నీలమత పురాణం – 8

1
6

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]య[/dropcap]క్షాశ్చ రాక్షసాశ్చైవ ఖసాయాస్తనథాః స్మృతాః ।
ఐరావణస్త్విలాపుత్రః పులవాయా దశ గాయనాః॥

ముని ప్రసవ ఉత్కశ్చ దివ్యో ప్యరసాం గణః।
కాలాయూ కాల కల్పాశ్చ కాలకేయా మతాః సుతాః॥

‘ఖస’ తనయులు యక్షులు. ఐరావణుడు ఇలా పుత్రుడు. దశ గాయనులు పులవుడి పుత్రులు. మునికి అప్సరలు జన్మించారు. ‘కాలుడి’ కొడుకులు కాలకల్పులు, కాలకేయులు.

పురాణల ప్రకారం స్వర్గంలో మూడు రకాల దేవతలుంటారు. దేవతలు, గణదేవతలు, ఉపదేవతలు. గణ దేవతలు అంటే 12 మంది ఆదిత్యులు, 10 విశ్వదేవులు, 8 వసువులు, 36 తుషితలు, 64 ఆభాస్వరులు, 49 అవిలులు, 220 మహారాజికులు, 12 సాధ్యులు, 11 రుద్రులు. ఉపదేవతలు 10 రకాలు – విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, గుష్యకులు, సిద్ధులు, భూతాలు. నీలమత పురాణంలో ఖస తనయులు యక్షులు అని ఉంది. కానీ ఈ ‘ఖస’ ఎవరో ఎక్కడా లేదు. పురాణాలలో ‘ఖస’ విష్ణు పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య. మహాభారతం ప్రకారం ‘ఖస’ అన్నది ప్రాచీన భారతంలో ఒక దేశం. మహాభారతంలో ఆదిపర్వంలో బ్రహ్మ జననం తర్వాత విరాట్ పురుషుడి ‘అండం’ నుంచి యక్షులు జన్మించారని ఉంది. అగ్నిపురాణం ప్రకారం యక్షులు, రాక్షసులు ‘ముని’కి జన్మించారని ఉంది. ఈ ముని కశ్యప ప్రజాపతి భార్య. రాక్షసులు, గంధర్వులు ఈమె సంతానం. అగ్నిపురాణంలో ‘ముని’కి 16మంది గంధర్వులు జన్మించారని, వారిలో పెద్దవాడి పేరు భీమసేనుడు అని ఉంది. పురాణాలలో ఈ ‘ముని’ కాక, ఇంకా ముగ్గురు ‘ముని’లు ఉన్నారు. ఒకరు ‘వసు’ సంతానం. మరొకరు ‘పురు’ వంశానికి చెందిన ‘కురు’ సంతానం. మరో ‘ముని’ ద్యుతిమంతుడి సంతానం. అయితే నీలమత పురాణంలో యక్షులు, రాక్షసులు ‘ఖస’ తనయులు అని ఉండడంతో ఒక చోట ‘ముని’ తనయులు, మరో చోట ‘ఖస’ తనయులు అని ఉంది కాబట్టి, పురాణానికి పురాణానికి తేడా ఉంది కాబట్టి, ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పడేస్తే నష్టం పురాణాలకు కాదు. భారతీయ వాఙ్మయము కొన్ని వేల సంవత్సరాలు మౌఖికంగా చలామణిలో ఉంది. రాతప్రతులు తయారు చేయడం వచ్చిన తరువాత, పురాణాలు  రాతగాళ్ళ రాతపై ఆధారపడింది. అందుకే ప్రాచీన పురాణాలకు పలు విభిన్నమైన ప్రతులు లభిస్తున్నాయి. వాటన్నింటిని పోల్చి పరిష్కరించడం ఒక పెద్ద పని. కాబట్టి ‘నీలమత పురాణం’లో ఉన్న దాన్ని ఉన్నట్టు చదువుకుని ముందుకు పోవడం మంచిది.

