నీలమత పురాణం-76

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఆరుహ్య తదవాప్నోతి రాజసూయ ఫలమ్ నరః।
తత్ర గంగా సరిత శ్రేష్ఠా చంద్రభ్రష్టా ప్రతిష్ఠితా॥

[dropcap]క[/dropcap]శ్మీరులోని పవిత్ర స్థలాలు, తీర్థాలు, వాటి దర్శనంతో లభించే ఫలితాలను వివరించడం కొనసాగిస్తున్నాడు బృహదశ్వుడు.

ఉత్తమ మానసలో స్నానం చేయటం వల్ల వెయ్యి గోవుల దాన ఫలం లభిస్తుంది. ఈ స్థలంలో పితృదేవతలను సంతృప్తి పరచడం వల్ల కోరిన కోరికలన్నీ తీరతాయి. హరముంద సరస్సులో స్నానం చేయటం వల్ల పది గోవుల దాన ఫలం లభిస్తుంది. ఈ పర్వతారోహణ వల్ల రాజసూయ యాగ ఫలం దక్కుతుంది. ఆకాశం నుండి దూకిన అత్యుత్తమ నది గంగ కూడా ఇక్కడే ఉంది. చంద్రభ్రష్టమైన ఈ గంగానదిలో స్నానం చేయడం వలన పాపాలు నశిస్తాయి. గంగా, మానస నదుల సంగమ స్నానం వల్ల రాజసూయ యాగ ఫలితం లభిస్తుంది.

ఇక్కడ ‘చంద్రభ్రష్టా’ అన్న పదం ఉంది. పురాణం ప్రకారం శివుడు ఆకాశం నుండి దూకుతున్న గంగాతోయ రాశిని తన జటాజూటంలో బంధించాడు. తరువాత ఒక పాయని నెమ్మదిగా వదిలాడు. చంద్రుడిని శివుడు శిరస్సుపై ధరించినవాడు. కాబట్టి శివుడి శిరస్సు నుండి క్రిందకు గంగ జాలువారడమంటే, చంద్రుడిని వదిలి క్రిందకు రావటమే. ‘చంద్రభ్రష్ట’ అన్న పదం ఈ సత్యాన్ని సూచిస్తుంది. చంద్రుని వీడి భూమిపై స్థిరపడిన పవిత్ర గంగానది అన్న మాట.

దేవ తీర్థంలో స్నానం చేసి పూజించటం వల్ల అమరులవుతారు.

వాలఖిల్యులు నిర్మించిన అగస్త్య సరస్సులో స్నానం చేయటం వల్ల యోగుల తేజస్సుతో సమానమైన తేజస్సు ప్రాప్తిస్తుంది.

కాలోదకం, నందికుండం, శంఖ, చక్రం, గదా, పద్మతీర్థం, కపిల తీర్థం, వాతిక, శుండిక తీర్థాలు అప్సరసలు, ఉత్తములు స్నానం చేసే తీర్థాలు. ఈ తీర్థాలలో స్నానం చేయటం వల్ల వారు పొందే పుణ్యంతో పాటు వంద గోవుల దాన ఫలం కూడా లభిస్తుంది.

మానస, కాలోదక నదీ సంగమంలో స్నానం వల్ల సకల పాపాలు ప్రక్షాళనమౌతాయి. సూర్యసార, తారసర, చంద్రసర, కలుశకం వంటి తీర్థాలు అత్యంత మహత్తు కలవి. చక్రతీర్థం, దేవతీర్థం, బ్రాహ్మణ కుండకం తీర్థాల వంటి తీర్థాలు బ్రహ్మ స్వయంగా యజ్ఞం చేసిన తీర్థాలు. ఈ తీర్థాల దర్శనం, స్నానం వల్ల వంద గోవుల దాన ఫలం లభిస్తుంది. హంసద్వారం దర్శనంతో స్వర్గం ప్రాప్తిస్తుంది.

సింధునది ఆరంభమయ్యే ప్రాంత దర్శనంతో రాజసూయ ఫలం సిద్ధిస్తుంది. బిందుసార నది స్నానంతో పుండరీక దర్శన ఫలం ప్రాప్తిస్తుంది.

సంధ్య నది దర్శనంతో పాపాలు నశిస్తాయి. అగ్నితీర్థం దర్శనంతో వ్యక్తి పవిత్రుడవుతాడు. వహ్నిలోకం చేరతాడు. చిత్రపథ, మృగనంద, మృగ నదులు అతి పవిత్రమైనవి. ఈ నదులలో స్నానం వల్ల పాపాలు నశిస్తాయి. గోదావరి, వైతరణి, మందాకిని, చంద్రభాగ, గోమతి నదుల స్నానం వల్ల సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. పాపాలు నశిస్తాయి. భయాలు తొలగుతాయి. చిత్రపథ, మధుర నదుల సంగమంలో స్నానం పాపాలు తొలగించటమే కాదు, స్వర్గ ప్రాప్తి కలిగిస్తుంది. అతని కుటుంబం పరిశుద్ధ మవుతుంది. గోదావరి, మధుమతి నదుల స్నానం పాపాలని పరిహరిస్తుంది.

ఈ నదులన్నీ అతి పవిత్రమైనది. ఈ నదుల సంగమం అత్యంత పవిత్రమైనది. స్వర్గఫలం లభిస్తుంది. ఉమాదేవి వివాహమయిన చిత్రకూటం అతి పవిత్రమైనది.

పంచగవ్య సర, గవ్య సర, తిల సర, ఉద్యర్తన సర, అతసీ సర, సిద్ధార్థక సర, అమలకవరి నీటితో నిండిన సరస్సు, మధుపర్క సర, ఉష్ణోదక సరస్సులలో స్నానం వల్ల, దర్శనం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది.

చిత్రకూట పర్వతారోహణం వల్ల స్వర్గంలో సన్మానం జరుగుతుంది. సప్తర్షి ప్రాంత దర్శనం వల్ల కోరికలన్నీ ఫలవంతమవుతాయి.

సప్తర్షులకు నైవేద్యం అర్పించటం, వెయ్యి అశ్వమేధాలు, వంద రాజసూయాలు, లక్ష గోదానాల కన్నా పుణ్యం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here