Site icon Sanchika

నీలమత పురాణం-74

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తతః సంవత్సరాన్తే చ దదర్శ మధుసూదనామ్।
దివ్యేన చక్షుశా రాజేన ప్రసన్నం పురతః స్థితమ్॥

తుషారచయ సంకాశం శ్వేతాంబర విరాజితమ్।
చతుర్ముఖం చతుర్భాహుం చతుర్వాధాశ్రయా న్వితమ్॥

[dropcap]మ[/dropcap]ధుసూదనుడి నామ జపం చేస్తూ సంవత్సర కాలం తపస్సు చేశాడు రాముడు.

సంవత్సరం తరువాత దివ్యదృష్టితో చూస్తే అతడి ఎదురుగా సంతుష్టాంతరంగుడైన మధుసూదనుడు మంచు రూపంలో దర్శనమిచ్చాడు. తెల్ల దుస్తులు ధరించి, సూర్యతేజంతో ఉన్న కిరీటం శిరస్సున ధగధగలాడుతూండగా, కుండలాలు, చతుర్ముఖం, చతుర్భుజాలతో, కంట వేదాలుండగా, మంచు గుట్టలా దర్శనమిచ్చాడు మధుసూదనుడు.

మధుసూదనుడి దర్శనం అవుతూనే రాముడు ఆయన కీర్తి గానం చేశాడు.

దేవదేవా, పాపాలను నశింపచేసేవాడా, నీకు ప్రణామాలు.

చతుర్మూర్తి, మహామూర్తి, చతుర్వేద, మహాభుజ, గోవింద, పుండరీక, వరాహమూర్తి, పద్మనయనాల వాడా నీకు వందనాలు.

వరాహ దంష్ట్రాలతో భూమిని ఎత్తి రక్షించినవాడవు. పర్వతాలను బద్దలు కొట్టినవాడవు. వరాహరూపంలో నిత్యం జగతిని ధరించేవాడవు. ఉగ్రనరసింహ రూపంలో అగ్నిజ్వాలల మాలల నడుమ వాడి అయిన గోళ్ళతో హిరణ్యకశిపుడి హృదయాన్ని చీల్చినవాడవు. త్రివిక్రముడవు. నమస్కారాలు నీకు. అశ్వశిరస్సు కలవాడా, వస్త్రాలపై సోమరసం అలంకారం కలవాడా, నీకు వందనాలు. దేవతలంతా తమ కష్టాలను తీర్చుకునేందుకు నిన్ను ఆశ్రయిస్తారు. మనస్సు, బుద్ధి, ఆత్మలు నిరంతరం నిన్ను ఆశ్రయిస్తాయి. నిన్ను వ్యక్తపరుస్తాయి. ముల్లోకాలలో చరాచరాలన్నిటినీ ఆవరించి ఉన్నది నీవే. సత్వరజస్తమో గుణాలు, వ్యక్తావ్యక్తాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నింటా నువ్వే ఉన్నావు. ముల్లోకాలలో నువ్వు తప్ప మరొకటి నా కంటికి గోచరించటం లేదు. నీ శక్తి వల్లనే నేను భూమిపై సింహబలులైన క్షత్రియులను, కోటిపైన సంఖ్యలో సంహరించగలిగాను. దేవదేవా నీకు వందనాలు. సూక్ష్మంలో సూక్ష్మానివి. విరాట్‌లో విరాట్‌వు. సముద్ర తనయ హృదయాన్ని గెలుచుకున్నవాడవు. ఇష్టరూపధారివి. కోరిన కోర్కెలు తీర్చేవాడివి. పాపాలను నశింపచేసేవాడివి. కామ విరోధి మన్నలను అందుకున్నవాడివి. బ్రహ్మ చతుర్ముఖాలతో స్తుతి పొందినవాడివి. ముల్లోకాల నాథుడివి. నీకు నమస్కారాలు.

నీకు సర్వదిక్కుల నుంచి ప్రమానాలు. పర్వతాలు, సముద్రాలు, ప్రపంచాలు, అంతరిక్షంతో సహా అన్ని వైపుల నుంచి, అణువణువు నుంచి ప్రమాణాలు దేవదేవా!

రాముడి తపస్సు వల్ల, దీక్ష వల్ల, స్తుతి వల్ల ప్రీతి చెందిన జనార్దనుడు రాముడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు.

“దేవదేవా గృధకూటంపై ప్రతిష్ఠితమై ఉన్న విగ్రహాన్ని కొండపాదాల వద్దకు తెచ్చి ప్రతిష్ఠించేందుకు అనుమతి కావాలి” కోరుకున్నాడు రాముడు.

సంప్రీతితో మధుసూదనుడు అనుగ్రహించాడు.

“నీ కోరిక ప్రకారం కానీ. ఇందువల్ల ప్రజలు అమితంగా కష్టపడకుండా పాపాల నుంచి విముక్తి పొందుతారు.”

“వరం ఇచ్చి విష్ణువు అంతర్ధానం అయ్యాడు. రాముడు పర్వత శిఖరంపై నున్న విగ్రహాన్ని పర్వత పాదాల వద్దకు తెచ్చి ప్రతిష్ఠించాడు” అని చెప్పి కథను ముగించాడు బృహదశ్వుడు.

కొండ పై నుంచి తెచ్చిన విగ్రహాన్ని  భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించాడు రాముడు. ఈ విగ్రహ దర్శనంతో ప్రజల పాపాలు నశిస్తాయి. పుణ్యం లభిస్తుంది.

అశ్వమేధ యాగం చేసిన తరువాత రాముడు భూమిని కశ్యపుడికి అప్పగించి మంధర పర్వతం చేరుకున్నాడు.

ఈ రకంగా పర్వత శిఖరం పై నున్న పవిత్ర విగ్రహం పర్వత పాదాలు చేరుకుంది మహారాజా” అని చెప్పాడు బృహదశ్వుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version