ఐరావతము ఐరావణ అన్న పదాలను సమానార్థాలుగా వాడడం కనిపిస్తోంది. నీలమత పురాణం ప్రకారం ఐరావణ ‘ఇలా’ పుత్రుడు. కాని ‘ఐరావతం’ పురాణాల ప్రకారం ఏనుగు. విష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి కశ్యపుడు, తరువాత భద్రమాత, ఐరావతి, ఐరావతు. ఇదీ ఐరావతం జననం. కశ్యపుడు దక్షుడి కూతురు క్రోధవశను వివాహామాడాడు. ఆమె ద్వారా 10 మంది కూతుర్లను కన్నాడు. వారిలో భద్రమాత ఒఅక్రు. ఆమె కొడుకు ఐరావత. ఇంద్రుడు కశ్యపుడికి అదితి వల్ల జన్మించాడు కాబట్టి ఐరావతాన్ని తన వాహనంగా చేసుకున్నాడు. దుర్వాసుడి శాపం వల్ల దేవతలు ముసలివాళ్లవడం మొదలయ్యింది. సాగర మథనం వల్ల జనించే అమృత సేవనమ్ వారిని యవ్వనవంతులను చేస్తుంది. దుర్వాసుడి శాపానికి కారణమైన ఐరావతం పాలసముద్రంలో మునిగి విష్ణువు నామ జపం చేసింది. దేవతలు రాక్షసుల సహాయంతో సాగర మథనం జరిపినప్పుడు ఐరావతం శాప విమోచనం పొందింది. ఇది ఐరావతం పురాణ గాథ. అయితే నీలమత పురాణంలోని ఐరావణ, ఇతర పురాణాలలోని ఐరావతం ఒకటేనా అన్నది ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది.

కశ్యప ప్రజాపతికి ‘కాలా’కి జన్మించిన వారు కాలకేయులు. కాలకేయులు 60,000 మంది. వీరు వృతాసురుడి నేతృత్వంలో పోరాడుతారు. పురాణ కథనం ప్రకారం కాలకేయులు బ్రాహ్మణులపై పగబట్టి వారిని హింసించడం ప్రారంభించారు. అప్పుడు బ్రాహ్మణులు అగస్త్యుడిని ప్రార్థించారు. అగస్త్యుడికి భయపడిన కాలకేయులు సముద్రంలో దాగారు. అప్పుడు అగస్త్యుడు సముద్రం నీటిని తాగేశాడు. అక్కడ దాగిన కాలకేయులను సంహరించాడు. కొందరు పాతాళానికి పారిపొతారు. మరో సందర్భంలో కాలకేయులు దేవలోకంపైకి దాడి చేసినప్పుడు ఇంద్రుడు అర్జునుడి సహాయం కోరతాడు. ఇది కాలకేయుల కథ.

అప్సరసలు దేవతాస్త్రీలు. వీరు కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. సాగర మథనం సమయంలో అప్సరసలు జన్మించారని పురాణాలలో ఉంది. మరో కథ ప్రకారం కశ్యపుడికి, అరిష్టకు 13 మంది అప్సరసలు జన్మించారు. అలంబస, మిత్రకేశి, తిలోత్తమ, రక్షితా, రంభ, మనోరమా, కేశిని, సుబాహు, సురభా, సురతా, సుసియా. అరిష్ట నలుగురు గంధర్వులకు కూడా జన్మనిచ్చింది. వారు  హాహా, హుహు ,అవి,బాహు.

అయితే నీలమత పురాణంలోని దశగాయనిలు ‘పుల’కు జన్మించడం గురించి ఇతర పురాణాలలో కనబడదు.  ఒకవేళ ‘పుల’ను ‘పులస్త్య’ అనుకుంటే, పులస్త్యుడికి రాక్షసులు, వానరులు, కిన్నెరలు, గంధర్వ్యులు, యక్షులు జన్మించారన్న ‘ఆదిపర్వం’ లోని శ్లోకాన్ని పరిగణనలోకి తీసుకుంటే దశగాయనులు కిన్నెరులుగా భావించవచ్చు. కాని కిన్నెరులు పురుషులు. వారందరూ వీణాధరులు. కాబట్టి ‘దశగాయని’ల గురించి తెలియడం లేదు (తెలిసిన వారెవరైనా తెలియజేస్తే ఆ సమాచారాన్ని ఈ వ్యాఖ్యానంలో పొందుపరిచే వీలుంటుంది).

ఇక్కడి నుండి నీలమత పురాణంలోని అంశాలు అందరికి పరిచయమైనవే ఉంటాయి.

