నీలమత పురాణం-79

1
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పుణ్య లోకో స్త్యసా నామ సర్వపాప హరః పరః।
కాపోతకే నరః స్నాత్వా గోప్రదాన ఫలం లభేత॥

లోకపుణ్య తీర్థంలో స్నానం సర్వ పాపాలను హరిస్తుంది. కాపోతక స్నానం వల్ల గోదాన ఫలం లభిస్తుంది. రాజోత్తమా, నృసింహుడి ఎదురుగా వున్న విష్ణు ఆశ్రమంలోని వితస్తోన్మజ్జనలో స్నానం వల్ల విష్ణులోకంలో గౌరవం లభిస్తుంది. ధ్యానధరణిలో స్నానంవల్ల వెయ్యి గోవుల దాన ఫలం లభిస్తుంది. వితస్త, ధ్యానధరణిల సంగమ స్థలిలో స్నానం వల్ల పాపాలు నశిస్తాయి. వాజపేయ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. ధ్యానధరణితో సంగమించిన వితస్త అదృస్యమవుతుంది. ఎవరికీ కనబడకుండా విశోకా నది ఆ సంగమ స్థలానికి చేరుకుంది. విశోకా నది, ధ్యానధరణిల సంగమం ధౌమ్యాశ్రమం వద్ద సంభవిస్తుంది. ఇక్కడ స్నానం వల్ల రాజసూయ యాగ ఫలం లభిస్తుంది. చతుర్వేదిలో స్నానం వల్ల కన్యాదాన ఫలం లభిస్తుంది. హర్షపథలో స్నానం వల్ల బంగారం లభిస్తుంది. త్రికోటి ప్రభావం వల్ల పాపాలు నశిస్తాయి. చంద్రావతి నదీ స్నానం వల్ల చంద్రలోకం లభిస్తుంది. దేవతీర్థంలో స్నానం వల్ల శుభం జరుగుతుంది. సంతానం ప్రాప్తిస్తుంది. త్రికోటి స్నానం వల్ల దేవలోకం సిద్ధిస్తుంది.

హర్షపథలో స్నానం శుక్రలోక ప్రాప్తినిస్తుంది. చంద్రావతి స్నానం పది గోవుల దాన ఫలాన్నిస్తుంది. హర్షపథ, చంద్రావతి నదులు అత్యంత పవిత్రమైనవి. ఈ రెండు నదుల సంగమంలో స్నానం రాజసూయ యాగ ఫలాన్నిస్తుంది.

త్రికోటి, శాప్యేస్వర హరనందుల సంగమ స్థలం వారణాసి అంత పవిత్రమైనది, శక్తివంతమైనది. కపోతేశ్వర నదీ స్నానం వల్ల రుద్రలోకం ప్రాప్తిస్తుంది. విశాలింగప్రదలో స్నానం వల్ల రుద్రలోకం ప్రాప్తించడమే కాదు, అతని కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది. పింగళేశలో స్నానం వల్ల విష్ణులోకం లభిస్తుంది. ఖందపుచ్ఛలో స్నానం వల్ల పుణ్యం లభిస్తుంది.

పుండరీకలో స్నానం వల్ల పుండరీక యజ్ఞ ఫలం లభిస్తుంది. శూర్పర్కలో స్నానం గోదాన ఫలాన్నిస్తుంది.

వితస్త, ధ్యానధరణి నదుల సంగమం దగ్గర అన్నదానం వల్ల, పధ్నాలుగురు ఇంద్రులు జీవించినంత కాలం నశించని పుణ్యం లభిస్తుంది. నృసింహ తీర్థంలో సకల పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. వితస్థ, ధ్యానధరణిల సంగమం నుండి నాగకల్ప షోడశ వరకూ ఉన్న స్థలాన్ని ప్రయాగ అంత పవిత్రంగా భావించాలి.

ఈ తీర్థాలు, వాటి ప్రాశస్త్యాల గురించి తెలుసుకుంటుంటే ఒక ఆలోచన మనసులో మెదలుతూంటుంది. కశ్మీరులో భారతదేశంలోని అతి పవిత్ర తీర్థాలన్నీ కొలువై ఉన్నాయి. భారతీయులకు అత్యంత పవిత్రం, వారణాసి. ఇంకా పవిత్రం ప్రయాగ. ఈ రెంటికీ పవిత్రతలో సమానమైన స్థలాలు కశ్మీరులోనూ ఉన్నాయి. గమనిస్తే, భారతదేశంలోని అనేక ప్రాంతాలలోనూ, ఇలా వారణాసితో సమానమైన పవిత్రత కల ప్రదేశాలు లభిస్తాయి. కాశి, త్రివేణి సంగమాలు దేశంలో నలుమూలలా కనిపిస్తాయి. ఇది కూడా దేశాన్ని ధార్మికంగా ఏకత్రితం చేసి అందరూ ఒకటేనన్న భావనను రాజులు, రాజ్యాలతో సంబంధం లేకుందా నెలకొల్పడంలో తోడ్పడే అంశం. తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్ర లోని ద్రాక్షారామం వంటివి వారణాసికి పవిత్రతలో సమానమైనవి. అయినా సరే, వారణాసిలో కాశీవిశ్వనాథుని దర్శనం చేసుకునేందుకు ప్రజలు తహతహలాడతారు. ఇదీ ఈ దేశం బలం. ప్రతీ ప్రాంతం పవిత్రమైనదే. ప్రతీ ప్రదేశం దైవ పాదాల తాకిడితో అమృతమయమైనదే. కానీ అందరినీ ఆకర్షించిన కేంద్రం ఒకటి ఉంది. అదే వారణాసి. కుటుంబానికి తల్లిదండ్రులు కేంద్రం. ప్రాంతానికి ప్రాంతీయ అధికారి కేంద్రం. దేశానికి రాజు కేంద్రం. ఇలాంటి సామాజిక, రాజకీయ వ్యవస్థనే మన ధార్మిక వ్యవస్థలోను కనిపిస్తుంది. ఏ ప్రాంతం మరో ప్రాంతానికి దేనిలోనూ తీసిపోదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకం, స్వతంత్ర్యం. కానీ అన్నీ ప్రాంతాలు స్వచ్ఛందంగా ఒక కేంద్రాన్ని పవిత్రంగా భావిస్తాయి.

