సత్వరం విజయం లభిస్తుంది.

రాముడు ఈ విగ్రహన్ని క్రోధావేశంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ హరి ఎల్లప్పుడూ ఆగ్రహంతోటే ఉంటాడు. క్రోధంగా ఉంటాడు. ఇక్కడ హరిని పూజించే మనుషుల మనస్సులో కూడ క్రోధం, ఆవేశం ఉంటుంది. అందుకని వారు ఇక్కడ అర్చన కూడా జంతువులను  బలి ఇస్తూ చేస్తారు.

క్షత్రియుల రుధిరధారలతో సమాధులను తవ్విన రాముడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. తన పూర్వీకులను పూజించాడు. రాముడి పూజలతో సంతృప్తి చెందిన పూర్వీకులు అతడిని ఆశీర్వదించారు.

“ఇక క్షత్రియ సంహారం ఆపు. ఈ హింసాత్మకమయిన చర్యలతో నీ మనస్సు, శరీరం అపవిత్రం అయిపోయాయి. కాబట్టి తీర్థయాత్రలు చెయ్యి. పవిత్ర తీర్థాలలో స్నానమాచరించు. నీ మనసు, శరీరం రెండూ క్రోధాన్ని వదలి, పాపరహితమైన తరువాతనే నీ చేతులకు అంటిన రక్తం పోదు. రెండు చేతులూ రక్త రహితమయిన తరువాతనే పవిత్రుడి వయినట్టు. అప్పుడు తపస్సు ఆరంభించు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here