‘దను’కు దానవులు జన్మించారు. క్రోధకు పదిమంది పుత్రికలు కలిగారు. ఒకరిపట్ల ఒకరు మాత్సర్యం వహించారు వినత కద్రువలు. జలం నుంచి జన్మించిన అశ్వం ‘ఉచ్ఛైశ్రవం’ను చూసి వినత అది తెల్లగా ఉందన్నది. కాని కద్రువ నల్లగా ఉందన్నది. ఇద్దరు వాదించుకున్నారు. ఓడిపోయినవారు గెలిచిన వారికి ‘బానిస’ అవ్వాలని నిశ్చయించుకున్నారు. నాగులు తల్లికి సహాయపడ్డారు. దాంతో అశ్వం నల్లగా కనబడింది. వినత కద్రువకు బానిసయ్యింది. కానీ శక్తిమంతుడైన వినత తనయుడు గరుడుడు ఇంద్రుడి నుంచి అమృతం తెచ్చాడు. నాగులను భక్షించే వరం పొందాడు. గరుడుడు  నాగులను భక్షిస్తున్న తరుణంలొ వాసుకి జనార్ధనుడి రక్షణ కోరాడు. జనార్ధనుడిని ప్రార్ధించాడు. ప్ర్రసన్నుడైన భగవంతుడు వాసుకికి వరమిచ్చాడు. ఆ వరం నీలమత పురాణానికి నాందీ ప్రస్తావన లాంటిది.

ఇక్కడి నుండి అసలు నీలమత పురాణం ఆరంభమవుతుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళేకన్నా ముందు వాసుకి జనార్ధనుడిని స్తుతించిన శ్లోకాలను స్మరించాల్సి ఉంటుంది. అత్యద్భుతమైన శ్లోకాలు ఇవి.

నమోస్తు తె దేవవరాప్రమేయ నమోస్తు తె శంఖ గదాసిపాణే।
నమోస్తు తె దానవనాశనాయా నమోస్తు తె పద్మజసంస్థుతాయ॥

నమోస్తు తె లోకహితె రతాయ నమోస్తు తె వాసవనందనాయ।
నమస్తు తె భక్తవరప్రదాయ నమోస్తు తె సత్పథదర్శనాయ॥

ఉన్నిద్రనీలనళినధ్రుతిచారూవర్నమ్ సంతృప్తహాటకనిభే వసనే వసానమ్।
సద్రత్నచుంబితకిరీటవిరాజమానమ్ దామోదరమ్ సురగురుమ్ ప్రాణతోశ్చిమ నిత్యమ్॥

క్షీరోదకన్యార్పితపాదపద్మమ్ హరిమ్ ప్రపన్నోశ్స్యానంధమ్ వరేణ్యమ్।
పరమ్ పురణామ్ పరమ్ సనాతనమ్ తమాదిదేవమ్ ప్రణతోస్మి భక్త్యా॥

ఫణావళీరత్నాసహస్రార్చిత్ర శేషశ్య భోగే విమలే శయానమ్।
తమాదిదేవమ్ పురూవమ్ పురాణమ్ నమామి భక్త్యా పరయా రమేశమ్॥

భుమేః సముద్ధారణ బద్ధచిత్తౌ దైత్యేంద్రానర్ఘాత విధానదక్షః।
లోకస్య సర్వస్య తు చింతయానః శుభాశుభమ్ రక్ష మమాధ్యదేవ॥

ఖగపతిరాతిబీమచండవేగో మమ కులమాశు వినాశాయత్యనంత।
కురుమునివరసంస్థుతాధరక్షామ్ పవనబలమ్ వినివారయస్వ సాక్ష్య్రమ్॥

ఇలా అత్యంత రమణీయమైన రీతిలో స్తుతిస్తాడు వాసుకి భగవంతుడిని. ఆ స్తుతికి ప్రసన్నుడైన భగవంతుడు గరుడుడి నుండి వాసుకికి రక్షణ కల్పిస్తాడు.

తమాహా భగవాన్దేవో వాసుకిమ్ భయవిహ్వలమ్।
సతీదేశోత్ర పుణ్యోదె సరస్యమరభూషితె॥

ధర్మిష్టైః సహితొ నాగైర్వసస్వామితవిక్రమ।
తస్మిన్ సరసై యె స్థానమ్ కరిష్యాంతి భుజంగమాః॥

తస్య తస్యాహిశత్రువై న హానిష్యాంతి జీవితమ్।
సతీదేశె కృతస్థానమ్ తిష్టంతమకుతోభయమ్॥

భయంతో వణుకుతున్న వాసుకికి అభయం ఇచ్చి “నువ్వు నీ ఇతర నాగులతో కలిసి సతీదేవి దేశమైన సతీ సరోవరమనే పవిత్ర నీటి సరస్సులో భయరహితంగా జీవించు. సతీసరోవరంలో ఉన్న నాగులను ఏ శత్రువూ ఏమీ చేయలేడు. నాగులకు రాజుగా నీలుడిని నియమించండి. నీకు శత్రుభయం ఉండదు” అంటాడు.

