Site icon Sanchika

నీలమత పురాణం-78

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తీర్థాని ద్వాజముఖ్యాని కశ్మీరేషు వదస్యమే।
తేషామ్ స్నానేన యత్పుణ్యం తపసా దగ్ధకిలిబిషః॥

[dropcap]క[/dropcap]శ్మీరులోని ప్రధాన తీర్థాలు, వాటిల్లో స్నానం చేయటం వల్ల కలిగే సత్ఫలితాల గురించి వివరించమని గోనందుడు బృహదశ్వుడిని కోరాడు.

ఇప్పటికే కశ్మీరులోని సరస్సులు, వాటి దర్శనం, స్నాన ఫలితాలు, నదీ సంగమాలలో స్నాన ఫలితాల గురించి తెలుసుకున్నాడు గోనందుడు. అయినా ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాసను వ్యక్తపరిచాడు.

భారతదేశం పరమ పవిత్రమైన దేశం. దేవీదేవతలు భువిపై ఇక్కడే నడయాడతారన్న నమ్మకం మనది. అణువణువూ పవిత్రమే. నిజానికి భరత భూమిలో జన్మించాలంటేనే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలన్నది నమ్మకం. అయినా సరే, కొన్ని ప్రత్యేక ప్రాంతాలను మరింత పవిత్రంగా భావిస్తారు. కశ్మీరు కూడా అంతే. కశ్మీరు అణువణువూ పవిత్రమే. అయినా సరే, కొన్ని నదులు, కొన్ని సరస్సులు, కొన్ని పర్వత శిఖరాలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పురాణాలలో ఇలాంటి వాటి ప్రస్తావనలు ఉంటాయి. ఆయా తీర్థాలకు సంబంధించిన గాథలు, వాటి పవిత్రత వంటి విషయాలుంటాయి. ఇవన్నీ ప్రజలలో తమ ధర్మం పట్ల విశ్వాసాన్ని కలిగిస్తాయి. తమ పవిత్ర స్థలాల పట్ల గౌరవాన్ని కలిగిస్తాయి. ‘ఇది తమది’ అన్న భావన కలిగిస్తాయి. వాటి పరిరక్షణకు ఉద్యుక్తుడిని చేస్తాయి. అంతే కాదు, వాటి పవిత్రతను కాపాడటం తమ బాధ్యత అన్న విచక్షణను మనిషికి ఇస్తాయి. ఆధునిక సమాజంలో ఇలాంటి భావనలోని తత్త్వం సామాన్య ప్రజానీకానికి బోధించేవారు నశించటంతో అనేక పవిత్ర స్థలాలు పవిత్రతను కోల్పోయి వ్యాపారమయం అయ్యాయి. భారతీయ ధర్మాన్ని చులకన చేయాలని ప్రయత్నించేవారికి అవకాశాన్నిస్తున్నాయి. తద్వారా మనమంటే మనకు చులకన అభిప్రాయం కలిగిస్తున్నాయి. సామాన్యులకు సైతం ధర్మం గురించి అవగాహన కలిగించేందుకు పురాణాలు దోహదం చేస్తాయి. పురాణ పఠనం కేవలం ఆధ్యాత్మిక భావ పరిచయం కాదు. పురాణాలు ధర్మం పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమను కలిగించి, వ్యక్తికి కర్తవ్య నిర్దేశనం చేస్తాయి. బాధ్యతను బోధిస్తాయి. అందుకే ప్రతి పురాణానికి తనదైన ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. పైకి, అవి విష్ణులీలలు, శివుడి మహిమలు, దేవీ శక్తి గాథలు చెప్తున్నట్టుంటాయి. కానీ అంతర్లీనంగా పురాణాలు వ్యక్తికి కర్తవ్య నిర్దేశనం చేస్తాయి. బాధ్యత నిర్వహణకు ప్రోత్సహిస్తాయి. ఇలాంటి పురాణాలకు భిన్నమయినది కాదు కశ్మీర నీలమత పురాణం. కానీ నీలమత పురాణంలో దేవీ దేవతల గాథలతో పాటు కశ్మీరు ప్రాశస్త్యం గురించి, అణువణువూ పవిత్రమైన కశ్మీరు భూభాగం గురించిన వివరాలు పొందుపరిచి ఉన్నాయి. దేశంలోని ఏ ఇతర ప్రాంతాలకీ లేదు ఇలాంటి పురాణం. గమనిస్తే, నీలమత పురాణంలో కశ్మీరు సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు జరుపుకోవాల్సిన పద్ధతులు, దర్శనీయ స్థలాలు ఇలాంటి వివరాలు అధికంగా ఉన్నాయి. అంటే కశ్మీరీయులకే కాదు, సమస్త భారతీయులకు కశ్మీరు ప్రాధాన్యం, పవిత్రతలను వివరిస్తుందన్నమాట నీలమత పురాణం. దేవీ దేవతల గాథలు ఉన్నా ప్రధానంగా నీలమత పురాణం కశ్మీరును పరిచయం చేసే చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక పర్యాటక పుస్తకం లాంటిది.