ఇదే రకమైన వ్యవస్థ అంతరిక్షంలోనూ కనిపిస్తుంది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడు మన గెలాక్సీలోని పాలపుంత చుట్టూ తిరుగుతాడు. ఈ పాలపుంతలు విశ్వంలోని నక్షత్ర సమూహాల కేంద్రంగా తిరుగుతుంటాయి. ఇలా అనేక నక్షత్ర సమూహాలు విశ్వంలోని నక్షత్ర సమూహం కేంద్రంగా పరిభ్రమిస్తాయి. ఇదొక అత్యద్భుతమైన ప్రణాళిక. అణువు నుంచి అంతరిక్షం వరకూ ఇదే ప్రణాళిక. ఇదే ప్రణాళిక భారతదేశ ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవస్థలోను ప్రతిఫలిస్తుంది.

ప్రపంచంలో ఏ నాగరికతలోనూ లేని వ్యవస్థ ఇది. ప్రకృతిని గమనించి, ప్రకృతి ప్రణాళికను అర్థం చేసుకుని, మానవ మనస్తత్వాన్ని అవగాహన చేసుకుని, ఆత్మతో దర్శించిన ధార్మిక వ్యవస్థ ఇది. మనిషి ఆత్మను విశ్వ ప్రణాళికతో లయింపజేసి దర్శించి కలవరించిన ఆధ్యాత్మిక వ్యవస్థ ఇది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ దేశాన్ని, ప్రజనలను ఒకే వ్యక్తిగా, ఒకే శక్తిగా, ఒకే గుండెగా, ఒకే ఆత్మగా రూపొందించిన అత్యంత పవిత్రము, అద్భుతమూ అయిన వ్యవస్థ ఇది. కణం కణంలో భగవంతుడిని దర్శించి, అడుగడుగూ ఆధ్యాత్మిక బాటలోని అడుగుగా రూపొందించి సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకూ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహింపజేసి అంతిమ సత్య దర్శనం సులభతరం చేసే సువ్యవస్థ ఇది. ఇందుకు తిరుగులేని నిదర్శనం నీలమత పురాణం.

భౌదాదేవి వద్ద ఉన్న గంగోద్భేదలో స్నానం వల్ల గంగానది స్నాన ఫలితం లభిస్తుంది. స్వర్గం ప్రాప్తిస్తుంది.

పవిత్రమైన ‘కథ’లో స్నానం వల్ల పది గోవుల దాన ఫలం లభిస్తుంది. ధర్మరాజు ఎదురుగా ఉన్న ‘జౌజస’లో స్నానం వల్ల జీవితాంతం దారిద్ర్యం దరిదాపులకు కూడా రాదు. వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. అంతే కాదు, ఈ తీర్థంలో పూర్వీకులకు శ్రాద్ధం అర్పించటం వల్ల, పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయి. ముఖ్యంగా ఆశ్వయుజం కృష్ణపక్షంలో జరిపే శ్రాద్ధ కార్యకలాపాలకు ప్రాశస్త్యం అధికం.

నారాయణ స్థానంలో స్నానం వల్ల విష్ణు ప్రపంచంలో స్థానం లభిస్తుంది. రామతీర్థ, భావోత్స తీర్థాలలో స్నానం వల్ల కూడా ఇదే ఫలితం లభిస్తుంది. శైలప్రస్థ, వైశ్రావణ వంటి తీర్థాలలో స్నానం వల్ల – ఏ జన్మలోనైనా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కామతీర్థంలో స్నానం వల్ల కోరికలు తీరుతాయి. అప్సరస తీర్థంలో స్నానం వల్ల అందం ప్రాప్తిస్తుంది. రిషి తీర్థ స్నానం వల్ల వ్యక్తికి ఋషి పవిత్రత ప్రాప్తిస్తుంది. వైతరిణి స్నానం వల్ల దారిద్ర్యం అన్నది సంభవించదు. రిషికుల్య, దేవకుల్యం, అశ్వతీర్థం, ప్రభాసం, వరుణ, వహ్నితీర్థం, చంద్రతీర్థం, నాగతీర్థం, చక్రతీర్థం, వామన తీర్థాలలో స్నానం వల్ల గోదాన ఫలితం లభిస్తుంది. మరుతీర్థం, స్కందతీర్థం, సురేశ్వరి తీర్థాలలో స్నానం వల్ల స్వర్గలోకంలో గౌరవం లభిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here