నీలమత పురాణం-81

1
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

సర్వాః ఋషిగతాశ్చార్చః సరాంసి విపులాని చ।
సర్వత్రైవ మహీనాథ కశ్మీరేషు విశేషతాః॥

[dropcap]”మ[/dropcap]హారాజా! కశ్మీరంలోని నదులన్నీ, సరస్సులన్నీ అతి పవిత్రం. కశ్మీరంలోని పర్వతాలు ఇంకా పవిత్రం. ఋషుల ప్రతిష్ఠాపనలు, సరస్సులు ఎక్కడయినా పవిత్రమైనవే కానీ, కశ్మీరంలో అవి ఇంకా ప్రత్యేకంగా పవిత్రమైనవి.

నాగుల నదుల సంగమాలు అతి పవిత్రమైనవి. ఈ సంగమ స్థలాలలో స్నానం వల్ల వ్యక్తికి వంద నాణేలు దానం చేసిన ఫలం లభిస్తుంది. ఇక్కడి అడుగడుగూ పవిత్రమైనదే. ముఖ్యంగా వితస్త నది. వితస్త నది ప్రవహించిన ప్రతి ప్రాంతాన్నీ పవిత్రం చేస్తూ ప్రవహిస్తుంది. పాపాత్ములు కూడా వితస్తలో స్నానం చేయడం వల్ల స్వర్గాన్ని పొందుతారు. వితస్తలో స్నానం వల్ల వహ్నిస్టోమ యజ్ఞఫలం లభిస్తుంది. శుక్లపక్షంలో 13వ రోజున వితస్తలో స్నానం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. వితస్త అణువణువూ పవిత్రమైనదే. కాని కృష్ణపక్షం పదమూడవ రోజున మాత్రం వితస్తలోని వితస్తాఖ్య ఆశ్రమం, ధౌమ్యేశ ఆశ్రమం, వితస్త సింధు నదుల సంగమం, వరాహ తీర్థం వంటి ప్రాంతాలు ఇతర ప్రాంతాలన్నింటికన్నా అధిక పవిత్రతను సంతరించుకుంటాయి. మామూలు రోజుల కన్నా ఈ రోజు అదనపు పవిత్రతతో అలరాలుతాయి. ఈ రోజు ఈ ప్రాంతాలలో స్నానం చేసినవారికి రాజసూయ యాగం ఫలితం లభిస్తుంది. మామూలుగా అందరికీ తెలిసిన పంచదోషాలే కాక, కనపడని దోషాలు కూడా ఈ రోజు స్నానం వల్ల నశిస్తాయి. చలికాలంలో సూర్యోదయం కన్నా ముందు ఈ చల్లటి నీటిలో నెలపాటు స్నానం చేయటం వల్ల కోరిన కోరికలు తీరుతాయి. పధ్నాలుగురు ఇంద్రులు ఉన్నంత కాలం స్వర్గం ప్రాప్తించాలంటే, తప్పనిసరిగా పద్ధతి ప్రకారం నదులలో స్నానం చేయాలి, అగ్నిని అర్చించాలి, నైవేద్యం అర్పించాలి. అన్నం, పాయసం, నెయ్యి వంటి వాటిని బ్రాహ్మణులకు సమర్పించాలి. ఇలా సంవత్సరం పాటు చేసేవారికి ముక్తి లభిస్తుంది.

కశ్మీరి కాణాం తీర్థానం ఫలం తే కథితం మయా।
సకలం నీల వాక్యం చ గమిష్యామి సుఖీభవ॥

నీలుడు నాకు చెప్పినదంతా మీకు చెప్పాను. కశ్మీరు లోని పవిత్ర స్థలాలు, వాటి వెనుక ఉన్న గాథలు, వాటి దర్శన ఫలితాలు అన్నీ మీకు వివరించాను. మీకు కశ్మీరు ప్రాశస్త్యం అర్థమయి ఉంటుంది. కశ్మీరు ఎంత పవిత్రమో అర్థమయి ఉంటుంది. దేశంలో అనేక పవిత్ర స్థలాలున్నాయి. భువిపై కైలాసాలు, వైకుంఠాలు, స్వర్గాలు ఉన్నాయి కానీ కశ్మీరు అంత పవిత్రమైనది, అణువణువూ పవిత్రమైనదీ ఈ భువిపై మరొకటి లేదు. మీకు తెలపాల్సిందంతా తెలిపాను. సెలవు” అంటూ సెలవు తీసుకున్నాడు వైశంపాయనుడు. దీనితో ప్రధానంగా నీలమత పురాణం చివరికి వచ్చినట్టే. తరువాత ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయి కానీ ప్రధానంగా కశ్మీరు లోని పవిత్ర స్థలాల గురించి చెప్పటం ఇంతటితో అయిపోయింది. కశ్మీరు ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే, నాగులతో, పిశాచాలతో సహజీవనం చేస్తూ ఆనందంగా కశ్మీరులో మనగలగాలంటే నీలుడు చెప్పిన ఈ పద్ధతులను పాటించాల్సిందేనన్నమాట.

గమనిస్తే, నీలమత పురాణంలో నీలుడు చెప్పిన పద్ధతులు, పుణ్యతీర్థాలు, పవిత్ర స్థలాలు దేశంలోని ఇతర పలు ప్రాంతాలలో ప్రచలితమైనటువంటివే. అలవాటు అయినటువంటివే. కానీ కశ్మీరులోని పద్ధతులకూ, ఇతర ప్రాంతాలలోని పద్ధతులకూ స్వల్పమైన తేడాలున్నాయి. ఆ తేడాలను స్పష్టం చేస్తూ, కశ్మీరు భారతదేశంలో భౌతికంగానే కాదు, సాంస్కృతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా కూడా అవిభాజ్యమైన అంగం అని నిరూపిస్తుంది నీలమత పురాణం. నీలమత పురాణం రచన ఉద్దేశం కూడా ‘ఇదేనేమో’ అనిపిస్తుంది. భౌతికంగా, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకూ, కశ్మీరుకూ తేడాలున్నాయి. ఇక్కడి ప్రజలు తమని తాను ప్రత్యేకం అనుకోకుండా, ఇతర ప్రాంతాల ప్రజలు కశ్మీరును తమ కన్నా భిన్నం అనుకోకుండా కశ్మీరుకూ ఇతర ప్రాంతాలకూ నడుమ పూర్వీకులు నిర్మించిన వారధి ‘నీలమత పురాణం’.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here