గోనందుదు అడిగే ప్రశ్నలు, వాటికి బృహదశ్వుడు ఇస్తున్న సమాధానాల ద్వారా నీలమత పురాణం తన లక్షాన్ని సాధిస్తోంది. కశ్మీరుకు ప్రత్యేకమైన ఇలాంటి పురాణ ఆవశ్యకతను పూర్వీకులు గుర్తించారు. భారతదేశాంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం కూడా కశ్మీరులా ఆరంభం నుంచీ ‘ఏకఖండం’లా లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మనం విభజించుకున్న ఏ రాష్ట్రం కూడా కశ్మీరులా ఆరంభం నుంచీ ‘ఒకే రాష్ట్రం’లా లేదు. రాజ్యాలు, రాజధానులుగా ఏర్పడి కలిసిపోతూ, విడిపోతూ, విభజితమవుతున్నాయి. కానీ ఆరంభం నుంచీ కశ్మీరు ఏకరాజు పాలనలో ఉంది. స్వాతంత్ర్యానంతర దుష్పరిణామాల వల్ల ఈనాడు కశ్మీరు, కశ్మీరుగా, పాక్ ఆక్రమిత కశ్మీరుగా విభజితమయింది కానీ, ఎన్నడు అవిభాజ్యంగానే ఉంది. ఈ అవిభాజ్యంగా ఉన్న కశ్మీరుకూ దేశంలో పలు రాజ్యాలుగా విభాజితమై ఉన్న ప్రజలకూ నడుమ వారధిగా నిలుస్తుంది నీలమత పురాణం. కశ్మీరులోని పవిత్ర స్థలాలు, దేశంలోని ఇతర ప్రాంతాలలోని పవిత్ర స్థలాలలో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ పవిత్ర స్థలాలలో కొలువైన దేవతలు దేశమంతా పూజలు అందుకునే దేవతలే. ఇక్కడి పవిత్ర స్థలాలలలోని జలం ఇతర తీర్థాలలోని జలమే. కొన్ని పవిత్ర స్థలాల పేర్లు సైతం ఇతర ప్రాంతాలలోని పవిత్ర స్థలాలే. అంటే ఆరంభం నుంచీ ప్రత్యేక రాజ్యంగా ఉన్నా, కశ్మీరు భారతదేశంలో చారిత్రకంగా, సాంస్కృతికంగా, ధార్మికంగా అంతర్భాగం అనీ, అవిభాజ్యమైన అంగం అనీ నీలమత పురాణం అడుగడుగునా నిరూపిస్తున్నదన్నమాట. అందుకే గోనందుడు అడుగుతున్న ప్రతి ప్రశ్న, దానికి బృహదశ్వుడు ఇస్తున్న ప్రతి సమాధానం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.

గోనందుడి ప్రశ్నకు బృహదశ్వుడు సమాధానం ఇవ్వటం ఆరంభించాడు.

క్రమసార సరస్సు నుండి ఆవిర్భవించిన అతి పవిత్రమైన నది కౌండిన్య. ఈ కౌండిన్య నదిలో స్నానం వల్ల పుండరీక వ్రత ఫలితం లభిస్తుంది. పవిత్ర నది ‘క్షీర’లో స్నానం వంద గోదాన ఫలితాన్నిస్తుంది. ఈ రెండు నదుల సంగమం అంటే, కౌండిన్య నది, క్షీర నదుల సంగమంలో స్నానం వల్ల వెయ్యి గోవుల దాన ఫలితం లభిస్తుంది. విశోక నదిలో స్నానం వల్ల దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. దేవసత్ర యాగ ఫలితం లభిస్తుంది. కౌండిన్య నది విశోక నదిని కలిసే స్థలంలో స్నానం వల్ల వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది.

వృద్ధ తీర్థంలో స్నానం చేయటం వల్ల ‘గోసవ’ యజ్ఞ ఫలం లభిస్తుంది. నాగుల దైవం ‘వాసుకి’ ఇక్కడ సదా కొలువై ఉంటాడు. దేవసారలో స్నానం వల్ల దేవతల లోకాలు సిద్ధిస్తాయి. అగ్నితీర్థంలో స్నానం వల్ల అగ్నిలోకం ప్రాప్తిస్తుంది. దేవసారకు ఆగ్నేయంలో సరస్వతి నది ఉంటుంది. ఈ నదిలో స్నానం వల్ల స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. విలోకస్వామికి ఎదురుగా వున్న తీర్థం, కద్రుస్వామి దగ్గర ఉన్న తీర్థాలలో స్నానం వల్ల వంద గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.

సంధ్య నదిలో స్నానం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. బొందితో స్వర్గం ప్రాప్తిస్తుంది. సంధ్య పుష్కరిణిలో స్నానం వల్ల కూడా సంధ్య నదిలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. నీలకుండా, వితస్తాఖ్య, శూలఘాత వంటి మూడు పవిత్ర స్థలాలను దర్శించి, ‘బ్రాహ్మణ కుండిక’లో స్నానం చేస్తే స్వర్గలోకంలో సన్మానం లభిస్తుంది. వినాశన తీర్థంలో స్నానం వల్ల దాన ధర్మాలు, తపస్సు వల్ల చిరంజీవిత్వం ప్రాప్తిస్తాయి. వితస్తోన్మజ్జనలో స్నానం వల్ల వెయ్యి గోవుల దానఫలం లభిస్తుంది. పంచహస్తక తీర్థ స్థానం వల్ల గృహస్థాశ్రమంలో నిర్వహించాలసిన పాంచయజ్ఞాల నిర్వహణ ఫలం లభిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version