భగవంతుడి ఆజ్ఞను వాసుకి పాటిస్తాడు. ఎలాంటి భయం లేకుండా సతీసరోవరంలో సుఖంగా నాగులు జీవించడం ప్రారంభిస్తాయి.

సతీసరోవరం జలం ఎంతటి పవిత్రమైనదంటే, దేవతల రాజు ఇంద్రుడు సతీసమేతంగా ఆ సరోవరం ప్రాంతానికి వచ్చి క్రీడిస్తాడు. ఆనందిస్తాడు.

అలా ఇంద్రుడు శచీదేవితో క్రీడిస్తున్న సమయంలొ ‘సంగ్రహి’ అనే దైత్యుల రాజు అక్కడికి వస్తాడు. శచీదేవిని చూసి మోహిస్తాడు. అదుపులేని కాంక్ష వల్ల రేతస్సు పతనం అవుతుంది. అది సతీసరోవరం నీటిలో పడుతుంది. అయితే శచీదేవిని మోహించిన సంగ్రహుడితో ఇంద్రుడు పోరాడుతాడు. సంవత్సరం పాటు జరిగిన పోరాటంలో చివరికి ఇంద్రుడు విజయం సాధిస్తాడు. సంగ్రహుడు మరణిస్తాడు. శచీదేవితో ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు.

సతీసరోవరంలో పడిన సంగ్రహుడి రేతస్సును సరోవరంలోని నాగులు కాపాడుతాయి. కొన్నాళ్లకు పిల్లవాడు పుడతాడు. జలంలో ఉద్భవించడం వల్ల ఆ దైత్యుడి సంతానానికి నాగులు జలోద్భవుడని పేరు పెడతాయి. ఈ సంగ్రహుడి ప్రసక్తి కానీ, జలోద్భవుడి గురించి కానీ ఇతర పురాణాలలో కనబడదు. ఇది కశ్మీరుకే ప్రత్యేకమైన పురాణం.

నాగుల సాంగత్యంలో పెరుగుతాడు జలోద్భవుడు. అతడు ఘోరమైన తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటాడు. జలోద్భవుడు మూడు వరాలు కోరుతాడు. నీటిలో ఉన్నంత కాలం మరణం తన దరిదాపుల్లోకి రాకూడదు, తనకు మాయాశక్తులు ఉండాలి, ఇతరులెవరికీ లేనంత శక్తి తనది కావాలి. భగవంతుడి నుండి వరాలను పొందిన జలోద్భవుడు సతీసరోవరం పరిసర ప్రాంతాలలొ ఉన్న మనుషులను తినడం ప్రారంభిస్తాడు. దార్వాభిసార, గాంధార, జుహుందర, శక, ఖాస, తంగణ, మండవ, మద్ర, అంతర్దితి, బహిర్దితి ప్రాంతాల ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు. జలోద్భవుడికి భయపడి ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోతుంటారు. దేశం శూన్యమైపోతుంది.

ఇది చదువుతుంటే ఆలోచనలు పలు భిన్నమైన దిశలలో పరుగిడతాయి. సాధారణంగా పురాణాలలో పలువురు తపస్సులు చేస్తుంటారు. తపస్సు ద్వారా శక్తులు సంపాదిస్తుంటారు. కానీ ఆ శక్తులను తమ స్వార్థం కోసమో, ఇతరులను హింసించడం కోసమో చేసేవారు రాక్షసులు. వారి బారి నుండి ప్రజలను రక్షించేందుకు భగవంతుడు అవతారం ఎత్తడమో, ఎవరో మహాపురుషుడు రావటమో జరుగుతుంది. అంటే, పురాణాలు స్వార్థం రాక్షసం, నిస్వార్థం దైవత్వం అని ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తున్నాయన్న మాట. ఎంత తపస్సు చేసినా అది స్వార్థం కోసమయితే వ్యర్థమే అన్న మాట.

(మళ్ళీ రెండు వారాల తరువాత)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here